నిరుద్యోగపు కొరడా దెబ్బలు

Jan 30,2024 07:17 #Editorial

బూర్జువా రాజకీయ పార్టీలు సైతం అయిష్టంగానైనా, ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యతే అని ఒప్పుకోక తప్పడం లేదు. అది వెంటనే సాధ్యం కాదని చెప్తూ ప్రతీ ఒక్కరికీ ”కనీస ప్రాథమిక ఆదాయం” కల్పించాలన్న ప్రతిపాదనను అవి ముందుకు తెస్తున్నాయి. ఐతే వాళ్ళు ప్రతిపాదిస్తున్న ”కనీస ప్రాథమిక ఆదాయం” (బేసిక్‌ మినిమమ్‌ ఇన్‌కమ్‌) అత్యంత స్వల్పంగా ఉంది. అంతేగాక ఎప్పుడైనా దానిని చెల్లించడానికి నిరాకరించవచ్చు. అది ఒక ఎన్నికల హామీగా ఉండడం చేత కొత్తగా వచ్చే ఏ ప్రభుత్వమైనా దానిని రద్దు చేయవచ్చు. ఈ కనీస ప్రాథమిక ఆదాయం అనేది ప్రభుత్వం దయతో ఇచ్చే భిక్ష కాదు. నిజానికి ఏ నిరుద్యోగీ యాచకుడు కాదు. వారికి ఉద్యోగాలే కావాలి. వాటిని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు, ఈ దేశంలో ప్రతీ పౌరుడికీ గౌరవ ప్రదమైన జీవితం గడిపే హక్కు ఉన్నందున, ఒక హక్కుగా కనీస ప్రాథమిక ఆదాయాన్ని వాళ్ళు పొందగలగాలి.

స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేనంత ఘోరంగా నిరుద్యోగం నేడు నెలకొని వుంది. ఈ పరిస్థితి దాపురించడానికి రెండు స్పష్టమైన కారణాలున్నాయి. మొదటిది: కరోనా మహమ్మారి కాలంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో తీవ్రంగా ఉత్పత్తి పడిపోయింది. ఉద్యోగాలూ పోయాయి. ఆ తర్వాత కాలంలో ఉత్పత్తి కోలుకుంది కాని ఆ మేరకు ఉద్యోగాలు తిరిగి కల్పించడం జరగలేదు. 2019-20 (కరోనాకి ముందరి ఏడాది)తో పోల్చితే 2023-24లో జిడిపి వృద్ధి 18 శాతం దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాని 2019 నుండీ ఇప్పటిదాకా ఉపాధి కల్పనలో వృద్ధి మాత్రం సున్నా. ఇది సిఎంఐఇ సంస్థ ప్రకటించిన గణాంకాలను బట్టి కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరిగింది? కరోనా అనంతర కాలంలో ఉత్పత్తి కోలుకోవడం అనేది భారీ పరిశ్రమల్లో, పెద్ద సంస్థల్లో ఎక్కువగా జరిగింది. వాటితో పోల్చితే చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో వృద్ధి బాగా తక్కువగా జరిగింది. ఉపాధి అవకాశాలు భారీ పరిశ్రమల్లో తక్కువగా ఉంటాయి. అదే చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో అధికంగా ఉంటాయి. ఉపాధిని ఎక్కువగా కల్పించే పరిశ్రమల్లో ఉత్పత్తి అభివృద్ధి తక్కువగా జరగడంతో ఉపాధి అవకాశాల్లో వృద్ధి సున్నా అయిపోయింది.

ఈ పరిస్థితికి మరో కారణం కూడా ఉంది. కరోనా రాకముందే 2019 నాటికే దేశంలో నిరుద్యోగం పరిస్థితి తీవ్రంగా ఉంది. 1973లో చమురు ధరలు ఒక్కసారి పెరగడంతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. దాని ఫలితంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. అది పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతకు, వేతనాల కోతకు దారి తీసింది. అప్పటి నిరుద్యోగం పెరుగుదల రేటు కన్నా కూడా 2019లో నిరుద్యోగం పెరుగుదల తీవ్రంగా ఉంది. నిజానికి ఈ నిరుద్యోగం నయా ఉదారవాద విధానాల అమలు వలన అనివార్యంగా వ్యక్తం అయ్యే ధోరణి. దీనికి కరోనా మహమ్మారితో కాని, ఆ తర్వాత కాలంలో కోలుకోవడంతో కాని ఏ సంబంధమూ లేదు. ఇక్కడ కొట్టవచ్చినట్టు మనకు ఒక విషయం కనిపిస్తోంది. నయా ఉదారవాద విధానాల అమలు మొదలుకాక మునుపు కాలంతో పోల్చితే నయా ఉదారవాద కాలంలో జిడిపి వృద్ధి రేటు రెట్టింపు అయింది. ఇదే కాలంలో ఉపాధి కల్పన రేటు మాత్రం సగానికి సగం పడిపోయింది.

