యుద్ధ అనాథల కోసం…

Jan 6,2024 07:14 #Editorial

               ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీన ”ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం (వరల్డ్‌ వార్‌ ఆర్ఫన్స్‌ డే)” జరుపుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, వ్యాధులు, పేదరికం, కరువు, ప్రకృతి విపత్తుల వలన 18 సంవత్సరాల లోపు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయినట్లయితే వారిని అనాథలుగా పరిగణిస్తారని యునిసెఫ్‌ తెలిపింది. యుద్ధాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అనాథల విషయం రెండవ ప్రపంచ యుద్ధానంతరం అంతర్జాతీయంగా చర్చనీ యాంశమైంది. దీనికి కారణం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఒక్క పోలెండ్‌ లోనే 3 లక్షల మంది, యుగోస్లేవియాలో 2 లక్షల మంది అనాథలుగా మారారు. వీరి భవిష్యత్తు కోసం తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించారు. ప్రస్తుతం మన కళ్ళ ముందే జరుగుతున్న ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధంలో సుమారు పాతికవేల మంది మరణించారని వీరిలో 9 వేల మంది అభం-శుభం తెలియని పసికందులన్న విషయం యావత్‌ ప్రపంచాన్ని కలవర పరచింది. ఇంకా ఎన్ని ప్రాణాలు గాల్లో కలవాలో…ఈ యుద్ధం ఆగేదెన్నడో…!? అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి యుద్ధాలు ఆపడానికి అన్ని దేశాలు ముందుకు రావాలి. అనాథలుగా మారుతున్న వారి సంక్షేమం కోసం అంతర్జాతీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి.

ఆధిపత్యం కోసం, మత వ్యాప్తి కోసం, జాతి, లింగ, భాష, ప్రాంతం వంటి వివక్షతలతో మనుషుల మధ్య, దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు జరుగుతూ అనేక మంది అనాథలుగా మారుతున్నారు. 2015 నాటికే ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల మంది అనాథలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఆసియాలో 6.1 కోట్లు, ఆఫ్రికాలో 5.2 కోట్లు, లాటిన్‌ అమెరికా, అరేబియన్‌ దేశాల్లో ఒకో కోటి, తూర్పు ఐరోపా, సెంట్రల్‌ ఆసియాలో 73 లక్షల మంది అనాథలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో సుమారు 30 లక్షల మంది అనాథలు వున్నారు. వీరిలో ఎక్కువ మంది అక్రమ రవాణాకు గురవుతున్నారు. భిక్షాటన వంటి వృత్తులు చేపడుతున్నారు. అవిద్య, అనారోగ్యం, పోషకా హార లోపం, గృహ వసతి లేకపోవడం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.

వివిధ రకాలుగా అనాథలుగా మారుతున్న వారి సంక్షేమం, ఆరోగ్యం, చదువు అందించి ప్రయోజకులుగా మార్చే ఉద్దేశ్యంతోనే ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ అనాథల దినోత్సవం జరుపు కుంటున్నాం. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆధిపత్య ధోరణి విడనాడాలి. అంతర్జాతీయ సంస్థలు పారదర్శకంగా పనిచేయాలి. అసమానతలు, వివక్షతల నిర్మూలనకు కృషి చేయాలి. ధనిక, పేద ప్రజల మధ్య అంతరం తగ్గించాలి. జాతి, లింగ వివక్షతను తొలగించాలి. ఆర్థిక, సామాజిక అంతరాలు తగ్గించాలి. విద్య అందరికీ సమానంగా అందించాలి. సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రపంచ దేశాలు పయనించాలి.ముఖ్యంగా అనాథలను వివక్షతో చూడరాదు. మానసికంగా శారీరకంగా హింసించ రాదు. లైంగిక వేధింపులు చేయరాదు. వీరికి చదువు, సంస్కారం నేర్పాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. వలసలను అరికట్టాలి. అనాథలను అన్ని రకాలుగా అభివృద్ధి పరచి, మంచి పౌరులుగా తీర్చిదిద్దటమే ఈ యుద్ధ అనాథల దినోత్సవ పరమార్థం.

– ఐ. ప్రసాదరావు,సెల్‌ : 6305682733

➡️