మోడీ బిల్డప్‌నే మోయడం అవసరమా? 

Apr 7,2024 05:16 #editpage

భారత దేశంలో, పాలక వ్యవస్థలన్నీ కలసి నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వాన్ని మూడోసారి ప్రతిష్టించడానికి పథకాలు వేస్తున్నాయి. ఎన్నికలలో ఓటు వేసి గెలిపించవలసిన ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలనుకుంటున్నాయి. నిజానికి మోడీని త్రీడీలో తీసుకువచ్చిన మొదటి రోజు నుంచి ఈ వ్యూహం వుంది. ఇప్పుడు ఆయన మూడవసారి అధికారంలోకి రావడం అనివార్యమనే మోత పరమార్థం అదే. ఎలాగూ గెలిచే మోడీని ఎదుర్కోవడం వృథా అని నూరిపోయడం అందులో భాగమే. తెలుగు నాట సీనియర్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో మోడీని మోయడం అనివార్యమని నమ్ముతూ ఆ ప్రచారానికి ఊతమిస్తున్నారు. గత పదేళ్ల నుంచి మోడీకే వత్తాసునిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ కూడా బిజెపి జోలికి పోకుండా తన వంతు సహాయం అందిస్తున్నారు. ఇక తెలంగాణలో ఓటమిపాలైన మాజీ సిఎం కెసిఆర్‌ కూడా కాంగ్రెస్‌నే ఏకైక శత్రువుగా భావిస్తూ బిజెపికి పరోక్షంగా సహకరిస్తున్నారు. జాతీయ మీడియా దాదాపుగా మోడియాగా మారిపోగా తెలుగు మీడియా కూడా ప్రాంతీయంగా తమకు నచ్చిన వారికి మద్దతిస్తూ జాతీయ స్థాయిలో బిజెపికి అనుకూలమైన రాగాలే వినిపిస్తున్నది. ఏతావాతా బిజెపి హ్యాట్రిక్‌ విజయం గురించి వారికన్నా ఎక్కువగా ఈ శక్తులు ప్రచారం చేస్తున్నాయి. వామపక్షాలు గానీ, బిజెపి ఎన్‌డిఎకు వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ దండగమారి ప్రయత్నమనీ, వామపక్షాలు ఏదో సైద్ధాంతికంగా వ్యతిరేకించడం తప్ప చేయగలిగింది లేదనీ అహోరాత్రులు అపహాస్యం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలుగా పోరాడటం జరుగుతుందనే కనీస ప్రజాస్వామిక సంప్రదాయాన్ని కూడా భరించలేకపోతున్నాయి.
రాజకీయ ప్రత్యామ్నాయాల నేపథ్యమేమిటి?
నిజంగానే ఇది చాలా విడ్డూరమైన పరిస్థితి. దేశ విదేశాలలోని గుత్తాధిపతులు మోడీ రాక కోసం ఎందుకంత పరితపిస్తున్నారనేది ఆలోచించవలసిన అంశం. గతంలో కాంగ్రెస్‌ అవిచ్ఛిన్నంగా ముప్పై ఏళ్లు దేశాన్ని పాలించింది. ప్రతిపక్షాలకు చాలా తక్కువ సీట్లే వుండేవి. బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పంజాబ్‌ వంటి చోట్ల తప్ప బలమైన ప్రత్యామ్నాయ పక్షాలు, కూటములు కూడా వుండేవి కావు. అయినా ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్‌ను ఓడించేందుకు విస్తారమైన ప్రయత్నం జరిగేది. అందుకు గల అవకాశాలకు తగినట్టు వేదికలను ఏర్పాటు చేయడం జరుగుతుండేది. ఆ క్రమంలోనే 1957లో కేరళలో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నాయకత్వాన తొలి కాంగ్రెసేతర కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. 1967 నాటికి ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలచ్చాయి. 1977లో ఇందిరా గాంధీ ఎమర్జన్సీ తర్వాత ప్రతిపక్షాల ఐక్యత దాన్ని ఓడించడానికి దారితీసింది. రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ ఏర్పడిన ఈ ప్రభుత్వాలు పూర్తి కాలం సాగకుండా కేంద్రం కుట్రలు చేసింది. ప్రతిపక్షాల అనైక్యతా అందుకు దోహదం చేసింది. ఎమర్జన్సీతో ఓడిపోయిన ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి రాగలిగారు. ఆమె దారుణ హత్య తర్వాత ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ సానుభూతి వెల్లువలో చరిత్రలోనే లేనంత పెద్ద మెజారిటీతో అంటే 400 పైన స్థానాలతో ప్రధాని అయ్యారు. ఇప్పుడు పాలన చేస్తున్న బిజెపికి ఆ ఎన్నికల్లో రెండంటే రెండు సీట్లే వచ్చాయి. ఆ 1984 ఎన్నికల్లో బెంగాల్‌లో సిపిఎం, ఎ.