కార్మిక, కర్షక మైత్రి నిర్మాత లెనిన్‌

Jan 20,2024 07:18 #Editorial

కార్మిక కర్షక మైత్రి అనే మౌలిక సూత్రంపై ఆధారపడే లెనిన్‌, బోల్షివిక్‌ పార్టీ అనేక విధానపరమైన నిర్ణయాలను…అక్టోబరు విప్లవం జయప్రదం కాకముందు, తర్వాత కూడా తీసుకున్నారు. రష్యన్‌ విప్లవం ప్రధాన నినాదం ‘శాంతి, భూమి, తిండి’ ఈ ఐక్యతనే ప్రతిఫలిస్తోంది. ”కార్మికుల, రైతుల, సైనికుల ప్రతినిధులు ఎన్నికైన సోవియట్‌లలో ఒకరికొకరు దగ్గరయ్యారు. రైతాంగంపై తమ నాయకత్వ స్థానాన్ని నిలుపుకోగలిగిన స్థాయిలో కార్మిక వర్గం ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో అనవసర దుబారా ఖర్చుల్ని తొలగించడం ద్వారా అది రైతాంగ విశ్వాసాన్ని పొందగలిగి వుండాలి. ఆ విధమైన సామాజిక సంబంధాలు ఆర్థిక వ్యవస్థలో ఉండాలి”.

                కార్మికవర్గ విముక్తి పోరాటం ఉత్పత్తి చేసిన సిద్ధాంతవేత్తల్లో లెనిన్‌ మార్క్స్‌కు సరిసమానమైన వ్యక్తి అని వర్గచైతన్యంపైనా, చరిత్ర పైనా అధ్యయనం చేసిన రచయిత, హంగేరికి చెందిన మార్క్సిస్టు జార్జి లూకాక్స్‌ అంటాడు. ఏ లెనిన్‌ శత వర్థంతిని నేడు మనం జరుపుకుంటున్నామో అది సిద్ధాంతం, ఆచరణల, అలాగే ఉద్యమాలు, నిర్మాణం యొక్క ప్రత్యేక కలయిక. మొట్టమొదటి సోషలిస్టు విప్లవానికి నాయకత్వం వహించడం ఆయన సాధించిన అతి పెద్ద విజయం. అన్ని ప్రతికూల పరిస్థితుల్లో దాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేయడం ఆయన ప్రత్యేకత. మార్క్సిజానికి ఆయన చేసిన ప్రభావవంతమైన సైద్ధాంతిక సహకారాల్లో ఒక ముఖ్యమైనది సోషలిస్టు విప్లవానికి కార్మిక కర్షక మైత్రికి సంబంధించినది. విషయాన్ని ఆయన సైద్ధాంతికంగా ప్రతిపాదించడమే కాదు, రష్యాలో జరిగిన అక్టోబర్‌ విప్లవంలో దాన్ని ఆచరణలో పెట్టాడు. సోషలిస్టు వ్యవస్థ నిర్మాణంలో దాన్ని అంతర్భాగమే చేశాడు.

