ఆర్థిక వృద్ధి ఎగుమతులపై ఆధారపడితే వచ్చే చిక్కులు

Dec 12,2023 08:40 #Editorial

ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా మొత్తం మార్కెట్‌ శక్తులకే విడిచిపెడితే విదేశీ మారక నిల్వల విషయంలో ఎప్పటికైనా సమతూకం సాధించడం సాధ్యమేనా అన్నది సందేహమే. కాని అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాగానే ఆ దేశం ఐఎంఎఫ్‌ వద్దకు పోయి రుణం తీసుకుంటుంది. అప్పుడు ప్రైవేటు పెట్టుబడిదారులలో కొంత భరోసా ఏర్పడి వారి పెట్టుబడులను వెనక్కి తీసేసుకోకుండా కొనసాగిస్తారు. ఐతే తాను రుణం ఇవ్వడానికి ఐఎంఎఫ్‌ చాలా పెద్ద మూల్యం కోరుతుంది. సంక్షేమానికి చేసే ఖర్చులో కోతలు విధించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను ఎత్తివేయాలని, దేశ ఆస్తులను ప్రైవేటు, విదేశీ పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని (దీనినే విజాతీయీకరణ అని ముద్దుగా అంటారు)-ఇలాంటి షరతులను విధిస్తుంది.

             దేశ ఎగుమతులను పెంచి తద్వారా ఆర్థికవృద్ధి సాధించడం అనే వ్యూహంపై ఆర్థికవేత్తల నడుమ గత ఏభై ఏళ్ళుగా చర్చ నడుస్తూనే వుంది. తూర్పు ఆసియా ‘పులులు’ సాధించిన ‘అద్భుతాల’ను భారతదేశం వంటి నత్త నడకన వృద్ధి సాధిస్తున్న దేశాలతో పోల్చి ‘ముడుచుకు పోయే’ అభివృద్ధి వ్యూహం అనుసరించడమే మన వృద్ధి రేటు పెరగకపోవడానికి కారణం అని ప్రపంచబ్యాంక్‌ వ్యాఖ్యానించింది. ఈ మొత్తం చర్చలో వాస్తవ జీవితానికి సంబంధించి కీలక పాత్ర పోషించే ఒక విషయాన్ని మాత్రం విస్మరించారు.

ఒక ఆర్థిక వ్యవస్థలో స్థూల డిమాండ్‌లో భాగంగా ఉండే వివిధ ఖర్చులలో కొన్ని పద్దులు స్వయంప్రతిపత్తితో ఉంటాయి. తక్కిన ఖర్చులు మొత్తం డిమాండ్‌ ఏ మేరకు పెరిగితే ఆ మేరకు అవి కూడా పెరుగుతాయి. ఎగుమతులు, ప్రభుత్వ వ్యయం స్వయంప్రతిపత్తి కలిగిన ఖర్చులు (ఎగుమతుల ఖర్చు అంటే ఎగుమతి చేసే సరుకులను ఉత్పత్తి చేయడం కోసం చేసే ఖర్చు. ఇది మన దేశానికి వెలుపల ఉండే డిమాండ్‌ బట్టి ఉంటుంది తప్ప మన దేశపు డిమాండ్‌ మీద కాదు). సరుకుల వినిమయం కోసం చేసే ఖర్చు వినిమయదారుల ఆదాయాల మీద ఆధారపడి వుంటుంది. ఐతే, కొన్ని సందర్భాలలో ఆదాయాలతో నిమిత్తం లేకుండా కూడా వినిమయ ఖర్చు ఉంటుంది. ఉదాహరణకు ఇంతవరకూ వినియోగదారులకు మార్కెట్‌లో లభించని ఏదైనా వస్తువు ఇప్పుడు మార్కెట్‌లో ఒక్కసారి లభిస్తూ వుంటే, దానిని కొనుగోలు చేయడానికి అందరూ సిద్ధపడతారు.

