సమిష్టిగా..సమానత వైపు…

Mar 8,2024 07:17 #Editorial
  • మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మాటల్లో మాత్రమే కాదు, చేతల్లోనూ సమానత కావాలి. ఎలాంటి నిబంధనలు లేకుండా స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన మొట్టమొదటి దేశం సోవియట్‌ రష్యా. ఆ తర్వాత అనేక పోరాటాల ఫలితంగా వివిధ దేశాల చట్టాలలో మార్పులు చేస్తున్నా అనేక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ వారంలోనే కోస్టుగార్డ్‌ మహిళా అధికారుల ఉద్యోగాల సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి తలంటింది. స్కీం వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ మహిళా కార్మికులు అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. సమాన ఆస్తి హక్కు చట్టం అమలు కావడం లేదు. పురుషాహంకారం స్త్రీలపై హింసకు కారణం అవుతున్నది. చట్టసభలలో రిజర్వేషన్ల అమలును బిజెపి మోసపూరితంగా వాయిదా వేసింది.

              లక్షలాది ఉద్యోగినులు, మహిళా కార్మికులు పని గంటల కోసం, సమాన వేతనాల కోసం ఉద్యమిస్తున్నారు. మరోవైపు సమానంగా, సంతోషంగా ప్రేమతో జీవించే నూతన సమాజం గురించి కలలు కంటున్నాం. కానీ అడుగడుగునా అసమానత, విద్వేషాలు!! దినదినగండంగా జీవించే కోట్లాది మంది మహిళలు వర్గ ఆధిపత్యం, పురుష దురహంకారం, కుల అణచివేత, వివక్షత కలగలసి మహిళలు అసమానతను ఎదుర్కొంటున్నారు. అందరినీ భాగస్వాములను చేసే స్ఫూర్తితో అసమానతను అధిగమించాలన్నది ఈ సంవత్సరం మార్చి 8 థీమ్‌గా ప్రకటించారు.

మహిళా దినోత్సవ చారిత్రక నేపథ్యం

                మహిళలు తమకు తామే యంత్రాలుగా మారిపోయారు. 1867 జూన్‌ మాసంలో లండన్‌లోని దినపత్రికలన్నీ ‘అధిక శ్రమతో మృతి’ శీర్షికతో ఇరవయ్యేళ్ల యువతి మరణం గురించి రాశాయి. ఆమె సగటున రోజుకి పదహారున్నర గంటలు కుట్టు పని చేసింది. అధిక శ్రమ వల్ల మరణించే వారిలో ఆమె ఒకరు. 8 గంటల పని, కార్మిక వేతనాల కోసం పోరాటాలు సాగుతున్న నేపథ్యంలో 1889లో సోషలిస్టు ఇంటర్నేషనల్‌ సదస్సులో జాతీయతతో సంబంధం లేకుండా స్త్రీపురుషులిరువురికీ సమాన పనికి సమాన వేతనాన్ని డిమాండ్‌ చేయాలని తీర్మానించారు. 1907లో మొట్టమొదటి సోషలిస్టు ‘మహిళా’ మహాసభ స్టట్‌గార్ట్‌లో జరిగింది. స్త్రీలు, పురుషులకు సార్వత్రిక ఓటు హక్కు అమలు చేయాలని ఆ సభ తీర్మానించింది. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని చెప్పుకునే ఏ దేశంలోనూ (ఇంగ్లాండ్‌తో సహా) ఆనాటికి సార్వత్రిక ఓటు హక్కు లేదు. 1909 ఫిబ్రవరి 20 చివరి ఆదివారం నాడు అమెరికాలోని పలు ప్రాంతాల్లో మహిళా ఓటు హక్కు ప్రదర్శనలలో స్త్రీపురుషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది జాతీయ స్థాయిలో జరిగిన మొదటి మహిళా హక్కుల దినోత్సవం. 1910 ఆగస్టులో జరిగిన రెండవ అంతర్జాతీయ మహిళా సదస్సు ఓటు హక్కు, మెటర్నిటీ ఇన్సూరెన్సు, మాతా శిశుసంరక్షణ, యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసింది. ప్రత్యేకంగా ఓటు హక్కు, సామాజిక సమస్యల డిమాండ్లతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని పిలుపునిచ్చింది.

మార్చి ఎనిమిదినే ఎందుకు ?

