చెరువుకు నీటికోసం రాస్తారోకో

Apr 15,2024 23:36

ప్రజాశక్తి – ప్రత్తిపాడు : నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో తాగునీటి కష్టాలతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్తిపాడుకు సాగర్‌ నుండి వదిలిన నీళ్లు చెరువులకు చేరాయి. నీరొచ్చిందని సంతోషంతో ప్రత్తిపాడు ప్రజలు చెరువు వద్దకు చేరుకునిలోపే సరఫరా ఆగిపోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబుకింది. పార్టీలకతీతంగా సోమవారం స్థానిక పాతమల్లాయిపాలెం రోడ్డుపై మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ రాస్తారోకో చేపట్టారు. ఎంపిడిఒ దుర్గాప్రసాద్‌ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన కొనసాగించారు. చెరువు నిండకుండానే నీటి సరఫరాను ఎందుకు నిలిపేశారని నిలదీశారు. ఇరిగేషన్‌ ఇఇ మూరళిధర్‌ వచ్చి వారితో మాట్లాడారు. రెండ్రోజుల్లో చెరువుకు నీరిస్తామని హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఇచ్చిన మాట ప్రకారం చెరువు ను నింపకుంటే మళ్లీ ధర్నా చేస్తామని గ్రామస్తు లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అన్ని గ్రామాల చెరువులు నిండే వరకూ నీటిని సరఫ రా చేయాలని జిల్లా కలెక్టర్‌కు టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుపున ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బి.రామాంజనేయులు లేఖ రాశారు.

➡️