ఆ భావనకు అంకురార్పణ

              మార్క్స్‌, ఏంగెల్స్‌ తమ రచనల్లో నాటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలకు చెందిన కార్మిక వర్గం పైనే తమ దృష్టిని కేంద్రీకరించారు. పెట్టుబడిదారీ విధానం నుండి సోషలిజంలోకి పరివర్తన జరిగే క్రమంలో కార్మిక వర్గం అందుకు అవసరమైన నాయకత్వాన్ని అందించగలదని వారిరువురూ పేర్కొన్నారు. ఏమైనా రైతాంగంలోని వివిధ తరగతులు ఆ విప్లవంలో పోషించే సానుకూల, ప్రతికూల అంశాలను కూడా వారు పరిగణనలోని తీసుకున్నారు. 1871లో జరిగిన వీరోచిత ప్యారిస్‌ కమ్యూన్‌ను ఓడించడంలో రైతాంగం ఫ్రెంచ్‌ బూర్జువా వర్గానికి ఏ విధంగా సహకరించిందో ఆయన పరిగణనలోకి తీసుకున్నాడు. పెట్టుబడిదారుల ఆస్తులతో పాటు రైతాంగం ఆస్తులపై కూడా కార్మిక వర్గం దాడి చేస్తుందన్న భయం రైతాంగం పెట్టుబడిదారులకు సాయపడేలా చేసింది. ఏమైనా, మార్క్స్‌ ఏంగెల్స్‌లకు రైతాంగ శక్తిపై అవగాహన ఉంది. ఏప్రిల్‌ 16, 1856లో మార్క్స్‌ ఏంగెల్స్‌కి రాసిన లేఖలో కార్మికవర్గ విప్లవానికి రైతాంగం కలిస్తే అద్భుతాలు జరుగుతాయన్నాడు. ఈ విషయాన్ని లెనిన్‌ సీరియస్‌గా తీసుకున్నాడు. ‘మన విప్లవం’ పేరున ఆయన జీవిత చరమాంకంలో (1923, మే 30న) ప్రావ్దా ప్రచురించిన వ్యాసంలో ఈ విషయాన్ని నొక్కి వక్కాణించాయి.

26 ఏళ్ల పిన్న వయసులో ”రష్యాలో పెట్టుబడిదారీ విధాన అభివృద్ధి” అనే గ్రంథం 1896లో లెనిన్‌ రాశాడు. దాన్లో కార్మికవర్గ, రైతాంగ విప్లవకర శక్తి గురించి రాశాడు. ”కార్మికవర్గ పార్టీ, రైతాంగం” అనే వ్యాసం 1901లోనే ఆయన రాశాడు. ”కార్మికవర్గ పోరాటాల విప్లవ లక్ష్యం కోట్లాది రైతాంగంలో విప్లవ చైతన్యాన్ని రేకెత్తించకుండా సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఇది సాధ్యం కాదని ఏ ఒక్కరూ చెప్పకండి! మన కు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే వేలాది పద్ధ తుల్లో ఇది జరిగిపోతూనే ఉంది. 1903లో ”గ్రామీణ పేదల కోసం” అనే గ్రంథంలో ఈ ఆలోచనను మరింత విస్తృత పరిచాడు. ఇది ఇప్పటికీ తన ప్రాసంగితను నిలుపుకుంటూనే ఉంది.

కార్మిక కర్షక మైత్రి ద్వంద్వ లక్ష్యాలు

              1905లో జరిగిన మొదటి రష్యా విప్లవాన్ని జార్‌ ప్రభుత్వం రక్తపుటేరుల్లో ముంచేసినా, అది ఎన్నో విలువైన పాఠాలను అందించింది. అప్పుడే బోల్షివిక్‌ పార్టీ ‘కార్మిక వర్గ, రైతాంగ విప్లవకర ప్రజాతంత్ర నియంతృత్వం’ అని ఒక నినాదమిచ్చింది. ఇది మార్క్సిజాన్ని మరింత సంపద్వంతం చేసింది. నిర్దిష్ట పరిస్థితుల్ని నిర్దిష్టంగా విశ్లేషించడం ప్రాతిపదికన లెనిన్‌ ప్రతిపాదించిన సిద్ధాంతం ఈ విధంగా ఉంది. పెట్టుబడిదారీ విధానం మొదట ప్రారంభమైన దేశాలకీ, తర్వాత ఆలస్యంగా ప్రారంభమైన దేశాలకీ చాలా తేడా ఉంది. 1789లో ఫ్రెంచ్‌ బూర్జువా వర్గ నాయకత్వాన జరిగిన ఫ్రెంచ్‌ విప్లవం, భూస్వామ్య విధానాన్ని ధ్వంసం చేసి ఫ్యూడల్‌ ఎస్టేట్లను రైతాంగానికి పంచి పెట్టింది. ఇది పెట్టుబడిదారీ విధాన ప్రారంభ దశలోని పరిణామం. రష్యాలో గాని, ఇతర దేశాల్లో గాని, పెరుగుతున్న కార్మికవర్గ భయానికి పెట్టుబడిదారీ వర్గం పాతశక్తిని కోల్పోయి భూస్వాములతో రాజీపడనారంభించింది. ఇది రైతాంగ ప్రజాస్వామిక ఆకాంక్షలకు భిన్నంగా ఉండి, వారిలో అసంతృప్తిని రాజేస్తున్నది. భూస్వామ్య ఆస్తిపై దాడిచేస్తే అది ప్రతీఘాతమై యావత్‌ కష్టజీవుల్నీ ఏకంచేసి పెట్టుబడిదారుల ఆస్తిపై తిరగబడేలా చేస్తుందని బూర్జువాలు భయపడ్డారు.

