ఉద్యమాలే బి.జె.పిని ఓటమి అంచున నిలబెట్టాయి

Jun 19,2024 04:45 #editpage

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రజా ఉద్యమాల విజయంతో పాటు…నిరంకుశ, మతతత్వ, కార్పొరేట్‌, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ పట్ల తీవ్ర వ్యతిరేకతను వెల్లడించాయి. దశాబ్దం క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే బిజెపి పాలనకు వ్యతిరేకంగా ఒక స్థిరమైన, అవిశ్రాంత పోరాటం చేసిన వారు రైతులు, కార్మికులు.
నిరంకుశ, ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం 2014లో భూసేకరణ ఆర్డినెన్సు విడుదల చేసిన వెంటనే, దానికి వ్యతిరేకంగా సమస్యల ఆధారంగా ఐక్యతను నెలకొల్పడం, ‘భూమి అధికార్‌ ఆందోళన్‌’ చేపట్టిన పోరాటాలతో పాటు, ప్రతిపక్ష పార్టీలు కూడా పార్లమెంటును ముట్టడించడంతో ఆ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం అనివార్యంగా ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఇది నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎదుర్కొన్న మొదటి ఓటమి. ఇది నిస్సందేహంగా పట్టు విడవకుండా, సమస్యలను తీసుకుని చేసిన, ఐక్య పోరాటాల కృషి వల్లనే సాధ్యమైంది. కేవలం ఈ విజయంతోనే పోరాటాలు ఆగలేదు.
ప్రజల జీవనోపాధిపై దాడి, నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సంక్షోభం, గో రక్షణ పేరుతో జరిగిన దాడులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో పాటు, వాటి విక్రయాలకు, అటవీ హక్కులను హరించడానికి వ్యతిరేకంగాను, జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ లాంటి అనేక సమస్యలపైనా పోరాటాలు ప్రారంభించారు. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సుదీర్ఘ కాలంగా ఉనికిలో ఉండటమేగాక, ఆయా సంఘాలు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలను ఎదుర్కోవడంలో ప్రధాన పాత్ర పోషించాయి. వారి అనుభవం కూడా రైతు ఉద్యమానికి లాభించింది. 2017 జూన్‌లో బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌ లోని మాందసార్‌లో జరిగిన పోలీస్‌ కాల్పుల్లో రైతులు మరణించాక, ”అఖిల భారత సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌” కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ విభిన్న మార్గాలలో, పోరాటాలను నిర్వహించింది.
మార్చి 2018లో నాసిక్‌ నుండి ముంబై వరకు సుదీర్ఘంగా సాగిన కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్వహించబడింది. ఈ లాంగ్‌ మార్చ్‌ బిజెపిని ఓడించటం సాధ్యమేనని… బిజెపి అజేయ శక్తి అనే అభిప్రాయం, కేవలం కార్పొరేట్‌ మీడియా ప్రచార సృష్టి మాత్రమేనని స్పష్టమైన సందేశాన్ని పంపింది. మోడీ నాయకత్వం లోని బి.జె.పి ప్రభుత్వం రైతాంగ వ్యతిరేకి అనే నినాదం, బిజెపి పాలనకు వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. 2019 సంవత్సరంలో పుల్వామా ఘటన, బాలాకోట్‌ వైమానిక దాడి ఆ తరువాత…తీవ్ర జాతీయవాద ప్రచార నేపథ్యంలో బిజెపి విజయం సాధించినప్పటికీ…అంతకు ముందు జరిగిన ఎన్నికలలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ లలో బిజెపి ఓటమి పాలైన సంగతిని మరువలేం.
