ఢిల్లీ దీక్ష ఓ పెద్ద సందేశం

ఎల్‌డిఎఫ్‌ అధికారంలో ఉన్న కేరళపై ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆర్థిక దురాక్రమణకు వ్యతిరేకంగా ఈ నెల 8న ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమం దేశ దృష్టిని ఆకర్షించింది. పన్ను కేటాయింపులను నిరాకరిస్తూ, గ్రాంట్లు నిలిపివేసి, రుణ పరిమితిని తగ్గించేసి బిజెపి యేతర రాష్ట్రాలను ఆర్థికంగా కుంగదీస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా దేశ రాజధాని నగరంలో దీక్ష చేపట్టాలనే ఆలోచన మొదటగా కేరళ ప్రభుత్వమే చేసింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి వచ్చి కేంద్రంపై నిరసన తెలపడం అరుదైన ఘటన. స్వతంత్ర భారత చరిత్రలో కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రికి, ఆర్థిక మంత్రికి లేఖలు రాయడం, ప్రభుత్వ కమిటీలు, ఫోరమ్‌లలో లేవనెత్తడం, ఆర్థిక నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపడం వంటి ప్రజాస్వామిక మార్గాలన్నీ విఫలమైనప్పుడు ఢిల్లీలో సమ్మె చేస్తున్నట్లు కేరళ ప్రకటించింది. ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు కూడా సమ్మె నిర్వహించాల్సి వచ్చిన పరిస్థితి గురించి ప్రజలకు తెలియ చెప్తున్నారు.

పైన పేర్కొన్న అన్ని సందర్భాలలోనూ కేరళ ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించడానికి, హక్కులను డిమాండ్‌ చేయడానికి ప్రతిపక్షాల సహకారం కోరింది. అయితే కాంగ్రెస్‌గానీ యుడిఎఫ్‌ గానీ నవ కేరళ సమావేశంలో లేదా ఢిల్లీ దీక్షలో పాల్గొనడానికి సిద్ధంగా లేవు. ఆర్థిక నిర్వహణ లోపం, పట్టు లేకపోవడమే కేరళ సంక్షోభానికి కారణమన్న మోడీ ప్రభుత్వ వాదనను కేరళలోని కాంగ్రెస్‌, యుడిఎఫ్‌ అంగీకరించాయి. అయితే కేరళ దీక్షకు ముందు రోజు ఢిల్లీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు, ప్రజాప్రతినిధులు కేంద్ర నిర్లక్ష్యానికి నిరసనగా ధర్నా చేయడంతో యుడిఎఫ్‌ వాదనలు తుస్సుమన్నాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ‘కర్ణాటక తరహాలోనే కేరళ కూడా ఇబ్బంది పడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సైతం కేంద్రం చేసిన ఆర్థిక అన్యాయంపై మొన్ననే మాట్లాడారు. కేంద్రం నిర్లక్ష్యం వాస్తవమేనని వారంతా అంగీకరించాల్సి వచ్చింది’ అన్నారు.

మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనపై ‘బ్లాక్‌ పేపర్‌’ విడుదల చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఇలా అన్నారు: ‘కేంద్రం వివక్ష చూపుతోంది. బిజెపి యేతర పార్టీలు పాలించే అన్ని రాష్ట్రాలను విస్మరిస్తోంది. కర్ణాటక, తెలంగాణ, కేరళ వంటి ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది’ అని విమర్శించారు. కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న ఈ విధానాన్ని అంగీకరించని కేరళ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం మోడీకి దీటుగా దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. కేరళలో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న ఈ వైఖరి… విస్తృత స్థాయిలో జాతీయంగా బిజెపి వ్యతిరేక కూటమి నిర్మాణానికి అడ్డంకిని సృష్టిస్తోంది. కేరళ చేపట్టిన సమ్మెకు ఖర్గే సహా కాంగ్రెస్‌ నేతలను ఆహ్వానించామని, అయితే కేరళలోని కాంగ్రెస్‌ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వారు పాల్గొనలేదని మీడియాలో వచ్చిన కథనాలను కాదనలేం.

అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత మోడీ ప్రభుత్వం, సంఫ్‌ు పరివార్‌ మతం పేరుతో ప్రజల మధ్య చీలికలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, ఢిల్లీలో కేరళ చేపట్టిన దీక్ష రాష్ట్రాలకు జరుగుతున్న ఆర్థిక అన్యాయం, సమాఖ్య వ్యవస్థకు వాటిల్లుతున్న ప్రమాదం వంటి సమస్యలను లేవనెత్తింది. ప్రజల సమస్యను ముందుకు తీసుకు రావడం ద్వారా మతతత్వ శక్తులను ఎలా ఎదుర్కోవాలన్న రాజకీయ సందేశాన్ని కూడా ఈ పోరాటం అందిస్తోంది.

