‘నమో’ పాలనలో ‘చందా ఇవ్వు- దందా చేస్కో’

ఎలక్టోరల్‌ బాండ్ల పేరుతో దేశంలో ఎవరూ ఎప్పుడూ పాల్పడనంత అవినీతికి బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాల్పడుతున్నదీ? అంటే ఎన్నికల సమయంలో విపక్షాన్ని ఆర్థికంగా కట్టడి చేసి, తాము మాత్రం విచ్చలవిడిగా దోచుకోవడానికే కదా? అంతా దేశ ప్రజలు గమనిస్తున్నారు.
ఎన్నికల బాండ్ల రహస్యం బయట పడగూడదని బిజెపి-కేంద్ర ప్రభుత్వం ముందుగా ఎస్‌బిఐని కట్టడి చేసింది. ఏదేమైనా తమ పార్టీకి ఎంత చందా వచ్చిందో. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో బయటికి రాగూడదని జాగ్రత్తలు తీసుకుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ప్రభుత్వానికి వంత పాడుతూ సుప్రీంకోర్టుకు అనేకసార్లు అబద్ధాలు చెప్పింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు తాము ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆ విషయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి, వెంటనే అందించాలని ఒత్తిడి చేసిన మీదట విధిలేక అందించింది. ఆ సంచలన వార్తను తగ్గించడానికి-కేంద్రం, పౌరసత్వ చట్టాన్ని (సిఎఎ) అమలు చేస్తున్నామని ఉన్న ఫళాన ప్రకటించింది. ఇటు ఎస్‌బిఐ యూనిక్‌ సీరియల్‌ నెంబర్‌తో సహా ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు సుప్రీంకోర్టుకు అందించేసరికి కేంద్రానికి ఏం చేయాలో పాలుపోక లిక్కర్‌ స్కాం పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను, తెలంగాణ బిఆర్‌ఎస్‌ నేత కవితను ఆగమేఘాల మీద అరెస్ట్‌ చేశారు. బాగానే ఉంది నాటకం-కానీ, ఢిల్లీ ఆప్‌ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఇద్దరిని సంవత్సరం నుండి జైల్లో ఉంచి కూడా ఏమీ నిరూపించలేకపోయారే-అంటే తమ అసమర్థతని తామే ప్రకటించుకున్నట్టే కదా?
ఏప్రిల్‌ 2019 నుండి 2024 మధ్య రూ.12,156 కోట్ల రూపాయలు ఎన్నికల చందా 26 రాజకీయ పార్టీలకు అందింది. ఇందులో ఆరు వేల అరవై కోట్ల అత్యధిక మొత్తం బిజెపి పార్టీ ఖాతాలోకి వెళ్ళింది. అంటే సుమారు 48 శాతం. దీని అర్ధం ఏమిటీ? మిగతా 25 రాజకీయ పార్టీలకు అందిన చందా మొత్తం కంటే, ఒక్క బిజెపికి అందిన చందాయే ఎన్నో రెట్లు అధికం! బిజెపికి అధిక మొత్తంలో చందాలిచ్చిన పది కంపనీలు ఈ విధంగా ఉన్నాయి. 1. మేఘా ఇంజనీరింగ్‌ చాలా ఎక్కువ మొత్తంలో బిజెపికి చందా ఇచ్చింది. 2. ఆ తరువాత రిలయెన్స్‌ గ్రూపు ఇచ్చిన చందా 375 కోట్లు. 3. మూడవ స్థానంలో వేదాంత గ్రూపు వస్తుంది. ఇది రూ.226 కోట్లు ఇచ్చింది. 4. నాలుగో స్థానంలో ఎయిర్‌టెల్‌ ఉంది. ఇది 197 కోట్లు ఇచ్చింది. 5. మదన్‌లాల్‌ లిమిటెడ్‌ రూ.175 కోట్లు 6. కెవేటర్‌ ఫుడ్‌ పార్క్‌ రూ.144 కోట్లు 7. డి.ఎల్‌.ఎఫ్‌ రూ.130 కోట్లు 8. బిర్లా కార్బన్‌ రూ.105 కోట్లు 9. ఫ్యూచర్‌ గేమింగ్‌ రూ.100 కోట్లు 10. హల్దియా ఎనర్జీ రూ.81 కోట్లు ఎలక్షన్‌ చందాలిచ్చాయి. ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బిజెపికి అత్యధికంగా చందాలిచ్చిన కంపెనీల వివరాలు ఇవి- ఇంకా తక్కువ మొత్తంలో చందాలిచ్చిన కంపెనీలు అనేకం ఉన్నాయి. ఈ వివరాలు కేవలం విషయం అర్థం చేసుకోవడానికే-అక్రమంగా బిజెపి ఎంతెంత చందా వసూలు చేసిందో ఎన్నెన్ని అక్రమ నిల్వలు పోగేసుకుందోననే పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం లేదు. ఎమ్మెల్యేలను కొని, యంపీలను కొని, ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చి బిజెపి ఎలా అధికారం చేపడుతూ వస్తుందో మనం చూస్తున్నాం. అలా కొనగలగడానికి ఆ పార్టీకి అంత డబ్బు ఎలా వస్తుందో ఇప్పుడీ ఎలక్టోరల్‌ బాండ్లతో కొంత వెలుగులోకి వచ్చింది. ఇంకా బయట పడని అవినీతి ఎంత వుందో చూడాలి!
