అన్ని పంటలకూ, అన్ని కాలాల్లో ఎంఎస్‌పి

Mar 5,2024 07:20 #Editorial

మార్కెట్లోకి వచ్చిన ప్రతి పంటనూ, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయదు. ప్రభుత్వానికి అవసరమైనంత వరకే మద్దతు ధరకు కొంటుంది. మిగిలిన పంటను మార్కెట్‌ శక్తులే కొంటాయి. ప్రభుత్వం చట్టం చేయకపోతే మార్కెట్‌ శక్తులు సిండికేట్‌గా మారి ధరను పతనం చేస్తాయి. అనంతరం కృత్రిమ డిమాండ్‌ సృష్టించి… అవే అధిక ధరలకు ప్రజలకు అమ్ముతాయి. కనీస మద్దతు ధరల చట్టం లేకపోతే రైతుకూ, వినియోగదారుడికీ ఇద్దరికీ నష్టమే.

పంజాబ్‌, హర్యానా రైతులు ఈ నెల 13 నుండి ఢిల్లీ శింబు సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. 2021లో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతు ఉద్యమం మీద అనేకమంది మేధావులు రకరకాల ప్రశ్నలతో, సందేహాలతో, ప్రజల్లో పొరపాటు అభిప్రాయాలు కలిగిస్తున్నారు. డా|| స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం…23 పంటలకు కనీస మద్దతు ధర సి2+50 శాతం ప్రకారం ఇవ్వాలని రైతులు అడుగుతున్నారు. మోడీ ప్రధాని కాకముందే ఎన్నో సభల్లో మాట్లాడుతూ.. ‘స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను కాంగ్రెస్‌ అమలు చేయలేకపోయింది. అధికారంలోకి వచ్చాక మేము అమలు జరిపి తీరుతాం’ అని హామీ ఇచ్చారు. ప్రధాని అయ్యాక కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పి) అమలు చేయలేదు. పైగా తమ ప్రభుత్వం ఎమ్‌ఎస్‌పిని అమలు చేయలేదని సుప్రీంకోర్టుకు రాత పూర్వక అఫిడవిట్‌ ఇచ్చారు. 2020లో 13 నెలలకు పైగా జరిగిన ఆందోళన అనంతరం ప్రధాని ప్రజలకు క్షమాపణ చెప్పారు. కనీస మద్దతు ధరలు అమలు చేస్తామని చెప్పడమేగాక…మరోసారి మరికొన్ని హామీలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. దీంతో రైతు ఉద్యమం మళ్లీ ప్రారంభమైంది.

మద్దతు ధర ఇస్తే అభివృద్ధి అటకెక్కుతుందట !

                 కనీస మద్దతు ధర 23 పంటలకు ఇవ్వాలంటే రూ.10 లక్షల కోట్ల నుండి రూ.17 లక్షల కోట్లు అవసరమవుతాయని కొంతమంది మేధావులు తప్పుడు లెక్కలతో ప్రచారం చేస్తున్నారు. ఇది అమలు జరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం పెరుగుతుందని, విద్య, వైద్యం, అభివృద్ధి, దెబ్బ తింటుందని అంటున్నారు. ఇవేమీ వాస్తవం కాదు. ఆర్థికవేత్త క్రిసిల్‌ అంచనా ప్రకారం…రూ.21 వేల కోట్లు వెచ్చిస్తే భారత రైతాంగం మొత్తానికి కనీస మద్దతు ధరలు ఇవ్వగలమని చెప్తున్నారు. మన ప్రధాని 55 నెలల్లో 92 దేశాల పర్యటనకుగాను భారత ప్రభుత్వం రూ.254 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రధాని దుస్తుల కోసం రూ.100 కోట్ల పైనే ఖర్చు పెట్టింది. మేధావులు ఈ ఖర్చు గురించి మాత్రం మాట్లాడరు. రైతాంగంపై ఖర్చు పెట్టే విషయంపైన దుష్ప్రచారం చేస్తారు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి పంటనూ, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయదు. ప్రభుత్వానికి అవసరమైనంత వరకే మద్దతు ధరకు కొంటుంది. మిగిలిన పంటను మార్కెట్‌ శక్తులే కొంటాయి. ప్రభుత్వం చట్టం చేయకపోతే మార్కెట్‌ శక్తులు సిండికేట్‌గా మారి ధరను పతనం చేస్తాయి. అనంతరం కృత్రిమ డిమాండ్‌ సృష్టించి…అవే అధిక ధరలకు ప్రజలకు అమ్ముతాయి. కనీస మద్దతు ధరల చట్టం లేకపోతే రైతుకూ, వినియోగదారుడికీ ఇద్దరికీ నష్టమే.