పి లో ఎన్టీఆర్‌ నేతృత్వంలో టిడిపి మాత్రమే నిలబడగలిగాయి. అంతేగానీ పలాయన మంత్రం పాడింది లేదు. 1989లో వి.పి.సింగ్‌ ప్రభుత్వం కూడా వచ్చింది. రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత మళ్లీ పి.వి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ కాలంలోనే బిజెపి మత రాజకీయాలను అయోధ్య వంటి సమస్యలనూ పెంచుతూ శక్తి పెంచుకున్నది. 1989, 1996-97 లలో కేంద్రంలో విఫల యత్నాలు చేసి 1998లో తొలిసారి అధికారం చేపట్టగలిగింది. మారిపోయిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మద్దతు అందుకు ప్రధాన కారణమైంది. వాజ్‌పేయి పాలనా సమర్థతలో దేశం వెలిగిపోతుంది అని ప్రచారం మోగించిన కాలం కూడా మర్చిపోలేము. 2004లో మళ్లీ యుపిఎ సర్కారు ఏర్పడే వరకూ చంద్రబాబు వారికే మద్దతుగా వున్నారని మర్చిపోరాదు. వాజ్‌పేయికి స్వంతంగా మెజార్టీ లేని మాట నిజమే గాని బలపరిచే పార్టీలు చాలా వుండేవి. అయినా ఓటమిపాలు కాక తప్ప లేదు. తర్వాత మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో వామపక్షాల మద్దతుతో ఏర్పడిన యుపిఎ ప్రభుత్వం రెండు పర్యాయాలు పాలన చేసింది.
అవకాశవాదం అనర్థం
అనేక ప్రాంతీయ పార్టీల అవకాశవాదం, కాంగ్రెస్‌ బలహీనపడటం, వామపక్షాలు ప్రతికూల పరిస్థితిలో పడటం, దేశంలో పాలక వర్గాలు మతవాద మితవాద రాజకీయాలను ప్రోత్సహించడం, సరళీకరణ విధానాలు అనివార్యంగా మత మార్కెట్‌ తత్వాలను ప్రోత్సహించడం వంటి కారణాల వల్ల బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు పట్టు పెంచుకున్న మాట నిజం. దేశ విదేశీ గుత్తాధిపతులు, ఫైనాన్స్‌ పెట్టుబడి శక్తులు కూడా ఆయనకు దన్నుగా నిలిచిన మాటా నిజం. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజాస్వామిక విలువలనే బలహీనపరిచే ప్రయత్నాలు కూడా కాదనలేనివి. అయితే ఈ కారణాలన్నీ ప్రత్యామ్నాయం కోసం పోరాడవలసిన అవసరాన్ని మరింత పెంచుతాయే గాని తగ్గించవు. ఎందుకంటే వీటి అంతిమ ఫలితం మోసేది శ్రమజీవులు, సామాన్య ప్రజానీకమే. అలాంటి ప్రత్యక్ష దాడులే మనం చూస్తున్నాం. ఆ ప్రజలు అందుకు వ్యతిరేకంగా ఒక్కతాటిపై నిలవకుండా మతపరమైన విభజనలు, విద్వేషాలు పెంచడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఐక్యంగా నిలబడి పొంచివున్న ప్రమాదాన్ని ప్రతిఘటించవలసి వుంటుంది. పాలక వర్గాలు స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారతాయనే వాస్తవిక అవగాహన లేకుండా ఏదో అవకాశవాదాలతో అంచనా వేసుకోవడం ఎక్కడకు దారితీస్తుంది? ఎ.పి, తెలంగాణల లోనే ఈ తరహా ఆలోచనల పర్యవసానాలు చూస్తూనే వున్నాం. బిజెపి నిరంకుశత్వాన్ని, మతతత్వ రాజకీయాలను నికరంగా ఎదుర్కొనే బదులు ఊగిసలాటలు, లోపాయికారీ పోకడలకు పాల్పడిన ప్రతివారూ మూల్యం చెల్లించక తప్పలేదు. అయినా టిడిపి, జనసేన దాంతో జత కట్టడానికి ఉబలాటపడ్డాయి. వైసిపి అప్రకటిత మైత్రీ బంధం పాటిస్తున్నది. అయినా సరే మోడీ సర్కారు రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే వుంది. తెలంగాణలోనూ కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ల మధ్య కపట నాటకం నడిపిస్తూ తన పబ్బం గడుపుకొంటున్నది. ఈ పరిణామాల పట్ల స్పష్టమైన, కచ్చితమైన వైఖరి తీసుకోకపోతే ఆ యా పార్టీలూ రాష్ట్రాలూ కూడా నష్టపోవడం అనివార్యమవుతుంది. కాంగ్రెస్‌ నాయకత్వమే ఆ మెళకువతో అన్ని చోట్ల సరైన వైఖరి తీసుకోలేకపోతున్న తీరును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సూటిగా విమర్శించారు.
