శుభ సూచికలు

Feb 27,2024 07:10 #Editorial

            అతి త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందనగా ‘ఇండియా’ బ్లాక్‌లోని భాగస్వామ్య పక్షాల మధ్య వివిధ రాష్ట్రాల్లో అవగాహనలు, సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వస్తుండటం రాజ్యాంగ, లౌకిక, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణోద్యమానికి మంచి సూచిక. కాగా వరుసగా మూడవ తడవ అధికారం చేపడతామని బీరాలు పలుకుతున్న బిజెపికి ‘ఇండియా’లో ఐక్యత గంగవెర్రులెత్తిస్తోంది. ఈ మారు బిజెపికి సొంతంగా 370 లోక్‌సభ సీట్లు, ఎన్‌డిఏకి 400 సీట్లూ అని మోడీ,షా ద్వయం లంకించుకున్న ప్రచారం ఆడంబరానికేనని, వాస్తవ పరిస్థితులు ఏకోశాన ఆ రకంగా లేవని శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రజాకంటకంగా పాలిస్తున్న బిజెపి గెలుపు ఈసారి అంత సులువు కాదని గ్రహించినందునే ఎన్‌డిఏలోకి పాత మిత్రులకు వల, ఇ.డి, సిబిఐ ప్రయోగం వంటి వాటికి బిజెపి తంటాలు పడుతోంది. దీనిని బట్టే ఆ పార్టీకి వాస్తవ చిత్రం బోధ పడిందని తెలుస్తుంది. ‘ఇండియా’ నుంచి బీహార్‌లో నితీష్‌ పార్టీ జెడియు, ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌ఎల్‌డి నిష్క్రమించడంతో ఇక ‘ఇండియా’ పని అయిపోయిందన్న బిజెపి ఆనందం ఆవిరి కావడానికి ఎంతోకాలం పట్టలేదు. పలు రాష్ట్రాల్లో ‘ఇండియా’ పార్టీల మధ్య సీట్ల పంపిణీకి కుదిరిన అవగాహనలతో బ్లాక్‌ బలోపేతం కావడం బిజెపిని బెంబేలెత్తిస్తుండగా, పైకి మాత్రం ఆ పార్టీ మేకపోతు గాంభీర్యానికి పోతోంది.

అతిపెద్ద రాష్ట్రం యు.పి.లో ఎస్‌పి, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదరడం కీలక రాజకీయ పరిణామం. అక్కడి 80 సీట్లలో ఎస్‌పి 63, కాంగ్రెస్‌ 17 పోటీ చేసేందుకు నిర్ణయానికొచ్చాయి. ఇది బిజెపిని కలవర పెట్టే విషయం. ఎందుకంటే, గత ఎన్నికల్లో బిజెపికి యు.పి.లో 64 స్థానాలొచ్చాయి. ఎస్‌పి, కాంగ్రెస్‌ పొత్తు బిజెపి సీట్లకు భారీ గండి కొడుతుంది. కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య అవగాహన కుదరదని బిజెపి ఆశ పెట్టుకోగా, ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాల్లో సర్దుబాట్లు కుదిరాయి. పంజాబ్‌లో మాత్రం వ్యూహాత్మకంగానే విడివిడిగా పోటీ చేస్తున్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలో ఏడుకు ఏడు, గుజరాత్‌లో 26కి 26, హర్యానాలో పదికి పది సీట్లు బిజెపికి రాగా పొత్తులతో ఈ 43 చోట్లా ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. బీహార్‌లో నితీష్‌ యుటర్న్‌ తీసుకున్నాక కూడా, గత ఎన్నికలనాటి మహా కూటమి అలాగే కొనసాగుతోంది. ఆర్‌జెడి, కాంగ్రెస్‌, వామపక్షాలు అవగాహనతో పోటీ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఎస్‌పికి కాంగ్రెస్‌ ఒక సీటు కేటాయించింది. మహారాష్ట్రలో పవార్‌ పార్టీ, ఉద్ధవ్‌ఠాక్రే శివసేన, కాంగ్రెస్‌ మధ్య మెజార్టీ స్థానాల్లో అవగాహన కుదిరింది. జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ను అరెస్ట్‌ చేయడం ద్వారా అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న బిజెపి కుట్రలు పారలేదు. కేరళలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ మధ్యనే వార్‌. బిజెపి నామమాత్రం. తమిళనాడులో అన్నాడిఎంకె బిజెపిని వీడింది. అక్కడా బిజెపికి పెగిలేదేమీ లేదు. ఈ పరిణామాలన్నీ బిజెపికి గట్టి ఎదురుదెబ్బలు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతీయ పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన, ఈ రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేసిన బిజెపికి వంత పాడుతుండగా, వైఎస్‌ షర్మిల రాకతో కాంగ్రెస్‌ పుంజుకుంటోంది. బిజెపి, దానికి మద్దతిచ్చే పార్టీల ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్‌, వామపక్షాలు చర్చించాయి. పరస్పర పోటీ నివారణకు అవగాహనతో కలిసి పని చేయాలని స్థూలంగా అభిప్రాయపడ్డాయి. దాంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి, సైద్ధాంతిక, రాష్ట్ర ప్రయోజనాల ప్రాతిపదికన చర్చ ఆవిష్కృతమైంది. ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోదలిచిన టిడిపి, జనసేనలు, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి బిజెపి తలపెట్టిన ద్రోహంపైనా, రాష్ట్రాల హక్కుల హననంపైనా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం బిజెపితో నెరపిన బంధంపై వైసిపి సైతం ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సిన అనివార్యత నెలకొంది. రాజ్యాంగాన్ని, లౌకిక, ప్రజాస్వామ్య, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణకు, మత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

➡️