టిటిడి అటవీ కార్మికుల ఘన విజయం

Feb 17,2024 06:49 #Articles, #Protest, #TTD forest workers

పట్టుదలగా పోరాడితే విజయం తథ్యమని తిరుపతి నగరంలో ఓ చిన్న కార్మిక సంఘం చేసిన పోరాటం నిరూపించింది. స్ఫూర్తిని కలిగిస్తున్న ఈ పోరాట అనుభవం చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న టిటిడి అటవీ కార్మికులు 130 మంది చేపట్టిన పోరాటం చరిత్రను సృష్టించింది. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టిన 56 నెలల కాలంలో 38 నెలల పాటు రిలే నిరాహార దీక్షలు చేసి రాష్ట్రంలో అత్యధిక రోజులు పోరాడిన చరిత్రను ఈ చిన్న యూనియన్‌ సొంతం చేసుకుంది.

2020 నవంబర్‌ 26వ తారీకున రాజధాని ఢిల్లీ నగరంలో రైతులు ఆందోళన చేపట్టారు. అదే రోజున జోరున కురుస్తున్న వర్షంలో టిటిడి అటవీ కార్మికులు తమని రెగ్యులర్‌ చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నాటి ఆ పోరాటాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజయ కుమార్‌ ప్రారంభించారు. సమ్మె 1163వ రోజున కార్మికులు ఘన విజయం సాధించారు.

362 మంది కార్మికులున్న టిటిడి అటవీ విభాగంలో 162 మంది జూనియర్లను అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో టిటిడి యాజమాన్యం పర్మినెంట్‌ చేసి అటవీ కార్మికులకు అన్యాయం చేసింది. మిగిలిన రెండు వందల మందికి బోర్డు చేసిన తీర్మానం ప్రకారం టైం స్కేల్‌, అలవెన్సులతో కూడిన వేతనం ఇవ్వాలని సిఐటియు అడుగుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. అధికార పార్టీ మద్దతుతో జూనియర్‌ కార్మికుల్ని పర్మినెంట్‌ చేసి…సిఐటియులో ఉన్న కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేసింది. ఇదేమి న్యాయమని ప్రశ్నించినా వినడానికి కూడా టిటిడి యాజమాన్యం సిద్ధపడలేదు.

ఈ నేపథ్యంలో కార్మికులందరూ రెగ్యులర్‌ అయ్యేంతవరకు పట్టు వదలబోమని ప్రకటించి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. రెండున్నర సంవత్సరాలపాటు 200 మంది కార్మికులు తమ పోరాటాన్ని ఎంతో విశ్వాసంతో నడిపారు.

రెండున్నర సంవత్సరాల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రికి అత్యంత విశ్వసనీయమైన ఓ ప్రజా ప్రతినిధి తమ యూనియన్‌ లోకి వస్తే పర్మినెంట్‌ చేయిస్తామని కార్మికులను రెచ్చగొట్టి 200 మందిలో 76 మందిని అధికార పార్టీకి అనుకూలంగా చీల్చి వేశారు. మిగిలిన 124 మంది కార్మికులు పట్టు విడవకుండా వంతులవారీగా కడుపులు మాడ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.

‘ఎన్నికల ముందు నేటి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ, 2019లో టిటిడి బోర్డు చేసిన తీర్మానం, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశం…ఇందులో ఏ ఒక్కటైనా అమలు జరపండి మహాప్రభో…’ అని మూడేళ్లకు పైగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల గురించి టిటిడి యాజమాన్యం పట్టించుకోలేదు.

అటవీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా సిఐటియు రాష్ట్రమంతటా ధర్నాలు నిర్వహించింది. ఈ ధర్నాలకు విశేషమైన స్పందన లభించింది. అనంతరం సంఘీభావ విరాళాలను కూడా వసూలు చేయడం జరిగింది. టిటిడి అటవీ కార్మికులు విజయం సాధించడానికి రాష్ట్ర కార్మిక వర్గం భరోసా కలిగించింది. సిఐటియు అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్‌ హేమలత, ఐద్వా అఖిల భారత నాయకురాలు బృందాకరత్‌ తోపాటు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పలువురు ఈ పోరాట శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. టిటిడి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు పలుమార్లు ఈ పోరాట కార్యక్రమాల్లో పాల్గొని, శాసనమండలిలో ప్రశ్నించి అటవీ కార్మికులకు అండగా నిలిచారు.

