పెట్టుబడి ప్రపంచవ్యాప్త విస్తరణ – సామ్రాజ్యవాదం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం గణనీయమైన స్థాయిలో విస్తరణ జరుగుతోంది. అమెరికా ఆధ్వర్యంలో ఇంతవరకూ నడుస్తూ వచ్చిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ విధంగా ”బహుళ ధృవ ఆర్థిక వ్యవస్థ”గా విస్తరించడం ఒక పెద్ద మార్పు అని చాలామంది అంటున్నారు. ఈ విధంగా వర్ణించడం పట్ల ఎవరికి ఏ విధమైన అభిప్రాయం ఉన్నా, ఆర్థిక వ్యవస్థ విస్తరించడం అనేది నిస్సందేహంగా జరుగుతోంది. 1994 నాటికి జి-7 దేశాలు (అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌, ఇటలీ, కెనడా) అన్నీ కలిసి ప్రపంచ ఉత్పత్తిలో 45.3 శాతాన్ని ఉత్పత్తి చేయగా, బ్రిక్స్‌ దేశాలు (బ్రెజిల్‌, రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా) తమతో కొత్తగా కలిసిన ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఈజిప్ట్‌, ఇథియోపియా లను కలుపుకుని 18.9 శాతం ఉత్పత్తిని చేశాయి. అదే 2022 నాటికి జి-7 దేశాలు 29.3 శాతం, బ్రిక్స్‌ దేశాలు 35.2 శాతం చొప్పున ఉత్పత్తి చేశాయి (ఇవి ప్రపంచబ్యాంక్‌ లెక్కలు).
అమెరికా, బ్రిటన్‌, కెనడా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లను కలిపి చూసినా, వాటి ఉత్పత్తి శాతం 1994లో 56 ఉండగా 2022 నాటికి 39.5కి తగ్గింది. అమెరికా మాత్రం ఈ విస్తరణ పర్యవసానాలను జీర్ణించుకోడానికి సిద్ధంగా లేదు. అందుకే పాత రోజుల్లో మాదిరిగానే తన పెత్తనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పాత పద్ధతుల్లోనే సాగించడానికి చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ దూకుడు ముఖ్యంగా రష్యా, చైనా, ఇరాన్‌ వంటి దేశాల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దూకుడు వల్ల ప్రపంచం అత్యంత ప్రమాదకరమైన సైనిక ఘర్షణలకు దారి తీస్తోంది.
సోషలిస్టు వ్యవస్థ తలెత్తడం ఈ ఉత్పత్తి విస్తరణకు చాలా దోహదం చేసింది. సోషలిజం ఉనికి లోకి రావడంతో వలస విధానం అంతరించడం వేగంగా జరిగింది. ఆ దేశాల్లో దేశీయంగా నైపుణ్యాలు పెంపొందడం, సాంకేతిక సామర్ధ్యం, మౌలిక వసతుల కల్పన, ఉత్పత్తి సామర్ధ్యం పెరగడానికి సోషలిస్టు వ్యవస్థ తోడైంది. ఆ ప్రభుత్వాల నియంత్రణలో ఆర్థిక వ్యవస్థలు నిర్వహించడం అనేది ఈ అభివృద్ధితో నిలదొక్కుకుని పాశ్చాత్య దేశాల శతృపూరిత వైఖరిని ఎదుర్కోగల శక్తిని వాటికి కల్పించింది. సోవియట్‌ యూనియన్‌ లోను, తూర్పు యూరప్‌ దేశాలలోను సోషలిస్టు వ్యవస్థలు పతనం చెందాక, ప్రభుత్వ నియంత్రణలో మూడవ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు నిర్వహించడం అనేది మారిన తర్వాత అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహాలు వేగంగా సాగడంతో ఉత్పత్తి ప్రపంచవ్యాప్త విస్తరణ అనేది కొనసాగింది. ఇందుకు నయా ఉదారవాద ఆర్థిక విధానాలు తోడ్పడ్డాయి. అప్పటికే ప్రభుత్వ నియంత్రణలో ఆ యా దేశాల ఆర్థిక వ్యవస్థలు నడిచినప్పుడు పెంచుకున్న ఉత్పత్తి సామర్ధ్యాలు, మౌలిక వసతులు వగైరా ఉండడంతో నయా ఉదారవాద వ్యవస్థలో ఉత్పత్తి విస్తరణ సులభ సాధ్యం అయ్యింది. ఇప్పుడు అమెరికా నాయకత్వం లోని కూటమి పరిధికి వెలుపల ఉత్పత్తి విస్తరణ పెట్టుబడిదారీ వ్యవస్థలోనే సాగుతోంది (చైనా సంగతి వేరు. దానిని ప్రత్యేకంగా చూడాలి).
