శిథిల శరీరులు

Mar 25,2024 04:21 #editpage

పూర్వం ఇక్కడో గుడి ఉన్నట్టు తెలుసు
దాని చుట్టుపక్కల నది ప్రవహిస్తున్న జ్ఞాపకమూ వుంది.
అక్కడ!
బతకలేక, జీవితాన్ని బతుకుతున్న
శిధిల శరీరులెందరో
ఆకలి వేడుకలు జరుపుకున్నట్టు
యాదికి నాలో ఇంకా సజీవంగా వుంది!

అర్ధరాత్రి హఠాత్తుగా అంతా నిశ్శబ్దం!
నిర్మానుష్యం, గుడి లేదు,
గుడిసెలు లేవు.
అంతా ధ్వంసం
నది పక్కన దీర్ఘ నిద్రలో
ఉన్న నిర్వాసితులే
అందుకు ప్రత్యక్ష సాక్ష్యం!
తర్వాత మరో వీధి వాడి లక్ష్యం.
కొండలు, నదులు, శ్మశానాలు
మింగేసే కబ్జాదారులు
ఆక్రమణ స్థానంలో
ఇండిస్టీయల్‌ కాంప్లెక్స్‌!

వాడు నడుస్తున్నంత మేరా
దేశభక్తి వాసన పులుముకుంటాడు
ఆధ్యాత్మికతను అలంకరించుకుంటాడు
జనం ఎందుకు ఏడుస్తున్నారో
వేరే చెప్పాలా?
భూ బకాసురులు
భూమంతా ఆక్రమించుకుంటున్నారు
వాడు మృత్తికలో నివాసం వుండే రోజెప్పుడో!?
– అనిత గండమళ

➡️