నరేంద్ర మోడీ రెండవసారి ఎన్నికైన తరువాత, పోరాటాలు తీవ్రమయ్యాయి. తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొని, 750 మంది కామ్రేడ్లు తమ ప్రాణాలను పణంగా పెట్టడం, చారిత్రాత్మక రైతాంగ, కార్మికుల ఐక్య పోరాటాల ఫలితంగా…నరేంద్ర మోడీ అనివార్యంగా తన ఓటమిని అంగీకరించి, కార్పొరేట్‌ అనుకూల 3 వ్యవసాయ చట్టాలను, 4 లేబర్‌ కోడ్స్‌ను ఉపసంహరించుకోవడంతో ఉద్యమకారులలో ఆశ చిగురించింది. సంయుక్త కిసాన్‌ మోర్చా, ఒక వినూత్నమైన సమస్యల ఆధారిత ఐక్యతతో, వర్గాలను అధిగమించి విస్త్రుత శ్రేణులలోని రైతాంగాన్ని ముందుకు తీసుకు వెళ్లింది. ఈ పోరాటం కరోనా మహమ్మారి కాలంలో జరిగినదని, ఈ వ్యాధిని గురించిన భయంతోపాటు, కఠినమైన లాక్‌డౌన్‌ వల్ల, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంటికే పరిమితమైన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. వారు మొదట మహమ్మారి అనే భయంపై విజయం సాధించారు. ఆ తరువాత రాజ్య అణచివేతపై విజయం సాధించారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నప్పుడు, అంతిమ విజయం సాధించడంలో, పాలక వర్గాలు చేసిన ఏ చిన్న ప్రయత్నం కూడా సహాయ పడలేదు. ముజఫర్‌ నగర్‌ కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌ కార్మికుల, కర్షకుల ఐక్యతతో, బి.జె.పి విభజిత రాజకీయాలను, మతపరమైన ఎజెండాను ఓడిస్తామని స్పష్టంగా ప్రకటించింది. ఎస్‌.కె.యమ్‌ కార్పొరేట్‌ దోపిడీకి వ్యతిరేకంగా, నిర్ణయాత్మకమైన పాత్రను పోషించింది. ఇది మోదానీ మోడల్‌కు వ్యతిరేకం. రైతాంగాన్ని అదానీ, అంబానీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ధీటుగా నిలబెట్టింది. అదానీ, అంబానీలు, మనను పాలించే ప్రభుత్వానికి చెందిన కార్పొరేట్‌ కుబేరులుగా చిత్రించింది. వారి లాభాల కోసమే, లక్షలాది మంది రైతుల, కార్మికుల ప్రయోజనాలను బలి చేయడానికి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఈ సందేశం ప్రతిపక్ష పార్టీలకు కూడా విస్తరించి, ఎన్నికలలో బి.జె.పిని ఓడించడంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి.
బి.జె.పిని శిక్షించాలనే కిసాన్‌ సంయుక్త మోర్చా నినాదం దేశవ్యాప్తంగా విస్తరించింది. బి.జె.పి కార్పొరేట్‌ అనుకూల, మతతత్వ విధానాలను బహిర్గతం చేస్తూ యస్‌.కె.యమ్‌-జె.పి.సి.టి.యు అనేక రకాల ప్రచారాలను చేపట్టాయి. అగ్నివీర్‌ పథకానికి వ్యతిరేకంగా ప్రచారం, మహిళా రెజ్లర్ల పట్ల వ్యవహరించిన తీరుతో పాటు, ఇతర సమస్యలను కూడా చేపట్టాయి. పంజాబ్‌, హర్యానాలలో రైతుల నిరసనలతో బిజెపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం, గ్రామీణ ప్రాంతాలలోనికి రాలేకపోయారు. ట్రేడ్‌ యూనియన్ల సమన్వయంతో విస్త్రుత సాహిత్యం, పోస్టర్లు, ప్రచారం నిర్వహించారు. లఖింపూర్‌ ఖేరి ఘటనకు కారణమైన, ఐదుగురు రైతులను, ఒక జర్నలిస్టును వాహనంతో తొక్కించి వారి మరణానికి కారణమైన అజరు మిశ్రా తేని కుమారుడిపై అవిశ్రాంత పోరాటం చేశారు.
