లాలిపాట

Dec 3,2023 07:20 #Editorial

                ‘ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన/ ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా/ మహరాజులా జీవించాలి నిండు నూరేళ్లు’ అంటూ తన బిడ్డ నూరేళ్లు బతకాలని, జగమంతా ఏలాలని కోరుకుంటున్న తల్లి మనసును ఆవిష్కరిస్తాడొక కవి. నిజానికి ఏ తల్లి అయినా ఇదే కోరుకుంటుంది. తన లాలిపాటలో ఎందరో వీరులను, అద్భుత ప్రపంచాన్నీ పరిచయం చేస్తుంది. ఆ తల్లి పాడే లాలిపాట ధ్వని చాలా లోతైనది. ఇది ప్రకృతి అంతా పరుచుకున్న దృశ్యరూపం. ‘యుద్ధం విలాపాలను, ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణహోమం గురించి మనం విలపించాలి. కానీ, భారీ స్థాయిలో విధ్వంసం ఎదుర్కొంటున్న గాజా పిల్లలు అత్యంత ప్రమాదకరంగా వున్నారని లాలిపాటలు పాడదాం. అది వారి జీవితాలకు, కలలకు రక్షణవుతుంది. స్థానభ్రంశం చెందినా, అజ్ఞాతవాసం చేయాల్సివచ్చినా…లాలిపాట వారిని సొంతగడ్డకు చేర్చుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలను సజీవంగా వుంచుతుంది. సుస్థిర పాలస్తీనా భవిష్యత్తుకు హామీగా వుంటుంది. పాలస్తీనా శరీరమైతే, గాజా… పిల్లల మెరిసే కళ్లు. పాలస్తీనా ఒక పాట అయితే, గాజా ఒక లాలిపాట. పాలస్తీనా వలసవాద వ్యతిరేక పోరాటమైతే, గాజా దాని చివరి సహనం. జీవితం-మరణం మధ్య వేలాడుతున్న విరామంలో గాజా మన కాలపు లాలిపాట. పాలస్తీనా కోల్పోయిన శరణార్థుల ఇంటి రూపకం. గాజా అనేక జీవితాల ప్రతిఘటన యొక్క ఆశ’ అంటూ- పాలస్తీనా తల్లుల హృదయఘోష ఈ లాలిపాట.పాలస్తీనా ఓ నెత్తుటి ప్రవాహం.

సొంత గడ్డ మీదే శరణార్థులుగా మిగిలిపోయిన దైన్యం వారిది. మాతృభూమిపై మమకారం, తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో ఎన్ని దెబ్బలు తిన్నా… త్యాగాలు చేస్తూ పోరాడుతున్నారు. ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం/ నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అంటాడు శ్రీశ్రీ. శత్రువుది సామ్రాజ్యవాద బలాన్ని దన్నుగా చేసుకున్న కండకావరం అయితే, పాలస్తీనియులది ఆత్మస్థైర్యం. పొరుగు దేశాల్లో తలదాచుకొంటూ… దేశం కోసం పోరాటం చేయడం పాలస్తీనా ప్రజలకే సాధ్యం. కాళ్ల కింద నేల ఉంటే నిలదొక్కుకొని, నిలబడి పోరాటం చేయొచ్చని, విజయం సాధించవచ్చని చైనా, వియత్నాం ప్రజలు నిరూపించారు. కానీ, పుట్టిన గడ్డపై నిలువ నీడలేక, కాళ్ల కింద నేల కోసం, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పోరాడాల్సిన రావడం చరిత్రలో అత్యంత విషాదం. వీరిది ధర్మాగ్రహం. ఏండ్ల తరబడి కొనసాగుతున్న అణచివేతకు ప్రతిఘటన. ఈ ప్రతిఘటన లాలిపాట రూపంలో పాలస్తీనా అంతటా ప్రతిధ్వనిస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయిన నవజాత శిశువులను, కాళ్లు, చేతులు కోల్పోయిన చిన్నారులను, శిథిలాల మధ్య శకలంలా చిక్కి రక్తమోడ్చుతున్న శరీరాలను మేల్కొలుపుతుంది. మాతృభాష మీద, మాతృభూమి మీద మమకారాన్ని రగుల్కొల్పుతుంది. అందుకే అక్కడి బిడ్డలు ఉగ్గుపాలతోటే ప్రతిఘటనను లాలిపాటగా ఒంటబట్టించుకుంటారు. కొనఊపిరి వున్నా… మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలను ఉగ్గబట్టుకుంటారు.

లాలిపాట-తల్లి, బిడ్డ, అమ్మమ్మ మధ్య పెనవేసుకున్న ఓ రాగ బంధం. యుద్ధంలో ఇద్దరు నిశ్శబ్ద బాధితులు – మహిళలు, పిల్లలు. ఈ కారణంవల్లే… లాలిపాట యొక్క ప్రతిఘటన అంత తీవ్రంగా వుంటుంది. అది మరణంలో కూడా చనిపోవడానికి నిరాకరిస్తుంది. పాలస్తీనా ప్రజల మనుగడలో, అస్తిత్వంలో, మాతభూమిలో నిలువ నీడ కోసం సాగించే పోరాటం ప్రతిఘటన రూపం. సామ్రజ్యవాదం చేసిన గాయాలను భరించి, ప్రతిఘటించే శక్తులుగా పాలస్తీనాలోని ప్రతి తల్లీ లాలిపాట పాడుతోంది. అక్కడ ఎగసే ధూళిలో, చిందే రక్తంలో ధ్వనిస్తుంది. అనాథలైన తన బిడ్డలను మాతృభూమి సాధనకు సన్నద్ధమవ్వమంటుంది. ‘అతను ఎన్నుకున్న బాట/ అందరికీ వెలుగు బాట/ అటు చూడండి పాలస్తీనా దేశభక్తుణ్ణి/ బతుకుతూనే, ప్రాణాలు విడుస్తూనే/ నిటారుగా నిలబడ్డవాడు/ పోరాడుతూనే వాస్తవం గ్రహిస్తాడు/ పోరాడుతూనే రేపు గురించి కలలు కంటాడు’ అంటాడు విలియం రెవేలి. కళ్ళ ముందే శత్రువు తన పిల్లల్ని నిలువునా చీరేస్తూంటే, తన ఇల్లు కనుమరుగైందని తెలిసి కూడా నిటారుగా నిలబడి పోరాడతాడు. ‘ఓ అన్యాయమా!/ నా కన్నీళ్ళు – భయం వల్ల వచ్చింది కావు/ నా కన్నీరు- మాతృదేశం కోసం’ అని 1937 నాటి పాలస్తీనా ‘ఖైదీ గీతం’ నేటికీ పోరాట స్ఫూర్తినిస్తూనే ఉంది. ఎందరో తల్లుల గర్భశోకం లాలిపాటై జ్వలిస్తూనే వుంటుంది.

➡️