ఆ నిర్దిష్ట పరిస్థితిలో లెనిన్‌ కార్మికవర్గ నాయకత్వంలో కార్మిక-కార్షక ఐక్యతను ప్రతిపాదించాడు. ఇది ఫ్యూడల్‌ వ్యతిరేక ప్రజాతంత్ర విప్లవాన్ని పూర్తి చేస్తుందని, అలానే పెట్టుబడిదారీ వ్యతిరేక పోరాటం నుంచి సోషలిస్టు విప్లవం వరకు పురోగమిస్తుందని ప్రతిపాదించాడు. 1905లో రాసిన తన ప్రఖ్యాత గ్రంథం ‘ప్రజాతంత్ర విప్లవం’లో సోషల్‌ డెమోక్రసీ యొక్క రెండు ఎత్తుగడల్లో దాన్నే కింది విధంగా క్రోడీకరించాడు. ”పెట్టుబడిదారీ వర్గ నిలకడలేమిని, కులీన వర్గాల ప్రతిఘటనను రైతాంగం బల ప్రయోగంతో కూలదోయాలంటే కార్మిక వర్గం ప్రజాతంత్ర విప్లవాన్ని పరిపూర్తి చేయవలసిందే. జనాభాలోని అర్థ శ్రామికులను కలగలుపుకుని రైతాంగ, పెటీబూర్జువా వర్గ నిలకడ లేనితనాన్ని అడ్డుకుని బూర్జువా వర్గ ప్రతిఘటనను బలప్రయోగంతో కూలదోసి సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేయాలంటే కార్మికవర్గం సోషలిస్టు విప్లవాన్ని జయప్రదం చేయాల్సిందే.

కార్మిక కర్షక మైత్రి అనే మౌలిక సూత్రంపై ఆధారపడే, లెనిన్‌, బోల్షివిక్‌ పార్టీ అనేక విధానపరమైన నిర్ణయాలను…అక్టోబరు విప్లవం జయప్రదం కాకముందు, తర్వాత కూడా తీసుకున్నారు. రష్యన్‌ విప్లవం ప్రధాన నినాదం ‘శాంతి, భూమి, తిండి’ ఈ ఐక్యతనే ప్రతిఫలిస్తోంది. ”కార్మికుల, రైతుల, సైనికుల ప్రతినిధులు ఎన్నికైన సోవియట్‌లలో ఒకరికొకరు దగ్గరయ్యారు. రైతాంగంపై తమ నాయకత్వ స్థానాన్ని నిలుపుకోగలిగిన స్థాయిలో కార్మిక వర్గం ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో అనవసర దుబారా ఖర్చుల్ని తొలగించడం ద్వారా అది రైతాంగ విశ్వాసాన్ని పొందగలిగి వుండాలి. ఆ విధమైన సామాజిక సంబంధాలు ఆర్థిక వ్యవస్థలో ఉండాలి”.

