డిగ్రీలు లేని ప్రిన్సిపాల్‌ !

Mar 22,2024 05:41 #editpage

కనీస విద్యార్హత లేకుండానే అధ్యాపకుడూ ప్రిన్సిపాలూ కావొచ్చా? అంటే వీలు కాదు. కానీ, కొందరు ఆ పరిధులు దాటుకుని, దీక్షతో నిరంతర కృషితో వాటిని సాధించగలుగుతారు. అలాంటి అరుదైన జీవితం-వ్యక్తిత్వం గలవాడు మన తెలుగు వారిలోనే ఒకరున్నారు. నాలుగో తరగతితో చదువు ఆపేసి, స్వయంకృషితో ఉన్నత విద్యావంతుడయ్యారు. ఒక జర్నలిజం స్కూలుకు చాలా కాలం ప్రిన్సిపాల్‌గా కొనసాగారు. ఆయనే రాంభట్ల కృష్ణమూర్తి (24 మార్చి 1920 – 7 డిసెంబరు 2001). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రముఖ జర్నలిస్టులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గురువు లేదా గురుతుల్యులు. ప్రగతిశీల సాహిత్యోద్యమ పునాది నిర్మాణానికి ఒక్కొక్క రాయి పేర్చిన అభ్యుదయ కాముకుడు.
తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం తాలూకా అనాతవరం గ్రామంలో జన్మించిన రాంభట్ల స్వయంగా ఇంగ్లీషు, ఉరుదూ, తెలుగు, సంస్కృత భాషలు నేర్చుకున్నారు. ఆ యా భాషల్లోని అనేకానేక గ్రంథాలు అద్యయనం చేశారు. ముఖ్యంగా ఒకవైపు సంప్రదాయ గ్రంథాల మీద, మరోవైపు ఆధునిక సాహిత్య ధోరణుల మీద సమానంగా పట్టు సాధించారు. చిన్నచిన్న పనులు చేస్తూ, స్వంత వ్యాపారాలు ప్రారంభించి ధనవంతులైన వారిని మనం చాలా మందిని చూడగలం. కానీ, స్వయంకృషితో ఇంత పెద్ద ఎత్తున విద్యాధనమార్జించిన పండితుల్ని చూడలేం. వేదాల్ని, ఉపనిషత్తుల్ని, దర్శనాల్ని క్షుణ్ణంగా చదివి, వాటి ప్రభావంలో పడి, ఒక ఛాందసవాదిగా మారిపోకుండా నిలదొక్కుకుని, అభ్యుదయవాదిగా నిలబడగలగడం చాలా గొప్ప విషయం. 1943లో హైదరాబాదు లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శి అయి, అదే సమయంలో ఒక ఐదేళ్ళ పాటు ‘మీజాన్‌’ పత్రికలో పని చేశారు రాంభట్ల! 1946లో తొలి తరం జర్నలిస్ట్‌ల జీతాల పెంపు కోసం సంఘర్షించారు. 1948లో మద్రాసులోను విజయవాడలోనూ పలు పత్రికల్లో పనిచేశారు. 1952లో విశాలాంధ్ర పత్రికకు సబ్‌ ఎడిటర్‌ అయ్యారు. ఆ రోజుల్లోనే కార్టూన్లు వేయడం, కార్టూన్‌ కవితలు రాయడం ప్రారంభించారు. తెలుగు జర్నలిజంలో అవే తొలి ప్రయత్నాలు.
కవి రాక్షస, అగ్నిమిత్ర, కృష్ణ-పేర్లతో ఆరోజుల్లో కనిపించిన రచనలన్నీ రాంభట్ల కృష్ణమూర్త్తివే!! అవన్నీ ఆయన కలం పేర్లు. జర్నలిస్ట్‌ గనక పత్రికలకు రాయడం మామూలుగా జరిగేదే. కానీ, అంతకు మించి అనేక విషయాల మీద ఆయన ఎన్నో గ్రంథాలు ప్రకటించారు. జన కథ, వేల్పుల కథ, సొంత కథ, శశవిషానం, పాదుటాకులు వంటి గ్రంథాలు చాలా ప్రకటించారు. ఉరుదూ కవి ముగ్దుమ్‌ మొహియుద్దీన్‌ కవిత్వానికి ఆకర్షితులై ఆయన కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారు. అలాగే కమ్యూనిస్టు అంతర్జాతీయ గీతాన్ని అదే బాణిలో, పాడుకోవడానికి అనువుగా అనువదించారు. ఇవన్నీ చేస్తూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘానికి మార్గదర్శిగా నిలిచారు. 