భూదోపిడీ చట్టం

Jan 6,2024 07:20 #Editorial

           రైతుల, ప్రజల ఆస్తి హక్కులకు విఘాతం కలిగించే ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కుల చట్టం (ఎ.పి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 2023) పీడ విరగడ కాలేదు. చట్టం విషయంలో హైకోర్టులో తాత్కాలిక ఉపశమనమే లభించింది. అది కూడా నెల రోజులే. కాబట్టి భూ హక్కుల చట్టం కత్తి రైతుల, ప్రజల మెడపై వేలాడుతూనే ఉందని గ్రహించి అప్రమత్తం వహించాలి. చట్టం బారి నుంచి శాశ్వత విముక్తి కోసం ప్రజలందరూ పోరాడాలి. ప్రజల హక్కులకు ప్రమాదకరమైన ఎ.పి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయాలంటూ ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ (ఐలు), మరికొన్ని సంస్థలు, హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేయగా, విచారణ సందర్భంగా న్యాయస్థానానికి ప్రభుత్వం నివేదించిన అంశాలు చట్టం అమలుపై ముందుకేనని స్పష్టం చేస్తున్నాయి. ఇంకా నిబంధనలు రూపొందించలేదు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ అధికారులను నియమించలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కనుక ప్రస్తుతానికి చట్టం అమల్లో లేదు అని సర్కారు తెలిపింది. అంతే తప్ప చట్టంపై ప్రజల, వివిధ తరగతుల నుంచి వెల్లడవుతున్న వ్యతిరేకతను గమనించినట్లుకాని, యాక్ట్‌ను పున:సమీక్షిస్తున్నట్లుకాని చెప్పలేదు. ప్రభుత్వ ఈ వివరణ దృష్ట్యా న్యాయస్థానం వ్యాజ్యాల విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు సివిల్‌ కోర్టులు ఆస్తి వివాద వ్యాజ్యాలను తిరస్కరించకుండా విచారించాలని ఆదేశించింది. ప్రభుత్వాన్ని సవివరంగా అఫిడవిట్‌ దాఖలు చేయమంది. చివరికి న్యాయస్థానం ఏం తీర్పు చెబుతుందో చూడాలి.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దుర్మార్గమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు కర్త, కర్మ, క్రియ కేంద్ర బిజెపి ప్రభుత్వం. ప్రధాని మోడీ మానస పుత్రిక నీతిఆయోగ్‌ బుర్రలోనుంచి చట్టం పురుడు పోసుకుంది. దేశ వ్యాప్తంగా ఏకరూప భూహక్కుల చట్టం ఉండాలన్న లక్ష్యం ఇమిడి ఉంది. అందులో భాగంగానే మోడల్‌ యాక్ట్‌ను తయారు చేసి రాష్ట్రాలకు పంపి ఆమోదించాలని హుకుం జారీ చేసింది. కేంద్రం చెప్పిందే తడవు వైసిపి ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌లోనే అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపగా అక్కడ ఆగమేఘాల మీద ఓకే అయింది. 2023 అక్టోబర్‌ 31 నుంచి రాష్ట్రంలో చట్టాన్ని అమల్లోకి తెస్తూ జిఓ 572 జారీ అయింది. బాలికలు, మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి జగన్‌ సర్కారు తెచ్చిన ‘దిశ’ చట్టాన్ని రాష్ట్రపతి, కేంద్రం అనేక కొర్రీలతో ఆమోదించకుండా పలుమార్లు తిప్పి పంపగా, సదరు చట్టం ఇంకా గాలిలో ఉంది. అలాంటిది ప్రజల భూ హక్కులను కాలరాసే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని మాత్రం రాష్ట్రపతి నుంచి జెట్‌ స్పీడ్‌లో ఆమోదం లభించిందంటేనే, బిజెపి ప్రాధామ్యాలేమిటో అర్థమవుతుంది.

భూహక్కుల చట్టం గురించి నీతిఆయోగ్‌ ఉద్దేశాలు ఏమి చెప్పినా అంతిమంగా అదానీ, అంబానీ, కార్పొరేట్లకు ప్రభుత్వ, ప్రైవేటు భూములను అప్పనంగా కట్టబెట్టేందుకే. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతిఆయోగ్‌ చేసే పని అంతర్జాతీయ ఫైనాన్స్‌ కేపిటల్‌కు అనుకూలంగా నయా ఉదారవాద విధానాల అమలుకు మార్గాలు వేయడమే. కార్పొరేట్లకు అడ్డుగా ఉన్న చట్టాలను సమూలంగా మార్చడమే. ఎ.పి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌లో పొందుపర్చిన అంశాలు ఆ లక్ష్య సాధనకే. రాష్ట్రంలో 90 శాతం భూవివాదాలకు హేతువు రెవెన్యూ వ్యవస్థే. పలు కేసుల్లో న్యాయస్థానాలు ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టాయి కూడా. రెవెన్యూ అధికారుల చేతుల్లో ప్రజల ఆస్తులను పెట్టడం దొంగకు తాళాలివ్వడమే. బాధితులు డివిజనల్‌, జిల్లా స్థాయి సివిల్‌ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయడమే. రాష్ట్ర స్థాయి అథారిటీ తీర్పులపై నేరుగా హైకోర్టుకే వెళ్లాలి. హైకోర్టుకెళ్లే స్తోమత ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, పేదలకు, చిన్న సన్నకారు రైతులకు లేదు. భూములను, హక్కులను కోల్పోవడం తప్ప వారికి మరే గత్యంతరం ఉండదు. ఇదే అదనుగా ఇష్టారీతిన కార్పొరేట్లు భూములను కాజేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎ.పి లో జరుగుతున్న సమగ్ర భూ సర్వే తంతైనా, గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ధరణి దందాకైనా మూలం కేంద్ర విధానాలే. ప్రజల హక్కులకు ప్రమాదంగా మారిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని ప్రతిఘటించి పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది.

➡️