మోసపు పత్రం

Apr 16,2024 06:12 #artical, #edit page, #PM Modi

‘సంకల్ప్‌ పత్ర’ పేరిట ప్రధాని మోడీ ఆదివారం విడుదల చేసిన బిజెపి 2024- ఎన్నికల మేనిఫెస్టో మరో మోసపు పత్రం అనిపించుకుంది. రెండు తడవలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొడతామంటున్న పార్టీ అబద్ధపు ప్రచారంతో, వాగాడంబరంతో ఎన్నికల ప్రణాళిక రచించి ప్రజలను నమ్మమనడం బిజెపికే చెల్లింది. కొత్తగా అధికారంలోకి రావడం కోసం హామీలివ్వడం వేరు, దశాబ్దకాలం పాలించి హామీలివ్వడం వేరు. ఎక్కడేగాని మేనిఫెస్టో విడుదల చేసే ముందు గత హామీల అమలుపై సమీక్ష ఉండటం కద్దు. ఏం చెప్పాం ఏం చేశాం అని ప్రజలకు స్పష్టం చేయాలి. చేయలేనివి ఎందుకు చేయలేకపోయామో ఎదురైన అటంకాలేమిటో వివరించడం పార్టీల బాధ్యత. కానీ బిజెపి ఆ కనీస ధర్మాన్ని కూడా పాటించలేదు. చెప్పటమే తప్ప చేసిందేమిటో వెల్లడించడానికి కించిత్తు సిద్ధపడలేదని తాజా మేనిఫెస్టోను చూస్తే తెలుస్తుంది. ఇది ఒక విధంగా వన్‌సైడ్‌ వార్‌ వంటింది. మోడీ ప్రభుత్వ పచ్చి మోసాన్ని తెలపడానికి రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) హామీ ఒక్కటి సరిపోతుంది. తాము అధికారంలోకొస్తే స్వామినాథన్‌ సిఫారసుల మేరకు రైతులు పంట పండించడానికి చేసే మొత్తం వ్యయానికి యాభై శాతం కలిపి ధర (సి2 ప్లస్‌ 50 శాతం) నిర్ణయిస్తామన్నారు. పదేళ్లల్లో ఆ హామీ అమలుకు నోచుకోలేదు. అమలు చేయలేమంటూ సుప్రీం కోర్టుకు లిఖితపూర్వక అఫిడవిట్‌ ఇచ్చింది బిజెపి సర్కార్‌. ఇలాగేనా రైతుల ఆదాయాలు రెట్టింపు చేసేది? రైతుల సంక్షేమానికి పూచీ పడ్డమంటే ఇదా?
పధ్నాలుగంశాల తమ మేనిఫెస్టో పేదలు, రైతులు, యువత, మహిళలు.. అనే నాలుగు స్తంభాలపై తయారైందన్నారు మోడీ. దేశంలో చిన్న, సన్నకారు, కౌలు రైతులు అత్యధికంగా ఉండగా, వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తుల గుప్పెట్లోకి నెట్టడానికి మోడీ సర్కారు తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిపాటు జరిగిన రైతు ఉద్యమాన్ని అణచివేసిన తీరు దేశం కళ్లారా చూసింది. చేసేది లేక మోడీ సర్కారు చట్టాలనూ ఉపసం హరించుకుంది. ఆ సందర్భంగా జరిగిన చర్చల్లోనే ఎంఎస్‌పికి చట్ట బద్ధత అంశాన్ని సర్కారు అంగీకరించి కూడా ఎగనామం పెట్టింది. ఈ పదేళ్లల్లో రైతుల ఆత్మహత్యలు లక్షల్లో జరిగాయి. సాగు రంగం సంక్షోభంలోకి నెట్టబడ్డాక, వ్యవసాయ దేశమైన భారత్‌లో పేదరికం ఎలా తగ్గుతుంది? ఉపాధి హామీకి నిధులు తగ్గించి, సాగులో భారీ యంత్రాలు, డ్రోన్ల వంటి వాటిని ప్రవేశపెట్టాక, కార్పొరేట్‌, కంపెనీ సేద్యాన్ని విస్తరింపజేశాక మోడీ పలికే రైతు అనే స్తంభానికి అర్థమే లేదు.
పదేళ్లనాడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలన్న బిజెపి హామీ నెరవేరలేదు. ఆ అంశం ప్రస్తావన సైతం తాజా మేనిఫెస్టోలో కనిపించలేదు. స్టార్టప్‌లు, ఈజ్‌ఆఫ్‌ డూయింబ్‌ బిజినెస్‌, మేక్‌ ఇన్‌ ఇండియా, గ్లోబల్‌ మ్యానిఫ్యాక్చర్‌ హబ్‌, డిజిటల్‌ ఇండియా, ఇత్యాది డైలాగులు మాత్రం వల్లె వేశారు. మోడీ జమానాలో పేదల బతుకుల సంగతి చెప్పనవసరం లేదు. అధిక ధరలు వారి ఉసురు తీస్తున్నాయి. నారీశక్తి గుర్తించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ముద్ర, డ్వాక్రా రుణాల వంటివి నామ్‌కేవాస్తే. మహిళలను లక్షాధికార్లు చేస్తామనడం దగా. మనువాదం, సనాతన ధర్మం పరిరక్షణ అంటున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు మహిళలను, దళితులను, నిమ్న కులాలను చీడపురుగులకంటే హీనంగా చూస్తాయి. ఆ తరగతుల అభివృద్ధి, సామాజిక న్యాయం అనే పదాలు ఒట్టి బూటకం. పదేళ్లల్లో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగాయి. మత విద్వేషాలతో సమాజం చీలింది. లౌకిక ప్రజాస్వామ్యం, చివరికి రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. అభివృద్ధి చెందింది ప్రజలు కాదు, వేళ్లపై లెక్కించే అంబానీ, అదానీ వంటి వారు. ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఇటువంటి వారు ఏటికేడు పెరుతున్నారు. ప్రజలేమో చితికిపోతున్నారు. ప్రైవేట్‌ చేతుల్లో బుల్లెట్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇతర మౌలిక ప్రాజెక్టులు నయాఉదారవాద విధానాల్లో భాగం. వాటినే బిజెపి తన మేనిఫెస్టోలో పుణికిపుచ్చుకుంది. ఉచిత రేషన్‌, ఉయుష్మాన్‌ భారత్‌, మూడు కోట్ల ఇళ్లు, పెట్రోల్‌ ఛార్జీల తగ్గింపు వంటివి పైపూతలే. నేడు బిజెపి లంకించుకున్న ‘వికసిత్‌ భారత్‌’ నినాదం, నాడు వాజ్‌పేయి హయాంలో ఎత్తుకున్న ‘ఇండియా వెలిగిపోతోంది’కి ఏమాత్రం తీసిపోదు. అప్పటి పరిస్థితులే బిజెపికి ఇప్పుడూ ఎదురుకాకపోవు!

➡️