ఒక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌లో వృద్ధి, దానితోబాటు ఉత్పత్తిలో వృద్ధి స్వయంప్రతిపత్తి ఉన్న ఖర్చుల పెరుగుదల మీద ఆధారపడి వుంటుంది. నయా ఉదారవాద విధానాలను అమలు చేసే ఆర్థిక వ్యవస్థలో దేశాల ఎల్లలను అధిగమించి ద్రవ్య పెట్టుబడి సంచరిస్తూ వుంటుంది. అందుచేత అది ఆ యా దేశాల ఆర్థిక వ్యవస్థల మీద అనేకరకాలుగా ఒత్తిడులు తెచ్చి తాను విధించే పరిమితులకు లోబడి వ్యవహరించాలని ఒప్పిస్తుంది. జిడిపిలో ఒకానొక పరిమితిని దాటి ద్రవ్యలోటు ఉండరాదు అన్నది అటువంటి ఒక షరతు. అప్పుడు ఆ దేశం తన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచడం కోసం చేయగల ప్రభుత్వ వ్యయాన్ని పెంచుకోడానికి చిక్కులెదురౌతాయి. సంపన్నులపై విధించే పన్నులను పెంచి తద్వారా లభించే అదనపు ఆదాయంతో ప్రభుత్వ వ్యయాన్ని పెంచుకోవచ్చు. కాని అందువలన ద్రవ్యలోటు పెరుగుతుంది. ద్రవ్యలోటు ఒకానొక పరిమితికి మించరాదన్న షరతు ఉంది కనుక సంపన్నుల మీద విధించే పన్నులను పెంచగల శక్తిని ప్రభుత్వం కోల్పోతుంది. మరి డిమాండ్‌ పెంచడానికి, తద్వారా వృద్ధిరేటు పెంచడానికి ఎగుమతులను పెంచడం వినా మరో దారి లేదు. అందుచేత నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ ఎగుమతుల వృద్ధి మీద ఆధారపడి నడిచే వ్యవస్థగా ఉంటుంది.

ఐతే నయా ఉదారవాద విధానాల చట్రానికి లోబడకుండా కూడా ప్రభుత్వం తన ఎగుమతులను పెంచి తద్వారా వృద్ధి సాధించవచ్చు. అటువంటి వృద్ధి సాధించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించి ఎగుమతులు పెరగడానికి తోడ్పడవచ్చు. చాలామంది తూర్పు ఆసియా దేశాల్లో జరిగిందిదే అని వాదిస్తారు.

ఎగుమతులను పెంచుకోవడం ద్వారా వృద్ధి సాధించడం అనే వ్యూహాన్ని అమలు చేసే దేశాల్లో రెండు రకాలు ఉంటాయి. ఆ తేడాను మనం చూడాలి. మొదటి కేసులో ఒకానొక దేశం ఒక పథకం ప్రకారం తన ఎగుమతులను పెంచుకుంటూ, విదేశీ వాణిజ్యంలో మిగులును క్రమంగా పెంచుకుంటూపోవచ్చు. తద్వారా తన విదేశీ మారక నిల్వలను పెంచుకుంటూ పోవచ్చు. ఇందుకు చైనా ఒక ప్రధాన ఉదాహరణ. అటువంటి దేశాల విషయంలో, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏవైనా ప్రతికూల మార్పులు చోటు చేసుకున్నా, వాటి ప్రభావం ఆ విదేశీ వ్యాపారం ద్వారా సమకూరిన నిల్వలు తగ్గడం వరకే పరిమితంగా ఉంటుంది. అందుచేత అటువంటి దేశాలు ఆ ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితులను తట్టుకుని తేలికగానే బైటపడగలుగుతాయి.