ప్రస్తుత పరిస్థితుల్లో సామ్రాజ్యవాదాన్ని మనం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి? అన్నది ఇప్పుడు తలెత్తే ప్రశ్న. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సామ్రాజ్యవాదంతోబాటే అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు, వెనుకబడిన తక్కిన దేశాలు అన్న విభజన కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆ విభజన రేఖ చెదిరిపోయి, ఇంతవరకూ వెనుకబడిన దేశాలలో ఉత్పత్తి పెరుగుదల రేటు వేగంగా, సంపన్న దేశాలను సైతం అధిగమించి ముందుకు సాగిపోతూ వుంటే, ఇంకా సామ్రాజ్యవాదం గురించి ఎలా మాట్లాడగలం? వెనుకబడ్డ దేశాలు సంపన్న దేశాల స్థాయిని అందుకుంటున్నప్పుడు, అది కూడా పెట్టుబడిదారీ చట్రం లోపలే జరుగుతున్నప్పుడు ( చైనా ఇందుకు మినహాయింపు) ఇక పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచంలో అసమాన అభివృద్ధికి దారి తీసిందంటూ దానిని నేరస్థురాలిగా ఎలా నిలబెడతాం? ఇదీ ఆ ప్రశ్న. ఐతే ఈ ప్రశ్న కరెక్టేనా?
మొట్టమొదటగా, ఉత్పత్తి విస్తరణ అనేది స్పష్టంగా కనిపిస్తున్నా, వెనుకబడిన దేశాలు సైతం సంపన్న దేశాల స్థాయిని అందుకుంటున్నాయని నిర్ధారించడం అతిగా భావించడమే ఔతుంది. జరుగుతున్న ఉత్పత్తి విస్తరణను అతిగా పరిగణించడమే దీనికి కారణం. ఈ విస్తరణ జరుగుతున్న దేశాల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగానే ఉంది. ఈ దేశాలలో కూడా పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నయా ఉదారవాద వ్యవస్థలో తలెత్తిన సంక్షోభం ఫలితంగా ఈ దేశాలన్నీ రుణాల వలలో చిక్కుకున్నాయి. ఆ రుణాలతోబాటు వచ్చే షరతులను పాటించవలసి వస్తోంది. ద్రవ్య వినిమయంలో పొదుపు పాటించడం, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని లేకుండా చూడడం ఆ షరతులలో భాగం. వాటిని అమలు చేసినందువలన ఈ దేశాలలో ఉత్పత్తి పెరుగుదల నిలిచిపోవడమే గాక దిగజారడం కూడా మొదలౌతుంది. చరిత్రలో ఈ విధంగా జరిగిన అనుభవాలు మన ముందున్నాయి. ముఖ్యంగా ఖనిజ సంపద కలిగి ఉన్న దేశాలకు ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి. మయన్మార్‌ ఇందుకు ఒక ఉదాహరణ. ఒకప్పుడు ఆ దేశం అభివృద్ధిలో చాలా ముందుకు పోతున్నట్టు భావించారు. కాని ఇప్పుడు అతి తక్కువ అభివృద్ధి నమోదైన దేశాల్లో ఒకటిగా మయన్మార్‌ ఉంది. మన పొరుగు దేశాల్లో కూడా విదేశీ రుణ భారం ఫలితంగా దిగజారిపోవడం కనిపిస్తోంది.
