ప్రజాస్వామ్యం ఖూనీ

Dec 20,2023 07:20 #Editorial

             నూతన పార్లమెంట్‌ భవనంలో ప్రజాస్వామ్యానికి సమాధి కడుతున్నారు! చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన 141 మంది ఎంపిలను శీతాకాల సమావేశాలు పూర్తయ్యేవరకూ పార్లమెంట్‌లో అడుగుపెట్టొద్దంటూ హుకుం జారీ చేశారు. మమ్మల్నే ప్రశ్నిస్తారా అన్నట్టుగా ఉంది నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తీరు. లోక్‌సభలో చొరబడిన ఆగంతకులకు పాస్‌లు ఇచ్చిన బిజెపి ఎంపిపై చర్యలు తీసుకోలేదు. కనీసం ప్రశ్నించలేదు. పైగా ప్రధాని, హోం మంత్రి ఎక్కువ రోజులు సభకు రారు. సభలో మాట్లాడరు. బయట ఇంటర్వ్యూలు ఇస్తారు. పార్టీ సమావేశాల్లోనూ మాట్లాడతారు. భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం, అందరూ ఖండించాలి, ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలి, దీని వెనుక ఉన్న వ్యక్తుల మూలాలను, వారి ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరం అంటూ సభ బయట సభా నాయకుడు సుద్ధులు చెబుతున్నారు. భద్రతా వైపల్యానికి బాధ్యత వహించి, దాన్ని సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవడం మాని ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారు. ”డిసెంబర్‌ 13న ఏం జరిగింది? ఎలా జరిగింది? హోం మంత్రి ప్రకటన చేయాలి?” ఇదే ఇండియా వేదికలోని పార్టీలు చేస్తున్న ఏకైక డిమాండ్‌.

మణిపూర్‌ నెలల తరబడి అగ్నిగుండంగా మారినా పార్లమెంట్‌లో మాట్లాడరు. చిట్టచివరికి ప్రధానిని మాట్లాడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు అవిశ్వాసం పెడితే గంటల తరబడి ప్రతిపక్షాలను దూషిస్తూ సాగిన ప్రసంగంలో రెండు నిమిషాలు కూడా మణిపూర్‌ మంటలపై మాట్లాడలేదు. బాధితులకు భరోసా ఇవ్వలేదు. తమ పాలనలో, డబుల్‌ ఇంజిన్‌ ఇలాకాల్లో… ఎన్ని ఘోరాలు జరిగినా, తమ ఎంపీలు ఎన్ని నేరాలు చేసినా నోరు మెదపరు. లైంగికంగా వేధించారంటూ దేశ రాజధానిలో రెజ్లర్లు పోరాడి, కన్నీరు మున్నీరైనా పట్టించుకోరు. ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్‌భూషణ్‌ పార్లమెంట్‌లో దర్జాగా కూర్చుంటున్నారు. అదానీ మోసాలపై ప్రశ్నలడిగిన మహువా మొయిత్రా పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోయారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎన్నికైన ప్రతినిధుల కర్తవ్యం. ఆ చర్చల ఆధారంగా ప్రజా సమస్యలకు పరిష్కారాలను వెతకాలి. అందుకు భిన్నంగా నిరంకుశత్వమే మోడీ ప్రభుత్వ అజెండాగా ఉంది. 14, 78, 49… ఇలా వరుసగా మూడు రోజుల్లో 141 మందిని సస్పెండ్‌ చేశారు. ఇంకా ప్రతిపక్షాలకు చెందిన 47 మంది సభ్యులే సభలో మిగిలారు. గతంలో ఇంతమంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసి, బిల్లులను ఆమోదించుకునేందుకు తెగబడిన సర్కారే కేంద్రంలో లేదు.

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాలు బిజెపి ప్రభుత్వాల ఏలుబడిలోనే ఎక్కువగా సంభవిస్తున్నాయి. 22 ఏళ్ల క్రితం పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రధానిగా వాజ్‌పేయి, హోం మంత్రిగా అద్వానీ ఉన్నారు. నాటి ఉగ్రదాడి వార్షిక దినం సందర్భంగా దాడులు చేస్తామంటూ ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్‌సింగ్‌ పన్ను ప్రకటించిన హెచ్చరికతో పూర్తిస్థాయి భద్రత ఉన్నప్పుడే, ప్రతి ఒక్కరినీ నాలుగైదు సార్లు శల్యపరీక్షలు చేసే యంత్రాంగం ఉన్నప్పుడే, మోడీ, అమిత్‌షా నాయకత్వంలోని సర్కారు హయాంలోనే తాజా ఘటన జరిగింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, మణిపూర్‌ మారణకాండను చర్చనీయాంశం చేయడమే లక్ష్యమంటూ ఆగంతకులు పొగ బాంబులు వేసి ఊరుకున్నారు. వారు తలచుకుంటే విషవాయువులు, తుపాకులు తేగలిగే వారేమో! గొప్పలు మావి.. ఘోరాలు కిందివారివి అన్నట్టు ఈ ఘటనలోనూ మోడీ జోడీ నాయకత్వం అఘోరించింది. జరిగిన దానికి తనదే బాధ్యత అని లోక్‌సభ స్పీకర్‌ ప్రకటించేసుకున్నారు. దేశవ్యాప్తంగా దర్యాప్తు చేస్తున్న సంస్థలు, సస్పెండైన భద్రతా అధికారులు హోం మంత్రి నేతృత్వంలో పనిచేస్తున్నారో! స్పీకర్‌ నేతృత్వంలో పనిచేస్తున్నారో! మరి. తమ ఎంపి ప్రతాప సింహ ఇచ్చిన పాసులపై ఆగంతకులు రావడానికి గల కారణాలపై సమాధానం చెప్పేందుకు అధికారపక్షం ముందుకు రాకుండా సస్పెండ్‌ చేస్తూ పోవడం సిగ్గుచేటు. ప్రధాని, హోం మంత్రి సభలో ఉండాలని, సమాధానం చెప్పాలని అడగడం సభ్యుల కర్తవ్యం. అందుకు వారిని సభ నుంచి బహిష్కరించడం సమాధానం కాదు. ప్రజాస్వామ్యం అంతకన్నా కాదు. ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమే!

➡️