ఆందోళనకరమే!

Mar 14,2024 06:17 #Articles, #edite page

ద్రవ్యోల్బణం దారికి వచ్చినట్లు కేంద్ర గణాంకాల శాఖ ఎన్నికల వేళ విడుదల చేసిన తాజా నివేదిక పైపై మెరుగులకే పరిమితమైంది. కొద్దిరోజుల క్రితం వృద్ధి లెక్కలకు రెక్కలు తొడిగి విమర్శల పాలైన కేంద్ర ప్రభుత్వం మళ్లీ అదే తరహా విన్యాసానికి పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలనే పరిగణలోకి తీసుకున్నా భవిష్యత్తు ఆందోళనకరంగానే ఉంటుందన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. తాజా నివేదిక ప్రకారం ప్రధాన ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.3 శాతానికి తగ్గింది. విభాగాల వారీగా చూస్తే వినియోగదారుల ధరల సూచీ రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.09 శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు గణాంకాల శాఖ ప్రకటించింది. జనవరిలో రిటైల్‌ సూచీ 5.10 శాతంగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఇది 6.44 శాతంగా ఉందని, అక్కడి నుండి దిగిరావడంతో పాటు, ఆరు నెలల పాటు గరిష్ట కట్టడి స్థాయి యైన 6 శాతం కన్నా దిగువగా ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల వాస్తవ ఆదాయాలు పెద్దగా పెరగకపోవడం, నిరుద్యోగం పెరగడం, విద్య-వైద్యం వంటి రంగాల్లో ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో ఉన్నప్పటికీ రానున్న నాలుగైదు నెలల కాలంలో ధరలు మూడు నుండి నాలుగు శాతం పెరిగే అవకాశం ఉందంటూ వస్తున్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అత్యంత కీలకమైన ఆహార పదార్ధాల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైన విషయం తాజా గణాంకాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల మీద నేరుగా ప్రభావం చూపే ఈ అంశాన్ని చూసీ చూడనట్లు మోడీ సర్కారు వ్యవహరిస్తోంది. ప్రభుత్వానికి వంత పాడే మీడియాది కూడా ఇదే వైఖరి. జనవరిలో 8.3 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.66 శాతానికి పెరిగింది. 2023లో సగటున 5.95 శాతంగానే ఆహార పదార్ధాల ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం. ప్రజలు తమ కష్టార్జితమంతా ఆహార పదార్ధాల మీదనే ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏటికేడాదికి పెరుగుతున్నా పాలకులకు ఏ మాత్రం పట్టకపోవడం బాధాకరం! దేశవ్యాప్తంగా ధాన్యాలు, మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తుల ధరలు పెరిగాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో వంటనూనెలు, కూరగాయలు వంటి ధరల్లో కొంత తగ్గుదల కనిపించిందని గణాంకాలు పేర్కొన్నాయి. అయితే, తిండిగింజల ధరలు ఏటికేడాదికి పెరుగుతూనే ఉండటం సామాన్యులతో పాటు మధ్య తరగతికి శరాఘాతంగా మారుతోంది. దీనిని సరిదిద్ది ధరలకు కళ్లెం వేయవలసిన కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 5 కిలోల బియ్యం ఇచ్చి, ఇతర ఆహార పదార్ధాలకు కోత పెట్టడం దుర్మార్గం. ఈ పరిస్థితే దేశంలో అన్నార్తుల సంఖ్యను ఏటికేడాదికి పెంచుతోంది. ప్రపంచ ఆహార నివేదిక చెబుతున్నది ఇదే! దేశ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళల్లో రక్తహీనత పెరగడానికి, శిశువులు పోషకాహార లేమితో బాధపడటానికి ఈ పరిస్థితే కారణం. క్షేత్రస్థాయిలో అడుగడుగునా కనిపించే ఈ వాస్తవ దుస్థితిని మార్చకుండా, కాగితాలపై గణాంకాలను ఎంత గొప్పగా తీర్చిదిద్దినా ఫలితం శూన్యం.
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆర్భాటంగా చెప్పుకుంటున్న మన రాష్ట్రంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం జాతీయ సగటుకన్నా అధికంగా నమోదైనట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. అస్సాం, గుజరాత్‌, హర్యానా, జార్ఖాండ్‌, కర్ణాటక, ఒడిషా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి! ధరలను అదుపు చేయడంలో విఫలం కావడంతో ఎప్పటికప్పుడు బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న మొత్తం ఏ మూలకూ రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం బియ్యంతో సరిపెట్టకుండా కేరళలో మాదిరి ఇతర నిత్యావసర వస్తువులను కూడా రేషన్‌ షాపుల ద్వారా అందించాలి. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన అభివృద్ధి వస్తుంది. చిత్తశుద్ధితో అమలు చేసే ఆ తరహా కార్యక్రమాలే ప్రజలకు ఊరటనిస్తాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం నమోదు కావడం ఉపాధి హామీ చట్టం అమలుకు ఉన్న ప్రాధాన్యతను తెలియచేస్తోంది. ఈ చట్టాన్ని నీరుగార్చడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలి. మరిన్ని ఎక్కువ పని దినాలను, ఎక్కువ కూలీని సాధించాలి. ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఆ దిశగా చర్యలు చేపట్టేలా ప్రజల నుండి ఒత్తిడి పెరగాలి.

➡️