సంపన్న దేశాల స్థాయికి మూడవ ప్రపంచదేశాలు చేరుకోవడం అనేది సాధ్యం కాదు. దీనికి ప్రధాన కారణం సామ్రాజ్యవాదమే. దీనిని అర్ధం చేసుకోవాలంటే ఉత్పత్తి విస్తరణ తోబాటు ప్రస్తుత నయా ఉదారవాద శకంలో మూడవ ప్రపంచ దేశాలలో పెరుగుతున్న పౌష్టికాహార లేమిని కూడా పరిశీలించాలి. ఒకవైపు సంపన్న దేశాల నుండి మూడవ ప్రపంచ దేశాలకు ఉత్పత్తి విస్తరిస్తూంటే, దాని ఫలితంగా అవి సంపన్న దేశాల కన్నా అధికంగా వృద్ధిరేటు పెరుగుదలను నమోదు చేస్తూంటే మరోవైపు ప్రజలకు పౌష్టికాహార లభ్యత తగ్గిపోతోంది. ఈ వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేసి కేవలం ఉత్పత్తి విస్తరణను మాత్రమే గొప్పగా చిత్రించే ప్రయత్నాన్ని ప్రపంచబ్యాంకు చేస్తోంది. పౌష్టికాహారం లేకపోవడం అంటే దానర్ధం ఇక్కడ నికరంగా పేదరికం పెరిగిపోవడమే. మూడవ ప్రపంచ దేశాలలో ప్రజలకు నయా ఉదారవాద శకంలో మెరుగైన రోడ్లు, విద్యుత్తు, ఇతర మౌలిక వసతులు అభివృద్ధి చెంది వుండొచ్చు. కాని, వ్యక్తిగత వినిమయం స్థాయి పడిపోయింది. సోషలిస్టు వ్యవస్థ, దాని ఊతం తో మూడవ ప్రపంచ దేశాలలో ప్రభుత్వ నియంత్రణలో నడిచిన ఆర్థిక వ్యవస్థలు పతనం కావడం, నయా ఉదారవాద ఆధిపత్యం ప్రపంచం అంతా బలపడడం జరిగిన కాలంలోనే మూడవ ప్రపంచ దేశాల ప్రజల వినిమయ స్థాయి పడిపోయింది.
అందుచేత సంపన్న దేశాల సరసన మూడవ ప్రపంచ దేశాలు సైతం చేరుతున్నాయి అని నిర్ధారించడం అంటే పరిస్థితిని తప్పుగా అర్ధం చేసుకోవడమే. మహా అయితే, పెట్టుబడిదారీ ప్రపంచానికి, దానికి వెలుపల ఉన్న ప్రపంచానికి నడుమ ఉండే విభజన రేఖ చెరిగిందని, ఆ విభజన రేఖ కాస్తా ఇప్పుడు పెట్టుబడిదారీ ప్రపంచం లోపలే కనిపిస్తోందని నిర్ధారించవచ్చు. మూడవ ప్రపంచ దేశాలలోని బడా పెట్టుబడిదారీ వర్గం ఇప్పుడు సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోని పెట్టుబడిదారుల సరసన చేరారు. గతంలో వీరు తమ తమ దేశాల్లోని ప్రజలతో బాటు నిలిచి వలస పెత్తనానికి వ్యతిరేకంగా నడిచారు.
సామ్రాజ్యవాదం అంటే ఒక భౌగోళికమైన విభజనగా అర్ధం చేసుకోకూడదు. పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ పరిసరాల మీద సాగించే పీడన రూపమే సామ్రాజ్యవాదం. అదొక రాజకీయ అర్ధశాస్త్రపు భావనే తప్ప భౌగోళికంగా అర్ధం చేసుకోవలసినది కాదు. అందుచేత రాజకీయ అర్ధశాస్త్రం లోని కొన్ని అంశాలను ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకోవడం అవసరం.
