శ్రీనివాస్‌కు చిన్న మధ్య తరహా పరిశ్రమలశాఖ.. సంధ్యారాణికి స్త్రీ శిశు, గిరిజన సంక్షేమం

Jun 14,2024 20:26

స్వయం ఉపాధి, గిరిజన సంక్షేమంపై జిల్లా వాసుల్లో చిగురిస్తున్న ఆశలు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి

గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌కు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ), పేదరిక నిర్మూలన సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ సాధికారిత, సంబంధాల శాఖ మంత్రిగా అవకాశం లభించింది. సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణికి స్త్రీ,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిద్దరికీ మంత్రి పదవులు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో, టిడిపి కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ నెలకుంది. మంత్రి శ్రీనివాస్‌ శనివారం జిల్లాకు రానున్నట్టు సమాచారం. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఆయన అనుచురులు, అభిమానులు, పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. సంధ్యారాణి శుక్రవారం సాయంత్రమే జిల్లాకు చేరుకున్నారు. సాలూరులో ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి జిల్లాలోని మంత్రులిద్దరికీ మంచిశాఖలే లభించాయి. ముఖ్యంగా శ్రీనివాస్‌కు ఇదో అరుదైన అవకాశం. అనూహ్యంగా మంత్రి కావడంతోపాటు మంచి శాఖ కూడా లభించింది. గతంలో మన జిల్లా నుంచి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ పనిచేశారు. భూమి, నీరు, రోడ్డు, రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్నప్పటికీ జిల్లాకు ఒక్కటంటే ఒక్క భారీ పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో, జిల్లా వాసులు కొంత నిరాశ చెందారు. తాజాగా శ్రీనివాస్‌కు అతి చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా అవకాశం వచ్చింది. తద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఊరట కల్పించవచ్చు. ఇందుకు తగ్గ పరిశ్రమల ఏర్పాటుకు కూడా జిల్లా ఎంతో అనువుగా ఉంది. ముఖ్యంగా విజయనగరం పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా. వరి విస్తారంగా సాగవుతున్నప్పటికీ మిల్లులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ పేరుతో ఏటా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని గోదావరి జిల్లాలకు పంపుతున్నారు. పత్తి, మొక్కజొన్న, చెరకు, మామిడి తదితర పంటలు కూడా ఎక్కువగానే సాగవుతున్నాయి. అటు ఏజెన్సీలో చింతపండు, జీడి సాగువుతుంది. వీటి ఆధారంగా మామిడి తాండ్ర, జీడి, మొక్కజొన్న ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవి మచ్చుకు మాత్రమే. ఈ అన్ని రంగాల్లోనూ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రోత్సహించే అవకాశం మంత్రిగా శ్రీనివాస్‌కు దక్కింది. ఇప్పటికే జిల్లాలో జూట్‌, ఫెర్రో ఎల్లాయీస్‌ మూతపడిన నేపథ్యంలో శ్రీనివాస్‌కు దక్కిన శాఖకు ముఖ్యంగా మన జిల్లాలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతోపాటు సెర్ప్‌ (పేదరిక నిర్మూలన) విభాగం కూడా ఈయన పరిధిలోనే ఉంది. తద్వారా మహిళల్లో స్వయం ఉపాధి, సాధికారత సాధించే దిశగా ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఎన్‌ఆర్‌ఐలతో మెరుగైన సంబంధాలు ఏర్పాటు చేయగలిగితే సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీలో భాగంగా రాష్ట్ర సంక్షేమం, ఉపాధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, అభివృద్ధికి నిధులు తెచ్చుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా సొంత జిల్లాకు ఎంతో కొంత ఎక్కువగానే మేలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. యువకుడైన శ్రీనివాస్‌ సమర్థవంతగానే శాఖలు నిర్వహిస్తారని జిల్లా వాసుల్లో ఆశాభావం వ్యక్తమౌతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల సంధ్యారాణికి చంద్రబాబు రెండు కీలకమైన స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖలు అప్పగించారు. అభివృద్ధికి అత్యంత దూరంగా ఉన్న గిరిజనులు, అణిచివేతకు గురవుతున్న మహిళల సంక్షేమం ఆమె చూడాల్సి ఉంది. ఇప్పటికీ గిరిజనులు విద్య, వైద్య సదుపాయాలకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా గిరి శిఖర గ్రామాల్లో డోలీ మోతలు, మార్గమధ్యలోనే ప్రసవాలు, శిశుమరణాలు కొనసాగుతున్నాయి. బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. చాలా గ్రామాల్లో ప్రభుత్వ బడులను గత ప్రభుత్వం ఎత్తివేయడంతో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. రకరకాల కారణాలతో ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనులకు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇటువంటి తరుణంలో సంధ్యారాణిపై చంద్రబాబు ప్రభుత్వం పెద్ద బాధ్యతలే అప్పగించింది. సంధ్యారాణికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజనల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. సుదీర్ఘకాలం గిరిజన ప్రాంతంలోనే ఉండడం, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆమె ఈ రెండు శాఖలనూ సమర్థవంతంగానే నిర్వహిస్తారని జిల్లా వాసులు భావిస్తున్నారు.

➡️