ప్రభుత్వ బడిని బతికించుకుందాం

Jun 13,2024 05:40 #Articles, #edit page, #reopen, #schools

అమ్మ లాంటి ప్రభుత్వ బడి. అమ్మా నాన్న కూలికి వెళితే అక్కున చేర్చుకుని విద్యా బుద్ధులు నేర్పిన బడి. సమాజంలో ఎలా బతకాలో నేర్పిన బడి. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించడం తన జీవనంలో భాగంగా చూడమన్న బడి. పెద్దలను గౌరవించండి, తల్లిదండ్రులను పూజించండి అని రోజూ ఓనమాలు దిద్దించిన బడి. ఇప్పుడు ఏదో పాడు ప్రపంచీకరణ వచ్చి అమ్మ, బడి నేర్పాల్సిన దాన్ని సెల్‌ఫోన్‌ నేర్పుతుంది కానీ..ఆ రోజుల్లో బడే నేర్పేది. పాఠశాల ప్రారంభం కాబోతుంది కనుక ఆ బడిని రక్షించుకోవడం కోసం ఉపాధ్యాయులుగా, సమాజంగా ఏం చేయాలో చూద్దాం.

పాఠశాలలు-పిల్లలు
ఏప్రిల్‌ 30, 2021 ప్రభుత్వ లెక్కల ఆధారంగా ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ రంగంలో 33,813 ఉంటే, ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలలు 1,287 ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రాథమికోన్నత పాఠశాలలు 4,158 ఉంటే, ఎయిడెడ్‌ పాఠశాలలు 250 ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నత పాఠశాలలు 6,648 ఉంటే, ఎయిడెడ్‌ పాఠశాలలు 435 ఉన్నాయి. 2021 ఏప్రిల్‌ నాటికి ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 44,54,038.
జిఓ 117 పేరుతో పాఠశాలలకు సంఖ్యను 6 పాఠశాలలుగా మార్చిన తర్వాత కచ్చితమైన లెక్కలు ప్రభుత్వం నుంచి బహిర్గతం కాలేదు. కొన్ని జిల్లాల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఫౌండేషన్‌ స్కూళ్లు అంటే 1,2 తరగతులు మాత్రమే నిర్వహించే పాఠశాలలు మొత్తంగా 4600 ఉంటే దానిలో 20 లోపు ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్న పాఠశాల 2,730. ఫౌండేషన్‌ ప్లస్‌ అంటే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 27,000 పైచిలుకు ఉంటే … 8,900 వరకు 20 లోపు విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అంటే సుమారుగా 12,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయులతో నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రశ్నార్థకంగా మారిపోయింది.
ప్రీ హైస్కూల్‌ అంటే 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న మొత్తం పాఠశాలలు 3,500 దాకా ఉన్నాయి. వీటిలో 30 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 900 వరకు ఉన్నాయి. ఉన్నత పాఠశాలలు 5,400 దాకా ఉంటే దీనిలో 100 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు 450 దాకా ఉన్నాయి. 20 లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 30 లోపు వున్న ప్రీ హైస్కూళ్లు, 100 లోపు ఉన్న ఉన్నత పాఠశాలల భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారబోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే హైస్కూల్‌లో చదువుతున్న మూడో తరగతి విద్యార్థికి సబ్జెక్టు టీచర్లతో పాఠాలు, అదే ఒక ప్రాథమిక పాఠశాలలో లేదా ప్రీ హైస్కూల్‌లో 8వ తరగతి దాకా ఉన్న యూపీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థికి సబ్జెక్టు టీచర్లతో బోధన ఉండదు. ఒక భిన్నమైన విద్యా విధానం గత రెండు సంవత్సరాల కాలంగా అమలు చేయబడింది. మేధావులు, ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు దీన్ని సరిచేయాలని ఇది సరైన పద్ధతి కాదని చెప్పినా ఇది మా పాలసీ అనే పేరుతో అప్పటి ప్రభుత్వం అమలు చేసుకుంటూ పోయింది.
దీంతో ఈ రోజున 12,000 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. అలాగే కొన్ని ఉన్నత పాఠశాలల డీ గ్రేడ్‌, కొన్ని యూపీ పాఠశాలల డిగ్రేడ్‌గా మారిపోయాయి. ఎయిడెడ్‌ పాఠశాలలు కనుమరుగు అయిపోయాయి. ఇప్పుడు ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ చూస్తే ఈ లెక్కలు కూడా ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా వెబ్‌సైట్‌లో పెట్టలేదు. కానీ 36 లక్షలకు మించి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం లేదనేది అర్థమవుతుంది. ప్రాథమిక పాఠశాల వ్యవస్థ జిఓ 117 వల్ల అస్తవ్యస్తంగా మారిపోయింది. అక్కడ చదివే పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారో ప్రైవేటు పాఠశాలకు వెళ్లారో కూడా గణాంకాలు లేని పరిస్థితులు ఏర్పడతాయి. పాఠశాల స్ట్రక్చర్‌, మౌలిక వసతులు, పిల్లలకు కావలసిన సదుపాయాలు కలుగచేసిన తర్వాత కూడా పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గడానికి కారణమేమిటో, ఉపాధ్యాయ పోస్టులు కుదించబడటానికి కారణమేమిటో సమీక్ష జరగకపోవటం ప్రధాన లోపంగా ఉన్నది. ఇప్పటికైనా తక్షణం ఈ విద్యారంగంలో చేస్తున్న మార్పుల మీద ఒక స్పష్టమైన సమీక్ష జరగాలి. దాన్ని సరిచేసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకునేవైపు ప్రణాళికలు ఉండాలి.
బైజూస్‌, సిబిఎస్‌ఇ, టోఫెల్‌, ఐఎఫ్‌బి ప్యానల్‌….ఇలా అనేక పథకాలు పాఠశాలలోకి వచ్చి చేరాయి. ఏ పాఠశాలలో ఏ సిలబస్‌ ఉందో, ఏ పరీక్షా విధానం ఉందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపైన మాట్లాడుకోవడం గానీ, చర్చించుకోవడం గానీ సమగ్రంగా జరగలేదు. మరో విచిత్రం ఏమంటే ఉపాధ్యాయులు తమ సొంత నెట్‌, సెల్‌ఫోన్‌లోనే అన్ని యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవటం. పిల్లలకు ఏమైనా నాలుగు అక్షరాలు వచ్చాయా అనే దానికంటే ఉపాధ్యాయులు యాప్‌లు నింపడం, ఫార్మేట్లు పూర్తి చేయటం మీదే పర్యవేక్షణ సాగింది. పర్యవేక్షణ పాఠశాలలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది. ఒక్క ఉపాధ్యాయులే కాదు. విద్యార్థులు, తల్లిదండ్రులు, డీఈఓ, ఆర్‌జెడి, పై అధికారులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక స్వేచ్ఛాయుత వాతావరణం పాఠశాలో దెబ్బతిన్నది.