పారిశ్రామిక విప్లవం తర్వాత పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కొత్త రూపం తీసుకుంది. బ్రిటన్‌లో జౌళి పరిశ్రమతో ఇది మొదలైంది. ఐతే బ్రిటన్‌లో జౌళి పరిశ్రమకు కావలసిన పత్తి ఉత్పత్తి సాధ్యం కాదు. అదే విధంగా తమ దేశాలలో ఉత్పత్తి చేయడం సాధ్యం కాని లేదా ఒకవేళ ఉత్పత్తి చేయగలిగినా తమ పరిశ్రమల అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేని వివిధ రకాల ముడి సరుకుల కోసం ఉష్ణ మండల దేశాల మీద పెట్టుబడిదారీ దేశాలు ఆధారపడవలసి వచ్చింది. ఈ ఉష్ణ మండల దేశాలలో ఏడాది పొడవునా పంటలు పండుతాయి. అందుచేత చారిత్రికంగా అక్కడ జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ దాదాపుగా పెట్టుబడిదారీ దేశాలకు వెలుపలే ఉన్నాయి. కాలక్రమంలో ఈ ప్రాంతాలకు కూడా పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించినప్పటికీ, అక్కడి స్థానిక పెట్టుబడిదారులతోబాటు, సంపన్న పెట్టుబడిదారీ దేశాలలోని పెట్టుబడిదారులు కూడా ముడిసరుకుల కోసం ఈ ఉష్ణమండల దేశాలలోని రైతాంగం మీదనే ఆధారపడక తప్పలేదు. ఆ రైతులు పండించే ఉత్పత్తుల ధరలు దశాబ్దాలుగా పెరగలేదు సరి కదా డాలర్‌ లెక్కల్లో చూస్తే తగ్గిపోయాయి.
ఈ వ్యవసాయోత్పత్తుల ధరలు సాపేక్షంగా తక్కువగా ఉండడం అనేది వాస్తవానికి పెట్టుబడిదారీ పీడన ఫలితమే. దశాబ్దాలుగా ఈ పీడన సాగుతోంది. మూడవ ప్రపంచ దేశాల్లో వ్యవసాయో త్పత్తులకు ఈ వ్యవస్థలో పెద్దగా ప్రాధాన్యత లేదు అన్నఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడడానికి ఇది దారి తీసింది. కాని పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ ఉత్పత్తులను ఉపయోగించకుండా తన మనుగడను కొనసాగించలేదు అన్నది సత్యం. ఉష్ణ మండల దేశాల్లో భూమి అంతా దాదాపు సాగులోకి ఎప్పుడో వచ్చేసింది. అందుచేత ఇక్కడ భూమి మీద వ్యవసాయం దిగుబడి ఇంకా పెరగాలంటే పంట దిగుబడిని పెంచుకోవడం ఒక్కటే మార్గం. ఆ పని చేయడానికి రైతాంగం మీద ఎటువంటి పీడననూ ప్రయోగించనవసరం లేదు. ఐతే దిగుబడి పెంచడానికి అవసరమైన సాగునీటి సదుపాయం, అధిక దిగుబడులనిచ్చే వంగడాలపై పరిశోధనలు వంటివి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలి. రైతులు తమకు తాముగా జరపలేరు. కాని నయా ఉదారవాదం ప్రభుత్వ జోక్యాన్ని సహించదు. జాతీయ, అంతర్జాతీయ బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రమే ఏ ప్రభుత్వమైనా పని చేయాలి తప్ప అంతకు మించి స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వమైనా పూనుకుంటే అది ఒప్పుకోదు. కనుక రైతులకు, చిన్న ఉత్పత్తిదారులకు అండగా ఏ ప్రభుత్వమైనా చర్యలు చేపడితే అందుకు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అంగీకరించదు. దాంతో సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడుల పెంపు వంటివి వెనకపట్టు పడతాయి. ఆ పరిస్థితుల్లో దేశీయంగా ప్రజల వినియోగాన్ని తగ్గించినప్పుడే ఆ వ్యవసాయోత్పత్తులు పెట్టుబడిదారులకు తగినంత పరిమాణంలో, చౌకగా లభిస్తాయి. అందుకోసం ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించాలి. ఎటువంటి పీడనా లేకుండా ఈ పని చేయడం సాధ్యం కాదు.
అటువంటి పీడన ఫలితంగానే మూడవ ప్రపంచ దేశాలలో తలసరి ఆహారధాన్యాల ఉత్పత్తి గాని, వాటి తలసరి వినియోగం గాని తగ్గిపోతున్నాయి. దీనికి తోడు ఆహార ధాన్యాలను బయో ఇంధనాల ఉత్పత్తికి మళ్ళించడంతో క్రమంగా తలసరి ఆహార ధాన్యాల లభ్యత కూడా తగ్గిపోతోంది. దీని పర్యవసానమే పౌష్టికాహార లేమి. అందుచేత మూడవ ప్రపంచ దేశాలకు ఉత్పత్తి విస్తరణ జరగడం అంటే అదేమీ సామ్రాజ్యవాదం అనే ధోరణికి వ్యతిరేకం కాదు.

(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

➡️