ప్రజాస్వామిక ఆకాంక్ష

democracy in pakistan elections

పాకిస్తాన్‌ ఎన్నికల ఫలితాలు ఆ దేశ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అద్దం పడుతున్నాయి. జైలులో ఉన్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఎన్నికల ఫలితాల తరువాత అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా ఆవిర్భవించారు. ఆయనను, ఆయన పార్టీని ఎన్నికల బరిలోకి దిగకుండా చూడటానికి సైన్యం చేయని కుట్ర లేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి చాలా ముందే 2023 మే నెల నుండే ఆయన జైలులో ఉన్నారు. రకరకాల కేసుల్లో ఆయనకు జైలు శిక్ష పడింది. ఇప్పటికీ ఆయన మీద కేసులు పెడుతూనే ఉన్నారు. ఆయన పార్టీ పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పిటిఐ) పేరునుగానీ, గుర్తు బ్యాటును గాని వినియోగించడానికి లేదంటూ నిషేధం విధించారు. సైన్యం తీసుకునే చర్యల భయంతో ఇమ్రాన్‌ పార్టీలోని ముఖ్యమైన నాయకుల్లో పలువురు పరారీలో ఉన్నారు. మరికొందరు జైలులో ఉన్నారు. మరోవైపు ఒకప్పుడు సైన్యానికి శత్రువుగా ఉన్న పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-ఎన్‌ (పిఎంఎల్‌-ఎన్‌) నేత నవాజ్‌ షరీఫ్‌ ఇప్పుడు అదే సైన్యం మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల బరిలోకి దిగడమంటేనే కత్తి మీద సాము చేయడం! ఆ పనిని జైలు నుండే ఇమ్రాన్‌ చేస్తే, అక్కడి ప్రజానీకం స్పందించిన తీరు అపూర్వం! ఈ నెల ఎనిమిదిన జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్‌ లోని మొత్తం 12 కోట్ల మంది ఓటర్లలో సగానికిపైగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం 265 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులు 101 స్థానాల్లో గెలుపొందారు. వీరిలో 93 మంది ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పిటిఐ బలపరచిన వారే! పార్టీ పేరును, గుర్తును ఉపయోగించడానికి వీలులేకపోవడంతో వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా, వేరువేరు గుర్తులతో పోటీ చేశారు. అదే, ఇతర పార్టీల మాదిరి సమాన అవకాశాలు ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీకి కూడా దక్కి ఉంటే ఏం జరిగిఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సైన్యం మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన పిఎంఎల్‌-ఎన్‌కు 75 స్థానాలు, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) 54, కరాచీకి చెందిన ముత్తాహిదా క్వామి మూవ్‌మెంట్‌-పాకిస్తాన్‌కు 17 స్థానాలు దక్కాయి.

పాకిస్తాన్‌ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏమిటో, వారి ఆకాంక్ష ఏమిటో స్పష్టంగానే తెలుస్తూనే ఉన్నా దానిని వమ్ము చేసే ప్రయత్నాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన నవాజ్‌ షరీఫ్‌, భుట్టోల పార్టీలు పరస్పరం సహకరించుకునేలా సైన్యం ఒత్తిడి తెస్తోందన్న వార్తలు వస్తున్నాయి. తాను ప్రధానమంత్రి రేసు నుండి తప్పుకుంటున్నానంటూ పిపిపి నేత బేనజీర్‌ భుట్టో కుమారుడు బిలావల్‌ ప్రకటించారు. తాను కొత్త ప్రభుత్వంలో చేరనని, వెలుపలి నుండి బలపరుస్తానని ఆయన చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన తరువాత తన సోదరుడు 72 ఏళ్ళ షెహబాజ్‌ను నూతన ప్రధాని పదవికి నవాజ్‌ షరీఫ్‌ నామినేట్‌ చేశారు. దీంతో షెహబాజ్‌ షరీఫ్‌ పాకిస్తాన్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం దాదాపు ఖాయమనే అంటున్నారు. అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయానికి కారణలేమిటో తెలియాల్సి ఉంది. మరోవైపు ఇండిపెండెంట్‌ అభ్యర్థులందరినీ ఒక కూటమిగా చేసి, ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అయితే, సైన్యం కనుసన్నల్లోనే అంతా జరగాల్సి ఉండటంతో ఆ ప్రయత్నాలు ఫలించడం సందేహమే!

ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా సైన్యం తీసుకున్న చర్యల వెనుక అమెరికా హస్తం ఉందని చెబుతారు. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో అమెరికాతో పాటు రష్యా, చైనాలతో కూడా సామరస్యంగా వ్యవహరిస్తామంటూ తీసుకున్న వైఖరి దీనికి కారణం. ఇస్లామాబాద్‌లో కుర్చీలో ఎవరున్నా తమ చెప్పు చేతల్లో ఉండాలని అమెరికా భావిస్తుందన్నది బహిరంగ రహస్యమే! ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ప్రజాభీష్టాన్ని స్పష్టం చేశాయి. మిలిటరీ పెద్దలు ఈ విషయం అర్ధం చేసుకోవాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు పట్టం కట్టేలా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలి. అంతర్జాతీయ సమాజం కూడా ఈ దిశలో ఒత్తిడి తీసుకురావాలి.

➡️