గాజాలో దాడుల విస్తరణ !

israel palestine conflicts continue attack on gaza article

గాజాలో ఇజ్రాయెలీ దళాల నరమేథం 83వ రోజుకు చేరింది. బుధవారం నాటికి 21,110 మంది పాలస్తీనియన్లు మరణించగా 55,243 మంది గాయపడ్డారు. వీరిలో మూడింట రెండువంతులకు పైగా పిల్లలు, మహిళలే ఉన్నారు. అనేక వేల మంది ఆచూకీ లేదు.ఇప్పటికిప్పుడే దాడులు ముగిసే అవకాశం లేదని కొన్ని నెలలపాటు కొనసాగవచ్చని ఇజ్రాయెల్‌ దళాల ప్రధాన అధికారి హర్జీ జెలెవీ, దాడులను మరింతగా విస్తరిస్తామని మంత్రి బెన్నీ గాంట్జ్‌ ప్రకటించాడు.వర్తమాన కాల హిట్లర్‌ నెతన్యాహు అని టర్కీ అధినేత ఎర్డోగన్‌ వర్ణించాడు.గాజాలో పరిస్థితి విషమిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. అయినప్పటికీ అపరమానవతావాద కబుర్లు చెప్పే అమెరికా, ఇతర పశ్చిమదేశాలు దుర్మార్గాన్ని ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఇంకా ఎగదోసేందుకు చూస్తున్నాయి. హమస్‌ సాయుధులను పూర్తిగా అంతం చేసేందుకు తమ దగ్గర ఇంద్రజాల పరిష్కారాలు లేవని, వారు పౌరదుస్తుల్లో ఉంటున్నందున వారందరినీ చంపామని తాము చెప్పటం లేదని హర్జీ జెలేవీ చెప్పటం, ఇప్పటి వరకు 500 మంది వరకు ఇజ్రాయెలీ సైనికులు మరణించటం, 2066 మంది తీవ్రంగా గాయపడినట్లు వచ్చిన వార్తలు అక్కడి తీవ్ర ప్రతిఘటనకు అద్దం పడుతున్నాయి. ఈ సంఖ్యలను తక్కువగా చూపి తమ పౌరులను ఇజ్రాయెల్‌ పాలకులు తప్పుదారి పట్టిస్తున్నారు. తరతరాలుగా దాడుల మధ్య పుట్టి, దాడుల్లో పెరిగి దాడుల్లోనే మరణిస్తున్న పాలస్థీనియన్లు తమ మాతృభూమి కోసం ఎన్నిత్యాగాలకైనా సిద్దపడుతున్నారన్నది స్పష్టం. ఇజ్రాయెల్‌ దళాలు కూల్చివేస్తున్న భవనాల శిధిలాల వెనుక ఏ అరబ్బు దేశభక్తుడు ఉన్నాడో, ఎక్కడ ఏ బాంబు ఉందో అన్నట్లుగా యూదు దురహంకారులు భయపడుతున్నారు. ఒక భవనాన్ని కూల్చివేశామంటే అది తమ సైనికులకు ప్రమాదకారిగా తయారవుతున్నదని సైనిక అధికారే చెప్పాడు.తమ లక్ష్యాన్ని సాధించేందుకు, బందీలుగా ఉన్నవారిని విడిపించుకొనేందుకు శక్తివంతంగా మిలిటరీ, మోసకారిపద్దతుల్లో కూడా పని చేస్తున్నామని అన్నాడు. మిలిటరీకి చేయాల్సింది చేయటం లేదని ఏకంగా ఆ దేశ ఆర్థికమంత్రి నిర్‌ బార్కట్‌ చెప్పటం సైనికుల కుటుంబాల్లో తలెత్తుతున్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకే అన్నది స్పష్టం.తమ దేశం సురక్షితమైన నెతన్యాహు హస్తాల్లో ఉందన్న ఇజ్రాయెలీల భ్రమలు ఎంతోకాలం కొనసాగవు. సాధారణ పౌరుల నుంచి ఇప్పటికే వత్తిడి పెరుగుతోంది.అక్టోబరు ఏడున ఇజ్రాయెల్‌పై హమస్‌ దాడి గురించి గూఢచారి శాఖకు ముందే తెలిసినప్పటికీ పట్టించుకోలేదని తాజాగా మీడియా పేర్కొన్నది. ఇదే నిజమైతే అతగాడి రాజకీయ భవిష్యత్‌ అనిశ్చితం కావటమేగాక విచారణను ఎదుర్కొన్నా ఆశ్చర్యం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. మిలిటరీకి పెరుగుతున్న నష్టాలు, మిగిలిన బందీల విడుదలకు చర్యలు తీసుకోకపోవటంతో జనం నుంచి రోజురోజుకూ వత్తిడి పెరుగుతోంది.

