లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి జిమ్మిక్కులు

Dec 30,2023 07:18 #Editorial

మందిర నిర్మాణానికి 2020 ఫిబ్రవరి నుండి 2023 మార్చి 31 వరకు రూ.90 కోట్లు ఖర్చుచేసినట్లు, అవి పోగా మరో 3వేల కోట్లు తమ దగ్గర నిల్వ ఉన్నట్లు ట్రస్టు వెల్లడించింది. రామమందిర నిర్మాణంలో ఇది రెండో దశ మాత్రమే. మందిర నిర్మాణం 2025 జనవరి నాటికల్లా పూర్తవుతుందట. నిర్మాణం పూర్తి కాకుండానే ఇంత తొందరెందుకంటే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల కోసం అన్నది స్పష్టం….విదేశీ విరాళాల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అయోధ్య ట్రస్టును విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద రిజిస్టర్‌ చేసింది. అయితే దాని బ్యాంక్‌ అకౌంట్‌ ఢిల్లీలో ఉంది కనుక అందులో ఎంత డబ్బు పడిందో తమకు ఇంకా తెలియదని ట్రస్టు ప్రతినిధి అయోధ్యలో చెప్పారు. 2021 జనవరి 15నుండి 44 రోజుల పాటు దేశమంతటా విరాళాల సేకరణ కోసం శ్రీరామ జన్మభూమి రామ మందిర నిధి సమర్పణ్‌ అభియాన్‌ను ప్రారంభించారు.

             లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి చేస్తున్న విన్యాసంలో భాగంగా అయోధ్యలో జనవరి 22న ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంత అరుగు వేసి అన్నంత ఆర్భాటంగా శ్రీరామ మూర్తికి ”ప్రాణ ప్రతిష్ట” జరగనుంది. ఆ కార్యక్రమానికి తాము వెళ్లడం లేదని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ప్రకటించారు. మతం వ్యక్తిగతం.మత కార్యక్రమాలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని ఆయన చెప్పారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా మతాన్ని ప్రభుత్వాన్ని కలగాపులగం చేయడాన్ని వ్యతిరేకించారు. ప్రతి ఎన్నికలకు ముందు బిజెపి మతం కార్డును ప్రయోగిస్తోందన్నారామె. నిర్ధిష్టంగా చెప్పకపోయినా, ప్రకటన ఆమె వెళ్లడం లేదనే ధ్వనిస్తోంది. ఆహ్వానం అందుకున్న మిగతా పార్టీలు, వాటి నాయకులు ఏమి చేస్తారో చూడాలి. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవడం అవసరం. గుజరాత్‌లోని సోమనాథ్‌ మందిరం మరమ్మతుల తర్వాత తిరిగి ప్రారంభించే కార్యక్రమానికి తాను అధికార హోదాలో వెళ్లాలని అప్పటి రాష్ట్రపతి డా.రాజేంద్ర ప్రసాద్‌ భావించారు. కాని అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆయన కోరికను నిరాకరించారు. ఒక మతానికి చెందిన కార్యక్రమంలో అధికారికంగా రాష్ట్రపతి వెళ్లడం కుదరదని స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ఏమి చేయనుందో? రాజ్యాంగం బోధించే లౌకిక విలువలను తన రాజకీయాల కోసం ధ్వంసం చేస్తున్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ”ప్రాణ ప్రతిష్ట” కార్యక్రమానికి అట్టహాసంగా బయలుదేరనున్నారు. ఆయనతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఫ్‌ు చాలక్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

మతపరంగా భారతీయులను విభజించి పాలించడానికి బ్రిటిష్‌ పాలకులు రగిల్చిన మత విద్వేషాల మంట ఇంకా మండుతూనే ఉంది. ఎంతోమంది భారతీయులు ఆ మంటకు బలయ్యారు. అవుతూనే ఉన్నారు. అయినా ఆ మంట ఆరిపోకుండా మతతత్వ రాజకీయ పార్టీలు, సంస్థలు ఎగదోస్తూనే ఉన్నాయి. ముస్లింలపై, క్రైస్తవులపై లౌకిక ప్రజాస్వామ్య వాదులపై దాడులు జరుగుతున్నాయి. అవి భౌతిక దాడులు కావచ్చు. లేదా డీప్‌ ఫేక్‌ దాడులూ కావచ్చు. ముస్లిం మతోన్మాద పార్టీలు, సంస్థలు అదే పని చేస్తున్నాయి.

