సామాజిక సాధికారత ఇదేనా…?

Feb 28,2024 07:13 #Editorial

షెడ్యూల్డ్‌ ప్రాంత స్థానిక ఆదివాసీ అభ్యర్ధులతోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు ఉద్దేశించిన జి.ఓ నెంబర్‌ 3 ను సుప్రీంకోర్టు గతంలో రద్దు చేసింది. షెడ్యూల్డు ప్రాంత ఇతర ఉద్యోగ పోస్టులను భర్తీజేసే ప్రక్రియకు కూడా తెరపడింది. రెగ్యులర్‌ పోస్టులలో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీలోనూ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయకపోవడం వల్ల ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. జనరల్‌ డిఎస్సీతో పాటు 1998, 2008 డిఎస్సీ సందర్భంగా … సుమారు 680 పోస్టులను పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మినిమం టైమ్‌స్కేల్‌ ప్రాతిపదికన…స్థానికేతరులతో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోతున్నారు.

              రాష్ట్ర ప్రభుత్వం 6100 టీచర్‌ పోస్టులు భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్లు-226, ఎస్‌.జి.టి-280, పి.డి-13 మరియు గిరిజన గురుకులంలో పి.జి.టి-58, టి.జి.టి-446 పోస్టులను ఖాళీగా ఉన్నట్లు జనరల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. షెడ్యూల్డ్‌ ఏరియా, నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాలోనూ గిరిజన సంక్షేమ శాఖ విస్తరించి వుండటం వల్ల 5వ షెడ్యూల్‌ ఏరియాలో 500 పోస్టులు, నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాలో 300 పోస్టులను కేటాయించింది.

జిల్లాల వారీగా ఖాళీలు – డిఎస్సీలో కేటాయింపు

                     ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 5 జిల్లాల పరిధిలో 5వ షెడ్యూల్డ్‌ ఏరియా విస్తరించి వుంది. 5వ షెడ్యూల్డ్‌ ఏరియానే ఒక యూనిట్‌గా తీసుకొని ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు భర్తీ చేస్తారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సీలో విశాఖ (పాడేరు) ఏజెన్సీ ప్రాంతంలో 175 పోస్టులకు గాను ఎస్టీలకు 7 పోస్టులు, తూర్పు గోదావరి (రంపచోడవరం, చింతూరు) ఏజెన్సీకి 205 పోస్టులకు గాను 10 పోస్టులు ఎస్టీలకు, శ్రీకాకుళం (సీతంపేట) ఏజెన్సీ ప్రాంతాల్లో 35 పోస్టులకు గాను 6 మాత్రమే ఎస్టీలకు, పశ్చిమ గోదావరి (కెఆర్‌పురం) ఐటిడిఏ పరిధిలో 70 పోస్టులకు గాను 8 పోస్టులు మాత్రమే ఆదివాసీలకు కేటాయించారు. ఏజెన్సీ ప్రాంతానికి 500 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామంటూ చివరికి ఆదివాసీ నిరుద్యోగులకు కేవలం 38 పోస్టులు కేటాయించారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీ నిరుద్యోగుల ముందే షెడ్యూల్డ్‌ ప్రాంత యేతరులకు ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడాన్ని ఆదివాసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని పున: పరిశీలన చేయాలి.

గురుకులం నిబంధనలు తుంగలో తొక్కిన సర్కారు

                  1998 జూన్‌ 3న ఉమ్మడి గురుకులం సొసైటీ నుండి విభజించి ఆంధ్రప్రదేశ్‌ గిరిజన గురుకులం విద్యాసంస్థను ఏర్పాటు చేశారు. నాటి నుండి నేటి వరకు సొసైటీ (బై లా) నిబంధనల ప్రకారం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియామకం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం జనరల్‌ డిఎస్సీలో గురుకులం పోస్టులను విలీనంచేసి గిరిజన గురుకులానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని తుంగలోకి తొక్కింది. కనీసం సొసైటీ పాలక మండలిని లెక్కచేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికిి నోటిఫికేషన్‌ జారీ చేయడం దారుణం. గిరిజన గురుకులంలో జోనల్‌ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. కానీ జనరల్‌ డిఎస్సీ మాత్రం జిల్లా యూనిట్‌గా నోటిఫికేషన్‌ భర్తీ చేయడం గురుకుల సొసైటీ నిబంధనలకు విరుద్ధం. గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నా వారిని రెగ్యులర్‌ చేయకుండా జనరల్‌ డిఎస్సీ ద్వారా స్కూల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులైన ఆదివాసీలను గిరిజన గురుకులం విద్యా సంస్థ నుండి గెంటివేతకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుట్ర ఇది. ప్రభుత్వం చర్య వల్ల ఇప్పటి వరకు ఉపాధి పొందుతున్న గిరిజన గురుకులంలో ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు 504 మంది, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సిఆర్‌టి విధులు నిర్వహిస్తున్న 521 మంది ఉద్యోగం కోల్పోయి వారి స్థానంలో గిరిజనేతరులతో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం దారుణం.

జి.ఓ 3 రద్దుతో ఇక్కట్లు

           షెడ్యూల్డ్‌ ప్రాంత స్థానిక ఆదివాసీ అభ్యర్ధులతోనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు ఉద్దేశించిన జి.ఓ నెంబర్‌ 3 ను సుప్రీంకోర్టు గతంలో రద్దు చేసింది. షెడ్యూల్డు ప్రాంత ఇతర ఉద్యోగ పోస్టులను భర్తీజేసే ప్రక్రియకు కూడా తెరపడింది. రెగ్యులర్‌ పోస్టులలో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీలోనూ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయకపోవడం వల్ల ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. జనరల్‌ డిఎస్సీతో పాటు 1998, 2008 డిఎస్సీ సందర్భంగా…సుమారు 680 పోస్టులను పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మినిమం టైమ్‌స్కేల్‌ ప్రాతిపదికన…స్థానికేతరులతో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోతున్నారు.

