హసీనా విజయం

Jan 10,2024 07:20 #Editorial

                ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద జనాభా కలిగిన బంగ్లాదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఎన్‌సి బహిష్కరణ మధ్య జరిగిన ఎన్నికల్లో అవామీలీగ్‌ వరుసగా నాలుగోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. 300 స్థానాలున్న పార్లమెంటులో 299 స్థానాలకు జనవరి 7న ఎన్నికలు నిర్వహించగా, 76 ఏళ్ల షేక్‌ హసీనా నేతృత్వంలోని లౌకిక వాద పార్టీ అవామీ లీగ్‌ 222 స్థానాలు గెలుచుకుని తన సత్తా చాటుకుంది. జతియా పార్టీ 11 సీట్లు, స్వతంత్రులు 62 సీట్లు, ఇతర పార్టీలకు 3 సీట్లు దక్కాయి. హింస, అక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలను తాము గుర్తించడం లేదని, తిరిగి తాజాగా ఎన్నికలు జరపాలని బిఎన్‌సి డిమాండ్‌ చేసింది. ఆసియాలో వ్యూహాత్మకంగా, భౌగోళికంగా కీలకమైన 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్‌ను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్‌ కూడా ఇదే పాట పాడుతున్నాయి. బంగ్లాదేశ్‌ ఎన్నికల కమిషన్‌ దీనిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిగాయని, ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల రోజున చేపట్టిన దేశవ్యాపిత సమ్మె పిలుపును లెక్కచేయకుండా 40శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం గొప్ప విషయమని పేర్కొంది. హసీనా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. మత ఛాందసవాద శక్తులతో కూడిన బంగ్లా నేషనల్‌ పార్టీ (బిఎన్‌పి) అధినేత, రెండు సార్లు ప్రధాని బేగం ఖలీదా జియా అవినీతి కేసులో శిక్ష, అనారోగ్యంతో ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆమె కుమారుడు బిఎన్‌సి చైర్మన్‌ లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు. 2018లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బిఎన్‌సి పాల్గొని ఘోర పరాజయం చవిచూసింది. 80 శాతం దాకా ఓట్లు పోలైన ఆ ఎన్నికల్లో అవామీలీగ్‌ అసాధారణమైన రీతిలో 288 స్థానాలను గెలుచుకోగా, బిఎన్‌పికి కేవలం అయిదు సీట్లు మాత్రమే దక్కాయి. 2014 ఎన్నికలను బిఎన్‌పి ఇప్పుడు మాదిరిగానే బహిష్కరించింది. ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమ న్యాయం జరిగేలా చూసేందుకు 1991, 1996, 2001, 2008లో మాదిరిగా తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని, జైలులో ఉన్న బిఎన్‌పి నాయకులను, కార్యకర్తలను విడుదల జేయాలని బిఎన్‌పి డిమాండ్‌ చేసింది. దీనిని హసీనా ప్రభుత్వం తిరస్కరించడంతో 2014లో ఎన్నికలను బహిష్కరించింది. ఇప్పుడు అదే సాకుతో ఎన్నికలను బహిష్కరించింది. అంతర్జాతీయ, అంతర్గత కుట్రలు, కుతంత్రాలతో నలిగిపోయిన బంగ్లాదేశ్‌లో గత పదిహేనేళ్లుగా రాజకీయ సుస్థిరతను చేకూర్చడంలో బంగ బంధు షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ కుమార్తె హసీనా కొంతమేర కృతకృత్యులయ్యారు. అమెరికా, బ్రిటన్‌ వంటి పశ్చిమ దేశాల కుట్రలను తట్టుకుంటూ, భారత్‌, నేపాల్‌, భూటాన్‌లతోను, సోషలిస్టు చైనా, వియత్నాంలతోను చక్కటి స్నేహ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. మొత్తంగా ఐదోసారి ఆమె ప్రధాని పదవిని చేపట్టనున్నారు. 1981లో ప్రవాసం నుంచి బయటకు వచ్చి అవామీలీగ్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఆమె మిలట్రీ నియంత ఎర్నాద్‌కు వ్యతిరేకంగా ఖలీదాజియాతో కలిసి ఆందోళనలు నిర్వహించారు. 1996-2001 మధ్య తొలిసారి ప్రధాని పదవిని అధిష్టించారు. 2008 నుంచి అవామీలీగ్‌ జైత్రయాత్ర సాగుతోంది. మత తీవ్రవాదులను అణచివేసిన నేతగా హసీనా పేరు తెచ్చుకున్నారు. 1971 యుద్ధ నేరాల కేసుల విచారణకు ఆమె 2009లో ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. మానవాభివృద్ధి సూచిలో భారత్‌ కన్నా మెరుగైన స్థితిలో బంగ్లాదేశ్‌ నిలిచిందంటే ఆ ఘనత హసీనాకే దక్కుతుంది.

హసీనా తొలిసారి అధికారంలోకి వచ్చిన రోజుల్లో ఉన్న కరెంటు కోతలు ఇప్పుడు లేవు. కోవిడ్‌ తరువాత ఆర్థిక వ్యవస్థ కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. చైనాకు వ్యతిరేకంగా ఇండో – పసిఫిక్‌ వ్యూహం (క్వాడ్‌)లో కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఒత్తిడి తెచ్చినా తిరస్కరించారామె. మరోవైపు భారత వేర్పాటువాదులను అణచివేయడంతోపాటు ఇంధన, వాణిజ్యరంగాల్లో పరస్పర సహకారం, చట్టోగ్రామ్‌ (చిట్టగాంగ్‌) నౌకాశ్రయంతో అనుసంధానం ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకుల సరఫరా వంటి అంశాల్లో భారత్‌తో కలసి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల తరువాత దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ, ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలు కల్పించడం హసీనా సర్కార్‌ ముందున్న ప్రధాన సవాళ్లు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుని ప్రజాతంత్ర యుతంగా ముందుకు సాగాల్సిన బాధ్యత హసీనా ప్రభుత్వంపై ఉంది.

➡️