దేశంలో శ్రామిక వర్గం సంఖ్య పెరుగుదల రేటు కన్నా కూడా ఉపాధి అవకాశాల కల్పన రేటు తక్కువగా ఉంది. ఆర్థిక వ్యవస్థపై నియంత్రణలను తొలగించడంతో ఉపాధిని హరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుని ఉపాధి అవకాశాలను కుదించడం దీనికి కారణం. దీని వలన ఉత్పాదకత వేగంగా పెరిగింది కాని ఉపాధి అవకాశాలు దెబ్బ తిన్నాయి. మరొకవైపు రైతాంగానికి వ్యవసాయంలో అంతవరకూ ఇస్తున్న మద్దతును, సబ్సిడీలను, రుణాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో చిన్న రైతులు వ్యవసాయాన్ని మానుకుని పట్టణాలకు వలసలు పోవడం మొదలుబెట్టారు. అది పట్టణాల్లో నిరుద్యోగం మరింత పెరగడానికి దోహదం చేసింది.

నయా ఉదారవాద విధానాలు పెట్టుబడిదారులకు అవధులు లేని స్వేచ్ఛనిస్తాయి. అలా ఇవ్వడం నిరుద్యోగాన్ని పెంచుతుంది. ఇదేవిధంగా జరుగుతుందో పరిశీలిద్దాం. ఉదాహరణకు ఒకానొక ఆర్థిక వ్యవస్థలో 100 యూనిట్ల ఉత్పత్తిని 100 మంది కార్మికులతో చేయిస్తున్నార నుకుందాం. అటువంటి వ్యవస్థలో ఆ 100 యూనిట్ల ఉత్పత్తినే 50 మంది కార్మికులతోనే చేయించగల కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారనుకుందాం. అప్పుడు 50 మంది కార్మికుల ఉద్యోగాలు పోతాయి. తక్కిన 50 మందికీ వేతనాలు పాత స్థాయిలోనే కొనసాగుతాయి తప్ప రెట్టింపు కావు కదా. ఐతే వేతనాల కోసం చేసే ఖర్చు సగానికి పడిపోతుంది. అప్పుడు పెట్టుబడిదారుడి లాభాల వాటా పెరుగుతుంది. దాని వలన ఆదాయాలలో అసమానతలు పెరుగుతాయి. వేతనాల వాటా తగ్గి లాభాల వాటా పెరగడం అంటే దాని వలన మార్కెట్‌ లో సరుకుల వినియోగం ఆ మేరకు తగ్గిపోతుంది. అంతకు మునుపు 100 మంది ఖర్చు చేయగల స్థితిలో ఉండేవారు. ఇప్పుడు వారు సగానికి తగ్గిపోయారు. అందుచేత మార్కెట్‌లో సరుకులకు డిమాండ్‌ కూడా ఆ మేరకు తగ్గిపోతుంది. ఉత్పత్తి అయిన సరుకులు మిగిలిపోతాయి. అందుచేత పెట్టుబడిదారుడు తన ఉత్పత్తిని ఆ మేరకు తగ్గించుకుంటాడు. దాని వలన మరి కొన్ని ఉద్యోగాలు పోతాయి.

ఐతే, ప్రముఖ ఆంగ్లేయ ఆర్థికవేత్త డేవిడ్‌ రికార్డో పెట్టుబడిదారుడి లాభాలు పెరిగాయి గనుక అతడు ఆ లాభాలను మళ్ళీ పెట్టుబడిగా పెడతాడని, దాని వలన అదనంగా ఉద్యోగాలు వస్తాయని భ్రమ పడ్డాడు. అందువల్లనే అతడు కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టడం వలన నిరుద్యోగం పెరగదని భావించాడు. తాత్కాలికంగా టెక్నాలజీ కారణంగా పోయిన ఉద్యోగాలు అదనంగా పెట్టుబడి పెట్టడం వలన మళ్ళీ కల్పించబడతాయని అనుకున్నాడు. అలా లాభాలు పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిదారుడు మరింత పెట్టుబడులు పెడుతూనే వుంటాడని, ఆ క్రమంలో టెక్నాలజీ వలన పోయే ఉద్యోగాల కన్నా కొత్తగా వచ్చే ఉద్యోగాలే ఎక్కువగా ఉంటాయని అతడు అనుకున్నాడు. కాని రికార్డో మార్కెట్‌లో సరుకులకు డిమాండ్‌ విషయంలో తలెత్తే సమస్యను పరిగణనలోకి తీసుకోలేదు. వేతనాల బిల్లు తగ్గుతున్నకొద్దీ కొనుగోలుశక్తి పడిపోయి డిమాండ్‌ తగ్గుతుంది. అప్పుడు పెట్టుబడిదారుడు తన పెట్టుబడిని తగ్గించుకుంటాడే తప్ప లాభాలు వచ్చాయి గాబట్టి అదనంగా పెట్టుబడి పెడదాం అని అనుకోడు. అందుచేత నిరుద్యోగాన్ని కలిగించే టెక్నాలజీ రానురాను మరింత నిరుద్యోగాన్ని పెంచుతుందే తప్ప తగ్గించదు.

