మహిళా ఓట్లే కీలకం

Apr 30,2024 21:38

 జిల్లాలో 7,92,038 మహిళా ఓటర్లు

యువ ఓటర్లు 64,125 మంది

ప్రజాశక్తి -విజయనగరం కోట  : సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మహిళల ఓట్లే కీలకంగా మారనున్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 15,62,921 మంది ఉన్నారు. వీరిలో అధికంగా మహిళా ఓటర్లు 7,92,038 మంది ఉండడంతో అభ్యర్థుల గెలుపులో వీరంతా కీలకంగా మారనున్నారు. మహిళలు ఎక్కువ శాతం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లలో7,70,805 మంది పురుషులు, 7,92,038 మంది మహిళా ఓటర్లు, 78 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. రాజాం నియోజకవర్గంలో మొత్తంగా 2,27,503 మంది, బొబ్బిలిలో 2,31,232, చీపురుపల్లిలో 2,05,484, గజపతినగరంలో 2,05,471, నెల్లిమర్లలో 2,13,551, విజయనగరంలో 2,57,205, శృంగవరపు కోటలో 2,22,475 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓటర్లు విజయనగరం నియోజక వర్గంలో, అత్యల్పంగా గజపతినగరంలో ఉన్నారు. జిల్లాలో 80ఏళ్ల పైబడిన ఓటర్లు 19,926 మంది ఉన్నారు. జిల్లాలోని రాజాం నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే ఎక్కువ శాతం ఉన్నారు. రాజం నియోజకవర్గంలో పురుషులు 1,14,494 మంది ఉంటే మహిళలు 1,12,990 మంది ఉన్నారు. బొబ్బిలి నియోజకవర్గం లో 114216 పురుషులు ఉంటే మహిళా ఓటర్లు 1,17,006 మంది ఉన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 1,02,627 మంది పురుషులు ఉంటే 1,02,847మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో పురుషులు 1,00,799 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,04,667 మంది ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో పురుషులు 1,05,613 మంది ఉన్నారు. విజయనగరం నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,24,829 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,32,347 మంది ఉన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో పురుష ఓటర్లు 108227మంది, మహిళా ఓటర్లు 114246 మంది ఉన్నారు. ప్రధానంగా మహిళలు ధరల భారాలు, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ మేనిఫెస్టోలో మహిళలకే పెద్దపీట వేశాయి. ఈనేపథ్యంలో ఏ పార్టీకి ఓటు వేస్తారో వేచి చూడాలి. యువత ఓటు ఎటువైపో? ఎన్నికల్లో యువత కూడా ప్రభావం చూపనున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 ఏళ్ల నుంచి 29 సంవత్సరంలోపు వారు 64,125 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య 39, 612 మంది ఉన్నారు. వీరంతా కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవం, కేంద్రంలోని బిజెపి గాని, రాష్ట్రంలోని వైసిపి గాని ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చి యువతకు వెన్నుపోటు పొడిచాయి. వైసిపి ప్రభుత్వం గత ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. అంతకుముందు టిడిపి ప్రభుత్వం సైతం యువతకు చేసిందేమీ లేదు. ఈనేపథ్యంలో యువత ఎటువంటి మొగ్గు చూపుతారో వేచి చూడాలి. 29 నుంచి 49ఏళ్లలోపు ఓటర్లు 6,69,322 మంది ఉన్నారు. వీరి ఓట్లు పెరిగిన ధరలపై ప్రభావం చూపనున్నాయి.

➡️