మహిళలను మోసం చేసిన మోడీ

Mar 8,2024 07:20 #Editorial

ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, విద్య అందించడానికి, సంక్షేమ పథకాలను అమలు చేయటానికి ప్రభుత్వం రకరకాల స్కీమ్‌లను ప్రారంభించింది. కానీ పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదు. గ్రాట్యూటీకి అర్హులే అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా కేంద్ర పట్టించుకోలేదు. ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఎఎన్‌ఎమ్‌, సర్వశిక్షా అభియాన్‌, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కార్మికులకు కనీసం ఐఎల్‌సి సిఫార్సులు అమలు కావటం లేదు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని స్కీమ్‌ వర్కర్లు కోరుతున్నారు.

               ‘ప్రతి రోజు ఆకలితో చావటం కన్నా పోరాడుతూ చావటం మేల’నే నినాదంలో 1885లో న్యూయార్క్‌ నగరంలోని బట్టల మిల్లులో పనిచేసే మహిళా కార్మికులు సమ్మె చేశారు. సమ్మెను విచ్ఛిన్నం చేయటానికి నాటి పాలకులు వారి మీద కాల్పులు జరిపారు. అయినా భయపడకుండా పనిగంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని, ఉపాధి భద్రత కల్పించాలని దశలవారీగా అనేక పోరాటాలు చేశారు. పోరాటాలతోనే పాలకుల మెడలు వంచి మహిళా కార్మికులు అనేక హక్కులు సాధించుకున్నారు. ఆ పోరాట వారసత్వం కొనసాగించాలని కమ్యూనిస్టు ఇంటర్నేషనల లో క్లారాజట్కిన్‌, కృపస్కయా, అలెగ్జాండ్రా కొల్లంతారు తదితర మహిళా నేతలు చేసిన కృషి ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించారు. లింగ సమానత్వం సాధించటం ద్వారా మహిళలు ఆర్థికంగా సాధికారిత సాధించాలని ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో ప్రకటించింది. మహిళా ఆర్థిక సాధికారిత సాధించడమంటే పౌష్టికాహారం, విద్య, వైద్యం అందించడానికి ప్రభుత్వాలు బాధ్యత వహించాలని యునెస్కో కోరింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది.

మోడీ హయాంలో అట్టడుగుకు…

              భారతదేశం మానవాభివృద్ధి సూచీలో 132వ స్థానానికి, ప్రపంచ ఆకలి సూచీలో 111వ స్థానానికి పడిపోయింది. మహిళా అక్షరాస్యత 65 శాతానికి మించి లేదు. ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీలలో అయితే 50 శాతం లోపుగానే ఉంది. చిన్న పిల్లలు ఆహారం అందక చనిపోతున్నారు.42 శాతం పిల్లలు, 52 శాతం మహిళలు రక్తహీనతకు గురౌతున్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి. దేశంలో 90 శాతం మంది మహిళలు ఎటువంటి భద్రత, కనీస వేతనాలు లేని అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు.

రాష్ట్రంలోనూ అదే స్ధితి

               మన రాష్ట్రంలో బిల్డింగ్‌, బ్రాండెక్సు గార్మెంట్‌, ఆక్వా, బీడీ, పొగాకు గ్రేడింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లులు, చింతపిక్కలు, జీడిపిక్కలు, షాప్‌ ఎంప్లాయీస్‌, స్వయం ఉపాధి తదితర రంగాలలో లక్షలాది మంది మహిళలు అసంఘటిత కార్మికులుగా పని చేస్తున్నారు. షెడ్యూల్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారికి ప్రతి 5 సంవత్సరాలకు పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతన సవరణ జరగాలి. కాని రాష్ట్రంలో 15 సంవత్సరాల నుండి వేతన సవరణ జరగలేదు. ఫలితంగా కార్మికులకు అతి తక్కువ వేతనాలు అందుతున్నాయి. రూ. 5 నుండి రూ.10 వేల లోపు ఆదాయమే వస్తున్నది. ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, పెన్షన్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి కార్మిక చట్టాలు అమలు కావడంలేదు. లైంగిక వేధింపుల నిరోధానికి కమిటీలు వేయాలన్న సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ను బుట్టదాఖలు చేశారు. ఫలితంగా విజయనగరం బయోటెక్‌లో ఒక కార్మికురాలు వేధింపులు భరించలేక బయటకు వచ్చి కేసు నమోదు చేసినా ప్రభుత్వం నుండి కనీస చర్యలు లేవు. రెండు సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్‌, లేబర్‌ అధికారులు, దిశ పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. ఇది ఒక ఘటన మాత్రమే. ఇలాంటివి రాష్ట్రంలో కోకొల్లలు. అయినా పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు.

స్కీమ్స్‌ వర్కర్లకు ఉద్యోగ భద్రత !