ఐదవ షెడ్యూల్‌ నిబంధనలు అతిక్రమణ

                     భారత రాజ్యాంగం పార్ట్‌-10 మరియు 5వ షెడ్యూల్డ్‌ ఆదివాసీలకు ప్రత్యేక హోదాను భారత పార్లమెంట్‌ గుర్తించింది. ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి, భాష, ఆర్థిక, సామాజిక రక్షణతో పాటు ఆదివాసులకు భద్రత, రక్షణ, పరిపాలన బాధ్యత గూర్చి స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఏ ఉత్తర్వులైనా 5వ షెడ్యూల్‌ క్లాజ్‌ (1) (2) ప్రకారం గవర్నర్‌, టి.ఏ.సి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. కానీ జనరల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ జారీపై ఇటువంటి ప్రక్రియను ధిక్కరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆదివాసులకు ప్రత్యేక భాష, సంస్కృతి ఉంది. గిరిజన భాష రాని ఉపాధ్యాయులను ఏజెన్సీలో నియమించడమంటే ఆర్టికల్‌ 29, 32ను ఉల్లంఘించడమే.

నూతన రెగ్యులేషన్‌ ముసాయిదాను ఆమోదించాలి

          సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పున: సమీక్ష చేయాలని కోరుతూ 2020 లోనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆదివాసీ గిరిజన సంఘం మొదలగు సంఘాలు, వ్యక్తులు మొత్తం 17 రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆదివాసీలకు అనుకూల ఉత్తర్వులు కోర్టు నుంచి వెలువడ లేదు. మరోపక్క ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు జీఓ నెంబర్‌ నెంబర్‌ 3లో గల మౌలిక హక్కులు ఉద్యోగ రిజర్వేషన్‌ కొనసాగించే విధంగా 5వ షెడ్యూల్డ్‌ క్లాజ్‌ (2) ప్రకారం రూపొందించిన నూతన రెగ్యులేషన్‌ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి (టిఏసి) 2021 లోనే ఆమోదించింది. అలాగే 371(డి) కింద రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం మరో సవరణ ముసాయిదా రూపొందించింది. కానీ టి.ఏ.సి ఆమోదాన్ని కూడా జగన్‌ ప్రభుత్వం కనీసం గౌరవించలేదు. మరోపక్క జనరల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌తో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన అభద్రతా భావం, ఆందోళన కలిగిస్తోంది.

జి.ఓ నెంబర్‌ 3 రద్దు చేసిన తర్వాత అనేకమార్లు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. కానీ ఏనాడూ ఆదివాసులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌కు చట్టబద్ధత గురించి ప్రస్తావన లేదు. పునరుద్ధరణకు కనీసం ఎటువంటి చర్యలకూ ఉపక్రమించకుండా ఆదివాసీ యువతకు తీవ్రమైన ద్రోహానికి తలపెట్టింది. ఆదివాసీ పక్షపాతి ప్రభుత్వమంటూ ఆర్భాట ప్రచారమే తప్ప వాస్తవంలో అలాంటిదేమీ లేదు.

ఆదివాసీలకు అన్యాయం

          1/70 చట్టం ప్రకారం ఏజెన్సీలో స్థిర నివాసానికి అర్హతలేని వారికి ఉద్యోగం ఇస్తే ఆదివాసీ భూముల దురాక్రమణ మరింత ఎక్కువ అవుతుంది. 2 శాతం మాత్రమే ఉన్న గిరిజనేతరులకు 95 శాతం పోస్టులు భర్తీ చేయడం, 98 శాతం మంది వున్న ఆదివాసులకు కేవలం 5 శాతం పోస్టులు మాత్రమే కేటాయించడమేనా సామాజిక సాధికారత?

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జనరల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ను పున:పరిశీలించి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు భద్రత, భరోసా కల్పించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన, నియామకాలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. తక్షణమే జనరల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలలో 5వ షెడ్యూల్డ్‌ ఏరియా నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి (ప్రత్యేక ఆదివాసీ డిఎస్సీ) ఆర్డినెన్స్‌ జారీచేయాలి. సుప్రీంకోర్టులో విచారణ దశలో పెండింగ్‌ వున్న రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత స్వీకరించి న్యాయం చేయాలి. లేదా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నూరు శాతం రిజర్వేషన్‌కు చట్టబద్దత కల్పించడానికి రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వులను జారీచేయాలి. ఆదివాసీల నూరు శాతం రిజర్వేషన్‌ చట్టబద్దతను న్యాయ సమీక్షకు అతీతంగా షెడ్యూల్‌ 9లో చేర్చాలి. షెడ్యూల్డు ప్రాంతాల్లో నూరు శాతం స్థానిక ఆదివాసీ అభ్యర్థులకే ప్రభుత్వ ఉద్యోగ, అవకాశాల కల్పనపై జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలి.

/ వ్యాసకర్త 'ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌' జాతీయ కార్యవర్గ సభ్యులు, సెల్‌ : 9490300917 / పి.అప్పలనర్స
/ వ్యాసకర్త ‘ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌’ జాతీయ కార్యవర్గ సభ్యులు, సెల్‌ : 9490300917 / పి.అప్పలనర్స
➡️