ఎటువంటి నియంత్రణా లేని పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంతరాయంగా కొనసాగే భారీ నిరుద్యోగాన్ని తీసుకొస్తుంది. ఒక పరిమిత స్థాయిలో రిజర్వు సైన్యంగా నిరుద్యోగం ఉన్నంతకాలమూ పెట్టుబడిదారీ వ్యవస్థ దానిని తట్టుకోగలుగుతుంది. టెక్నాలజీ ఆ పరిమిత నిరుద్యోగాన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోతుంది. ఇదే సోషలిస్టు వ్యవస్థలోనైతే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం వలన కార్మికుల పని భారం తగ్గుతుంది. వారి వెసులుబాటు సమయం పెరుగుతుంది. అంతే కాదు, వారి వేతనాల బిల్లు ఏమాత్రమూ తగ్గదు. ఇందాకా చెప్పుకున్న ఉదాహరణనే సోషలిస్టు వ్యవస్థలో తీసుకుందాం. అప్పుడు కార్మికులు 100 మందికీ ఉద్యోగాలు యథాతథంగా కొనసాగుతాయి. వారి పని గంటలు మాత్రం కొత్త టెక్నాలజీ కారణంగా సగానికి తగ్గిపోతాయి. ఆధునిక కాలంలో పూర్తి స్థాయిలో ఉపాధి కల్పన సాధించినవి సోవియట్‌ యూనియన్‌, తూర్పుయూరప్‌ దేశాలు మాత్రమే (అక్కడ సోషలిస్టు వ్యవస్థ ఉన్న కాలంలో). అదే కాలంలో పెట్టుబడిదారీ దేశాలన్నీ నిరుద్యోగంతో సతమతమౌతూనే ఉన్నాయి. నయా ఉదారవాద విధానాలు వచ్చాక పెట్టుబడిదారుల మీద ఏ నియంత్రణా లేకపోవడంతో ఆ నిరుద్యోగం భారీ స్థాయికి పెరుగుతోంది. భారతదేశం కూడా 2019 నాటికి ఆ స్థాయికి చేరింది.

ఒక వ్యక్తి నిరుద్యోగిగా ఉండడం అతడి లేదా ఆమె తప్పు కాదు. ఆ వ్యక్తి జీవించే సమాజంలో ఉన్న సామాజిక వ్యవస్థది ఆ తప్పు. ఆ వ్యక్తికి ఉపాధి కల్పించడం ఆ వ్యవస్థకి చేతకాదని నిర్ధారణ అవుతోంది. మరి అటువంటప్పుడు ఉపాధి కల్పన విషయంలో ముందుకు తేవలసిన డిమాండ్‌ ఎలా ఉండాలి (సోషలిజం కావాలి అని డిమాండ్‌ పెట్టడం అంటే ఆచరణలో అది నిరుద్యోగ సమస్యకు పరిష్కారాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడమే ఔతుంది.)? సమీప కాలంలో నిరుద్యోగ సమస్య నుండి కొంత ఊరట కలిగించేదిగా, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలోనే కల్పించగలిగేదిగా ఆ డిమాండ్‌ ఉండాలి.