1973 గుంటూరులో, 1977 హైదరాబాదులో జరిగిన ‘అరసం’ రాష్ట్ర మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నాటి యువతీ యువకుల మెదళ్ళలో అభ్యుదయ బీజాలు నాటి, వారిని రచనా రంగం వైపు నడిపించారు. ఆయన పరిశీలనల్లో, పరిశోధనల్లో ఎప్పుడూ కొత్త చూపు ఉండేది. కొత్త దారులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. చేసే కృషి ఏ రంగంలో దైనా, అన్నింటా మార్క్సిస్టు దృష్టి కోణాన్ని నిలుపుకోవడం ఆయన ప్రత్యేకత! ఈ విషయాలన్నిటినీ పొందుపరిచి ‘దారి దీపం’ మాసపత్రిక సంపాదకులు డి.వి.వి.ఎస్‌ వర్మ-రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి విశేష సంచికను వెలువరించారు. దానికి ఆర్వీ రామారావు గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు.
తొలితరం జర్నలిస్ట్‌గా, తొలి కార్టూనిస్ట్‌గా, మార్క్సిస్టు మేధావిగా గుర్తింపబడ్డ రాంభట్ల ఏం రాశారోనని ఆయన రచనలు జాగ్రత్తగా పరిశీలించాను. అప్పుడు తెలిసింది ఆయన నిజంగానే విషయ పరిజ్ఞానం గలవారని! వేదాలు సృష్టి మొదలైనప్పుడే ఉన్నాయని, ఆ భగవంతుడే స్వయంగా మానవుడికి అందించాడని ఊదరగొట్టే వారికి రాంభట్ల వాక్యాలు కొన్ని చూపించదలిచాను. ఆయన ఇలా రాశారు. ”మన వేద సమాజంలో జర్మన్‌ సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని, వేదకాలం కన్నా ముందే ఈ దేశంలో వర్ధిల్లిన హరప్పా, మొహంజొదారో సమాజాల్లో ప్రాచ్య సమాజ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయ”ని జనకథలో ఒక చోట చెప్పారు. ఆధునిక పరిశోధనలు ధృవపరిచిన విషయాల్ని రాంభట్ల కృష్ణమూర్తి ఆ రోజుల్లోనే గ్రహించగలిగారు.
ఇంకా ఇలా రాశారు. ”మొహంజొదారో సమాజ సంస్కృతుల ప్రభావం వేదాల మీద పడినట్లు వేదాల్లోనే యెన్నో ఆధారాలు కనిపిస్తాయి. ఇప్పుడు రామాయణం చదువుతూ ఉంటే-మొసపటేమియా, మొహంజొదారో సమాజం ప్రభావం రామాయణంలో చాలా కనిపిస్తోంది. జుడిషియల్‌ బ్లయిండ్‌నెస్‌ తొలగిపోయిన తర్వాత మన సమాజం కొత్త కాంతులతో కొత్త తేజస్సుతో కనిపిస్తోంది. అందుచేత మార్క్సిజం వెలుగులో మన చరిత్రను తిరిగి చూద్దాం. మన సమాజాన్ని తిరిగి అర్థం చేసుకుందాం. మన కూకటి వేళ్ళను-రూట్స్‌ను-తిరిగి పట్టుకుందాం!” ఇది రాంభట్ల కృష్ణమూర్తి భావితరాలకు ఇచ్చిన సందేశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది!
ఇలాంటి వారు ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. తాము చేయదలచుకున్న పని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతారు. గొప్ప పదవుల్లో ఉండి కూడా చేసింది ఏమీ లేకపోయినా, నిస్సిగ్గుగా అంతర్జాతీయ అవార్డుల కోసం ప్రయత్నాలు చేసుకునే హీన మనస్కులు, మీడియా పిచ్చోళ్ళూ ఉన్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా ఎవరినీ పట్టించుకోకుండా సత్యాన్ని అన్వేషించే దిశగా నిరంతరం కృషి చేస్తున్న వారిని తప్పకుండా గుర్తించుకోవాలి! గౌరవించుకోవాలి.

/ వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, జీవశాస్త్రవేత్త
– మెల్బోర్న్‌ నుంచి /

➡️