”ఫెడరలిజంపై కేంద్రం దాడికి వ్యతిరేకంగా ఢిల్లీలో పినరయి విజయన్‌” అనే శీర్షికతో ‘హిందూ’ వార్తాపత్రిక సమ్మె కవరేజీకి సంబంధించిన కథనాన్ని ప్రచురించింది. మోడీ హయాంలో రాజ్యాంగ ప్రధాన సూత్రమైన ఫెడరలిజంపై దాడి జరుగుతోందని, ప్రతిఘటిస్తున్నది వామపక్షమేనని ‘హిందూ’ పత్రిక స్పష్టమైన సందేశం ఇచ్చింది. కేంద్రంపై ప్రతిఘటనకు వామపక్షం నాయకత్వం వహిస్తోందని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ రాసింది. పార్టీల పని తీరును ఎంపీల సంఖ్యతో కొలవడం మూర్ఖత్వమని ఈ వార్తాపత్రికల పరిశీలనలు పదేపదే స్పష్టం చేస్తున్నాయి.

‘హిందూ’ వార్తాపత్రిక ఇలా రాసుకొచ్చింది…’లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఐక్యతను సాధించడంలో కేరళ దీక్ష విజయవంతమైంది’. బీహార్‌లో జె.డి(యు) అధినేత, ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ‘ఇండియా’ కూటమిని వీడి బిజెపి శిబిరంలోకి వెళ్లడంతో బిజెపి వ్యతిరేక కూటమి కుప్పకూలిందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే కేరళ చేపట్టిన నిరసనల్లో నాలుగు రాష్ట్రాల అధికార పార్టీ నేతలతో సహా డజనుకు పైగా రాజకీయ పార్టీలు చేతులు కలిపాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, తమిళనాడు మంత్రి పి.త్యాగరాజన్‌, జమ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, డిఎంకె నేత తిరుచ్చి శివ, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబాల్‌, వి.కె.కె. నాయకుడు, ఎంపీ తోల్‌ తిరుమావళవన్‌ కేరళ సమ్మెలో పాల్గొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్వయంగా హాజరు కాకున్నా వీడియో సందేశం ఇచ్చారు. వేదిక మీద చూపించారు. ఢిల్లీలో జరిగిన ‘ఇండియా’ నాలుగో సమావేశం తర్వాత, ఆ కూటమి లోని ప్రధాన పార్టీలు పాల్గొనే వేదికగా విజయన్‌ నేతృత్వంలో జరిగిన దీక్ష మారింది. ప్రజా సమస్యలను లేవనెత్తడం, పోరాటం చేయడం ద్వారానే కేంద్రంలో బిజెపికి మూడవసారి అధికారం అందకుండా అడ్డుకోగలమన్న పెద్ద సందేశాన్ని అందిస్తోంది.

మతం, కులాల ప్రాతిపదికన ప్రజలను విభజించి అధికారాన్ని పండిస్తున్న బిజెపి, ప్రధాని… కేరళతో పాటు పలు రాష్ట్రాలు చేస్తున్న కేంద్ర వ్యతిరేక పోరాటాన్ని విభజించి పాలించేందుకు అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే సమ్మెలో ప్రమాదకరమైన విభజన రాజకీయాలను చూశారు ప్రధాని. దీన్ని ‘దక్షిణాది’ పోరాటంగా చూపించే ప్రయత్నం జరిగింది. అయితే, ప్రధాని, సంఫ్‌ు పరివార్‌ వండివార్చిన ఈ తప్పుడు కథనానికి కేరళ దీక్ష సరైన సమాధానం ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఉత్తరాదికి చెందిన వ్యక్తి. పంజాబ్‌ ముఖ్యమంత్రి కూడా ఉత్తరాది వారే. ఇంకా ఉత్తరాది రాష్ట్రమైన జమ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి కూడా పాల్గొన్నారు. కేరళ చేపట్టిన న్యాయమైన అంశం ఉత్తరాది రాష్ట్రాల నుండి మద్దతును పొందగలిగింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సమ్మెపై ఉద్ఘాటించారు. భారతదేశ భౌగోళిక పరిస్థితులను ప్రధాని అధ్యయనం చేయాలని ఏచూరి అన్నారు. రాష్ట్రాల న్యాయబద్ధమైన పోరాటాన్ని కూడా వక్రీకరించి దేశద్రోహ జాబితాలో చేర్చే ప్రమాదకర చర్యను మోడీ ప్రభుత్వం చేపట్టింది. తమిళనాడు ముఖ్యమంత్రి వీడియో సందేశంలో చెప్పినట్లుగా, ఫాసిస్ట్‌ బిజెపిని అధికారం నుండి తరిమి కొట్టడానికి ‘ఇండియా’ బ్లాక్‌ లోని అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే కేరళలోని కాంగ్రెస్‌ నాయకత్వానికి మాత్రమే ఈ విషయం అర్థం కావడం లేదు. బిజెపిపై సంఘటిత పోరాటాన్ని ఇంకా బలహీనపరుస్తూనే ఉన్నారు. మోడీ మూడోసారి వచ్చినా పర్వాలేదు-కేరళలో వామపక్షాలు కూలిపోతే చాలన్న దానిమీదే కాంగ్రెస్‌ రాష్ట్ర అధిష్టానం ఆసక్తి కనబరుస్తోంది. కానీ ప్రజల ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడే వామపక్షాన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న విషయాన్ని వీరు త్వరలోనే గుర్తిస్తారు.

  • వ్యాసకర్త : ఎం.వి. గోవిందన్‌, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు //’దేశాభిమాని’ సౌజన్యంతో/

 

➡️