బడి కోసం ఉపాధ్యాయులు
విద్యార్థి బడి ద్వారా సమాజంలో మంచి పౌరుడుగా మారడానికి టీచరు ఉపయోగపడాలి. నిరంతరం తల్లిదండ్రులతో మమేకం అవ్వాలి. పిల్లల యోగక్షేమాన్ని అడిగి మనోధైర్యాన్ని ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించడానికి నిరంతరం ప్రత్యేక కృషి చేయాలి. చదవటం, రాయటం ప్రతి విద్యార్థికి వచ్చే బాధ్యత తీసుకోవాలి. మన బడికి వచ్చే పిల్లలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వారినే విషయం స్పృహలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆప్యాయతను విద్యార్థికి బడిలో ఉపాధ్యాయులు ఇవ్వాలి. బడి సమయాన్ని పిల్లల కోసం మాత్రమే కేటాయించాలి. ఉపాధ్యాయుల జీతాలు తల్లిదండ్రులు, సమాజం కట్టే పన్నుల నుంచే వస్తున్నాయనే వాస్తవాన్ని గ్రహించి, పిల్లల తల్లిదండ్రులతో, సమాజంతో అనుసంధానం అయ్యేలా వారి పని ఉండాలి. ప్రతి రోజు నూతన అంశాలు, నిరూపించిన శాస్త్రీయ అంశాలు బోధించాలి. విద్యార్థుల్లో చదువుల పట్ల ఆసక్తి కలిగించేటట్లు పని మెరుగు పరచుకోవాలి. ఏదైనా పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే, ఉత్తీర్ణత కాకపోతే తనువు చాలించడం కాకుండా మనోధైర్యంతో బతికేటట్లు, మరల విజయాన్ని అందుకునేటట్లు ప్రోత్సహించాలి. కష్టం, శ్రమ, నిజాయితీ లాంటి నైతిక విలువలను నేర్పాలి. మొత్తంగా బడి చుట్టూ ఒక సామాజిక కంచెను ఏర్పాటు చేసుకోవాలి. సమాజంలో మనం మనలో సమాజం భాగంగా ఉంటుందని భావనతో ఉపాధ్యాయులు తమ పనిని అభివృద్ధి చేసుకునే వైపు ఉండాలి. బడి తల్లిదండ్రుల ఆదరాభిమానాల్ని పొందే విధంగా టీచర్లు ఆదర్శంగా ఉండాలి. అవసరమైతే ఒక గంట అదనంగా పనిచేయడానికి సిద్ధపడాలి. బడి నుంచి బయటికి వెళ్లిన విద్యార్థి సమాజంలో ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా బతకగలిగే సామర్ధ్యాన్ని ఇవ్వగలిగేలా బోధన ఉండాలి. ఎలాంటి ఆటంకాలు ఎదురైనా బడి సమయంలో పిల్లల చుట్టూ, పిల్లల అభివృద్ధి చుట్టూనే ఉపాధ్యాయుల ఆలోచనలు, ఆచరణ, కార్యాచరణ ఉండాలి.