బూర్జువా రాజకీయ పార్టీలు సైతం అయిష్టంగానైనా, ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యతే అని ఒప్పుకోక తప్పడం లేదు. అది వెంటనే సాధ్యం కాదని చెప్తూ ప్రతీ ఒక్కరికీ ”కనీస ప్రాథమిక ఆదాయం” కల్పించాలన్న ప్రతిపాదనను అవి ముందుకు తెస్తున్నాయి. ఐతే వాళ్ళు ప్రతిపాదిస్తున్న ”కనీస ప్రాథమిక ఆదాయం” (బేసిక్‌ మినిమమ్‌ ఇన్‌కమ్‌) అత్యంత స్వల్పంగా ఉంది. అంతేగాక ఎప్పుడైనా దానిని చెల్లించడానికి నిరాకరించవచ్చు. అది ఒక ఎన్నికల హామీగా ఉండడం చేత కొత్తగా వచ్చే ఏ ప్రభుత్వమైనా దానిని రద్దు చేయవచ్చు. ఈ కనీస ప్రాథమిక ఆదాయం అనేది ప్రభుత్వం దయతో ఇచ్చే భిక్ష కాదు. నిజానికి ఏ నిరుద్యోగీ యాచకుడు కాదు. వారికి ఉద్యోగాలే కావాలి. వాటిని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైనప్పుడు, ఈ దేశంలో ప్రతీ పౌరుడికీ గౌరవ ప్రదమైన జీవితం గడిపే హక్కు ఉన్నందున, ఒక హక్కుగా కనీస ప్రాథమిక ఆదాయాన్ని వాళ్ళు పొందగలగాలి.

ఉపాధి హక్కు ఒక సార్వత్రికమైన హక్కుగా ఉండాలి. దానికి రాజ్యాంగపరమైన గ్యారంటీ ఉండాలి. రాజకీయ హక్కులు, పౌర హక్కులు ఏవిధంగా ప్రాథమిక హక్కులుగా గ్యారంటీ చేయబడ్డాయో అదే విధంగా ఉపాధి హక్కు కూడా గ్యారంటీ చేయబడాలి.

ఉపాధి హక్కును గ్యారంటీ చేసి కనీస ప్రాథమిక ఆదాయాన్ని అమలు చేయడానికి జిడిపిలో 3 శాతం కన్నా ఎక్కువ ఖర్చు కాదు. ఒక నిరుద్యోగికి కనీసం వేతనంగా నెలకు రూ. 20,000 చొప్పున చెల్లించాలనుకుంటే, ప్రస్తుతం నిరుద్యోగం రేటు 10 శాతం ఉందని లెక్క వేస్తే దేశంలో ఉన్న 4 కోట్లమంది నిరుద్యోగులకూ ఏడాదికి రూ. 9.6 లక్షల కోట్లు అవసరం ఔతుంది. ఇది మన జిడిపిలో 3.2 శాతం.

ఇంతమంది నిరుద్యోగులకు ఈ మొత్తాన్ని అందించడం వలన అది దేశంలో డిమాండ్‌ భారీగా పెరగడానికి దారి తీస్తుంది. అప్పుడు ఆ మేరకు ఉత్పత్తిని పెంచవలసివస్తుంది. దాని వలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంటే నిరుద్యోగులు తగ్గుతారు. అప్పుడు ప్రభుత్వం తన ఖజానా నుండి చెల్లించవలసిన మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు నిరుద్యోగ భృతిగా చెల్లించవలసినది జిడిపిలో 3.2 శాతం కన్నా తగ్గిపోతుంది. ఒక వ్యక్తికి నిరుద్యోగ భృతి నెలకు రూ. 20,000 చొప్పున చెల్లించడం వలన మరొక వ్యక్తికి ఉపాధి కల్పన జరిగిందని అనుకుంటే అప్పుడు ప్రభుత్వం చెల్లించవలసిన నిరుద్యోగ భృతి మొత్తం రూ. 9.6 లక్షల కోట్ల నుండి రూ.4.8 లక్షల కోట్లుకు పడిపోతుంది. అది జిడిపిలో కేవలం 1.6 శాతం మాత్రమే. ఉద్యోగాల కల్పన ద్వారా తక్కినవారికి వచ్చే ఆదాయాల ద్వారా ప్రభుత్వానికి అదనంగా పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది కూడా. అలా పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని కూడా లెక్క వేస్తే అప్పుడు ప్రభుత్వం నిరుద్యోగ భృతి నిమిత్తం చేసే ఖర్చు జిడిపిలో 1.6 శాతం కన్నా కూడా ఇంకా తగ్గిపోతుంది.

ఈ 1.6 శాతం మేరకు ఖర్చు చేయాలంటే దానికి ముందు అదనంగా ఆదాయాన్ని రాబట్టాలి. అందుకోసం అదనపు పన్నులు వేయడం పరిష్కారం. దేశంలోని అత్యంత సంపన్నులుగా ఉన్న 1 శాతం సూపర్‌ రిచ్‌ మీద సంపదపన్ను కేవలం 0.8 శాతం మాత్రం విధిస్తే సరిపోతుంది. ఈ పాటి పని కూడా ప్రభుత్వం చేయలేదంటే అది తన బాధ్యత నుండి దూరంగా పారిపోతున్నదన్నమాటే.

( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
( స్వేచ్ఛానుసరణ ) ప్రభాత్‌ పట్నాయక్‌
➡️