అయితే మనం ఇక్కడ ఒక్క విషయం అర్ధం చేసుకోవాలి! ముఖ్యంగా, ఎనర్జీ కంపెనీలు రాజకీయ పార్టీల ఖజానా నింపుతున్నాయి. ఎనర్జీ సెక్టార్‌కు సంబంధించిన కంపెనీలు అమ్ముడైన ఎలక్టోరల్‌ బాండ్లలో ముప్పయి శాతం అంటే సుమారు రూ.3600 కోట్లు ఎన్నికల బాండ్ల కింద చందా సమర్పించుకున్నాయి. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో చందాలివ్వాల్సి వస్తే, ఇక అసలు దేశంలో వ్యాపార రంగం నిలదొక్కుకోగలదా? ఇంకా కొత్త కొత్త పరిశ్రమలు రావడానికి అసలు అవకాశం ఉందా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. డిఎల్‌ఎఫ్‌ పై జనవరి 2019లో సిబిఐ దాడి జరిగింది. వెంటనే ఆ కంపెనీ రూ.130 కోట్లు ఎన్నికల చందా ఇచ్చింది. అలాగే మార్చి 2020లో హల్దియా లిమిటెడ్‌ పై ఇ.డి సోదాలు ప్రారంభించింది. వెంటనే ఆ కంపెనీ బిజెపికి రూ.82 కోట్ల రూపాయల చందా ఇచ్చింది. ఇలా కంపెనీలు పెద్ద మొత్తంలో ఎందుకు చందాలిస్తున్నాయీ? అనేది అర్థం చేసుకోవాలి. పర్యావరణానికి హాని కలుగజేసే పనులు చేయడానికి, నల్లడబ్బును తెల్లగా మార్చుకోవడానికి, ఇంకా ఇతరత్రా అవినీతి పనులు చేసుకోవడానికి అధికారంలో ఉన్న బిజెపికి చందాలిస్తున్నాయి. అంటే ఆ పార్టీ, ఆ ప్రభుత్వం…వారి కార్యక్రమాల్ని చూసీచూడనట్టు వదిలేయాలి. దీన్నే క్విడ్‌-ప్రో-కో అంటే మళ్ళీ మన దేశ నాయకుల భుజాలు తడుముకుంటారు. దౌర్జన్యంగా ఎదురు దాడికి దిగుతారు.
కంపెనీలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా కొందరు ఎలక్టోరల్‌ బాండ్లు కొని బిజెపికి ఎన్నికల చందా సమర్పిచుకున్నారు. ఇలాంటి వారిలో మిత్తల్‌ సుమారు రూ.35 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లు కొని ఆ మొత్తం బిజెపికి సమర్పించుకున్నాడు. ఎలక్ట్రికల్‌ వైర్‌, కేబుల్‌ తయారుచేసే పాలికేబ్‌ గ్రూపు మేనేజింగ్‌ డైరెక్టర్‌-ప్రసిడెంటూ అయిన ఇంద్ర ఠాకూర్‌ దాస్‌ జరు సింఘానీ సుమారు రూ.14 కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు కొని మొత్తం డబ్బు బిజెపి పార్టీ ఖాతాలో జమ చేశాడు. ఈ రకంగా ఇంకా ఎంతోమంది వ్యక్తిగతంగా దానాలు చేశారు. వీరంతా బిజెపి బెదిరింపులకు భయపడి, తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి మాత్రమే ఇచ్చారు. బిజెపి-ఆరెస్సెస్‌ ఆలోచనా విధానానికి ఆకర్షితులై స్వచ్ఛందంగా ఇచ్చినవారు ఒక్కరంటే ఒక్కరు లేరు- ఫ్యూచర్‌ గేమింగ్‌ హోటల్‌ సర్వీసెస్‌ కంపెనీ ఒక సంవత్సరంలో తమకు వచ్చిన లాభాల కంటే-ఆరు రెట్లు అధిక మొత్తం రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చింది. ఎందుకు ఈ కంపెనీ అధికారంలో వున్న రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో చందాలిస్తోందో అర్థం చేసుకోవాలంటే లాటరీల గురించి కూడా ఇక్కడ కొంత తెలుసుకోవాలి! ఈ లాటరీ విధానం దేశంలో సుమారు పదమూడు రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. లాటరీలో భాగస్వాములు కాదలచిన వారు కొంత మొత్తానికి లాటరీ టికెట్లు కొంటారు. అలా పెద్ద మొత్తంలో డబ్బు పోగవుతుంది. అందులోంచి బహుమతి వచ్చిన వారికి బహుమతిగా కొంత డబ్బు ఇస్తారు. మనకు ఇంత వరకే తెలుసు కానీ, లాటరీ నిర్వాహకులు స్థానిక ప్రభుత్వాలకు ట్యాక్స్‌లు చెల్లించాలి. 1998 నాటి లాటరీ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి ఆ స్కీమ్‌ను అజమాయిషీ చేస్తాయి. ప్రభుత్వం తమ పట్ల కొంత ఉదార స్వభావంతో ఉండాలని, ప్రభుత్వాలను మంచి చేసుకోవడానికి ఇలాంటి లాటరీ కంపెనీలు ప్రభుత్వానికి చందాలిస్తుంటాయి. ఇప్పటి బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా అదే-‘చందా ఇవ్వు-దందా చేస్కో’.
ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త అరవిందో ఫార్మా శరత్‌ రెడ్డి అరెస్ట్‌ అయిన తర్వాత బిజెపికి రూ.5 కోట్ల చందా ఇచ్చాడు. ఎందుకిచ్చాడూ? ప్రభుత్వం తన పట్ల కఠినంగా ప్రవర్తించగూడదనే కదా? ఇక కేజ్రీవాల్‌ అరెస్ట్‌ విషయానికి వస్తే-ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా నిరసించాయి. ఒక్క తాటిపైకి వచ్చి నినదిస్తున్నాయి. మరోవైపు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్యం కనిపించడం లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రజలకు విశ్వాసం కలిగించాలి. ఇప్పుడు ‘మోడీ గ్యారంటీ’ అంటున్నారు. మోడీ గ్యారెంటీ అంటే ఏదీ మరి ప్రతి అకౌంట్లో రూ.15 లక్షల గ్యారెంటీ? ప్రాజెక్టుల గ్యారెంటీ? ఉద్యోగాల గ్యారంటీ? సామాన్యుడికి తిండి అందించలేకనే కదా హంగర్‌ ఇండెక్స్‌లో అట్టడుగుకు పడిపోయాం? పడిపోయిన రూపాయి విలువ పైకి లేవదెందుకూ? వీళ్ళా…గ్యారెంటీ గురించి మాట్లాడేదీ? నిబద్దత, నైతికతా లేని నాయకులు ఈ దేశానికి అక్కర లేదు. కేవలం నీతి గలవారు ప్రజాహితం కోరే వారు మాత్రమే కావాలి! పదేళ్ళుగా ఊకదంపుడు ఉపన్యాసాలు వింటూనే ఉన్నాం. కపట ప్రేమలు, విచిత్ర వేషధారణలు, నటనలు చాలు. కట్టి పెట్టండి- అని ఈ దేశపు అంతరాత్మ చెప్తోంది. స్వచ్ఛత కోసం, నిజాయితీ కోసం నిలబడే పార్టీ బిజెపి కాదని ఈ దేశ ప్రజలు నిర్ణయించుకున్నారు.
మోడీ ‘చందా మామ’ అయిపోయాడు. చందా ఇవ్వు. దందా చేస్కో అని కార్పోరేట్లకు దేశాన్ని అమ్మేస్తున్నాడు.

 వ్యాసకర్త : కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త డా|| దేవరాజు మహారాజు

➡️