ఐతే, చాలా దేశాలు రెండో కోవకు చెందుతాయి. అవి నిరంతరం విదేశీ వ్యాపారంలో లోటును కలిగివుంటాయి. ఆ లోటును భర్తీ చేయడానికి ప్రైవేటు దవ్య్ర పెట్టుబడుల ప్రవాహం మీద ఆధారపడతాయి. ఒకవేళ విదేశీ మారకద్రవ్య నిల్వలలో మిగులును ఎప్పుడైనా సాధించినా, అందుకోసం అవి ప్రైవేటు రుణదాతల నుండి రుణాలు తీసుకుంటాయి. మన దేశం ఈ కోవకే చెందుతుంది. దక్షిణాసియా దేశాలన్నీ దాదాపు ఇదే కోవలో ఉంటాయి. మూడో ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా ఇదే కోవలో ఉంటాయి.

ఇటువంటి దేశాల విషయంలో విదేశీ వ్యాపార ఖాతాలో లోటు రకరకాల బాహ్య కారణాల వలన పెరగవచ్చు. కరోనా కాలంలో టూరిస్టుల రాక తగ్గిపోయినందువలన శ్రీలంకలో విదేశీ మారక ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా దిగుమతుల ధరలు పెరిగి పోవడం, ప్రపంచవ్యాప్త మాంద్యం కారణంగా ఎగుమతులకు ధరలు పడిపోవడం జరిగి బంగ్లాదేశ్‌ చిక్కుల్లో పడింది. అటువంటప్పుడు ఆ దేశానికి పెట్టుబడులను పంపించేవారు, ముఖ్యంగా రుణదాతలు వెనుకాడతారు. దాని వలన ఆ దేశపు చిక్కులు మరింత ఎక్కువ అవుతాయి. విదేశీ వ్యాపార లోటు మరింత పెరిగిపోతుంది. అప్పుడు దేశంలో ఉన్న ఆ కాస్త విదేశీ పెట్టుబడులు కూడా బైటకు ప్రవహించనారంభిస్తాయి.

పెట్టుబడులు పెట్టిన, లేదా రుణాలు ఇచ్చిన ప్రైవేటు పెట్టుబడిదారులు విదేశీ వ్యాపార లోటు పెరుగుతూంటే దాని వలన మన దేశ కరెన్సీ విలువ తగ్గుతుంది అని అంచనా వేస్తారు. అప్పుడు వారి పెట్టుబడులకు లభించే ప్రతిఫలం విలువ తగ్గిపోతుంది. అందుచేత తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటారు. అందువల్ల విదేశీ మారక ద్రవ్య లభ్యత మరింత పెద్ద సమస్యగా అయిపోతుంది. ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా మొత్తం మార్కెట్‌ శక్తులకే విడిచిపెడితే విదేశీ మారక నిల్వల విషయంలో ఎప్పటికైనా సమతూకం సాధించడం సాధ్యమేనా అన్నది సందేహమే. కాని అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాగానే ఆ దేశం ఐఎంఎఫ్‌ వద్దకు పోయి రుణం తీసుకుంటుంది. అప్పుడు ప్రైవేటు పెట్టుబడిదారులలో కొంత భరోసా ఏర్పడి వారి పెట్టుబడులను వెనక్కి తీసేసుకోకుండా కొనసాగిస్తారు. ఐతే తాను రుణం ఇవ్వడానికి ఐఎంఎఫ్‌ చాలా పెద్ద మూల్యం కోరుతుంది. సంక్షేమానికి చేసే ఖర్చులో కోతలు విధించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను ఎత్తివేయాలని, దేశ ఆస్తులను ప్రైవేటు, విదేశీ పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని (దీనినే విజాతీయీకరణ అని ముద్దుగా అంటారు)-ఇలాంటి షరతులను విధిస్తుంది.

