Parliament session : నీట్‌ స్కామ్‌పై చర్చ జరపాల్సిందే.. పట్టుబట్టిన ప్రతిపక్షాలు

ససేమిరా అన్న మోడీ సర్కారు
రాహుల్‌గాంధీ మాట్లాడుతుండగా మైక్‌ కట్‌
ఉభయ సభలు సోమవారానికి వాయిదా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :నీట్‌ కుంభకోణం శుక్రవారం పార్లమెంట్‌ ఉభయసభలను కుదిపేసింది. నీట్‌లో అకమాలపై చర్చకు అనుమతించాలని కోరుతూ ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులను తిరస్కరించడంతో లోక్‌సభలోను, రాజ్యసభలోను గందరగోళం నెలకొంది. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మొదట లోక్‌సభలో అన్ని కార్యక్రమాలను వాయిదా వేసి నీట్‌ స్కామ్‌పై ప్రత్యేకించి చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించారు. యువతను ఎంతగానో ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశంపై ప్రధాని సమక్షంలో చర్చించాలని రాహుల్‌ గాంధీ కోరారు. స్పీకర్‌ ఓం బిర్లా అందుకు తిరస్కరించడంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. . మధ్యాహ్నం 12 గంటల వరకు మొదట వాయిదా వేశారు. ఆ తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో నీట్‌ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతూ నినాదాలు చేశాయి. పేపర్‌ లీకేజీపై ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే విమర్శలు చేశారు. చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. అయినప్పటికీ చైర్మన్‌ ధన్‌ఖర్‌ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టారు. సభ్యులు ఆందోళన కొనసాగిస్తుండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
రాహుల్‌ మాట్లాడుతుండగా మైక్‌ కట్‌
నీట్‌ పరీక్ష నిర్వహణలో అవకతవకలఅంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలంటూ కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతుండగా మైక్‌ కట్‌ చేశారు. ఇది నీట్‌ విద్యార్థుల గొంతు నొక్కడమేనని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. సభ్యుల మైక్రో ఫోన్‌ను తాను నియంత్రించ లేదని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు.
నీట్‌ వ్యవహారంలో ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ ఎంపి మనీష్‌ తివారీ తప్పుపట్టారు. నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజ్‌తో లక్షలాది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ప్రతిపక్ష ఇండియా ఫోరం సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారని, తాను క్రిమినల్‌ చట్టాల అమలు నిలిపివేయాలని కోరుతూ నోటీస్‌ ఇచ్చానని మనీష్‌ తివారీ పేర్కొన్నారు. వీటిపై చర్చ జరగకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ఇక దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్‌తో యువత భవిష్యత్‌ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపి దీపిందర్‌ సింగ్‌ హుడా ఆందోళన వ్యక్తం చేశారు.
స్పృహతప్పిపడిపోయిన కాంగ్రెస్‌ ఎంపి
నీట్‌ పరీక్షలో అవకతవకలపై ప్రతిపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఛత్తీస్‌గఢ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు ఫూలో దేవి నేతమ్‌ శుక్రవారం ఉదయం స్పృహతప్పి పడిపోయారు. ఆమెను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

➡️