400 సీట్ల పాట, నిరంకుశత్వ బాట
ఇదంతా ఒక ఎత్తయితే అసలు మోడీ మరింత ఆధిక్యతతో అధికారానికి రావడం తథ్యమనే ప్రచారానికి ఆధారమేమిటి? టైమ్స్‌ నౌ, న్యూస్‌ 18, ఇండియా టివీ, ఇండియా టుడే ఇలా ఏవేవో సర్వేలు ఇందుకు ఆధారంగా చూపిస్తుంటారు. జాతీయ మీడియా దాంతో చేతులు కలిపే సర్వే సంస్థలూ ఇంతకన్నా భిన్నమైన అంచనాలు ఎలా ఇస్తాయి? కాకపోతే 330 నుంచి 411 వరకూ ఎన్‌డిఎకు వస్తాయని లెక్కలు చెబుతున్నారు. సర్వేలు చాలాసార్లు విఫలం కావడం చూశాం. ఒక మేరకు నిజమైనా అంచనాలకు చాలా దూరంలో నిలబడిన పరిస్థితీ చూశాం. యు.పి లో బిజెపి బ్రహ్మాండంగా వచ్చేస్తుందనీ, హిందీ రాష్ట్రాలలోనూ గుజరాత్‌లోనూ బలం పెంచుకుంటుందని చెప్పే అంచనాలపై ఆధారపడి ఈ జోస్యాలు చెబుతున్నారు. నిజానికి యు.పిలో కూడా ఎస్‌.పి, కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం అసలు వుండదని చెప్పలేము. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ కన్నా ఆర్‌జెడి నాయకత్వంలోని ‘ఇండియా’కే మెరుగైన అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లలో మొన్నటి ఎన్నికలలో బిజెపి విజయం సాధించినా కాంగ్రెస్‌ దీటుగానే ఓటు తెచ్చుకున్నది. బెంగాల్‌లో తృణమూల్‌, ఒరిస్సాలో బిజెడి ఎక్కువ స్థానాలు తెచ్చుకుంటాయనే సర్వేల సారాంశంగా వుంది. కర్ణాటకలో మాత్రం బిజెపికి ఎక్కువ స్థానాలు వస్తే తెలంగాణలోనూ ఒక మోస్తరుగా తెచ్చుకొనే అవకాశం వుంది. కేరళ తమిళనాడు, ఎ.పిలలో బిజెపి నామమాత్రం. ఎ.పిలో బిజెపితో కలవడం వల్ల టిడిపికి కూడా నష్టమనే అంచనాలూ అనేకం. తమిళనాడులో డిఎంకె కూటమి దాదాపు తుడిచి పెడితే కేరళలో యుడిఎఫ్‌, ఎల్‌డిఎఫ్‌ మధ్యనే సీట్ల విభజన వుంటుంది. మహారాష్ట్రలో పోటాపోటీగానే నడవొచ్చు. ప్రధాన రాష్ట్రాలలో పరిస్థితి ఇలా వుంటే బిజెపికి ఏదో అపూర్వమైన ఆధిక్యత వస్తుందని ఎలా చెబుతున్నారు? ఈ మధ్య కాలంలో మత రాజకీయాల నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల వరకూ ఎన్ని విషయాల్లో మోడీ ప్రభుత్వం నిరసనను ఎదుర్కొంది? నిరుద్యోగం, ధరల పెరుగుదల, రాష్ట్రాల అప్పుల భారం వంటి అంశాలు ఆందోళన కలిగించడం లేదా? ఆ ప్రభావం ఓటర్లపై వుండనే వుండదా?