విదేశీ మారక నిల్వలలో లోటు పెరగగానే ప్రైవేటు మదుపుదారులు హడావుడి పడిపోయి తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవడం వలన ఆ లోటు భారీగా పెరిగిపోవడం అనేది ఒక స్వల్పకాల వ్యవధిలో జరిగే పరిణామం. ఆ దెబ్బకి దేశం ఐఎంఎఫ్‌ ఉక్కు పిడికిలి లోకి వెళ్ళిపోతుంది. అంతవరకూ ‘అద్భుతాలను’ చూపించిన దేశాలు కాస్తా ఒక్కసారి ‘బిచ్చగాళ్ళు’గా దిగజారిపోయినది ఇందుకే. కేవలం ఎగుమతులపైనే ఆధారపడి ఆర్థికవృద్ధి సాధించాలనే వ్యూహంతో ఎదురయ్యే చిక్కులు ఇవే. ఒకసారి ఆ వ్యూహంతో మన దేశం గనుక అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి దురాశాపూరిత కాంక్షల వలలో పడితే ఇక మన గతి అంతే.

ఈ పరిస్థితి మన ఇరుగు పొరుగు దేశాలలో తలెత్తడం మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్‌, శ్రీలంక ఒకానొక దశలో మానవాభివృద్ధి సూచికలలో మనతో పోల్చుకున్నప్పుడు చాలా పురోగతిని కనపరిచాయి. కాని ఇప్పుడు ‘బిచ్చగాళ్ళ’ స్థితికి వచ్చాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కొనసాగుతున్నప్పుడు పలు మూడవ ప్రపంచ దేశాల ఎగుమతులు దెబ్బ తింటాయి. అప్పుడు ‘బిచ్చగాళ్ళు’గా దిగజారే దేశాల జాబితా పెరిగిపోతుంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ సైజు పెద్దది అయివుండొచ్చు. మన విదేశీ మారక నిల్వలు భారీగానే ఉండివుండవచ్చు (నిజానికి ఆ నిల్వలలో ఎక్కువ భాగం విదేశీ వ్యాపారంలోని మిగులు వలన ఏర్పడినవి కావు, ప్రైవేటు పెట్టుబడులు, రుణాల ద్వారా ఏర్పడినవే). అయినా, మన దేశం ఈ ప్రమాదానికి అతీతం ఏమీ కాదు. ఒకే ఒక్క ఊరట కలిగించే అంశం ఏమంటే మన ఆహార ధాన్య నిల్వల స్వయంసమృద్ధి (అది కూడా తలసరి వినియోగం పడిపోయినందువలన). ఇక ప్రస్తుత అంతర్జాతీయ సంబంధాల నేపథ్యంలో ఒకవైపు ఆంక్షలు ఉన్నా మనని రష్యా వంటి ఆంక్షలకు గురైన దేశాల నుండి దిగుమతులు తెచ్చుకోడానికి సామ్రాజ్యవాదులు అభ్యంతరాలు పెట్టడం లేదు. నిజానికి రైతులు గనుక మోడీ నల్ల వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టనట్లైతే, మన ఆహార స్వయం సమృద్ధి కాస్తా ముప్పులో పడివుండేది. ఆ ముప్పు మన దేశానికి తప్పించినందుకు మనం ఆ రైతులకు ధన్యవాదాలు చెప్పాలి.