ఎన్నికల ఫలితాలపై ఈ ప్రచారాలన్నింటి ప్రభావం ఉంది. రైతాంగ ఉద్యమాలకు, పోరాటాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న, పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో, చాలా గ్రామీణ నియోజక వర్గాలలో, బిజెపి ఘోరంగా ఓడిపోయింది. ‘న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో జితేంద్ర చౌబే నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాజస్థాన్‌, హర్యానా, మహారాష్ట్రలోని ఐదు రాష్ట్రాల వ్యవసాయ బెల్టులలో బిజెపి 38 సీట్లను కోల్పోయింది. పశ్చిమ యూపీలో ముజఫర్‌ నగర్‌, సహారాన్పూర్‌, కైరానా, నగీనా, మురాదాబాద్‌, సంభాల్‌, రాంపూర్‌, మరీ ముఖ్యంగా అజరు మిశ్రా తేని, లఖింపూర్‌ ఖేరిలో ఎన్నికలలో ఓడిపోయాడు. పంజాబ్‌లో ఒక్క సీటు కూడా గెలవలేని బిజెపి, హర్యానాలో ఐదు సీట్లు కోల్పోయింది. రాజస్థాన్‌లో గత ఎన్నికలలో, బి.జె.పి మొత్తం 25 స్థానాలలో విజయం సాధించగా, వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో బిజెపి 11 స్థానాలను కోల్పోయింది. మహారాష్ట్రలోని ఉల్లిగడ్డల సాగు జరుగుతున్న ప్రాంతంలో, ఇద్దరు కేంద్ర మంత్రులు ఓడిపోయారు. ఎన్‌.డి.ఎ 12 సీట్లు కోల్పోగా, బి.జె.పి కి ఒక్క సీటు కూడా రాలేదు. వ్యవసాయ మంత్రి అర్జున్‌ ముండా కూడా జార్ఖండ్‌లో ఓడిపోయారు. రైతాంగ పోరాటంలో ముఖ్య నాయకులు, ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు, రాజస్థాన్‌ లోని షాజహాన్‌ పూర్‌ సరిహద్దులలో 13 నెలల పాటు పోరాటానికి నాయకత్వం వహించిన అమ్రారామ్‌, సికార్‌ లోక్‌సభ నియోజకవర్గం నుండి సి.పి.యం అభ్యర్థిగా, ఇండియా కూటమి మద్దతుతో విజయం సాధించారు. బీహార్‌లో కూడా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులకు, ఉమ్మడి పోరులో నికరమైన మద్దతునిచ్చిన, ముఖ్యమైన నాయకుడు ఆల్‌ ఇండియా కిసాన్‌ మహాసభ జనరల్‌ సెక్రెటరీ రాజారాం సింగ్‌, మరొక నాయకుడు సుధామ ప్రసాద్‌ కరాకట్‌, అర్రాV్‌ా నుండి ‘ఇండియా’ వేదిక మద్దతుతో ఎన్నికయ్యారు. వీరు సి.పి.ఐ ఎంఎల్‌ లిబరేషన్‌ అభ్యర్థులు. మహారాష్ట్రలోని వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో బిజెపి 12 సీట్లను కోల్పోయింది. తమిళనాడు లోని దిండిగల్‌ నుండి 4 లక్షల పైగా ఓట్లతో గెలుపొందిన సి.పి.ఐ ఎం అభ్యర్థి సచ్చిదానందంకు కూడా ‘ఇండియా’ బ్లాక్‌ మద్దతునిచ్చింది. ఆయన ఆలిండియా కిసాన్‌ సభ నాయకుడు కూడా. ఇతర రాష్ట్రాలను పరిశీలించినా ఈ పోరాటాల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
వాస్తవంగా, ఈ సమిష్టి ఉద్యమాలు, ప్రయత్నాలే… నరేంద్ర మోడీ అజేయుడు కాదనే అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని ప్రజలలో కలిగించాయి. యువత, విద్యార్థి, మహిళా పోరాటాలు, అణచివేతకు గురయినవారు, సి.ఎ.ఎకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక పోరాటం పాత్ర కూడా ఇందులో ఉంది. అసమ్మతితో కూడిన నిర్భయ స్వరాలు, ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్న అనేక మంది కూడా, నిస్సందేహంగా ప్రముఖ పాత్ర పోషించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య హక్కుల పరిరక్షణకు…ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా నిస్వార్ధంగా పనిచేసిన వేలాది మందినీ మరువలేం. ధృవ్‌ రాథీ, రవీష్‌ కుమార్‌ వంటి వారితోపాటు వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు, పౌర సమాజం ఉమ్మడిగా నిర్వహించిన సమిష్టి ప్రయత్నాల ఫలితంగానే, నిరంకుశ బిజెపి తిరస్కరణకు గురైంది. ‘రైతాంగ, కార్మిక ఉద్యమాలే’ చోదక శక్తిగా నిలిచి, గెలుపు సాధ్యమవుతుందన్న విశ్వాసాన్ని, వాతావరణాన్ని కల్పించాయి.

డా|| విజూకృష్ణన్‌

(వ్యాసకర్త అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి)

 

➡️