బడి కోసం ప్రభుత్వం
బోధనకు మాత్రమే ఉపాధ్యాయుని పరిమితం చేయాలి. పాఠశాల పర్యవేక్షణ కక్ష సాధింపు ధోరణితో కాకుండా పొరపాట్లను సరిచేసుకునే పద్ధతిలో ఉండాలి. విద్యారంగానికి హాని చేసే జీవో 117ని పూర్తిగా రద్దు చేయాలి. విద్యార్థి ఏ మీడియంలో చదువుకోవాలనే దానిపై విద్యార్థికి స్వేచ్ఛనివ్వాలి. ప్రాథమిక పాఠశాల విద్య మాతృభాషలో మాత్రమే ఉండాలి. మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో రెండు మీడియంలను అనుమతించాలి. ఖాళీలన్నీ డిఎస్సీ ద్వారా తక్షణం భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత లేకుండా చేయాలి. ఎంఈఓ-2, ప్లస్‌ టు పాఠశాలల వ్యవస్థపై సమీక్ష జరపాలి. ప్రతి పంచాయతీకి అన్ని హంగులతో ఒక ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉండేటట్లుగా ఏర్పాట్లు జరగాలి. ఉపాధ్యాయుల సమస్యలను విని పరిష్కరించే ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. బదిలీల కౌన్సిలింగ్‌ విధానాన్ని బలోపేతం చేసే విధంగా బదిలీల చట్టాన్ని రూపొందించాలి. బదిలీల చట్టానికి భిన్నంగా ఎలాంటి బదిలీలు చేయడానికి అనుమతించకూడదు. యాప్‌లు, సెక్షన్లు, ఫార్మేట్లు పూర్తి చేయటం అనేది పాఠశాల పరిధిలో ఉండకూడదు. పాఠశాల పనిదినాలలో ఎలాంటి శిక్షణలు ఉండకూడదు. బడి అంటే పిల్లల కేంద్రంగా ఉండాలి. పిల్లలకు నైపుణ్యమైన, నాణ్యమైన విద్య అందించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. సాంకేతిక పరిజ్ఞానం అదనపు సోర్సుగా ఉండాలి తప్ప ఉపాధ్యాయుడు మింగివేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుమతించకూడదు. స్కీముల పేరుతో రోజుకో రకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం కూడదు. రాష్ట్ర అవసరాలను తీర్చగలిగిన నూతన తరాన్ని తయారు చేసేటట్లు రాష్ట్ర విద్యా విధానం రూపొందించాలి. మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం విద్యలో చేస్తున్న మార్పులపై సమగ్ర చర్చ జరిపి, అందరి ఆమోదంతో అమలు చేయాలి. అంతిమంగా ప్రభుత్వ బడిని బలోపేతం చేసే వైపు కార్యాచరణ, ప్రణాళిక, బడ్జెట్‌ కేటాయింపులు జరగాలి. బడిలో ఉపాధ్యాయుడికి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలి.

ప్రభుత్వ బడికి ప్రత్యామ్నాయం లేదు
సమాజంలో నైతిక విలువలు, ప్రజాస్వామ్య విలువలు దృఢంగా నిలబడాలన్నా, మానవత్వం పరిమళించాలన్నా శ్రమజీవుల గురించి ఆలోచించే గొంతుకలు కావాలన్నా, ప్రశ్నించే తత్వం, పరిశోధనలు పెరగాలన్నా, భవిష్యత్తు తరంలో సమానత్వపు ఆలోచనలు పెంపొందించాలన్నా, చదువుకున్న చదువుని సమాజం కోసం నిస్వార్ధంగా వినియోగించాలన్నా ప్రభుత్వ బడి వుండాలి. డబ్బుతో కొనుక్కునే చదువు ద్వారా తయారైన పౌరుడు ప్రతిదాన్ని కొనుక్కునే వైపుగానే ఆలోచిస్తాడు. విద్యార్థి పరిపూర్ణ మానవత్వం కలిగిన వ్యక్తిగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలంటే ప్రభుత్వ బడిని బతికించుకోవాలి. కనుక ప్రభుత్వ బడిని రక్షించుకోవాల్సింది బలోపేతం చేయాల్సింది ఆ రంగంలో పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులే. ఉపాధ్యాయ హక్కుల కోసం ఎంతగా కదులుతున్నామో, ఎంతగా తపిస్తున్నామో, హక్కుల రక్షణకు ఎంతగా ఆలోచిస్తున్నామో అంతకంటే ఎక్కువ బాధ్యతతో, చిత్తశుద్ధితో ప్రభుత్వ బడిని బతికించుకునేందుకు కదలాలి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ముందుకు కదలాలి. నిరంతరం సమాజంతో మమేకం కావాలి.

 వ్యాసకర్త యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. వెంకటేశ్వర్లు

➡️