కార్మికులకు మద్దతుగా ఈ జనవరి 27వ తేదీన తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మరో ఎనిమిది మంది అటవీ కార్మికులు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. దాంతో తిరుపతి నగరంలో ఈ సమస్య ప్రధానమైన చర్చగా మారింది. పేద అటవీ కార్మికులకు మద్దతుగా తిరుపతి పౌర సమాజం కూడా నిలబడింది. మూడు రోజుల తర్వాత 29వ తేదీన పోలీసులు బలవంతంగా వీరిని అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు. అరెస్టుల అనంతరం అక్కడికక్కడే మరో ఏడుగురు కార్మికులు నిరవధిక దీక్ష ప్రారంభించారు. అధికార పార్టీ నేతలకు, పోలీసులకు ఈ పోరాటాన్ని ఆపగలిగామన్న సంతోషం గంటసేపు కూడా లేదు.

వివిధ రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు, రిటైర్డ్‌ జడ్జి, రిటైర్డ్‌ ప్రిన్సిపాళ్లు, రిటైర్డ్‌ ఉన్నతాధికారులు, సీనియర్‌ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల వారు, లాయర్లు, పూర్వ విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థి, మహిళా, యువజన సంఘాల వారు టిటిడి పరిపాలనా భవనం ఎదురుగా నిరాహార దీక్షకు పూనుకోవడంతో విధి లేని పరిస్థితుల్లో టిటిడి యాజమాన్యం దిగి వచ్చింది.

టిటిడి ఇ.ఓ ధర్మారెడ్డి ఆదేశం మేరకు టిటిడి జెఇఓ వీరబ్రహ్మం, సిఇఓ శేష శైలేంద్ర, డిఎఫ్‌ఓ శ్రీనివాసుల బృందం కార్మిక నేతలతో చర్చలు జరిపింది. అన్యాయానికి గురైన టిటిడి అటవీ కార్మికులందరినీ టిటిడి నిర్వహిస్తున్న కార్పొరేషన్‌ నుంచి మినహాయిస్తామని, టైమ్‌ స్కేలు అమలు పరుస్తామని చర్చల్లో హామీనిచ్చారు. అదే రోజు సాయంత్రం టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి శిబిరం వద్దకు వచ్చి దీక్షలో ఉన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 పిఆర్‌సి ఆధారంగా బేసిక్‌ను అందిస్తామని, ఇఎస్‌ఐ, పి.ఎఫ్‌ తో పాటు రూ.3125 మొక్కలు స్కీం పేరుతో అదనంగా అందిస్తామని, ప్రతి రెండేళ్లకు ఒక్కసారి రూ.3125 పెరుగుదల ఉంటుందని ప్రకటించారు.

ఈ ఒప్పందంతో ఒక్కో కార్మికుడికి ఎనిమిది వేల రూపాయలు అదనంగా వేతనం పెరిగినట్లయింది. అటవీ కార్మికులు చేపట్టిన 38 నెలల పోరాట కాలంలో రెండు సార్లు కరోనా రావడం, భారీ వర్షాలు, వరదలు తిరుపతి నగరాన్ని ముంచెత్తడంతో పాటు పండుగలు, పర్వదినాలలో సైతం శిబిరాన్ని వీడకుండా కార్మికులు రిలే నిరాహార దీక్షలను కొనసాగించడం తిరుపతి నగరంలో పెద్ద చర్చగా మారింది. తిరుపతిలో దాదాపు ఈ పోరాటం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు.

వెనుకడుగు వేయకుండా స్థిరత్వంతో పోరాడిన ఫలితంగా… పట్టు వీడని విక్రమార్కుల్లాగా అనేక ఒడిదుడుకులను, ఆటంకాలను, విచ్ఛిన్నాలను ఎదుర్కొని సిఐటియు నాయకత్వంలో కార్మికులు ఘన విజయం సాధించారు. పోరాడితే పోయేదేమీ లేదు-బానిస సంకెళ్లు తప్ప…అన్న నానుడిని మరో మారు రుజువు చేసిన అటవీ కార్మికులకు సిఐటియు రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేస్తున్నది.

Ch. Narasinga Rao

  • వ్యాసకర్త : సిహెచ్‌. నర్సింగరావు,  సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
➡️