ఒక దేశం నుండి ద్రవ్య పెట్టుబడులు బైటకు పోడానికి ఒక్క అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులే కారణం కానక్కరలేదు. ఒక దేశంలో పాలక పార్టీ ఓడిపోయి మరొకటి వచ్చిందనుకోండి. లేదా ఒక దేశంలోని మంత్రివర్గ పొందిక మారిందనుకోండి. అటువంటి సందర్భాలు కూడా ఒక్కోసారి ద్రవ్య పెట్టుబడులు బైటకు పోవడానికి కారణం అవుతాయి. అటువంటిది జరిగినప్పుడు ఆ దేశపు కరెన్సీ మారక విలువ తగ్గిపోతుంది. దానితో ఆ ప్రైవేటు పెట్టుబడులు మరింత ఎక్కువగా బైటకు పోతాయి. ప్రపంచ ద్రవ్య పెట్టుబడి ప్రవాహ వలయంలోకి ఒకసారి దేశం ప్రవేశించాక ఇటువంటి ప్రమాదాలకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గురవుతుంది. ఎగుమతుల పెంపు ద్వారా వృద్ధి సాధించాలనుకుంటే ఆ వలయం లోకి ప్రవేశించకా తప్పదు, ప్రమాదాలకు గురికాకనూ తప్పదు. పోనీ దిగుమతులను తగ్గించుకుందామా అంటే, ఒకసారి అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపడ్డాక దిగుమతులను కుదించుకుంటే ఎగుమతులను పెంచే పోటీలో వెనుకబడిపోతాం.

ఇటీవల అర్జెంటీనా దేశానికి మితవాద రాజకీయవేత్త జేవియర్‌ మిల్లర్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆ దేశాన్ని తీవ్ర స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం (150 శాతం) దెబ్బ తీసింది. గత ప్రభుత్వం (పెరొన్‌ ప్రభుత్వం) ఈ తీవ్ర స్థాయి ద్రవ్యోల్బణానికి కారణం అని ప్రజలు భావించారు. మితవాద మీడియా యావత్తూ పెరొన్‌ ప్రభుత్వపు విధానాలను ఏకి పారేయడమే గాక ఆ విధానాలు వామపక్ష విధానాలయినందువల్లనే ఆ పరిస్థితి దాపురించిందంటూ ప్రచారం అందుకున్నాయి. కాని అంతకన్నా సత్యదూరమైనది ఇంకొకటి లేదు. వాస్తవానికి ఆ దుస్థితికి పెరొన్‌ ప్రభుత్వ వామపక్ష విధానాలు కారణం కాదు. అర్జెంటినా లోని బడా ధనవంతులంతా తమ పెట్టుబడులను బైటకు తరలించుకుపోవడం అసలు కారణం. అలా తరలించడంతో కరెన్సీ మారకవిలువ పడిపోయి ద్రవ్యోల్బణానికి దారి తీసింది. ఇప్పుడు మరో ప్రభుత్వం అక్కడ వచ్చింది. ఈ ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు ఐఎంఎఫ్‌ రుణం తీసుకుని దేశాన్ని నయా ఉదారవాద సంకెళ్ళతో కట్టిపడేయవచ్చు. కాని ఆ రుణం తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చినప్పుడు మళ్ళీ విదేశీ చెల్లింపుల్లో లోటు తలెత్తవచ్చునన్న ముందస్తు అంచనాతో మళ్ళీ పెట్టుబడులు బైటకు భారీగా తరలిపోతాయి. అప్పుడు చెల్లింపుల లోటు మరింత పెరుగుతుంది. ద్రవ్యోల్బణం మళ్ళీ విజృంభిస్తుంది.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో ఎగుమతులను పెంచడం ద్వారా వృద్ధి అనే వ్యూహాన్ని అమలు చేశారు. ఆ కాలంలో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి వుంది. ఆ సమయంలో మూడవ ప్రపంచ దేశాలలో దిగుమతులకు ప్రత్యామ్నాయాలను రూపొందిం చుకునే విధానాలు చేపట్టారు. దాంతో ఎగుమతును పెంచుకోవడం అనే వ్యూహం పూర్తిగా దెబ్బ తినిపోయింది. దెబ్బ తిన్న ఆ విధానమే ఇప్పుడు మళ్ళీ, మరొక ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో నయా ఉదారవాద వ్యవస్థ ద్వారా మన ముందుకు వచ్చింది. అందుచేత ఆ విధానాన్ని తిరస్కరించాలనే చర్చ కూడా ఇప్పుడు మన ఎజెండాలో చేరింది.

( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
➡️