సమస్యలపై పోరాడే సిపిఎంను గెలిపించండి

May 3,2024 22:03

 ప్రజాశక్తి-మెంటాడ :  గిరిజనులు, దళితుల సమస్యలపై పోరాడేది సిపిఎం మాత్రమేనని, అందువల్ల ఇండియా వేదిక మద్దతుతో పోటీ చేస్తున్న తనను గెలిపించాలని అరకు పార్లమెంట్‌స్థానం సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స కోరారు. శుక్రవారం మండలంలోని ఆండ్రలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో వైసిపి పాలనలో ధరలు పెరిగాయని, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు తగ్గాయని అన్నారు. యువత గంజాయి మత్తుకు అలవాటు పడిపోయి ప్రమాదపు కోరల్లో చిక్కుకుంటున్నారని అన్నారు. వామపక్షాలు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ చట్టాన్ని బిజెపి,వైసిపి ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని అన్నారు. 200 రోజులు పని ఇమ్మంటే ఇవ్వడం లేదని, పనుల వద్ద కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని అన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ రాష్ట్రంలో రోజు కూలి రూ.739 ఇస్తుంటే ఇక్కడ మాత్రం రెండుపూటల పనులు పెట్టి అందుకు తగ్గ వేతనం ఇవ్వడం లేదని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం సబ్‌ ప్లాన్‌ నిధులను కేటాయించడం లేదన్నారు. ప్రజల మధ్య మతం, కులం పేరిట చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునేందుకు ప్రయతిస్తోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారానికి పార్లమెంట్‌లో మనం గళం వినిపించాలని, అందుకోసం సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి.శ్రీనివాస్‌, నాయకులు రాకోటి రాములు, ఆనంద్‌, హరి కృష్ణవేణి, సిహెచ్‌ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వాణిజ, గుర్ల, కొండలింగాలవలస, ఆగూరు గ్రామాల్లో ఆటో ద్వారా ప్రచారం నిర్వహించారు.

➡️