బడా నేతలను అరెస్టు చేస్తారా?

May 20,2024 23:34

ఈనెల 13న పోలింగ్‌ సందర్భంగా ఘర్షణలను నియంత్రించే ప్రయత్నంలో పోలీసులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌, అనంతరం రెండు రోజుల పాటు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రెరడు రోజుల పాటు విచారణ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన నివేదికను సోమవారం ఉన్నతాధికారులకు సమర్పించారు. సిట్‌ అధికారులు సౌమ్యలత, రమణమూర్తి నరసరావుపేట, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జరిగిన ఘటలను పరిశీలించారు. మొత్తం జిల్లాలో 22 కేసులు నమోదు అయ్యాయి. 581 మందిని నిందితులుగా గుర్తించారు. 274 మంది నిందితులను ఇప్పటి వరకు గుర్తించారు. ఇంకా 307 మందిని గుర్తించాల్సిఉంది. ఇప్పటి వరకు కేవలం 19మంది మాత్రమే అరెస్టు చేశారు. ఇంకా 471 మందిని అరెస్టుచేయాల్సి ఉరది. 91 మందికి 41ఏ కింద నోటీసులుజారీ చేశారు. వైసిపి, టిడిపి నేతల ప్రమేయంతో దాడులు జరిగాయని సిట్‌ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడయినట్టు తెలిసింది. సిట్‌ అధికారుల విచారణలో పల్నాడు ప్రాంతంలో కొంతమంది కీలకమైన నాయకుల ప్రోద్బలంతోనే అల్లర్లు జరిగాయని గుర్తించారు. వీరిని అరెస్టుచేస్తారా లేదా అన్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల రోజు ఘర్షణల అనంతరం గత సోమవారం మధ్యాహ్నం తరువాత ఎన్నికల కమిషన్‌ జోక్యంతో మాచర్ల, నర్సరావుపేటలో టిడిపి, వైసిపి అభ్యర్థులను గృహ నిర్బంధంలో ఉంచారు. వీరి పేర్లు కూడా విచారణలో పరిశీలనకు వచ్చాయి. ప్రస్తుతం నమోదు చేసిన 22 ఎఫ్‌ఐఆర్‌లను ఎంత వరకు సరిగా ఉన్నాయి? ఇంకా ఏమైనా సెక్షన్లు మార్చాలా లేక యథాతథంగా కొనసాగించాలాఅన్న అంశంపై సిట్‌ అధికారులు పరిశీలించారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు కొన్ని సూచనలు చేశారని తెలిసింది. ఈమేరకు పోలీసు స్టేషన్‌ వారీగా నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌లు, నిందితులుగా పేర్కొన వారి పేర్లు, నమోదు చేసిన సెక్షన్లు, మార్పు చేయడం, ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి వివరాలను సిట్‌ అధికారులు తమ నివేదికలో పొందుపర్చారు. ఇంకా ఎవరు ఎవరిని అరెస్టు చేయాల్సిఉందో కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈవివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు, అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఈనెల 13, 14, 15 తేదీల్లో ఘర్షణలపై జరిగిన విచారణలపై కూడా టిడిపి,వైసిపి సిట్‌ అధికారులకు కూడా పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.రెండుపార్టీల వారు పోలీసు అధికారులపై కూడా ఆరోపణలు చేశారు. దీంతో మరికొంతమంది అధికారులపై కూడా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మాచవరం, కొత్తగణేశునిపాడు, దాచేపల్లిలో జరిగిన ఘటనలపై మానవ హక్కుల కమిషన్‌, మహిళాకమిషన్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మూడు ఘటనల్లో టిడిపి వారిపై వైసిపి ఫిర్యాదులు చేసింది. పెదకూరపాడు మండలంలో అచ్చంపేట, కొత్తపల్లి, వేల్పూరు, దొడ్లేరు, కంభంపాడు, హుస్సేన్‌ నగరం, ఎర్రబాలెం, చింతపల్లి గ్రామాల్లో జరిగిన ఘర్షణలను కూడా వైసిపి సిట్‌ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లింది.
ఈవీఎంల ధ్వంసం కేసులో 10 మంది అరెస్టు
ప్రజాశక్తి – రెంటచింతల :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈనెల 13న పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఘటనల్లో పదిమందిని అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎఎస్‌పి జీవీ రమణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఐ ఎం.ఆంజనేయులుతో కలిసి సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలింగ్‌ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, ఈవీఎంల ధ్వంసం కేసుల్లో మండంలోని తుమృకోటకు చెందిన నలుగురు, జెట్టిపాలేనికి చెందిన ఆరుగుర్ని అరెస్టు చేశామన్నారు. ఎన్నికల కోడ్‌ ఇంకా అమలులో ఉందని, ఘర్షణలకు దిగకుండా బైండోవర్‌ చేసిన వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 4న ఓట్ల లెక్కింపు అనంతరం ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు. పెట్రోలు బంకుల్లో లూజు విక్రయాలు చేసినా, బాటిళ్లలో నింపినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాణాసంచా విక్రయించే వ్యాపారులపైనా చర్యలుంటాయన్నారు.

➡️