ప్రధానితో పాటు పదివేల మంది ప్రముఖులు ‘ప్రాణ ప్రతిష్ట’లో పాల్గొననున్నట్లు అయోధ్య ట్రస్టు వెల్లడించింది. వారితో పాటు ప్రభుత్వ సిబ్బంది కోసం అయోధ్య పట్టణంలోని హోటళ్ల రూములను, సత్రాలను బుక్‌ చేస్తున్నారు ఇప్పటికే చేసుకొన్న బుకింగ్‌లను యూపీ పభుత్వం రద్దు చేసింది. జనవరి 22న ట్రస్టు నుండి ఆహ్వానం అందుకొన్న వారు, విధులు నిర్వహణకు నియమించిన ప్రభుత్వ సిబ్బందిని మాత్రమే అయోధ్య పట్టణంలోకి అనుమతిస్తారు. వారు తమ ఆహ్వాన పత్రాలను, అధికారిక ఉత్తర్వులను చూపెట్టాలి. అయోధ్యలో కొత్తగా ప్రారంభమైన విమానాశ్రయంలోకి దేశం నలుమూలల నుండి వంద విమానాలు ఆరోజు వాలుతాయట.

దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లో జనవరి 1నుండి 15వ తేదీ వరకు తాత్కాలిక రామ విగ్రహం ముందు ఉంచి పూజించిన అక్షింతలను పంచుతారట. మందిర నిర్మాణానికి 2020 ఫిబ్రవరి నుండి 2023 మార్చి 31 వరకు రూ.90 కోట్లు ఖర్చుచేసినట్లు, అవి పోగా మరో 3వేల కోట్లు తమ దగ్గర నిల్వ ఉన్నట్లు ట్రస్టు వెల్లడించింది. రామమందిర నిర్మాణంలో ఇది రెండో దశ మాత్రమే. మందిర నిర్మాణం 2025 జనవరి నాటికల్లా పూర్తవుతుందట. నిర్మాణం పూర్తి కాకుండానే ఇంత తొందరెందుకంటే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల కోసం అన్నది స్పష్టం.

తాత్కాలిక గుడిలో భక్తులు సమర్పించుకొంటున్న కానుకలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. సెప్టెంబర్‌ నెలలో అక్కడి దానపాత్ర(హుండీ) ఆదాయం రూ.60లక్షలు కాగా అక్టోబర్‌లో రూ.64లక్షలు. ఆ రాబడి నెలకు కోటి రూపాయల వరకు పెరగొచ్చని ట్రస్టు అంచనా. మొదట్లో నెలకు రూ.10లక్షలు రూ.15లక్షలు మాత్రమే హుండీ ఆదాయం ఉండేది. విదేశీ విరాళాల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అయోధ్య ట్రస్టును విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద రిజిస్టర్‌ చేసింది. అయితే దాని బ్యాంక్‌ అకౌంట్‌ ఢిల్లీలో ఉంది కనుక అందులో ఎంత డబ్బు పడిందో తమకు ఇంకా తెలియదని ట్రస్టు ప్రతినిధి అయోధ్యలో చెప్పారు. 2021 జనవరి 15నుండి 44 రోజుల పాటు దేశమంతటా విరాళాల సేకరణ కోసం శ్రీరామ జన్మభూమి రామ మందిర నిధి సమర్పణ్‌ అభియాన్‌ను ప్రారంభించారు. రామమందిర నిర్మాణానికి రూ.18వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. అవి కాకుండా లెక్కకురాని ఖర్చులు కూడా ఉంటాయి. ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం మందిర నిర్మాణానికి రూ.500 కోట్లు బడ్జెట్‌ నుండి కేటాయించింది. ఆయోధ్య పర్యాటక స్థలంగా మారనుంది.కనుక మరో రూ.95 కోట్లు తులసి స్మారక భవనం పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం కేటాయించింది.

