ఉరితాడే ఊయలగా…

Mar 23,2024 04:30 #editpage
  • నేడు భగత్‌సింగ్‌ వర్థంతి

భారత జాతీయోద్యమంలో పాల్గొని కేవలం 23 ఏళ్ల వయసులో ఈ దేశం కోసం ప్రాణా లర్పించిన గొప్ప దేశభక్తుడు భగత్‌ సింగ్‌. నేడు దేశాన్ని పాలిస్తున్న బిజెపి కానీ అది తొడుక్కున్న మతం ముసుగు ఆర్‌.ఎస్‌.ఎస్‌ గానీ జాతీయో ద్యమంలో ఏనాడూ పాల్గొనలేదు. అటువంటి కుహనా దేశభక్తులు నేడు తామే అసలైన దేశభక్తులమని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. దేశభక్తి ముసుగులో ప్రజలందరికీ భ్రమలు కల్పిస్తూ నిరంతరం జాతీయవాదం పేరుతో యువతను, విద్యార్థులను పక్కదోవ పట్టిస్తున్నవారు దేశద్రోహులవుతారు కానీ దేశభక్తులెట్లా అవుతారు? దేశం కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం పాటు పడే వాళ్లు అసలైన దేశభక్తులు. అటువంటి దేశభక్తులను దేశ ద్రోహులుగా చిత్రించి ‘ఉపా’ చట్టం పేరుతో సంవత్సరాల తరబడి జైల్లో మగ్గేలా చేయడమేనా దేశభక్తి అంటే? గాంధీని చంపిన గాడ్సే కాదు దేశభక్తుడు. నేను జైల్లో ఉండేకంటే బయట ఉంటేనే హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు పెట్టి వారి మధ్య ఐక్యతను చీల్చుతానని చెప్పి క్షమాభిక్ష పత్రం పెట్టుకుని బ్రిటీష్‌ వారి అడుగులకు మడుగులొత్తిన సావర్కర్‌ కాదు దేశభక్తుడు. క్షమించమని ఒక్క మాట అంటే చాలు నిన్ను విడిచిపెట్టేస్తామని అన్నారని తన తండ్రి చెబితే దానికంటే చావడం నయమని చెప్పి దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు నిజమైన దేశభక్తులు. అటువంటి దేశభక్తుల జీవితాల గురించి తెలుసుకుని వారి స్ఫూర్తితో…నేటి యువత, విద్యార్థులు పోరాటాల్లోకి చేరుతూ బిజెపి పాలకుల నిగ్గు తేలుస్తున్నారనే భయంతో…వారి జీవిత చరిత్రలను పాఠ్యాంశాల నుండి తొలగించింది కర్ణాటక బిజెపి ప్రభుత్వం. నిజమైన దేశభక్తులను పుస్తకాల్లో కనిపించకుండా చేస్తూ దేశ స్వాతంత్రోద్యమంలో ఏ మాత్రం పాత్ర లేని ఆర్‌.ఎస్‌.ఎస్‌ నాయకులను, జాతీయ నాయకులను చంపిన దేశద్రోహులను దేశభక్తులగా ప్రచారం చేస్తున్నది బిజెపి. బ్రిటిష్‌ దాస్య శృంఖలాల నుండి భారత దేశాన్ని విముక్తి చేయడం కోసం తన ప్రాణాలనే తృణప్రాయంగా అతి చిన్న వయసులోనే భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌లు ఉరికంబమెక్కిన రోజు నేడు.
భగత్‌సింగ్‌ 1907 సెప్టెంబర్‌ 28న బంగా గ్రామంలో జన్మించాడు. జాతీయోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చిన జలియన్‌ వాలాబాగ్‌ ప్రాంతాన్ని తన పన్నెండేళ్ళ వయస్సులో సందర్శించాడు. ఇక్కడ జరిగిన పోలీసు దమనకాండలో అధికారిక లెక్కల ప్రకారం 379 మంది మరణానికి, 1200 మందికి పైగా క్షతగాత్రులవడానికి కారణమైన బ్రిటీష్‌ వారిని ఎలాగైనా ఈ దేశం నుండి తరిమికొట్టాలని బలంగా ఆనాడే అనుకున్నాడు. 1928లో సైమన్‌ గోబ్యాక్‌ ఉద్యమంలో లాలా లజపతిరారుపై లాఠీ ఝుళి పించి ఆయన గుండెపోటుతో మరణించడానికి కారణమైన పోలీసు అధికారిని చంపాలనుకున్నాడు. అందుకు ప్రయత్నించినప్పటికీ…ఆ తరువాత వ్యక్తిగత హత్యలతో స్వాతంత్య్రం సాధించలేమని ప్రజలను కూడగట్టి రాజ్యాధికారాన్ని కూలదోస్తేనే స్వాతంత్య్రం వస్తుందని గ్రహించాడు. అందుకుగాను నిజమైన విప్లవ శక్తులు ఎవరనే దానికోసం శోధించాడు. లెనిన్‌, మార్క్స్‌ రచనలను, మార్క్బిస్టు సాహిత్యాన్ని చదువుతూ రష్యా విప్లవాన్ని, ఫ్రెంచ్‌ విప్లవాన్ని అధ్యయనం చేస్తూ అతి చిన్న వయస్సులోనే పెట్టుబడిదారీ సమాజాన్ని దాని దోపిడీ పద్ధతులను పూర్తిగా తెలుసుకున్నాడు. వ్యవసాయ పొలాల్లో ఉన్న రైతులు, కర్మాగారాల్లో ఉన్న కార్మికులే అసలైన విప్లవ శక్తులని వారి దగ్గరకు మనం చేరుకోవాలని తన అనుచరులకు ఆదేశించాడు. ఆ రకంగా కార్మికులను, రైతులను