సామ్రాజ్యవాదం విసురుతున్న కొత్త సవాళ్లు ఇదే పుస్తకంలో లెనిన్‌ 1916లో సామ్రాజ్యవాదంపై అద్భుతమైన విశ్లేషణ చేశాడు. నేడు, ఒక శతాబ్దానికి పైగా, లెనిన్‌ వివరించిన సామ్రాజ్యవాదం ప్రాథమిక లక్షణమైన దోపిడీ, అసమానతలు, యుద్ధాలు, విధ్వంసం మరింత ఎక్కువైనాయి. అంతర్జాతీయ విత్తపెట్టుబడి ధ్వంసం చేస్తోంది. యుద్ధాలు, కరువులలో లక్షలాది మంది చనిపోతున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌, పర్యావరణ క్షీణత కారణంగా భూగోళం తీవ్ర ప్రమాదంలో పడింది.లెనిన్‌ కార్మిక-కర్షక మైత్రీ సిద్ధాంతమూ, దాని ఆచరణ రష్యాలోనే కాకుండా చైనా, వియత్నాం, కొరియా, క్యూబాలో సైతం సోషలిస్టు విప్లవాలు విజయవంతం కావటానికి దారితీసింది. విప్లవాలు విజయవంతమైన ఈ దేశాలన్నింటిలో, విప్లవ శక్తులు బూర్జువా-భూస్వామ్య పాలక వర్గాలకు వ్యతిరేకంగాను, ఆ వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచిన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగాను పోరాటం చేయవలసి వచ్చింది.సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, నయా ఉదారవాదం కొత్త యుగంలో, నయా-ఫాసిస్ట్‌, యుద్ధోన్మాద, మతతత్వ, జాత్యహంకార ధోరణులు వికృతంగా తలెత్తుతున్నాయి. ఈ ధోరణులను ప్రతిఘటించటానికి ప్రతి దేశంలో కార్మిక-కర్షక మైత్రిని ఏర్పరచడం, ఆ మైత్రీ బంధాన్ని బలోపేతం చేయడానికున్న ప్రాధాన్యత విశేషంగా పెరిగింది. ఎందుకంటే కార్మికవర్గం, రైతాంగం నేడు ఫ్యూడలిజం, దాని అవశేషాలతో పాటు, నయా ఉదారవాదం దానితో అనుబంధంగా వచ్చే దుష్పరిణామాల పెద్ద దాడిని ఎదుర్కొనవలసి వస్తున్నది. దీనిని దోపిడీకి గురవుతున్న ఈ రెండు ఉత్పత్తి శక్తుల మధ్య మరింత బలమైన మైత్రీబంధాన్ని ఏర్పరచడం ద్వారా మాత్రమే ఓడించగలం.

ప్రభాత్‌ పట్నాయక్‌ రాసినట్లు, ”చాలావరకు మూడవ ప్రపంచ దేశాలలో విప్లవానుకూల అవకాశాలు కార్మిక-కర్షక మైత్రిని విజయవంతంగా నిర్మించడంపై ఆధారపడి ఉంటాయి. అటువంటి మైత్రి లేకుండా పెట్టుబడిదారీ విధానాన్ని ఓడించలేం. అక్టోబర్‌ విప్లవం కూడా సాధ్యమయ్యేది కాదు.” ”ఈ రోజు భూస్వామ్య వ్యతిరేక ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేయడం కోసమే కాకుండా, సమకాలీన ప్రపంచీకరణ అనేక వర్థమాన దేశాల్లో సృష్టించిన తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని, చిన్న ఉత్పత్తి రంగంలోని సంక్షోభాన్ని అధిగమించడానికి కూడా అటువంటి కార్మిక-కర్షక కూటమి అవసరం. వలసవాద-వ్యతిరేక పోరాట వాగ్దానాలకు అనుగుణంగా, వలస పాలనానంతర ప్రభుత్వాలు అందించిన చిన్నపాటి ఉత్పత్తి రంగానికి వివిధ స్థాయిలలో రాజ్యం ఇస్తున్న మద్దతును ప్రపంచీకరణ నిర్మూలించింది. ఈ రంగాన్ని ప్రపంచమంతటా పరుగులు పెడుతున్న బడా పెట్టుబడి ఆక్రమణకు, ప్రపంచ మార్కెట్లో వుండే ధరల హెచ్చుతగ్గులకు బలిచేసింది.

