నాకు నువ్వు… నీకు నేను..

May 7,2024 21:55

అన్నిచోట్లా అవగాహన రాజకీయాలే

ప్రజలను మభ్యపెడుతూ.. సమస్యలను దాటవేస్తూ ప్రచారం

ఎన్నికల వేళ అభ్యర్థుల తీరు

ప్రత్యామ్నాయమే ప్రజల దారి

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తీరు నాకు నువ్వు… నీకు నేను అన్నట్టుగా ఉంది. మధ్యలో ఓటర్లే వెర్రిబాగులవారు అనుకుంటున్నారేమో. బహుశా అందుకేనేమో…! పార్టీలు వేరైనా పరస్పర అండర్‌ స్టాండింగ్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజక వర్గాల్లో దీర్ఘకాలంగావున్న కీలక ప్రజా సమస్యలపై గానీ, నెరవేరని హామీలపైగానీ విర్శలుచేయడం లేదు. ఎంతసేపూ తమ అధినేతలు ప్రకటించిన పప్పు బెల్లాలాంటి సంక్షేమ పథకాల కోసమే చెప్పు కుంటున్నారు. పరస్పరం తమ ఆర్థిక మూలలను, రాజకీయ అస్థిత్వాలను దెబ్బతీసు కోకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రజల్ని మభ్యపెడుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. విజయనగరంలో టిడిపికి చెందిన అశోక్‌ గజపతిరాజు ఆధీనంలోవున్న మాన్సాస్‌ లెక్క తేలుస్తామన్న స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి, ఇతర వైసిపి పెద్దలు కీలకమైన ఎన్నికల ఘట్టంలో నేడు నోరు మొదపడం లేదు. నోరు మెదిపితే వీరభద్రస్వామి కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ ఊదరగొట్టిన అశోక్‌, ఆయన కూతురు టిడిపి అభ్యర్థి అదితి విజయలక్ష్మి వాటిని బయటపెట్టేందుకు ఇప్పుడు ఎందుకు వెనుకాడుతున్నారు. ఇదీ విజయనగరంలో ముమ్మరంగా సాగుతున్న చర్చ. అటు గజపతినగరం మండలం కోరపు కొత్తవలస ప్రజానీకం నిన్నగాక మొన్న భూముల అక్రమ కొనుగోలు, క్రయ, విక్రయాలు, చెల్లింపులపై స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్యను నిలదీశారు. ఇది కేవలం ఆ ఊరిలో మాత్రమే కాదని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అప్పలనర్సయ్య అడ్డగోలుగా భూములు వశపర్చుకున్నారని నియోజకవర్గ వాసులు ఆరోపిస్తున్నారు. సాక్షాత్తు టిడిపి నాయకులు కూడా చెప్పుకుంటున్నారు. దానిపై స్థానిక టిడిపి అభ్యర్థి ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఇందుకు ప్రతిఫలంగా టిడిపిలోని గ్రూపు రాజకీయాలు తదితరాలపై ఎమ్మెల్యే కూడా మాట్లాడడం లేదు. గజపతినగరం తోటపల్లి బ్రాంచి కెనాల్‌ ఎందుకు పూర్తిచేయలేదో కూడా టిడిపి ఎమ్మెల్యే ప్రశ్నించలేదు. ఈ నియోజకవర్గం పరిధిలోవున్న భీమసింగి సుగర్‌ఫ్యాక్టరీ తెరిపిస్తామని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. రైతుల్ని ఆదుకుంటామని మాత్రం ప్రసంగాలు ఊదర గొడుతున్నారు. ఇటీవల ఎస్‌.కోట వచ్చిన చంద్రబాబు కూడా భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని ఎలా తెరింపించాలన్నది ఆలోచిస్తామంటూ చేతులు దులుపుకున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే స్థానిక జ్యూట్‌ మిల్లులు ఎందుకు తెరిపించలేదో టిడిపి అభ్యర్థి బేబీ నాయన ప్రశ్నించడం లేదు. నియోజకవర్గానికి తోటపల్లి నీరు, బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమల స్థాపనపై ఇద్దరూ ప్రస్థావించడం లేదు. రూ.24కోట్లతో చింతపల్లి తీరంలో ఏడాది క్రితం తలపెట్టిన మత్స్యకార ఫ్లోటింగ్‌ జట్టీ ఎందుకు పూర్తిచేయలేదో, గడిచిన ఐదేళ్లలో తారకరామకు తగినంత నిధులు కేటాయించలేదో జనసేన అభ్యర్థి మాట్లాడడం లేదు. వైసిపి అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు మిరాకిల్‌ విద్యాసంస్థలపై వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణలపై ప్రశ్నించడం లేదు. సాలూరు నియోజకవర్గంలో కుడుమూరు భూములు, మెంటాడలో అటవీ భూముల ఆక్రమణలపై అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులిద్దరూ కిమ్మనడం లేదు. పార్వతీపురంలో జరిగిన భూదందాలపై అక్కడి టిడిపి అభ్యర్థి నోరు వినిపించడం లేదు. కురుపాం నియోజకవర్గంలోని పూర్ణపాడు-లాబేసు వంతెన పైనా, గిరిశిఖర గ్రామాల్లో విద్య, వైద్య సదుపాయాలు, నాన్‌ షెడ్యూల్‌ గ్రామాల్లోని గిరిజనుల వెతలు తదితర సమస్యలపై టిడిపి, వైసిపి అభ్యర్థులు కనీసం మాట వరసకు కూడా ప్రస్తావన లేదు. పాలకొండ, రాజాం, తదితర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో, ఒకరి అస్థిత్వాన్ని ఒకరు కాపాడుకుంటూ ఎన్నికల్లో జనాల్ని మభ్యపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

➡️