Food: ఆహార కల్తీతో అనారోగ్యం

కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బ తింటోంది. కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. రోడ్డు పక్కన ఆహారాలు సాధ్యమైనంత వరకూ తినకపోవడమే మంచిది.
దేశంలో రోజు రోజుకూ ఆహార కల్తీ ఎక్కువ అయిపోతుంది. ఏది కొనాలన్నా తినాలన్నా భయపడే రోజులు వచ్చాయి. తమ వ్యాపారం పెంచుకునేందుకు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. దీంతో వారి వ్యాపారమే కాదు, ఆస్పత్రులు కూడా నిండిపోతున్నాయి. టీ, కాఫీ, పాలు, పిండి, నూనెలు, మాంసం, కంది పప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం ఇలా నిత్యం వినియోగించుకునే అన్ని పదార్థాలూ కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుంది పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకులు కల్తీ చేస్తుండడం, వినియోగదారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తీస్తోంది. నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఆహార పదార్థాలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో నామమాత్రపు సొమ్మునైనా కల్తీ నియంత్రణ, నిరోధానికి ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ సరకులపై న్యాయస్థానాలు స్వయంగా కేసుల్ని స్వీకరించి, మొట్టికాయలు వేసినా, అధికార యంత్రాంగం మందగమనం వీడలేదు. కల్తీ వస్తువులను విక్రయించే వారిపై దాడులు తూతూ మంత్రమే ఆపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు కూడా కల్తీ ఆహార వస్తువులేవో, అసలువేవో తెలుసుకోవడం అవసరం. ఇందుకు ‘భారతీయ ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ’ కొన్ని చిట్కాలు సూచిస్తోంది. త్వరగా కల్తీని గుర్తించే పరీక్ష (డి.ఎ.ఆర్‌.టి) పేరున వీటిని కరదీపికలో పొందుపరిచింది. ఈ మధ్యకాలంలో చికెన్‌ లాలిపాప్‌, పకోడీలో చికెన్‌ వేస్ట్‌ (కాళ్ళు, స్కిన్‌, పేగులు) కలపడం సాధారణం. హై వే దాబాలో మాంసంలో కుళ్ళినవి పెడుతున్నారని, చికెన్‌ బిర్యానీ బదులు కుక్క బిర్యానీ పెడుతున్నారని… చాలా వార్తలు చదువుతూనే ఉన్నాం. ఒక్క మాంసమే కాదు బయట చేసే ఫాస్ట్‌ ఫుడ్స్‌ అన్నింటిలో ఆహార కల్తీ ఉంటుంది. అన్నీ కూడా ఆహారంలో కల్తీ అవుతూనే ఉంటున్నాయి. పరిమితికి మించి రంగులు వాడకం ఎక్కువగా ఉంటున్నది. రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్‌ కాఫీ, టీ స్టాళ్లలో సింథటిక్‌ పాలు వినియోగం ఎక్కువగా ఉంటున్నది. ఇక ఫాస్ట్‌ ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లలో కల్తీ నూనెలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. పానీ పూరీ చేసే ప్రాంతాలు అపరిశుభ్రంగా, పరమ భయంకరంగా వుంటాయి. ఫ్రూట్‌ సలాడ్‌, ఐస్‌ క్రీమ్‌, ఐస్‌, నూడుల్స్‌ తయారు చేసే ప్రదేశాలలో శుచి, శుభ్రత పాటించక అవి తిన్న వారు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రతి రోజూ తనిఖీ చేయాలి. తయారీ కేంద్రాలను పరిశీలించాలి. ఎక్కువ మోతాదులో రంగుల వాడకాన్ని, కల్తీ పాల వాడకాన్ని నియంత్రించి తగిన చర్యలు తీసుకోవాలి. మన చేతిలో లేని పరిష్కారాల విషయానికి వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. లేకపోతే వ్యవసాయం చేసే సంఖ్య తగ్గి, కల్తీ ఇంకా పెరుగుతుంది. అలాగే రేట్లు ఇంకా ఇంకా పెరుగుతాయి. కల్తీ మీద ప్రచారం విస్తృతంగా పెరగాలి. వాటి వల్ల కీడు ప్రజలకు తెలియజేయాలి. అతిగా ఫెర్టిలైజర్ల వాడకం, క్యాన్సర్‌ కారణం అనే విషయాన్ని కూడా తెలియజేయాలి.
ఆరోగ్య తనిఖీ అధికారుల సంఖ్య పెరగాలి. వారి అధికారాలు పెరగాలి, కల్తీ చేసిన వారికి కఠిన శిక్షలు వుండాలి. అలాగే ప్రభుత్వం సేంద్రియ ఆహారాన్ని చౌకగా ఉండేట్లు చూడాలి. మంచి ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు వాటి వల్ల లాభాలు చెప్పి ప్రోత్సహించాలి. అప్పుడు ప్రజలు సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుంది. రేట్లు తగ్గుతాయి. ఇళ్లలో, డాబాల మీద, పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి. ఆర్గానిక్‌ కూరగాయలు, పండ్లు పెంచుకోవాలి. బియ్యం, పప్పులు, ఉప్పు, చింతపండు సంవత్సరంలో రెండు సార్లు పెద్ద మొత్తంలో కొంటే కల్తీ బారి నుండి తప్పించుకోవచ్చు.

డా. యం. సురేష్‌బాబు

➡️