                 రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో 1917 మార్చి 8న లక్షలాది మంది మహిళా కార్మికులు రొట్టె కావాలి, శాంతి కావాలి అని మొదటి ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేశారు. ఇతర ఫ్యాక్టరీలలో పని చేస్తున్న కార్మికులను కూడా సమ్మె చెయ్యమని ప్రదర్శనగా ఆయా ఫ్యాక్టరీల దగ్గరకు వెళ్లారు. విద్యార్థులు, కార్యాలయ ఉద్యోగులు కూడా వారితో చేరారు. లక్షలాది మంది కార్మికుల సమ్మెతో అది సార్వత్రిక సమ్మెగా మారింది. ఫలితంగా మార్చి 16 నాటికి జారు ప్రభుత్వం కూలిపోయింది. 1921లో 3వ అంతర్జాతీయ సదస్సు (ఇంటర్నేషనల్‌) రష్యా విప్లవానికి దారితీసిన మహత్తర మహిళా కార్మికుల స్ఫూర్తితో మార్చి 8ని శాస్వతంగా మహిళా దినోత్సవ తేదీగా నిర్ణయించింది.

1921 వరకూ రష్యాలో మినహ ఇతర దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏదో ఒక ఆదివారం నిర్వహించేవారు. మూడవ ఇంటర్నేషనల్‌ నిర్ణయంతో 1921 నుండి అన్ని దేశాలలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం తూర్పు యూరప్‌ దేశాలు సోషలిస్టు దేశాలుగా ఆవిర్భవించాయి. ఈ దేశాలన్నింటా మహిళా హక్కుల దినంగా మార్చి 8 నిజరపడంతో ఇది విస్తరించింది. 1960, 70 దశకాలలో వచ్చిన స్త్రీవాద ఉద్యమం, 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి తీర్మానం ఫలితంగా అన్ని దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించసాగారు.

మహిళాభివృద్ధికి పెట్టుబడి

                    అన్ని తరగతులను కలుపుకుని ఎదిగే సమాజానికి మహిళల అభివృద్ధి కీలకమైనది. మహిళల అభివృద్ధి అంటే అది సమాజం అంతటికీ అభివృద్ధి అన్నది అందరి మాట. అందుకు కీలకమైంది బడ్జెట్‌ కేటాయింపులు. 360 బిలియన్‌ డాలర్లను మహిళల అభివృద్ధికి, సమానత్వ సాధనకు వినియోగించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం అంచనా వేసింది. మహిళలకు తమ హక్కుల గురించి తెలియడం ద్వారా పేదరికం నుండి బయటపడడం సాధ్యమవుతుంది. బిడ్డల పెంపకం, కుటుంబ నిర్వహణ, పెద్దల బాధ్యత, తదితర సేవారంగం సమగ్రంగా విస్తరిస్తే నిర్మాణ రంగం కంటే 3 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు పెరుగుతాయని ఒక అంచనా. ఈ రోజు ప్రపంచీకరణ నేపథ్యంలో మన దేశంలోనూ, ప్రపంచంలోనూ పేదరికం మరీ ముఖ్యంగా మహిళల్లో పెరుగుతున్నది. ఇవే పద్ధతులు కొనసాగితే 2030 నాటికి 34.2 కోట్ల మంది మహిళలు పేదరికంలో ఉంటారని అంచనా.

తక్షణ సమస్యలు – మార్పుకు మార్గాలు

                 సరైన వేతనాలతో కూడిన ఉపాధి నేటి తక్షణ అవసరం. సామాజిక భద్రతా చర్యలు బలపడాలి. ధరలుతగ్గించడానికి ప్రజాపంపిణీ వ్యవస్థ మెరుగు పడాలి. విద్య, ఆరోగ్యానికి ప్రభుత్వ కేటాయింపులు పెరిగితేనే, ప్రత్యేకంగా స్త్రీలకు కేటాయింపులు చేస్తేనే వారికి అవకాశాలు మెరుగవుతాయి. సామాజిక పెన్షన్లు ఎన్నికల ప్రయోజనాల కోసమని తప్పుడు ప్రచారం జరుగున్నది. దేశంలో ఉన్న ఉద్యోగులందరు తమ అనుభవంతో సిపిఎస్‌ కాదు/ఒపిఎస్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతా చర్యలు ఎవరి దయాదాక్షిణ్యాలు కావు. ఇవి హక్కులు. కానీ పొదుపు చర్యల పేరుతో తీసుకుంటున్న చర్యలు యూజర్‌ చార్జీలు, పరోక్ష పన్నులు మహిళల జీవితాన్ని పేదరికంలోకి నెడుతున్నాయి.

