నీతిబాహ్య రాజకీయాలు

Jan 13,2024 07:20 #Editorial

               శివసేన చీలిక బృందానికే పార్టీ అధికారిక గుర్తింపును కట్టబెడుతూ మహారాష్ట్ర శాసన సభాధిపతి రాహుల్‌ నార్లేకర్‌ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామిక విలువలను అపహాస్యం చేస్తోంది. తన ముందుకు వచ్చిన అనర్హత పిటీషన్లను సంవత్సరాల తరబడి నానబెట్టి, చివరాఖరికి ఆయన చెప్పిన తీర్పు పక్షపాత వైఖరికి పరాకాష్టగా నిలిచిపోతుంది. ఎమ్మెల్యేల అధిక సంఖ్యను, ఎన్నికల సంఘం గుర్తింపునూ ఆసరాగా తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చినట్టు నార్లేకర్‌ ప్రకటించినప్పటికీ- ఆది నుంచి అతడిది అధికార షిండే గ్రూపు పట్ల అనుకూల వైఖరే! బిజెపి ఏకపక్ష విధానాలతోనూ, అనుచిత జోక్యంతోనూ నాటి శివసేన ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే తీవ్రంగా విభేదించటంతో – చీలిక దారిలో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టటానికి కాషాయ పార్టీ వ్యూహం రచించింది. ఏకనాథ్‌ షిండే తన సొంత పార్టీలో చీలిక తలపెట్టినప్పుడు లోపాయికారీగా తగు అండదండలు అందించింది. అదంతా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని పైకి చెబుతూ- లోలోపల గవర్నరు కోషియార్‌ సహాయంతో మొత్తం నాటకం నడిపించింది.                         2022 జూన్‌ 25న ఏకనాధ్‌ షిండే కొంతమంది ఎమ్మెల్యేలతో శివసేన నుంచి చీలిపోవడం, మూడు నాలుగు ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాలు నడపడం, లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాక బిజెపి మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడడం, గవర్నరు కోషియార్‌ అందుకు అంగీకరించటం చకచకా జరిగిపోయాయి. స్పీకరు నార్లేకర్‌ చీలిక గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించటం అప్పుడే మొదలుపెట్టారు. శాసనసభలో షిండే, ఠాక్రే గ్రూపుల బలపరీక్షకు ఆదేశించారు. చీలిక గ్రూపులోని భరత్‌ షెట్‌ గాగ్వాలేకు విప్‌ జారీ అధికారం కట్టబెట్టారు. చీలిక గ్రూపు ఎమ్యెల్యేలపై అనర్హత వేటు వేయమని నాటి డిప్యూటీ స్పీకరు నరహరి జరివాల్‌ ఇచ్చిన పిటిషన్‌ను స్పీకర్‌ మడత పెట్టి తన కుర్చీ కింద పెట్టుకున్నారు. ఇలా అన్ని సందర్భాల్లోనూ ఆయన రాజ్యాంగ విరుద్ధంగా, నీతిబాహ్యంగా వ్యవహరించారు. బిజెపి మద్దతుతో షిండే గ్రూపు అధికార ఫీఠం ఎక్కి నిలబడ్డానికి రాజ్యాంగబద్ధంగా ఏమేమి చేయకూడదో- అవన్నీ చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఉద్ధేవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలో బెంచి 2023 మే 11వ తేదీన ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. గవర్నరు, స్పీకర్‌ల రాజకీయ పక్షపాత వైఖరులను తీవ్రంగా తప్పు పట్టింది. గవర్నరు కోషియార్‌ తన పరిధిని దాటి వ్యవహరించారని విమర్శించింది. స్పీకరు నార్లేకర్‌ చీలిక గ్రూపునకు విప్‌ అధికారం కట్టబెట్టటాన్ని ఆక్షేపించింది. ”ఉద్ధేవ్‌ థాకరే బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేశారు. సంయమనం వహించి ఉంటే తిరిగి ఆయన్ని ఆ పీఠం మీద కూర్చోబెట్టటానికి కూడా ఆలోచించి ఉండేవారం.” అని పేర్కొంది. అనర్హత పిటీషన్లపై స్పీకరు తక్షణం నిర్ణయం ప్రకటించాలని కూడా సూచించింది. అత్యంత తీవ్రమైన ఈ తలంటు పట్ల స్పీకరు నార్లేకర్‌కు పట్టింపు లేకుండా పోయింది. సుప్రీంకోర్టు పెట్టిన రెండు గడువులు ముగిసిపోయాక, జనవరి 10 లోపు తన అభిప్రాయం వెల్లడించాలన్న మరో గడువు నిర్ణయించాక- చిట్టచివరికి నోరు విప్పి, తన మొట్టమొదటి వైఖరికి అనుగుణంగానే తీర్పు చెప్పారు. ఇది పక్షపాత రహితంగా ఉండాల్సిన రాజ్యాంగబద్ధ స్థానానికి మాయని మచ్చ.

అధికారమే పరమావధిగా వ్యవహరించే పార్టీలకు, ఆ పార్టీల్లోని వ్యక్తులకు నీతి నియమాలూ, రాజ్యాంగ విలువలూ పట్టవని ఈ వ్యవహారంతో మరోసారి వెల్లడైంది. తనకు తాబేదార్లుగా మారని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట బిజెపి కేంద్ర ప్రభుత్వం తన గవర్నర్ల ద్వారా ఇలాంటి నీతిమాలిన చర్యలకే పాల్పడుతోంది. ప్రజల చేత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల్లో గవర్నర్ల రూపేణా జోక్యం చేసుకొని రగడ సృష్టించటమే ధ్యేయంగా పనిచేస్తోంది. ఇలాంటి స్వార్థపూరిత ధోరణులు, రాజ్యాంగ విరుద్ధ పోకడలూ ప్రజాస్వామిక విలువలను మసకబారుస్తాయి. వ్యవస్థల స్వతంత్ర బలాన్ని, విలువనూ నిర్వీర్యం చేస్తాయి. గవర్నర్లు, స్పీకర్లూ చట్టబద్ధంగా నడుచుకుంటే ఆయా స్థానాలకు గౌరవం ఉంటుంది. ముసుగులుగా వేసుకోవటానికి మాత్రమే ఆ పదవులను ఉపయోగిస్తే- తీవ్రమైన కళంకం ఏర్పడుతుంది. సచ్ఛీలత గురించి ఉపన్యాసాలు దంచే బిజెపి నేతృత్వంలోనే ఈ నీతిబాహ్య రాజకీయాలు నడవడం ఆ పార్టీ అసలు రూపానికి ఆనవాలు.

➡️