చైతన్యం చేసి వారిని ఐక్యం చేసి పోరాటాల్లోకి దించాడు. ప్రజలను చైతన్యం చేయడం కోసం 1926లో సుఖదేవ్‌, భగవతీ చరణ్‌, యశ్పాల్‌ తదితరులతో కలిసి ‘నవ జవాన్‌ భారత్‌’ను స్థాపించాడు. దీనితో బహిరంగ సభలు, కరపత్రాలు, ప్రకటనల ద్వారా వారి అభిప్రాయాలను ప్రచారం చేశారు. దీనితో పాటు అవకాశం దొరికినప్పుడల్లా జైళ్లు, కోర్టులను సైతం ప్రచార సాధనాలుగా ఉపయోగించుకుని నిరంతరం ప్రజలను చైతన్యపరుచుకుంటూ వచ్చాడు. జైలు లోపల ఉన్నప్పుడు కూడా రాజకీయ ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, చదువుకోవడానికి పుస్తకాలు, న్యూస్‌పేపర్లు అందించాలని 64 రోజులు పాటు నిరాహార దీక్షలు చేశాడు. పోలీసులు, డాక్టర్లు ఈ దీక్షలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే వారికి ముచ్చెమటలు పట్టించి బ్రిటీష్‌ పాలకులకు సింహస్వప్నంలా నిలిచాడు. చివరికి భారత పాలకులు బ్రిటీష్‌ వారితో కలిసిపోయి ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్న సందర్భంలో ఈ నల్ల చట్టాలను ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని దానికి ఉన్న ఏకైక మార్గం పార్లమెంటు సమావేశాలే అనుకున్నాడు. కచ్చితంగా అలా చేస్తే ఉరిశిక్ష పడుతుందని తెలిసినా పార్లమెంటులో పొగబాంబు వేసి అనుకున్న విధంగానే పోలీసులకు పట్టుబడి చట్టాలను ప్రజలకు వివరించాలన్న లక్ష్య సాధనలో… దేశం కోసం 1931 మార్చి 23న భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌లు ముగ్గురూ ఉరితీయబడ్డారు. ఉరితాళ్లనే ఉయ్యాలలుగా భావించి ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అంటూ నినదిస్తూ చావును సైతం చిరునవ్వుతో స్వాగతించి అమరులైన వారి త్యాగం మరువలేనిది. ఉరి సమయంలో ‘బతికున్న భగత్‌సింగ్‌ కంటే మరణించిన భగత్‌సింగే మీకు అత్యంత ప్రమాదకారి. మీరు నన్ను చంపగలరు కానీ నా ఆలోచనలను కాద’ని బ్రిటీష్‌ పాలకులకు సింహస్వప్నంగా నిలిచిన భగత్‌ సింగ్‌ గొప్ప పోరాట యోధుడు మాత్రమే కాదు, గొప్ప అధ్యయనశీలి కూడా.
మరికొద్ది క్షణాల్లో ఉరితీస్తారని తెలిసినా చివరి సమయం వరకు లెనిన్‌ రాసిన ‘ఏం చెయ్యాలి?’ అనే పుస్తకం చదువుతూ కొద్ది పేజీలు మిగిలి ఉన్నాయని అవి పూర్తి చేసిన తరువాత ఉరితీయమని పోలీసు అధికారులను కోరాడు. చనిపోయే ముందు వరకు భగత్‌సింగ్‌ భారత దేశ స్వాతంత్య్రం కోసం అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అందుకే భగత్‌ సింగ్‌ చేతిలో పుస్తకం లేకుండా నేను ఏనాడూ చూడలేదని శివవర్మ అంటాడు. భగత్‌ సింగ్‌కి దేవుని పట్ల, మతం పట్ల కొన్ని భిన్నాభిప్రాయాలున్నాయి. నేనెందుకు నాస్తికుడిని అయ్యానని రాసుకున్న తన రచన చదివితే దేవునిపైన, మతం పైన అతని వైఖరి ఏంటనేది మనకు పూర్తిగా అర్ధమౌతుంది. అదేవిధంగా విప్లవం ఎందుకు అవసరం అన్న రచనలో విప్లవానికి కావలసింది ఉద్రేకం, చావటం కాదు. నిరంతర పోరాటం కావాలి. బాధలను భరించాలి. త్యాగం కావాలి. ముందు నీ అహంభావాన్ని తొలగించు. వ్యక్తిగత సౌఖ్యానికి సంబంధించిన కలలను తుడిచెయ్యి. అప్పుడు పని ప్రారంభించు. ఇందుకు ధైర్యం, సంరక్షణ, అకుంఠిత దీక్ష అవసరం. ఎటువంటి కష్టాలు, అడ్డంకులూ నిన్ను నిరుత్సాహపరచవు. ఏ వైఫల్యమూ విచ్ఛిన్నతలూ నిన్ను అధైర్యపరచవు. బాధల అగ్నిపరీక్షలను తట్టుకొని త్యాగాల ద్వారా నీవు విజయునిగా బైటకి వస్తావు. ఈ వ్యక్తిగత విజయాలే విప్లవానికి విలువైన ఆస్తులౌతాయంటూ తరువాత తరాలవారి హృదయాల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు. ఈ స్ఫూర్తితో యువతరం, విద్యార్థులు చైతన్యవంతులై భగత్‌సింగ్‌ ఆశయ సాధనకై ఉద్యమించాలి.

(వ్యాసకర్త ఎస్‌.ఎఫ్‌.ఐ విజయనగరం జిల్లా
సహాయ కార్యదర్శి, డి. రాము – సెల్‌ : 9705545164)

➡️