సమానతల లక్ష్యంగా మార్చి 8

               మాటల్లో మాత్రమే కాదు, చేతల్లోనూ సమానత కావాలి. ఎలాంటి నిబంధనలు లేకుండా స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన మొట్టమొదటి దేశం సోవియట్‌ రష్యా. ఆ తర్వాత అనేక పోరాటాల ఫలితంగా వివిధ దేశాల చట్టాలలో మార్పులు చేస్తున్నా అనేక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ వారంలోనే కోస్టుగార్డ్‌ మహిళా అధికారుల ఉద్యోగాల సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి తలంటింది. స్కీం వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ మహిళా కార్మికులు అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు. సమాన ఆస్తి హక్కు చట్టం అమలు కావడం లేదు. పురుషాహంకారం స్త్రీలపై హింసకు కారణమవుతున్నది. చట్టసభలలో రిజర్వేషన్ల అమలును బిజెపి మోసపూరితంగా వాయిదా వేసింది.

మహిళల సమానత సాధన ప్రజల సమానతతో ముడిపడి ఉందని సోషలిస్టు మహిళా నేతలు ఆనాడే విష్పష్టంగా ప్రకటించారు. లక్షలాది మంది మహిళలు (మన రాష్ట్రంలో అంగన్వాడీ, మున్సిపల్‌ కార్మికులు) కనీస వేతనాలు ఉపాధి, ఉద్యోగ భద్రత, హింస లేని సమాజం కోసం పోరాడుతున్నారు. ఈ సమస్యలన్నీ సమస్త కార్మిక వర్గం హక్కుల విజయంతో, సంక్షేమంతో ముడిపడి ఉన్నాయి.

ఆర్థిక అసమానతలేగాక, సామాజిక అసమానతలు కూడా స్త్రీలను రెండవ స్థాయికి నెట్టివేశాయి. కుటుంబ నిర్వహణ, భద్రత లేకపోవడం స్త్రీల ఉపాధికి ఆటంకంగా ఉన్నాయి. విసుగు పుట్టించే ఇంటి పని, బిడ్డల పెంపకం తదితర గృహ సంబంధిత పనులు సామాజికీకరణ చెందాలని గురజాడ ప్రకటించాడు. లెనిన్‌ ఆచరించి చూపాడు. పురుషాధిపత్య సంస్కృతి పురుషులలో మాత్రమే కాదు, స్త్రీలలో కూడా ఆవరించి ఉంది. ఈ ఆధిపత్య భావజాలం మీద యుద్ధం జరగాలి. స్త్రీల శ్రమను కారుచౌకగానూ, అసలు వేతనమే లేకుండానూ చేసే పెట్టుబడిదారీ వర్గం, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక ఈవెంట్‌ కాదు. ఒక పోరాట చిహ్నం. కార్మిక మహిళలు, విద్యావంతులైన చైతన్యవంతమైన మహిళలు తమలాగే బాధలు అనుభవిస్తున్న కార్మిక సోదరులతో కలసిసాగించిన పోరాట గాథల గానం. సాగించాల్సిన ఉద్యమాల ప్రతిజ్ఞా కార్యక్రమం. స్త్రీల ఐక్యత, పోరాడే మార్గంపై స్పష్టత, సృజనాత్మకంగా నూతన ఒరవడిలో రైతులను, కూలీలను సమస్త మహిళా కార్మికులను, గృహిణులను కలుపుకొని పోరాటాలకు అడుగులు కలపాలి. అందుకు వేదిక మార్చి 8. సమానత, ఉపాధి హక్కుల భద్రత లక్ష్యాల సాధన కోసం ప్రతిజ్ఞ తీసుకుందాం.

/ వ్యాసకర్త ఐద్వా రాష్ట్ర కార్యదర్శి /డి. రమాదేవి
/ వ్యాసకర్త ఐద్వా రాష్ట్ర కార్యదర్శి /డి. రమాదేవి
➡️