దేశం కోసం పిన్న వయసులోనే ప్రాణాలొదిలిన వీరుడు !

Dec 19,2023 07:49 #Editorial
  • నేడు అష్ఫాఖుల్లా ఖాన్‌ వర్థంతి

               ‘నాకు ఏ కోరికా లేదు. ఉన్నదల్లా ఒకే ఒక్క కోరిక. నా శవాన్ని చుట్టే గుడ్డలో నా మాతృ భూమి తాలూకు మట్టిని కొంచెం పెడితే చాలు’ అని చివరి కోరిక కోరుకున్న స్వాతంత్య్ర విప్లవవీరుడు షాహిద్‌-ఏ-ఆజాం అష్ఫాఖుల్లాఖాన్‌. ఈ మట్టి కోసం, ఈ ప్రజల కోసం ప్రాణం కంటే మిన్నగా దేశాన్ని ప్రేమించాడు. భగత్‌సింగ్‌ కంటే ముందే మా దేశ విముక్తి కోసం చిరునవ్వుతో ఉరితాడును పెళ్లితో ముడిపెట్టిన అసమాన ధైర్యశాలి. ఆయన ధైర్య సాహసాల గురించి ఆరోజుల్లో భగత్‌సింగ్‌ ఎంతగానో కొనియాడారు. అష్ఫాఖుల్లాఖాన్‌ నుంచి భగత్‌సింగ్‌ స్ఫూర్తి పొందాడు. అంతటి విప్లవ యువకిశోరం త్యాగచరిత్రను నేడు హిందూ మతోన్మాదులు మరచిపోయి ముస్లిమ్‌లపై అనేక రకాల దాడులు చేస్తున్నారు. ఈ దేశం వదలి పాకిస్తాన్‌కు వెళ్లిపొండి అంటున్నారు. అందుకే ఈ దేశ స్వాతంత్య్రం కోసం, హిందూ-ముస్లిమ్‌ల ఐక్యత కోసం ఆరోజుల్లోనే అనేక రకాలుగా అష్ఫాఖ్‌ కృషి చేశారు. ఆయన లాంటి వీరుల చరిత్రను తెలుసుకోవడం ద్వారా, వారిని స్మరించుకోవడం ద్వారా మతోన్మాద శక్తులకు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మరింత గట్టిగా పోరాడేందుకు అందరినీ కలుపుకుని ముందుకు సాగినపుడే అష్ఫాఖ్‌ నుంచి నిజమైన స్ఫూర్తి పొందిన వారమవుతాం.

ఉత్తరప్రదేశ్‌ లోని షాజహాన్‌పూర్‌లో విద్యావంతులైన జమీందారీ కుటుంబంలో మెహరున్నీసా బేగం, షఫీఖుల్లా ఖాన్‌ దంపతులకు 1900 అక్టోబర్‌ 22న అష్ఫాఖ్‌ జన్మించారు. కుటుంబంలో చివరివాడైనందున అత్యంత గారాబంగా పెరిగాడు. ఏడవ తరగతి చదువుతున్న దశలోనే బెంగాల్‌ విప్లవకారుల వీరోచిత సాహసాలు, ఖుదీరాంబోస్‌, కన్హయ్యాలాల్‌ లాంటి వీరుల ప్రాణత్యాగాల నుంచి ప్రేరణ పొందాడు. తను కూడా వారిలాగే మాతృభూమి విముక్తి కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. ఆనాటి విప్లవ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘హిందుస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌’తో సంబంధాల కోసం తీవ్రమైన ప్రయత్నాలు ప్రారంభించారు అష్ఫాఖ్‌. ఖిలాఫత్‌ ఉద్యమం అనంతరం హిందూ ముస్లిమ్‌ల ఐక్యతను దెబ్బ తీయడానికి సామ్రాజ్యవాదులు పన్నిన కుట్రల వల్ల హిందూ-ముస్లిమ్‌ల మధ్య కొన్ని అపోహలు, అపార్థాలు ఏర్పడ్డాయి. అందువల్ల ముస్లిమ్‌ యువకుడైన అష్ఫాఖుల్లా ఖాన్‌ను అసోసియేషన్‌ లోకి తీసుకునేందుకు రాంప్రసాద్‌ బిస్మిల్‌ విముఖత చూపాడు. అష్పాఖ్‌ పట్టు వదలకుండా వారు పెట్టిన పరీక్షలన్నిటి లోనూ నెగ్గి సంఘంలో ముఖ్య సభ్యునిగా ఎదిగాడు. ‘నేను స్వేచ్ఛా స్వాతంత్య్రం కలిగిన పూజారిని. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించడానికి సర్వదా సిద్ధం” అని ప్రకటించాడు. ‘మాతృదేశ విముక్తి కోసం ఏం వచ్చినా ఎదుర్కొంటాను కానీ బాధపడను. ఈ దేశం కోసమే జీవిస్తాను, మరణిస్తాను’ అని చాలా స్పష్టంగా తన జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మహనీయుడు అష్పాఖుల్లాఖాన్‌.

