అక్కచెల్లెమ్మల పోరాటం

ఆకాశంలో సగం..అవనిలో సగం…అనంతకోటి నక్షత్రాల్లో సగం అని అనేక ఉపమానాలు చెప్తాం…అవని అంతా పరివ్యాప్తమైన మహిళల గురించి. కుటుంబం కోసం వారు చేసే త్యాగం, కష్టం నిరుపమానం. మార్పు కోసం జరిగే పోరాటాల్లో, ప్రపంచ గతిని మార్చిన విప్లవాల్లో.. ఆమె పాత్ర అనంతం. ఆమె లేనిదే ఇంటా బయటా ఒక్క రోజూ గడవదు. ఆమె శ్రమ లేనిదే ఒక్క పనీ జరగదు. ఆమె చెమట చిందనిదే చెట్టు, చెలక పండదు. ‘నేను చెమట బిందువుని/ కండల కొండల్లో ఉదయించే లోక బంధువుని/ గుండెలతో నాకు దోస్తీ/ నేనుండేది బాధల బస్తీ’ అంటారు శేషేంద్ర శర్మ. వీధులు శుభ్రపరిచే మున్సిపల్‌ కార్మికులు, ఇల్లిల్లు తిరిగి ప్రజల ఆరోగ్య సమాచారాన్ని వాకబు చేసే ఆశాలు, చిన్నారుల ఆలనాపాలనా చూసే అంగన్వాడీల నుంచి ఉన్నత పదవుల్లో వుండే మహిళల వరకు అందరూ అభివృద్ధిలో భాగస్వాములే. వారి శ్రమ, తెలివి, తెగువ లేనిదే ప్రగతి చక్రం ముందుకెళ్ళదు. ఈ చిరుద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం, జెండర్‌ వివక్ష మానవ చరితకే అవమానకరం. సమాన పనికి సమాన వేతనం వారి హక్కు. ‘స్త్రీల హక్కులను ఉల్లంఘించడం అంటే మానవతావాద హక్కులను ఉల్లంఘించడమే’ అంటాడు ప్రముఖ నాటక రచయిత ఇబ్సెన్‌. శ్రమకు తగ్గ ఫలితాన్ని డిమాండ్‌ చేయడం వారి హక్కు.

గ్రామాల్లో అన్నీ తామై సేవలందిస్తున్న ఆశాలు, అంగన్వాడీల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. నెల జీతం వస్తే తప్ప పూట గడవని వీరికి ఇచ్చే అరకొర వేతనాలు కూడా సమయానికి రావు. పరిపాలనలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ స్కీమ్‌ వర్కర్ల బతుకుల్లో ఎలాంటి మార్పు ఉండట్లేదనేది అనుభవైక సత్యం. అమ్మ కడుపులోని బిడ్డ మొదలు అవ్వ వరకు అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, మాట తప్పం-మడమ తిప్పం అని, అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యమని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం…అదే అక్క చెల్లెమ్మలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. కనీస వేతనం, సెలవులు, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు వంటి కనీస అవసరాలను డిమాండ్‌ చేసినా పట్టించుకోవడంలేదు. ‘నా దేశంలోనే నా గొంతు పరాయిదయిపోయింది. ఇక్కడ నేను అరచిన అరుపు ఆకాశంలోకి వెళ్లి ఎక్కడో ఇరుక్కుపోతుంది. తిరిగి రానే రాదు’ అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ. నెలకు రూ.10 వేల లోపు ఆదాయం ఉన్న అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం…ఆశాలకు, అంగన్‌వాడీలకు మాత్రం అమలు చెయ్యటంలేదు. అంతకు ముందున్న తెల్ల కార్డులతోపాటు వారి కుటుంబ సభ్యులకు అందే పెన్షన్లను సైతం రద్దు చేస్తున్నారు. ఏమంటే… మీరు ప్రభుత్వోద్యోగులు అంటున్నారు. కాని, ప్రభుత్వోద్యోగులకుండే ఏ బెనిఫిట్లు వారికి ఇవ్వడం లేదు. ‘మా మొర ఆలకించండి మహాప్రభో..’ అని రోడ్డెక్కినాకే సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

నయా ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో మహిళల శ్రమ పాత్ర, శ్రమ దోపిడీ మరింత పెరిగింది. దానికి అతి పెద్ద ఉదాహరణ-ఆశాలు, అంగన్వాడీలే. మహిళలకు వైద్యసేవలు అందించడానికి ఆశాలు రాత్రి పగలు తేడా లేకుండా ఇల్లిల్లూ తిరుగుతుంటారు. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా నిలబడి తమ ప్రాణాలకు తెగించి పోరాడిన ఈ మహిళామ తల్లులను అన్ని ప్రభుత్వాలూ చులకన భావంతోనే చూస్తున్నాయి. గుర్రాలతో తొక్కించినా, వాటర్‌ కెనాన్‌లు ప్రయోగించినా వెరవని యోధలు అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు. నిరంతరం ప్రజలతో మమేకమౌతూ-ప్రజల్లో తిరుగుతూ ప్రజాసేవలో తలమునకలవుతున్న ఈ చిరుద్యోగుల కనీస డిమాండ్లను తీర్చడం ప్రభుత్వ ధర్మం. వీరి పట్ల అవమానకరంగా వ్యవహరించడం విజ్ఞత కాదు. ‘నీ అహంకారానికి మా సహనం సలాం అన్నంతవరకే/ నీ అధికారానికి బానిసలమై మేము గులాం అన్నంతవరకే/ ఒక్కసారి తిరగబడితే నీవు తట్టుకోలేవు’ అంటారో కవి. స్పందించని పాలకులపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం ఉగ్రరూపం దాల్చితే-తట్టుకోవడం ఎవరివల్లా కాదు. ఇప్పటికైనా వారి వేదనను, అసంతృప్తిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ‘ఎఱుకలేని దొరల నెన్నాళ్లు కొలిచిన/ బ్రతుకు లేదు వట్టి భ్రాంతిగాని’ అన్న తెలివిడి ప్రజలకు వచ్చిన తెల్లారే ఏ ప్రభుత్వానికైనా చెల్లుచీటి రాసేస్తారు.

➡️