‘ధర్మ’ వ్యాధి

May 14,2024 04:20 #editpage

మాయాబజార్‌ సినిమాలో శశిరేఖకు లక్ష్మణకుమారుడితో పెళ్ళి నిశ్చయించి ముహూర్తం పెట్టుకోడానికి కౌరవులు ద్వారకకు వస్తారు. అక్కడ కౌరవుల పురోహితుడు ఒక ముహూర్తం సూచిస్తాడు. అప్పుడు యాదవుల పురోహితుడు ”అబ్బే, అది రాక్షస లగం” అని అభ్యంతర పెడతాడు. దానికి కౌరవ పురోహితుడు ” చూశారూ! శాస్త్రం ఏదైనా కర్కశంగానే చెపుతుంది. మనమే దాని అర్ధాన్ని సౌమ్యంగా తీసుకోవాలి” అని అంటాడు. ఈ సినిమా సంభాషణ ఇప్పుడెందుకు? అని మీకు సందేహం కలగొచ్చు. దానికి మా అవధానే కారణం. ఆ రోజు మా ఇంటికొచ్చి ”చూశావా సుబ్రమణ్యం, సనాతన ధర్మం ఎలా నాశనం అయిపోతోందో! దానిని కాపాడడానికి మోడీజీ ఎంత తాపత్రయ పడుతున్నారు!” అని వాపోయాడు.
అప్పుడు నేను ”మనుధర్మశాస్త్రం సూటిగా, కర్కశంగానే చెప్పింది. స్త్రీలకు స్వాతంత్య్రం కలిగివుండే అర్హత లేదని. అంతకన్నా కర్కశంగా ధర్మాన్ని అతిక్రమించిన శూద్రులకు నాలుకలు తెగ్గొయ్యడం, మరణ శిక్ష విధించడం, చెవుల్లో సీసం కరిగించి పోయడం వంటి శిక్షలను విధించాలని చెప్పింది. ఇదే కదా సనాతన ధర్మం అసలు సారాంశం?” అని నేను అవధానితో అన్నాను.
దానికి అవధాని ” ఓరి తెలివితక్కువవాడా!” అన్నట్టు ఒక నవ్వు నవ్వి సనాతన ధర్మం గురించి అర్ధం కావాలంటే మహాభారతం అరణ్య పర్వంలో మార్కండేయ మహాముని ధర్మరాజుకి చెప్పిన ధర్మవ్యాధుడి కథ గురించి నువ్వు తెలుసుకోవాలి” అన్నాడు. అదేదో శలవియ్యమని అడిగాను. అప్పుడు అవధాని ఆ కథను ఈ విధంగా చెప్పాడు.
కౌశికుడు అనే బ్రాహ్మణుడు మహా పండితుడు. ఒకరోజు ప్రయాణం మార్గ మధ్యంలో చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటూ వుంటే అతడి తలపైన చెట్టు మీది కొంగ రెట్ట వేసింది. దానికి మండిపడి కౌశికుడు ఆ కొంగకేసి కొరకొరా చూసేడు. ఆ చూపుల తీక్షణతకి కొంగ మలమలా మాడి టప్పున కిందపడి చచ్చింది. ఆ తర్వాత కౌశికుడు ఒక ఇంటి ముందు నిలబడి ”భవతీ భిక్షాం దేహి” అని అడిగాడు (ఇప్పటి రోజుల్లో కొందరు స్టైల్‌గా మన ముందుకొచ్చి కెన్‌ యూ స్పేర్‌ మీ టెన్‌ రుపీస్‌?” అని అడుక్కుంటారు. ఇప్పుడు ఇంగ్లీషులో అడుక్కోడం ఫ్యాషన్‌. అది అంతర్జాతీయ పాలకుల భాష. మరి ఆ రోజుల్లో పాలకుల భాష సంస్కృతం. అందుకనే ఆ భాషలో అడుక్కున్నాడు కౌశికుడు). దానికి ఆ ఇంటి ఇల్లాలు ”ఇదిగో! వచ్చేస్తున్నాను స్వామీ” అని చెప్పింది కాని అరగంట దాకా రాలేదు. దాంతో అసలే ఆకలి మీదున్నాడేమో కౌశికుడికి అరికాలి నుండి మంటెక్కిపోయింది. ఆ తర్వాత ఆ ఇల్లాలు తాపీగా వచ్చి భిక్ష స్వీకరించమంది. కౌశికుడు ఆమెను కొరకొరా చూసేడు. అప్పుడు ఆ ఇల్లాలు ‘తమరలా కొరకొరా చూసినంత మాత్రాన కిందపడి చచ్చిపోడానికి నేనేమీ కొంగను కాను” అంది. తను గొప్ప పతివ్రతనని, భర్తకు సేవ చేయడమే పతివ్రత కర్తవ్యం అని, తక్కినవన్నీ ఆ తర్వాతేనని కూడా శలవిచ్చింది. ”నేను అసలైన పతివ్రతను కాబట్టే నాకు మీ కొంగ-రెట్ట వ్యవహారం దివ్యదృష్టి ద్వారా తెలిసిపోయింది” అని కూడా చెప్పింది. అప్పుడు కౌశికుడు ఆమెను క్షమించమని కోరాడు. ఆమె క్షమించింది. పైగా ఓ సలహా చెప్పింది. ”మీకు కోపం మీద పట్టు ఉన్నట్టు ధర్మం మీద లేదనిపిస్తోంది. అందుచేత ఇక్కడి నుంచి ఇలాగే మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ధర్మవ్యాధుడు అనే మహానుభావుడిని కలవండి. ధర్మం గురించి అతగాడు బాగా చెప్తాడు” అని చెప్పింది.