                  ప్రజలకు ఆహారం, ఆరోగ్యం, విద్య అందించడానికి, సంక్షేమ పథకాలను అమలు చేయటానికి ప్రభుత్వం రకరకాల స్కీమ్‌లను ప్రారంభించింది. కానీ పేద గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదు. గ్రాట్యుటీకి అర్హులే అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా కేంద్ర పట్టించుకోలేదు. ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఎఎన్‌ఎమ్‌, సర్వశిక్షా అభియాన్‌, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కార్మికులకు కనీసం ఐఎల్‌సి సిఫార్సులు అమలు కావటంలేదు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని స్కీమ్‌ వర్కర్లు కోరుతున్నారు.

రాజ్యాంగ ఉల్లంఘన

           1950 లోనే ఆర్టికల్‌ (12,15,16) ద్వారా భారత రాజ్యాంగం స్త్రీపురుషులకు సమాన అవకాశాలు కల్పించింది. చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని 1996 నుండి మహిళలు పోరాడుతున్నారు. ఆ పోరాటాల ఫలితంగా 2010లో రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందినా లోక్‌సభలో అటకెక్కించారు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినా మోడీ మహిళా రిజర్వేషన్ల అమలు హామీ నిలబెట్టుకోలేదు. పదేళ్ల పాలన పూర్తి కావస్తున్న సమయంలో సరిగ్గా ఎన్నికల ముందు నక్కజిత్తులతో బిజెపి ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించింది. 2029లో నియోజక వర్గాల పునర్‌ విభజన తరువాత మాత్రమే మహిళా రిజర్వేషన్ల అమలులోకి వస్తాయని మెలిక పెట్టి మహిళలను మోసం చేశారు.

మహిళలకు రక్షణ కరువు

               గుజరాత్‌లో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మందిని సత్‌ ప్రవర్తన పేరుతో మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి వన్నె తెచ్చిన మహిళా రెజ్లర్లపై బిజెపి ఎం.పి లైంగిక వేధింపులకు పాల్పడినా ఎటువంటి చర్యా తీసుకోలేదు. మణిపూర్‌లో మహిళలను వివస్త్రలను చేసి నడిరోడ్డుపై ఊరేగించినా మోడీ ప్రభుత్వంలో చలనం లేదు. బిజెపి తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న వేలాది మంది రైతులు, మహిళల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. మన రాష్ట్రంలో ఈ కాలంలో హక్కుల, సమానత్వ సాధన కోసం మహిళా పోరాటాలు అనేకం జరిగాయి. వేతనాల పెంపు గ్రాట్యూటీ అమలు, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వ నిర్బంధాలు, ఎస్మా లాంటి చట్టాలనెదిరించి అంగన్వాడీలు 42 రోజులు చారిత్రాత్మక సమ్మె చేశారు. సర్వశిక్షా అభియాన్‌, ఆశా, మున్సిపల్‌ కార్మికులు సాహసోపేత పోరాటం చేశారు. ఈ పోరాటాలను అణచటానికి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించినా ప్రజలు, లబ్ధిదారుల మద్దతుతో పోరాడి విజయాలు సాధించారు. పోరాటాలతో ప్రారంభమై, అనేక హక్కులు సాధించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళా విముక్తి సాధనే లక్ష్యంగా సాగాలి.

శ్రామిక మహిళల డిమాండ్లు

  • స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనాలు రూ.26,000 చెల్లించాలి. పెన్షన్‌ రూ.10,000 ఇవ్వాలి.
  • అసంఘటిత రంగ, ఇంటి పనివారు, వ్యవసాయ కార్మికులతో సహా శ్రామిక మహిళలు అందరికీ సమాన పనికి సమాన వేతనం, మెటర్నటీ లీవ్‌ 6 నెలలు అమలు చేయాలి.
  • మహిళా కార్మికుల సంఖ్యతో సంబంధం లేకుండా పనిచేసే ప్రాంతాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి. మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు నిర్మించాలి. మహిళలకు రుతుక్రమం సమయంలో ప్రత్యేక సెలవులు, ఉచిత శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలి.
  • మహిళలపై సైబర్‌ బెదిరింపులు, వేధింపులు, హింసను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం చెయ్యాలి.
  • పెరుగతున్న నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలి. ఆహార వస్తువులపై జిఎస్‌టి రద్దు చేయాలి. 15 రకాల సరుకులను రేషన్‌ షాపుల ద్వారా అందించాలి.
  • పార్లమెంటు, అన్ని రాష్ట్ర అసెంబ్లీలలో 2024 నుండి 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలుచేయాలి.
  • పట్టణాలలో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్లను నిర్వహించాలి.
  • ప్రభుత్వ పథకాలకు బడ్జెట్‌ పెంచాలి. శ్రీ నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలి.
  • / వ్యాసకర్త : ఎ.పి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి /కె. సుబ్బరావమ్మ
    / వ్యాసకర్త : ఎ.పి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి /కె. సుబ్బరావమ్మ
➡️