Italy: ఇటలీలో జి7 మల్లగుల్లాలు!

Jun 14,2024 05:07 #Articles, #edite page, #G7, #in Italy!

ఏడు ధనిక దేశాల కూటమి (జి7) యాభయ్యవ వార్షిక సమావేశం గురువారం నాడు ఇటలీలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ భేటీకి రికార్డు స్థాయిలో భారత్‌, బ్రెజిల్‌తో సహా పన్నెండు దేశాల నేతలను అతిథులుగా ఆహ్వానించటం ఒక విశేషం. రష్యా మీద ఆంక్షలను వెయ్యి నుంచి నాలుగు వేల వరకు విస్తరించేందుకు. ఇప్పటికే స్థంభింపచేసిన 280 బిలియన్‌ డాలర్ల రష్యా ఆస్తుల మీద వచ్చే రాబడి నుంచి ఉక్రెయిన్‌కు 50 కోట్ల డాలర్ల సాయం అందించాలన్న అమెరికా ప్రతిపాదనలు, చైనా కట్టడి అనే నిరంతర ఎజెండా ప్రధానంగా ఈ సమావేశం ముందున్నాయి. తన మీద పడే భారాన్ని తప్పించుకొనే అమెరికా ఎత్తుగడ, ఎన్నికల్లో స్వలాభం పొందే జో బైడెన్‌ మంత్రాంగం ఉంది. ఉక్రెయిన్‌కు సాయంపై ఐరోపా సమాఖ్యలో ఏకాభిప్రాయం వస్తేనే అది వీలుపడుతుంది. అయితే అలాంటి హామీ ఇచ్చే పరిస్థితి లేదన్నది విశ్లేషకుల అంచనా. ఎన్ని ఆంక్షలు విధిస్తే అంతగా అన్నట్లు వాటి ప్రభావం రష్యా మీద ఇప్పటి వరకు పెద్దగా లేదు. ఈ కారణంగానే మరోసారి గట్టిగా ఊపి చూద్దాం అనే తెగింపుతో పశ్చిమ దేశాలు ఉన్నాయి. అంతా మీరే చేస్తున్నారు అంటూ రష్యా ఆర్థికంగా, ఇతరంగా నిలదొక్కుకోవటానికి కారణం చైనా అని పశ్చిమ దేశాలు చిందులు వేస్తున్నాయి. తాము ఇచ్చిన ఆయుధాలతో అన్నెంపున్నెం ఎరగని పిల్లలు, మహిళలను గాజాలో ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌ దుశ్చర్యలు దానికి కనిపించవు. చైనా అందిస్తున్న యంత్రాలు, చిప్స్‌ వంటి వాటిని ఆయుధాల తయారీతో సహా వినియోగ వస్తువుల తయారీకీ రష్యా వినియోగించవచ్చు. దీన్ని సహించలేక అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అవసరానికి మించి అధిక ఉత్పత్తులు చేసి ప్రపంచ మార్కెట్లలో కుమ్మరిస్తున్నదనేది ఒకటి. ఆ సాకుతో చైనా విద్యుత్‌ వాహనాల దిగుమతులపై పన్ను మొత్తాన్ని 25 నుంచి 100 శాతానికి పెంచిన అమెరికా అడుగు జాడల్లో ఐరోపా దేశాలు 38 శాతం వరకు పెంచేందుకు నిర్ణయించి ఈ సమావేశానికి వచ్చాయి. అంటే రష్యా, చైనాలతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధపడుతున్నాయి. ఇల్లలకగానే పండగ కాదన్నట్లు అమెరికా ప్రతిపాదనల మీద ఏకాభిప్రాయం కుదురుతుందనే పరిస్థితి లేదు. రష్యా ఆస్తులు ఐరోపా దేశాల్లో ఉన్నాయి. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఇరికించే అవకాశం మాకూ ఉంది వెనుకా ముందు ఆలోచించుకోండని రష్యా హెచ్చరించింది. గత వారంలో జరిగిన ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పచ్చి మితవాద శక్తుల బలం పెరుగుదల, దానితో ముడివడిన సమస్యలను ఈ సమావేశం విస్మరించే అవకాశం లేదు.
గాజాలో ఇజ్రాయిల్‌ మారణకాండ 250 రోజులుగా కొనసాగుతున్నది, హమాస్‌ తీవ్రవాదులను పట్టుకొనే పేరుతో ఇజ్రాయిల్‌ జరుపుతున్న ఈ దారుణ కాండలో ఇంతవరకు ఎంత మందిని పట్టుకున్నదీ చెప్పలేని స్థితి. మరోవైపు ప్రపంచ వ్యాపితంగా దానికి మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాల మీద ఒత్తిడి తీవ్రం అవుతున్నది. ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య 840వ రోజులో ప్రవేశించింది. రోజు రోజుకూ జెలెన్‌స్కీ సేనలు బలహీనపడటం తప్ప జరుగుతున్నదేమీ లేదు. పశ్చిమ దేశాలు అందించిన ఆధునిక ఆయుధాలు రష్యాను ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా వెనక్కు నెట్టలేకపోయాయి. తమ మీద జరుపుతున్న వాణిజ్య పోరును పశ్చిమ దేశాలు ఎంతకాలం, ఎలా కొనసాగిస్తాయో తగ్గేదేలే మేమూ చూస్తామన్నట్లుగా చైనా ఉంది. తన ఎత్తుగడలను తానూ అమలు చేస్తున్నది. పశ్చిమ దేశాలు కాటు వేసేందుకు అవకాశాలు దొరక్క ప్రస్తుతం బుసలు కొట్టే స్థితిలోనే ఉన్నప్పటికీ వాటి కోరల్లో దాగిన విషాన్ని విస్మరించకూడదు.
వివిధ ప్రపంచ పరిణామాల పట్ల డోలాయమాన స్థితి, విబేధాలు, అసాధారణ సవాళ్ల నడుమ ఈ కూటమి ఇటలీ మధనంలో ఏమి వెలువడుతుంది అన్నదానిపై ఆసక్తి నెలకొన్నది. తమ కంట్లో నలుసుల్లా, కొరుకుడు పడని ముక్కల్లా ఉన్న చైనా, రష్యా, ఇరాన్‌ వంటి దేశాలను ఎలా కట్టడి చేయాలి? ప్రపంచాధిపత్యాన్ని ఎలా నిలుపుకోవాలి, కానసాగించాలనే యావతో ఉన్న జి7కు ఆత్రం తప్ప ఎలా ముందుకు పోవాలో తెలియని స్థితి గత జపాన్‌ సమావేశాల్లో వెల్లడైంది. గాజాలో జరుగుతున్న మారణకాండను నిలిపివేసేందుకు ఏ మాత్రం ముందుకు రాని ఈ గుంపు తమ కారణంగానే తలెత్తిన ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిం చేందుకు చొరవ చూపకపోగా మరింత ఆజ్యం పోసి జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది.
ఈ సమావేశాలకు వస్తూ కొన్ని దేశాలు తీసుకున్న నిర్ణయాలు ఘర్షణ, ఉద్రిక్తతలను పెంచేవిగా ఉన్నందున ఇటలీ భేటీలో జరిగేదేమిటో ఊహించుకోవచ్చు.

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️