”ఈ ఆర్థిక వ్యవస్థలలోని పెట్టుబడి రంగాలలో కార్మికుల డిమాండ్‌ దారుణంగా తగ్గిపోయింది. సహజంగా పెరిగే కార్మికశక్తి కంటే ఇది తక్కువగా ఉంది. పైగా పెట్టుబడిదారులు చిన్న తరహా ఉత్పత్తి రంగంలోకి జొరబడేసరికి కార్మిక జీవితాలు నాశనమైపోయాయి. ఉదాహరణకు గత మూడు దశాబ్దాలలో ఇండియాలోనే నాలుగు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

కార్మిక-కర్షక మైత్రీ బంధానికి కృషి

               2000 సంవత్సరంలో తాజాపరిచిన సిపియం కార్య క్రమం 7.6 పేరాలో ”ప్రజల ప్రజాతంత్ర కూటమి ఏర్పడ టానికి కార్మికవర్గం, రైతాంగం మధ్య ధృడమైన మైత్రీ బంధం ఉండటం కీలకం. దేశ స్వాతంత్య్రాన్ని కాపాడటంలో, విస్తృత ప్రజాతంత్ర పరివర్తన సాధించటంలో ఈ మైత్రీ బంధానికి అత్యంత ప్రాముఖ్యం వుంది. అన్ని విధాలా సామాజిక ప్రగతికి ఈ మిత్రత్వం హామీగా వుంటుంది. విప్లవాన్ని ముందుకు తీసుకుపోవటంలో ఇతర వర్గాల పాత్ర కార్మిక-రైతాంగ కూటమి బలం, స్థిరత్వం మీద ఆధారపడి ఉంది.

”భారతదేశంలో కార్మిక-కర్షక మైత్రి సామ్రాజ్యవాద వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటంలో, అంతకుముందు జరిగిన కార్మికవర్గం, రైతాంగ చారిత్రాత్మక పోరాట సందర్భాలలో అనేకసార్లు వ్యక్తమైంది. ఇటీవలి సంవత్సరాలలో, 2018 నుంచి 2023 దాకా సిఐటియు, ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌), ఆల్‌ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) సంయుక్తంగా చేసిన దేశవ్యాపిత పోరాటాల ద్వారా ఈ దిశలో చైతన్యంతో కూడిన కృషి జరిగింది. దుర్మార్గమైన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు దేశవ్యాపితంగా జరిగిన పోరాటంలో ఈ మైత్రిని సాధించటం గొప్ప విషయం. ఈ పోరాటానికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) కేంద్ర కార్మిక సంఘాల (సిటియు) నాయకత్వంలో కార్మికవర్గం నుండి అపారమైన మద్దతును అందుకున్నది. అదేవిధంగా సిటియు నాయకత్వంలో జరిగిన దేశావ్యాపిత సమ్మెలకు ఎస్‌కెఎం తన పూర్తి మద్దతును అందించింది. ఈ రెండు వర్గాలు కలిసి సంయుక్తంగా జరిపే పోరాటాలు 2024లో కూడా కొనసాగుతాయి.

ఏమైనప్పటికీ, ఇది ఒక చిన్న ప్రారంభం మాత్రమే. ప్రస్తుతం అధికారంలో వున్న కార్పొరేట్‌-మతోన్మాద-మనువాద-నిరంకుశ ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ప్రభుత్వాన్ని ఓడించటానికి మరింత విస్తృతమైన, తీవ్రమైన ఆందోళన, రాజకీయ, సైద్ధాంతిక, నిర్మాణ పరమైన చర్యలు తీసుకోవలసిన అవసరం వుంది. లెనిన్‌ స్వప్నమైన కార్మిక-కర్షక కూటమిని నిర్మించడానికి భారతదేశంలోని వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు అపారమైన కృషి చేయాలి. అది మాత్రమే భారత దేశంలో నిజమైన విప్లవాత్మక సామాజిక మార్పును సాధించగలదు.

 

/ వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు /అశోక్‌ ధావలే
/ వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు /అశోక్‌ ధావలే
➡️