బిజెపికి నిజంగా తిరుగు లేదనేట్టయితే ప్రతి సందర్భంలోనూ ఏకపక్షంగా చర్యలు తీసుకోవలసిన అవసరమేమొచ్చింది? ఈ అయిదేళ్ల కిందట నడిచిన రైతాంగ ఆందోళనను అణచి వేశామనుకుంటే మళ్లీ మొదలవలేదా? అప్పటి పౌరసత్వ సవరణ చట్టం కూడా కొత్త రూపంలో మొదలవలేదా? మీడియా నోరు నొక్కేందుకు ప్రతిపక్షాల ఖాతాలనూ కార్యకలాపాలనూ అడ్డుకునేందుకు రకరకాల అప్రజాస్వామిక చర్యలకు పాల్పడాల్సిన అవసరమేమొచ్చింది? అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ వంటి ముఖ్యమంత్రుల అరెస్టు ఏం చెబుతుంది? నిజమైన సమస్యలను పక్కదోవ పట్టించడానికి కాకపోతే కచ్చతీవు వంటి పాత అంశాలను తిరగదోడడం, చైనాతో వివాదాలను పదేపదే పైకి తేవడం, పాకిస్తాన్‌పై ఏదో చేస్తున్నట్టు బిల్డప్‌లు ఇవన్నీ ఎందుకు? ఇంత చేసినా బిజెపిలోనూ సంఘ పరివార్‌లోనూ అంతర్గతంగా విభేదాలు రావడం, ఉన్నతాధికారులే విభేదాలు వెల్లడించడం నిజమే కదా? దగ్గరకు వచ్చిన బిజెడి, అకాలీ వంటి వారు కూడా మళ్లీ వెనక్కు పోలేదా? పొత్తు పెట్టుకున్న టిడిపి అనుకూలంగా వుండే వైసిపి కూడా తాము మైనార్టీలకు వ్యతిరేకం కాదని చూపుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నాయి? దేశంలో పరిస్థితి అలా వుంచి అమెరికా జర్మనీ, ఐక్యరాజ్యసమితి కూడా అప్రజాస్వామిక ధోరణులపై ఆందోళన, అభ్యంతరాలు వెలిబుచ్చలేదా? వాటి జోక్యం సరైందా అనే ప్రశ్న ఒకటైతే మోడీ సర్కారు చర్యల పట్ల స్పందనలు ఎలా వున్నాయనేది దీన్నిబట్టి విదితమవుతుంది. ఇవి మన ప్రజలు గమనించలేరనీ, స్పందించరనీ అనుకోవడం పొరబాటు. గతంలో చాలాసార్లు చైతన్యవంతమైన తీర్పులతో చారిత్రక మార్పులు తెచ్చిన భారతీయ ఓటర్లు ఇప్పుడు కూడా ఆ మెళకువ చూపించకపోరు. అది ఏ రాష్ట్రంలో ఏ రూపంలో ఏ స్థాయిలో వుంటుందనేది వాస్తవంలో చూడాలి. గతంలో ప్రత్యామ్నాయాలు వచ్చినపుడు ఇన్ని ప్రతిపక్ష ప్రభుత్వాలు, ఇన్ని ప్రాంతీయ పార్టీలూ వుండేవి కావు. కాకపోతే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్వభావంలో మార్పు వచ్చిన మాట నిజమే గానీ బిజెపితో కలసినవి తక్కువే. ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే ప్రభుత్వ ఏర్పాటు గురించిన చర్చకు అర్థం వుంటుంది. అప్పుడు ఎవరు ఏమి చేస్తారనేది కీలకం. ఈ లోగా ఎన్నికల సవాళ్లను దీటుగా ఎదుర్కొనవలసి వుంటుంది.

– తెలకపల్లి రవి

➡️