మంచు…ముప్పు

Jan 25,2024 06:42 #edite page, #POGA MANCHU

వాతావరణ సంక్షోభం తీవ్రంగా ముంచుకొస్తున్న వేళ మంచుఖండం అంటార్కిటికా శరవేగంగా కరిగిపోతోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూమి నాలుగు కాలాలపాటు చల్లగా ఉండాలంటే అంటార్కిటికాలో పెనుమార్పులు చోటు చేసుకోకూడదని పర్యావరణ వాదులు చెబుతారు. దానికి భిన్నంగా జరిగితే మానవాళికి పెను ముప్పు తప్పదని వారు ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఆ ముప్పు ముంచుకొచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ల కాసుల కక్కుర్తి కారణంగా ఏటికేడాది పెరుగుతున్న కర్బన ఉద్గారాలు భూతాపాన్ని పెంచుతున్న సంగతి తెలిసిందే. భూమి వేడెక్కుతున్న ప్రభావం మంచుఖండంపై తీవ్రంగా పడుతోంది. శరవేగంగా మంచు కరిగిపోతోంది. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం 2023లో దాదాపు 365 రోజులు ఈ ఖండంపై మంచు కరగడం కొనసాగింది. ఈ ఖండం చుట్టూ ఉండే మంచుతో కప్పిన సముద్రప్రాంతం ఏడాది పొడవునా నిర్దేశించిన ప్రమాణాల కన్నా తక్కువగా కనపడింది. ఈ పరిణామం శాస్త్రవేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. గతంలో కూడా సముద్రపు మంచు కరిగిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఇలా దాదాపు సంవత్సరం మొత్తం ఉండవలసిన దానికన్నా తక్కువగా కనపడటం గతంలో ఎన్నడూ లేదని వారు అంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2023లో అంటార్కిటికా 1.5 మిలియన్‌ చదరపు కిలోమీటర్లకంటే ఎక్కువ మంచును కోల్పోయింది. ఇది గత కొన్ని దశాబ్దాలతో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ! 1979లో ఉపగ్రహ ఆధారిత గణన విధానం మొదలైనప్పటి నుండి ఇదే అత్యల్పమని చెబుతున్నారు. నిజానికి 2022వ సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అప్పటికి అదే అత్యధికమని శాస్త్రవేత్తలు ప్రకటించగా, 2023లో అంతకన్నా ఎక్కువగా మంచు కరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో అంటార్కిటికా ఖండపు తీర రేఖలో మూడింట రెండు వంతుల భాగం ఏమాత్రం మంచు లేకుండా కనిపించింది. అంటార్కిటికా తీర ప్రాంతం అలా కనపడటం అదే మొదటిసారి!

ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదలలో ఏమాత్రం తగ్గుదల లేకపోవడం, వాతావరణ మార్పులు కొనసాగుతుండటంతో రానున్న మరికొన్ని సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి కొనసాగే ప్రమాదం ఉంది. సమీప భవిష్యత్తులో ఈ పరిస్థితి మారే అవకాశం లేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘భూ తాపం ప్రభావం కొన్ని సంవత్సరాలుగా అంటార్కిటికాపై పడుతోంది. వాతావరణ కాలుష్యం పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ మంచు కరగడం కొనసాగుతుంది. మంచు కరుగుతున్న వేగంలోనూ మార్పు ఉండకపోవచ్చు. మార్పు ఉంటుందని అనుకోవడం అత్యాశే’ అని యూనివర్శిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ పరిణామం మానవాళికి పెనుముప్పు అని హెచ్చరించింది. అంటార్కిటికా ఖండంపై 2,54,00,000 క్యూబిక్‌ కిలోమీటర్ల మంచు ఉందని అంచనా. ఇది భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 60 శాతం, మొత్తం మంచులో 90 శాతం ఉంటుందని అంచనా. ఇంత పెద్దమొత్తంలో ఉన్న మంచుకరిగిపోతే సముద్రనీటి మట్టాలు భారీగా పెరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున సముద్ర మట్టం 70 మీటర్లు పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా. దీంతో అనేక దేశాలు ముంపు బారిన పడనున్నాయి. డెన్మార్క్‌, నెదర్‌ల్యాండ్స్‌, బంగ్లాదేశ్‌, బ్రిటన్‌, ఉరుగ్వే వంటి దేశాలు భారీగా నష్టపోతాయి. చిన్న ద్వీప దేశాల ఉనికి లేకుండా పోతోంది. మన దేశంలోనూ కోల్‌కతా, చెన్నై వంటి నగరాలు ముంపు బారిన పడనున్నాయి. మన రాష్ట్రంలోనూ అన్ని తీరప్రాంత నగరాలు, పట్టణాలకు అదే దుస్థితి దాపురించే ప్రమాదం ఉంది. మన దేశం చుట్టూ ఉన్న సముద్రాల నీటిమట్టం 20 నుండి 30 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సముద్రాల వాతావరణం గణనీయంగా మారుతుందని, ఫలితంగా రుతుపవనాల్లో కూడా భారీ మార్పులు వస్తాయని అంటున్నారు. అయితే, అంటార్కిటికాపై ఉన్న మంచు కనీసం కొన్ని దశాబ్దాలపాటు పూర్తి స్థాయిలో కరగదని శాస్త్రవేత్తలు చెబుతుండటమే కొంత ఊరట. ఏమైనప్పటికీ అట్టహాసంగా నిర్వహించే వాతావరణ సదస్సులు పేరు గొప్ప, ఊరు దిబ్బగా మారకుండా ఐక్యరాజ్యసమితి తగిన చర్యలు తీసుకోవాలి. వాతావరణాన్ని ధ్వంసం చేసే ధనిక దేశాల విచ్చలవిడి చర్యలకు కళ్లెం వేయాలి. అప్పుడే అంటార్కిటికాతో పాటూ భూ గోళాన్ని కాపాడుకోగలం.

➡️