1925 ఆగస్టు 9న కకోరీ సమీపంలో రైలులో తరలించబడుతున్న ప్రభుత్వ ఖజానాను దాడి చేసి దోచుకున్నారు. ఈ దాడిలో అప్షాఖుల్లాఖాన్‌, ఆజాద్‌, బిస్మిల్‌తో సహా 10 మంది విప్లవకారులు పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఈ ఘటన కకోరీ కుట్ర కేసుగా నిలిచిపోయింది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఏడుగురిని అరెస్టు చేశారు. అష్పాఖ్‌ అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అష్ఫాఖ్‌ను పట్టుకున్నారు. ఈకేసు విచారణ జరిపి కోర్టు ఉరిశిక్ష విధించింది. అష్ఫాఖుల్లాఖాన్‌ను 1927, డిసెంబర్‌ 19న ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయనను ఫైజాబాద్‌ జైలుకు తరలించారు. ఆయనకు జైలులో భగత్‌సింగ్‌తో పరిచయమైంది. ఉరితీయడానికి ముందురోజు అష్ఫాఖుల్లాఖాన్‌ బాగా ముస్తాబై ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ ఇలా అన్నాడు ‘రేపే నా పెళ్లి. నా పెళ్లి చేయాలని మా వాళ్లెంతో ప్రయత్నించారు. నాకు నచ్చిన వధువు దొరక్క చేసుకోలేదు. ఇన్నాళ్లకు ఇదిగో నాకు నచ్చిన వధువు దొరికింది’ అంటూ ఉరిశిక్షను వధువుతో పోల్చి ఉత్సాహంగా ఉరికంబం ఎక్కిన విప్లవకారుడు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగనిరతి ఆశ్చర్యానికి గురి చేసిందని భగత్‌సింగ్‌ రాసుకున్నారు.

1927, డిసెంబర్‌ 19న ఉరి వేదిక ఎక్కి ముందుకు నడిచి ఎంతో ధైర్యంతో ఉరితాడును చిరునవ్వుతో ముద్దాడాడు. స్వతంత్ర భారత దేశం ఏ విధంగా ఉండాలన్న విషయంలో అష్ఫాఖుల్లాఖాన్‌ చాలా స్పష్టమైన అభిప్రా యాలను కలిగి ఉన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఎటువంటి అసమానతలకు చోటు ఉండరాదని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక అసమానతలు, సాంఘిక అంతరాలు, ఏ రకమైన దోపిడీ లేని సమాజాన్ని ఆశించారు. సమ సమాజానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చిన అష్ఫాఖ్‌ హిందూ, ముస్లిముల ఐక్యతకు అంతటి స్థానం కల్పించారు. మౌలానా అబ్దుల్‌ కలాం స్థాయిలో హిందూ-ముస్లిమ్‌ల ఐక్యతకు ప్రతీకగా నిలిచారు. దేశంలో మతం పేరిట జరుగుతున్న సంఘటనలు, పాలక వర్గాల కుట్రలన్నిటిపై హెచ్చరించారు. ‘మత మార్పిడి సంస్థ ఏడు కోట్ల మంది ముస్లిములను హిందువులుగా, 22 కోట్ల మంది హిందువులను ముస్లిములుగా మార్చగలదా?’ అని నాడే ప్రశ్నించాడు అష్ఫాఖ్‌. బానిసలుగా బతుకుతున్న వారికి మతమేమిటన్నారు. భారతీయులు బానిసత్వం నుంచి బయట పడాలని, మత విభేదాలను మరచి సమైక్యం కావాలని ఆరోజే పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఐక్యమై విదేశీ పాలకులతో పోరాడాలని కోరారు. ‘భారతదేశ పౌరులారా! మీరు ఏ మతానికి, సంప్రదాయానికి చెందిన వారైనా సరే దేశసేవలో సహకరించండి. వృథాగా పరస్పరం కలహించుకోకండి. ఒకవేళ దారులు వేరైనా అందరి లక్ష్యం ఒక్కటే. అన్ని పనులూ ఒకే లక్ష్యాన్ని సాధించేందుకే. అలాంటప్పుడు ఈ వ్యర్థపు కొట్లాటలు, కుమ్ములాటలు ఎందుకు? ఐకమత్యంతో దేశంలోని దొరతనాన్ని ఎదిరించండి. దేశాన్ని స్వతంత్రం చేయండి. నా సోదరులు సుఖంగా ఉందురు గాక!’ అని ‘చివరిగా అందరికీ నా సలాం…’ అంటూ తన ప్రసంగం ద్వారా దేశభక్తులకు కర్తవ్యాన్ని బోధించారు. ఆయన ఈ దేశానికి సాధారణ స్వాతంత్య్రాన్ని మాత్రమే కోరుకోలేదు. ఆర్థిక, సామాజిక అసమానతలు లేని మరో ప్రపంచాన్ని ఆయన కలలు కన్నారు. మతం పేరుతో మారణహోమం సృష్టిస్తున్న మతోన్మాద శక్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. సమాజంలో మతతత్వ శక్తులు విజృంభిస్తున్నాయి. ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనే వారు శాంతియుత వాతావరణాన్ని చెల్లాచెదురు చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఒక మతాన్ని కించపరిచే విధంగా రాజకీయ నాయకులు ముందుకు పోతున్నారు. ముస్లిములు, దళితులు, మేధావులు, లౌకికవాదులపై అనేక రకాలుగా దాడులు చేస్తున్నారు. రాజ్యాంగ పరంగా ప్రతిజ్ఞ చేసిన వారే మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఏది రాయాలో, ఏది రాయకూడదో సైతం బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి చెప్పినట్లు చేయాలనే నిబంధన తెచ్చి దేశాన్ని హిందూదేశంగా మార్చాలన్న కుట్ర జరుగుతోంది. దీన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదం అంటే ముస్లిములు కారు. ముస్లిములు అంటే ఉగ్రవాదులు కారు. దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా వదలిన అష్ఫాఖుల్లాఖాన్‌ వారసులు ఈ దేశ ముస్లిములు. అదే స్ఫూర్తితో దేశం కోసం ఉద్యమిస్తాం… మతోన్మాదాన్ని ఈ దేశం నుంచి తరిమివేస్తాం… ఉద్యమిద్దాం.. అదే అష్ఫాఖుల్లాఖాన్‌కు మనమిచ్చే నిజమైన నివాళి.-

– సంఘమిత్ర

➡️