చిన్న దేశంతో పెద్ద తగాదా

Jan 11,2024 06:42 #edite page, #Maldives, #modi

మాల్దీవుల వ్యవహారం ముదురుతోంది. 5 లక్షల జనాభా కలిగిన దేశం గురించి ఇప్పుడు 140 కోట్ల జనాభా వున్న భారతదేశంలో ఇంత పెద్ద చర్చ జరుగుతోందంటేనే దాని ప్రాధాన్యత అర్థమవుతోంది. 24 ప్రధాన దీవులు, మరో 1200 చిన్న చిన్న ద్వీపాలు ఆ దేశ పరిధిలో ఉన్నాయి. 1965లో ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇండియాకు మిత్రదేశం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడు మహహ్మద్‌ మెయిజు గద్దెనెక్కే వరకూ సంబంధాలు సవ్యంగానే ఉండేవి. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారాయి.

మాల్దీవుల జనాభాలో 95 శాతం ముస్లింలు. ఇక్కడ మైనార్టీల మీద అణచివేత ప్రభావం ప్రపంచమంతా ఉన్నట్టే మాల్దీవుల వాసుల్లోనూ ఇండియా మీద వ్యతిరేకతను పెంచింది. ఫలితంగా అక్కడి పార్టీలు ఇండియా నుంచి చైనా అనుకూల వైఖరికి షిఫ్ట్‌ అయ్యాయి. దానికోసమే వేచి చూస్తున్న చైనా మాల్దీవులను ఆదరించి సహకరించే పని చేసింది. చివరకు ఇప్పుడు ఎలా అయ్యిందంటే ఆ దేశంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ చైనా అనుకూల వైఖరినే తీసుకున్నాయి.

ఇండియా రక్షణ అవసరాల రీత్యా మాల్దీవులు కీలకం. ఆర్థిక వ్యవహారాల్లోనూ అంతే ప్రధానం. మాల్దీవులు కేంద్రంగా సూట్‌కేస్‌ కంపెనీలు ఏర్పాటు చేసి పన్ను రాయితీలు పొందడంలో ఇండియన్‌ కార్పోరేట్లకు కొట్టిన పిండి. మన ఎస్బీఐ అక్కడ క్రియాశీలకంగా ఉంటుంది. ఇండియన్‌ నేవీ శిక్షణా కేంద్రాలున్నాయి. 1988లో అక్కడ శ్రీలంక సహకారంతో తిరుగుబాటు జరిగితే ఇండియా తోడ్పాటుతోనే అణచివేసిన చరిత్ర ఉంది. అన్ని విధాలా మాల్దీవులతో సంబంధాలు ఆ చిన్న దేశం కన్నా ఇండియాకు వ్యూహాత్మకంగా అవసరం ఎక్కువని భావించి సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి అన్ని ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చాయి. అందుకు అనుగుణంగానే ఇండియా నుంచి భారీగా ఆర్థిక సహాయమే కాకుండా బియ్యం, పప్పులు, పంచదార, బంగాళాదుంపలు వంటి వన్నీ ఎగుమతి అవుతాయి.

అలాంటి దేశంతో సంబంధాలు చెడిపోతున్నా సరిచేసుకోలేకపోవడం, చిన్న దేశాన్ని దౌత్యపరంగా దారికి తెచ్చుకోవడంలో స్పష్టమైన వైఫల్యం ఇండియా వైపు కనిపిస్తోంది. పాకిస్తాన్‌కి తోడుగా ఓవైపు శ్రీలంక, మరోవైపు నేపాల్‌, బర్మా, ఇప్పుడు మాల్దీవులు వంటి దేశాలన్నీ చైనాకి చేరువవుతున్నా చేతులు కట్టుకుని చూసి, ఇప్పుడు కుర్చీ మడతపెట్టేశామనే ఎలివేషన్లు ఏం ఉపయోగం చెప్పండి. మాల్దీవులకు టూరిజం ప్రధాన ఆదాయ వనరులు నిజమే. 2023లో ఇండియా నుంచి 2,09,198 మంది టూరిస్టులు వెళ్లారు. కరోనాకి ముందుతో పోలిస్తే ఇది లక్ష మంది తక్కువ. నిరుడు రష్యా నుంచి అంతే మంది 2,09,146 మంది అక్కడ అడుగుపెట్టారు. శ్రీలంక పరిస్థితులతో రష్యన్లు అటు మళ్లారు. 1,87,118 మంది చైనీయులు కూడా పర్యటించారు. 2022లో చైనా నుంచి 1.3 లక్షల మంది అక్కడికి వెళ్తే ఏడాదిలో అర లక్ష పెరిగారు. ఇండియన్లు 30 వేల మంది తగ్గారు.

ఇండియా నుంచి పర్యాటకులు గత కొన్నేళ్లుగా తగ్గుతున్నారని అధికారిక డేటా ఉండగా, ఇప్పుడేదో జరిగిపోయిందని కహానీలు అల్లుతూ, చివరకు బారుకాట్‌ మాల్దీవుల కోసం మాల్దీవుల ఫోటోలను వాడుకుంటూ సోషల్‌ మీడియాలో దేశం పరువు తీస్తున్న బ్యాచ్‌ తీరు విడ్డూరంగా ఉంది. ఇదంతా ఎందుకంటే సరిగ్గా ఇప్పుడే మాల్దీవుల అధ్యక్షుడు చైనాలో పర్యటిస్తున్నాడు. వాస్తవానికి అక్కడ అధికారంలోకి వచ్చిన ప్రతీ అధ్యక్షుడూ తొలుత ఇండియా వచ్చేవారు. ఈసారి మాత్రం మొదట టర్కీ, తర్వాత దుబారు వెళ్లి అనంతరం ఢిల్లీకి వచ్చారు. వెంటనే బీజింగ్‌ బయలుదేరాడు. ఇది అర్థమయితే మాల్దీవుల్లో మన పరువు ఎలా తగ్గిపోతుందో అర్థమవుతుంది. చేతగానితనానికి చక్కెర పూసి దేశవాసులను మభ్యపెట్టాలనే ప్రయత్నంలో ఉన్న వాట్సాప్‌ యూనివర్సిటీ కహానీలు వింటుంటే టూరిస్టులను ఆపేసి, మాల్దీవులను దిగ్బంధిస్తామని ఊహించడం ఎలా ఉంటుందంటే అప్పుడెప్పుడో గాల్వాన్‌ లోయ ఘటన తర్వాత చైనా టీవీలు పగులగొట్టిన వాళ్ల చందం అన్నమాట.

సత్తా ఉంటే సమీప, వ్యూహాత్మక దేశాన్ని దారికి తెచ్చుకోవాలి. అంతే తప్ప అల్ప సంతోషులయిన ప్రజలను అపోహల్లో ముంచేసే యత్నం ఏమి ఉపయోగం మహాశయా! చిన్న దేశంతో దౌత్యపరమైన వ్యవహారాన్ని సోషల్‌ మీడియాలో రచ్చ చేసి ప్రపంచ ముందు పలుచనవ్వడమే తప్ప ప్రయోజనం ఉంటుందా అన్నది సందేహమే!

– అమన్‌

➡️