ఒకవైపు హమస్‌ సాయుధులను ఎప్పటిలోగా అదుపు చేస్తారో తెలియని స్థితి. రెండో వైపు దాడుల ఖర్చు పెరుగుతున్నది. పశ్చిమ దేశాలు భారీ మొత్తాల్లో సాయం చేస్తున్నప్పటికీ ఎంతకాలం, ఎంత మేర అన్నది వాటి ముందున్న ప్రశ్న. ఇజ్రాయెల్‌ను పెంచి పోషించి ఇప్పటికే మధ్య ప్రాచ్య దేశాలు కొన్నింటిని అమెరికా అదుపులోకి తెచ్చుకుంది. గాజాను సర్వనాశనం చేసినందువల్ల వారికి వచ్చే అదనపు లబ్ది ఏమీ ఉండదు. మిలిటరీ ఖర్చు ఊహించినదాని కంటే ఎక్కువగా ఉంది.హమస్‌పై ప్రారంభించిన దాడుల ఖర్చు ఇప్పటికి 13.8బిలియన్‌ డాలర్లుగా అంచనా వేయగా దానిలో ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ పౌరుల తరలింపుకే 9.6బి.డాలర్లు అవుతుందట. మారణహౌమం సందర్భంగా యూదుల పట్ల హిట్లర్‌ అనుసరించిన వైఖరికీ ఇప్పుడు అరబ్బుల పట్ల నెతన్యాహు చేస్తున్నదానికి ఎలాంటి తేడా లేదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ బుధవారం నాడు తమ పార్లమెంటులో చేసిన వ్యాఖ్య నూటికి నూరుపాళ్లు నిజం. హిట్లర్‌ జర్మనీ, ఆక్రమిత ప్రాంతాల్లో నాజీ శిబిరాలను నిర్వహిస్తే ఇజ్రాయెల్‌ నేడు గాజాను అలాంటి దుర్మార్గాల కేంద్రంగా మార్చివేసింది. అంతర్జాతీయ చట్టాలు, సాంప్రదాయాలను ఉల్లంఘించి యుద్ధ నేరాలకు పాల్పడుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పౌరులను తరిమికొట్టటం, ఐరాస కేంద్రాలతో సహా ఆసుపత్రులు, విద్యా సంస్థలు, నిర్వాసిత శిబిరాల మీద వైమానిక, టాంకులతో దాడులు జరపటం నాజీల దుర్మార్గాల కంటే తక్కువేమీ కాదు. ప్రధాని నెతన్యాహు, మంత్రులు, మిలిటరీ, పౌర అధికార యంత్రాంగాన్ని, వారికి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల నేతలను యుద్ధ నేరగాండ్లుగా ప్రకటించి విచారణ జరపాల్సి ఉంది. ఇందుకోసం అంతర్జాతీయంగా శాంతి శక్తులు మరింతగా డిమాండ్‌ చేయాల్సి ఉంది.

 

m koteswararo

– ఎం కోటేశ్వరరావు

➡️