తామొకటి తలిస్తే దైవమొక్కటి తలిచాడు అన్నట్లు అయోధ్య పట్టణంలో చిన్న వ్యాపారులు ఒకటనుకొంటే మోడీ, యోగీలు మరొకటి చేస్తున్నారు. 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభమైన నాటినుండి అక్కడి వ్యాపారులు బిజెపి మద్దతుదారులు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని పట్టుదలతో ఉన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసంలో కరసేవకులకు సహకరించారు కూడా. 2020 ఆగస్టు 5న మోడీ మందిర నిర్మాణానికి పునాదిరాయి వేయడంతో వారు ఉప్పొంగిపోయారు. కాని ఆ రాయి తమకే వచ్చి బలంగా తగులుతుందని ఊహించలేని అమాయకులు. వారణాసిలో రోడ్లు వెడల్పు చేసి ”కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌” ను నిర్మించిన తరహాలో అయోద్య పట్టణంలోనూ రోడ్లు వెడల్పు చేస్తున్నారు. పట్టణంలో 13 కి.మీల ట్రంకు రోడ్డు నిర్మాణానికి ిరూ.797.68కోట్లు యూపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ పనిని రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించింది. రోడ్డు వెడల్పు చిన్న వ్యాపారుల నోటికాడి ముద్దను లాగేసుకొంది. పట్టణంలో బుల్‌డోజర్ల రొద నిర్విరామంగా వినిపిస్తోంది. ఆ రొద విన్పిస్తే చాలు చిన్న వ్యాపారుల పైప్రాణాలు పైనే పోతున్నాయి. అంగళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని యోగి ఏడాది క్రితం ప్రకటించారు. కాని ఆ న్యాయం దరిదాపుల్లో కన్పించడం లేదు. రాజ్‌కుమార్‌ సైని అనే అతను 30ఏళ్లుగా హనుమాన్‌ గృహ గుడి ముందు చిన్న అంగడిలో పూలు అమ్మేవాడు. రోడ్డు వెడల్పులో ఆ షాపును కూల్చేశారు. ఇప్పుడు రోడ్డుమీద సైని పూలు అమ్ముతున్నాడు. అతని రోజువారి ఆదాయం దాదాపు మూడింట ఒక వంతుకు పడిపోయింది. కుటుంబం కష్టాల పాలైంది.

