బాలోత్సవం

Dec 24,2023 07:25 #Editorial

                పాఠశాల గడప తొక్కని వ్యక్తి, తాను నిష్ణాతుడైన కళలో ఎవరి వద్దా శిక్షణ పొందని వ్యక్తి-1940లలో, తన పదహారేళ్ల వయస్సులో మాతృభాషలో సొంతంగా ‘బానిస పిల్ల’ అనే కామిక్‌ పుస్తకాన్ని సృష్టించాడు. అందులోని కథ, బొమ్మలు ఆయనవే. ఆయన… దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు బుజ్జాయి (సుబ్బరాయ శాస్త్రి). నవ కవితా చక్రవర్తి అన్న పేరున్న దేవులపల్లి తన కుమారుడ్ని ఏ పాఠశాలకూ పంపలేదు. తన కిష్టమైన ఊహాలోకంలో ప్రయాణం చేసే అవకాశాన్నిచ్చాడు. ఆ స్వేచ్ఛే సుబ్బరాయ శాస్త్రిని ఒక సృజనకారుడిగా మార్చింది. సహజంగా చిన్నతనంలో వుండే ఈ జిజ్ఞాస, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తృష్ణ, ప్రశ్నించే స్వభావం వంటివి సృజనశీలుర చరిత్రలను పరిశీలిస్తే అనేకం తారసపడతాయి. ‘ఆ చిన్నారి లాంటి అందమైన/ ప్రకృతి సిద్ధమైన/ ఒక కవితను/ నేను రాయగల వాడినైతే…’ అంటాడు ఠాగూర్‌. సహజసిద్ధమైన అందం, స్వేచ్ఛ, నవ్యత మిళితమైన చిన్నారిలా తన కవిత వుండాలనుకుంటాడు ఆయన. చిన్నారుల్లో కల్మషం వుండదు, నటన వుండదు, కపటం వుండదు. తమకు తోచినట్లు, చేయాలనుకున్నది స్వతంత్రంగా చేసేస్తారు. ‘మెరుపు మెరిస్తే,/ వాన కురిస్తే,/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. పెద్దలు కూడా పిల్లల్లా వారిలో కలిసిపోగలిగితే… ఆ చిన్నారుల్లోని సృజనాత్మకత, వాస్తవికత అర్థమౌతాయి.

నేడు ఆటపాటలు, విజ్ఞానదాయక కార్యక్రమాలు కనుమరుగై బాలలు యాంత్రికంగా తయారవుతున్నారు. ప్రగతి అంటే ఒక్క సాంకేతిక ప్రగతే కాదు. సామాజిక అంతరాత్మ ఇంకా అనాగరిక దశలోనే వుంది. చిన్నారులు సమాజ సంపద. ఆ సంపదను కాపాడుకోవాలి. చదువు, మార్కులే ప్రాతిపదిక కాకుండా మనోవికాసాన్ని పాదుకొల్పే సామాజిక, సాంస్కతిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి. ‘ఈకలు పీకి/ రెక్కలు కత్తిరించి పౌల్ట్రీ ఫామ్‌ల్లో/ పెంచితే../ బాల్యం విరబూస్తుందంటారా?’ అని ప్రశ్నిస్తారు కవయిత్రి సుజాత. పౌల్ట్రీఫామ్‌ల్లోని కోళ్లలా, ట్రిమ్మింగ్‌ చేసిన మొక్కల్లా కాదు… పిల్లలను స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. సృజనాత్మక ఆలోచనలకు చోటివ్వాలి. ఈ దిశగా అడుగులు వేస్తోంది ‘అమరావతి బాలోత్సవం వేదిక’. నేటి విద్యావిధానంలో పిల్లలు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడేందుకు బాలోత్సవాలు ఒక వేదికగా మారాయి. 1955 నుంచి 1990 వరకు ప్రభుత్వ అధీనంలో వున్న విద్యారంగం…ఆ తర్వాత కార్పొరేట్‌ రంగం చేతిలోకి వెళ్లింది. దాని ఇరుకైన తరగతి గదులు, ర్యాంకుల వెంట పరుగులు… పిల్లల్లోని సజనను మసకబార్చింది. నేటి విద్యావిధానంలో తమ ఆసక్తిని వెల్లడించే అవకాశం లేక ఒత్తిడికి లోనవుతున్నారు. అమరావతి బాలోత్సవం పేరిట ఆరేళ్ల క్రితం ఏర్పడిన సంస్థ పిల్లలను విద్యతో పాటు వికాసవంతులుగా తయారు చేసేందుకు కృషి చేస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల బాలోత్సవాలు నిర్వహించారు. ‘సోక్రటీస్‌ వేదాంతం, న్యూటన్‌ సిద్దాంతం, పైథాగరస్‌ థీయరీలు/ ఏవైనా ఎన్నైనా ఆటలలో ఆడుతాం, పాటలలో పాడుతాం’ అంటూ కదులుతున్నారు చిన్నారులు. దేశభక్తి చాటే నాటికలు, గేయాలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కోలాటం, జానపద, శాస్త్రీయ నృత్యాలు… ముందుగానే సంక్రాంతి తెచ్చి సందడి చేశాయి.

పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాలకు బానిసలైపోతున్న తరుణంలో మానసిక వికాసాన్ని కలిగించే ఇలాంటి కార్యక్రమాలు వారిలో నిద్రాణమైన ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయి. నచ్చిన రంగంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు, కొత్త కొత్త ఆలోచనలతో తమ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకునేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. తాము సాధించలేని లక్ష్యాలను సాధించే పనిముట్లుగానో, తమ వారసత్వాన్ని కొనసాగించే సొత్తుగానో తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే అంటాడు ఖలీల్‌ జిబ్రాన్‌-‘మీ పిల్లలు మీ పిల్లలు కారు/ తాము ఇష్టపడే తమదైన జీవితానికి పిల్లలువారు/…మీరు మీ ప్రేమను వారికి ఇవ్వవచ్చునేమోగాని/ మీ ఆలోచనలను వారికి ఇవ్వలేరు/ ఎందుకంటే/ వారికి తమదైన ఆలోచనలుంటాయి/ మీరు మీ కలలో కూడా దర్శించలేని/ భావి సౌధాలలో వారి ఆత్మలు నివసిస్తుంటాయి’ అని. వారి సృజనకు మెరుగుపట్టాలి. ఆలోచనకు ప్రోత్సాహమివ్వాలి. ‘చిట్టీపొట్టీ చిన్నారులు పారిజాతాలు/ రేపటి వెలుగులకై విరిసే పోరుజాతాలు’ ఓ కవి అన్నట్లుగా-విలుకాడి చేతిలోని ధనుస్సు నుంచి లక్ష్యాన్ని చేధించే బాణాలై దూసుకుపోతారు.

➡️