అప్పుడు కౌశికుడు మిధిల వెళ్ళాడు. ధర్మవ్యాధుడి గురించి వాకబు చేస్తూ అతడి దుకాణానికి చేరాడు. అది మాంసం దుకాణం. అక్కడ ఆ ధర్మవ్యాధుడు మాంసం అమ్ముతున్నాడు. ”ఈ కసాయివాడి దగ్గర నేను ధర్మం నేర్చుకోవడమేమిటి?” అని కౌశికుడికి అనుమానమైతే వచ్చింది. కాని ఆ మహా ఇల్లాలు చెప్పిందికదా, ఇదేదో తేల్చుకుందాం అనుకున్నాడు. ఈ లోపే ఆ ధర్మవ్యాధుడు దగ్గరకొచ్చి ”స్వామీ! రండి. మిమ్మల్ని ఆ పతివ్రత పంపింది కదా” అనేసరికి కౌశికుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధర్మవ్యాధుడు ధర్మం గురించి వివరించాడు. ఆ వివరణ సారాంశం ఇలా ఉంది: ”ధర్మం అంటే ఏ కులంలో పుట్టినవారు ఆ కుల వృత్తి చేయడమే. దానిని అతిక్రమిస్తే అది అధర్మం. పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాలను బట్టి ఈ జన్మలో ఏ కులంలో పుడతామో ఆధారపడి వుంటుంది. అందుచేత అంటరాని కులంలో నేను పుట్టడం నేను గత జన్మలో చేసుకున్న పాపఫలితమే. దానికి ఇప్పుడు విచారించకుండా ధర్మాన్ని అనుసరిస్తూ నడుచుకుంటే వచ్చే జన్మకి ఈ సమస్య ఉండదు. ఎన్ని కష్ట నష్టాలొచ్చినా, తడబడకుండా, ఈ ధర్మాన్ని అనుసరించాలి. అలా చేస్తున్నాను కాబట్టే నాకు కూడా దివ్యదృష్టి వచ్చింది.” ధర్మం అంటే కుల కట్టుబాట్లను, వివక్షతను కట్టుదిట్టంగా పాటించడమేనని, దానిని కడగొట్టు జాతులవాళ్ళు ధర్మవ్యాధుడి మాదిరిగానే అర్ధం చేసుకుంటే ఇక అస్సలు తిరుగుబాటే చేయరని, అప్పుడు ఇక బ్రాహ్మణాధిపత్యానికి ఎటువంటి ఢోకా ఉండదని తెలుసుకుని కౌశికుడు మనశ్శాంతితో ఇంటికి తిరిగిపోయాడు. చాలా ఉధృతంగా పురాణ కాలక్షేపాలు చేయడం మొదలుబెట్టాడు.
అవధాని ఈ కథను ముగించగానే నాకు మాయాబజార్‌ సంభాషణ పైన చెప్పినది గుర్తుకొచ్చింది. మనధర్మశాస్త్రం లో కర్కశంగా చెప్పినదాని సారాంశాన్ని ధర్మవ్యాధుడి కథలో సౌమ్యంగా వివరించారని అర్ధం అయింది. ఈ పురాణాలనెందుకు నిత్యం చదివి వినిపిస్తూంటారో అది కూడా బోధపడింది. అన్నింటికీ మించి సనాతన ధర్మం అంటే స్త్రీలకు, శ్రామిక తరగతులకు చెందిన శూద్ర, అతిశూద్ర కులాలకు ఎట్టి స్వేచ్ఛ, హక్కులు లేవని చెప్పిందని, ఆ ధర్మాన్ని అతిక్రమిస్తే మహాపాపం అని, కఠినమైన శిక్షలు ఎదుర్కోవలసి వస్తుందని అర్ధం అయింది. అంతే గాక,
(అ) కౌశికుడు లాంటి బ్రాహ్మణులు కొరకొరా చూస్తే పక్షులు, మరి కొంతమంది అల్పజీవులు మలమలా మాడి చచ్చిపోయే ప్రమాదం ఉంది.
(ఆ) ఐతే నిజమైన పతివ్రతలకు ఈ ప్రమాదం ఉండదు.
(ఇ) కౌశికుడి వంటి బ్రాహ్మణులకు కేవలం కోపం మాత్రం ఉంటే చాలదు. కుల ధర్మాన్ని కాపాడడం ఎలా అన్నది కూడా తెలియాలి. పురాణ కాలక్షేపాలతో శ్రామిక కులాల ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం కూడా తెలియాలి.
(ఈ) దుర్మార్గమైన ఈ ధర్మాన్ని మనువు వంటి వారి ద్వారా చెప్పిస్తే శూద్రులు స్వీకరించకపోవచ్చు. కనుక సౌమ్యంగా ధర్మవ్యాధుడు అనే కడగొట్టు జాతి పాత్ర ద్వారా మహా భారతంలో చెప్పించారు.
ఇదే అవధానితో చెప్పాను. అతగాడు కౌశికుడి మాదిరిగానే నన్ను కొరకొరా చూశాడు. కాని నాకేం కాలేదు. దాంతో అతగాడు రుసరుసా వెళ్ళిపోయాక తాపీగా నా భార్య వచ్చి ”ఈ పుక్కిటి పురాణాలన్నీ ఇప్పుడెందుకు అవధాని గారు చెప్పినట్టు?” అని అడిగింది.
”అవధానికి కూడా మోడీ అండ్‌ కో కి వచ్చినట్టే ”ధర్మ వ్యాధి” వచ్చింది. అందుకే ఇతగాడు ధర్మవ్యాధుడి కథ చెప్పాడు. అందుకే మోడీ ఆ సనాతన ధర్మం గురించి తెగ రచ్చ చేస్తున్నాడు.” అన్నాను.

సుబ్రమణ్యం

➡️