రోడ్డు వెడల్పులో బ్రిజ్‌ కిషోర్‌ పాండే అంగడి, ఇల్లూ రెండూ పోయాయి. ప్రభుత్వం తమ దుస్థితిని గమనిస్తోందో లేదో అర్థం కావడంలేదని పాండే చెప్పారు. మూడు తరాలుగా మేము మా అంగడిలో పూజా సామగ్రి అమ్మేవారం. మోడీజీకి, యోగీజీకి మద్దతు ఇస్తూ వచ్చాం. కాని బుల్‌డోజర్‌ నా ఇంటి ముందుకే యోగి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదని వాపోయాడు. అంగడిని, ఇంటిని కూల్చి రెండు నెలలయింది. ప్రభుత్వం నుండి అందిన నష్టపరిహారం లక్ష రూపాయలు మాత్రమే. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద వ్యాపారం కోసం నాలుగేళ్ల క్రితం అతను అప్పు తీసుకొన్నాడు. ప్రతి నెలా వాయిదా డబ్బు కడ్తున్నాడు. అప్పు ఇంకా ఉంది. అది ఎలా తీర్చాలని బ్రిజ్‌ బేలగా ప్రశ్నించారు. మా సమస్యల్ని ప్రభుత్వం ఎలా పరిష్కరించనుందో అర్థం కావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్మీకాంత్‌ తివారి తన షాపులో మత సంబంధమైన పుస్తకాలు అమ్మేవాడు. విస్తరణలో అతని అంగడిలో కొద్ది భాగమే మిగిలింది. ఇప్పుడు పుస్తకాల వ్యాపారం మానేసి పొగాకు వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిరోజు రూ. వెయ్యి నుండి రూ.1500 వరకు అతనికి ఆదాయం ఉండేది. ఇప్పుడు ఆ ఆదాయం పోయింది. ఇలాగే ఉంటే మేము బిచ్చమెత్తుకొని బతకాల్సిందేనని ఆయన అన్నారు. గతంలో వ్యాపారులు షాపు యజమానుల 25 శాతం అద్దె పెంపుతో ఐదేళ్లకు ఒప్పందం తిరిగి రాసుకొనేవారు. ఇప్పుడు ఐదేళ్లకు బదులు 11 నెలల లీజు ఒప్పందమే చేసుకొంటామని షాపు యజమానులు భీష్మించారు. అంటే ప్రతి 11 నెలలకు అద్దె పెంచుతారన్న మాట. తమ షరతులపై ఒప్పందం పునరుద్దరించుకో వారిపై ట్రెస్‌ పాసర్‌ కింద వివిధ సెక్షన్లు మోపి కేసులు పెడ్తున్నారు. ముప్పయి నలబై ఏళ్ల క్రితం తమ పేరుపై అంగడిని లీజుకు తీసుకొన్న వృద్ధతరం నేడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

బ్రిటిష్‌ కాలంలోనే బాబ్రీ మసీదుపై వివాదాలు మొదలయ్యాయి. 1853లో నిర్మోహీ అనే హిందూ తెగ బాబర్‌ గుడిని కూల్చి మసీదు నిర్మించాడని వాదించింది. ఆ సమయంలో మొదటిసారిగా అక్కడ మత ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత ఆరేళ్లకు బాబ్రీ మసీదును దాని ప్రాంగణాన్ని బ్రిటిష్‌ పాలకులు రెండుగా చేసి మసీదు ఉన్న భాగాన్ని ముస్లింల ప్రార్ధనకు, వెలుపలి భాగాన్ని హిందువులకు అప్పగించారు. 1990లో బిజెపి నాయకుడు ఎల్‌కె అద్వానీ రామమందిరంపై దేశవ్యాప్త రథయాత్ర చేశారు. ఆ తర్వాత లోక్‌సభలో బిజెపి బలం రెండు స్థానాల నుండి 80 స్థానాలకు పైగా పెరిగింది. మతాన్ని రాజకీయాల్ని జోడించి ఆనాడు బిజెపి రాజకీయ ప్రయోజనం పొందింది. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని యుపి ప్రభుత్వం మతంతో జోడించి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని చూస్తుంది. జనవరి 22న అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య మోడీ, భగవత్‌ల సమక్షంలో శ్రీరాముడి మూర్తికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. దాంతో రాతి విగ్రహానికి చేతనత్వం కలుగుతుంది. దేవుడు భక్తుల మొక్కులు తీర్చడం మొదలెడ్తాడు. మొక్కు లేని భక్తి లేదు కనుక హుండీలు నిండుతుంటాయి. అనతి కాలంలోనే భక్తులు అయోధ్య శ్రీరాముడిని కుబేరుడిని చేస్తారు. ఢిల్లీలో ప్రధాని లోక్‌సభ ఎన్నికలలోగా అదానీ, అంబానీలను మోడీ మరింత అపర కుబేరుల్ని చేస్తారు. అదీ సంగతి.

ఎస్‌. వినయ కుమార్‌
ఎస్‌. వినయ కుమార్‌
➡️