డబ్బుల్లేవా..!

Mar 30,2024 04:47 #Editorial

కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్‌ తన వద్ద డబ్బుల్లేవు కనుక పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడంలేదని మీడియాతో చెప్పడం దేశ ప్రజలను ఆశ్చర్య చకితుల్ని చేసింది. అలాగే కొన్ని నగసత్యాలను వెల్లడించడంతోపాటు పలు సందేహాలకు కారణమైంది. నిర్మలమ్మ మాటల ప్రకారం బిజెపి తరఫున పోటీ చేయాలంటే అభ్యర్థికి చాలా డబ్బుండాలన్నది ప్రాథమిక నిర్ధారణ. ఎన్నికల్లో పోటీకి భారీగా ఖర్చు చేయాల్సివుంటుందని సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేసినట్టయింది. అదే కనీస అర్హతగా కూడా భావించవచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే బిజెపి అభ్యర్థులు ఎన్నికల్లో డబ్బు ధారాళంగా ఖర్చు చేస్తారు. అలాగే డబ్బు ఖర్చు చేయలేనివారిని బిజెపి తన అభ్యర్థులుగా పోటీకి నిలపదన్నమాట. అంతేగాక వివిధ మీడియాల్లో మోత మోగిస్తున్న మోడీ గ్యారంటీలతో బిజెపి అభ్యర్థులు గెలవరనీ డబ్బు ఖర్చు చేసి గెలుస్తారనీ నిర్మలమ్మ చెప్పకనే చెప్పారు. ఆ విధంగా ఆ పార్టీ అభ్యర్థులకు ముందస్తు హెచ్చరికలు చేసినట్టే! ఇటువంటి ఎన్నో వాస్తవాలను ఆర్థిక మంత్రివర్యులు అన్యాపదేశంగానైనా వెల్లడించడం బాగానేవుంది.
ఇంతపెద్ద దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న మీకే డబ్బు లేకపోతే ఇంకెవరివద్ద ఉంటుందన్న పాత్రికేయుల ప్రశ్నకు అది దేశం డబ్బు, నాది కాదు కదా అని అమాత్యుల సమాధానం. అవును అది దేశం డబ్బే! మరి ఇడి, సిబిఐ, ఐటి దాడులు చేయించిన అధికార బిజెపి అక్రమంగా కూడబెట్టిన రూ.8,500 కోట్ల విలువైన ఎలక్టొరల్‌ బాండ్ల సంగతి ఏమిటి? అవి కమలం పార్టీ ఖాతాలో పడినవే కదా! ఆ డబ్బును ఎన్నికలకు కాక ఇంకేదైనా ప్రయోజనానికి ఉపయోగిస్తారా? ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలు పోను బిజెపి సుమారు 450 స్థానాలు పోటీ చేస్తుందనుకుంటే ఒక్కో నియోజకవర్గంలో బాండ్ల సొమ్ము మాత్రమే చూసినా దాదాపు రూ.20 కోట్ల చొప్పున ఖర్చు చేయవచ్చు. అంటే పార్టీ నిధి నుండి అభ్యర్థులకు ఇవ్వబోరనా లేక కమలనాథులు ఎన్నికల్లో ఇంకా పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తారనా! అంతేగాక ఆంధ్రప్రదేశ్‌ లేదా తమిళనాడులో పోటీ చేస్తే తన కన్నవారిల్లు అత్తవారిల్లు వంటి స్థానికతకు సంబంధించిన సమస్యలూ చర్చనీయాంశాలవుతాయని ఆమె వాపోయారట. గతంలో ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలుగు వారి కోడలి పేరిట రాజ్యసభకు ఎన్నికైన సంగతి ఆమె మర్చిపోయినా ఆంధ్రులు గుర్తు పెట్టుకుంటారు. అయితే, మతం, భాష, ప్రాంతం తదితర ప్రాతిపదికన జనాన్ని రెచ్చగొడుతూ సంఘపరివార్‌ సాగిస్తున్న విద్వేష ప్రచారం, బిజెపి గొప్పగా చెప్పుకునే సోషల్‌ ఇంజనీరింగ్‌ ప్రభావాలు ఈ విధంగా వారికి కూడా ప్రతికూల ఫలితాలిస్తుంటాయని అర్థం చేసుకోవడం అవసరం.
ఈ దేశాన్ని సుమారు పదిహేనేళ్లపాటు పాలించిన పార్టీలో ముఖ్యస్థానాల్లో పని చేసి, పదేళ్లపాటు కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికే డబ్బుల్లేవంటే ఇక సామాన్యుల మాటేమిటి? వారు ఎన్నికల దరిదాపుల్లోకి రాగలరా? ఇలా అయితే భారత్‌లో ప్రజాస్వామ్యం మనగలిగేదెలా? అందుకనే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఖర్చు చేసేందుకు నిధుల్ని ప్రభుత్వమే భరించేలా, అందుకు గడచిన ఎన్నికల్లో ఆ పార్టీ పొందిన ఓట్ల శాతాన్నిబట్టి చెల్లించడంలాంటి నిబంధనలతో ఎన్నికల సంస్కరణలు తేవాలని వామపక్షాలు, అభ్యుదయవాదులూ కోరుతున్నారు. అదే విధంగా పార్టీకి వచ్చే ఓట్ల దామాషానుబట్టి ప్రాధాన్యతా జాబితాలోని అభ్యర్థులు చట్టసభలకు ఎన్నికయ్యేలా ఆ సంస్కరణలుండాలనీ చాలా కాలంగా డిమాండ్లున్నాయి. అసలు ఎన్నికల్లో డబ్బు ప్రమేయమే లేనివిధంగా మార్పులు తీసుకొస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. నేర చరితులను చట్టసభలకు ఎన్నిక కాకుండా చూడాలి. ఎన్నికల్లో డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుందన్న ఆర్థిక మంత్రి మాటల సారాంశాన్ని తీసుకుంటే ఎన్నికల సంస్కరణల ఆవశ్యకత బోధపడుతుంది. అయితే మోడీ ప్రభుత్వం ఈపాటి ప్రజాస్వామ్యం కూడా మిగలకుండా జమిలి ఎన్నికల పేరిట ఏక పార్టీ ఏక వ్యక్తి నియంతృత్వ పాలన దిశగా చర్యలు చేపడుతోంది. ఆ కుట్రలను వమ్ము చేయాలి. అందుకు ఈ కార్పొరేట్‌-మతతత్వ కూటమి పాలనను అంతం చేయడమే ఏకైక మార్గం.

➡️