కారుచౌకగా కొని.. నషాళానికంటే ధరకు…

                        కిన్నో పండును రైతు నుండి 5 రూపాయలకు కొని సూపర్‌ మార్కెట్లు అదే పండును రూ.50కి అమ్ముతున్నాయి. కనీస మద్దతు ధర చట్టం లేదు కాబట్టి అతి తక్కువ ధరకు కొని 10 రెట్లు పెంచి దళారులు అమ్ముకుంటున్నారు. బస్తా ధాన్యం రూ. 1600 పెట్టి కొంటే కిలో బియ్యం రూ.28కి అమ్మవచ్చు. ప్రస్తుతం కిలో బియ్యం సుమారు రూ.60 ఉంది. ధాన్యాన్ని కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2,183 పెట్టి కొనడం లేదు. కేజీ బియ్యం రూ.28కీ అమ్మడంలేదు. బీహార్‌లో మార్కెటింగ్‌ వ్యవస్థ ఎప్పుడో దెబ్బతింది. అక్కడ పంటలకు ధరలు తక్కువగా వస్తున్నాయి. వరికి కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2,183 మద్దతు ధర ప్రకటించింది. స్వామినాథన్‌ కమిటీ సిఫారసు ప్రకారమైతే వరికి క్వింటాకు రూ.2,838 రావాల్సి ఉంది. బీహార్‌లో మార్కెటింగ్‌ వ్యవస్థ లేకపోవడం వల్ల క్వింటా వడ్లను రూ.1200కి అంతకంటే తక్కువకు కొని..అదే వ్యాపారులు పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు తరలించి రూ.2,183 మద్దతు ధర పొందుతున్నారు. అలాగే గోధుమలకు కేంద్ర ప్రభుత్వం రూ.2,125 మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్లో దళారులు రూ.1800 అంతకంటే తక్కువ ధరకు కొంటున్నారు. దీన్నిబట్టే దళారులు ఏ విధంగా దోచుకుంటున్నారో గమనించవచ్చు. మార్కెట్లో డిమాండు- సరఫరాను బట్టి ధరల్లో మార్పులు వస్తుంటాయి. దానిని కనీస మద్దతు ధరల చట్టం ద్వారా కట్టడి చేయవచ్చు.

అటకెక్కిన నివేదికలు

                  14 శాతం మంది రైతులు కనీస మద్దతు ధర పొందుతున్నారని పార్లమెంట్లో ప్రభుత్వం చెప్పింది. ఆరు శాతం మంది రైతులే ఎంఎస్‌పి పొందుతున్నారని శాంత కుమార్‌ కమిటీ చెప్పింది. చాలా తక్కువ మంది రైతాంగం మద్దతు ధరలు పొందుతున్నారు కనుక అసలు మద్దతు ధర వ్యవస్థనే రద్దు చేద్దామని కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. పార్లమెంట్‌ లెక్కలే తీసుకుంటే 86 శాతం మంది రైతులు మద్దతు ధరలు పొందలేక నష్టపోతున్నారు. మార్కెట్‌ శక్తుల మీద ఆధారపడుతున్నారు. తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారు. పంట ఉత్పత్తి ఖర్చులు, పంట పంటకూ, ప్రాంతానికి ప్రాంతానికీ వేర్వేరుగా ఉంటుంది కాబట్టి..అన్ని పంటలకూ అన్ని ప్రాంతాలకూ కనీస మద్దతు ధరలు నిర్ణయించడం, చట్టం చేయడం ప్రభుత్వానికి కష్టంగా ఉంటుందంటున్నారు. 1980లో పంజాబ్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎస్‌ఎస్‌ జోహల్‌ పంటల వైవిధ్యం మీద రిపోర్టును ప్రభుత్వానికి అందించారు. ప్రధాని ఆర్థిక సలహాదారు డాక్టర్‌ అరవింద సుబ్రమణ్యన్‌ అపరాల మీద 2016లో నివేదిక ఇచ్చారు. ఈ కమిటీల రిపోర్టులను అటకెక్కించారు. ఉత్పత్తి ఖర్చులు మరీ ఎక్కువగా వున్న చోట రాష్ట్ర ప్రభుత్వం కొంత భాగాన్ని భరించి, తద్వారా రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేరళ, చత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధర అందించడానికి గాను…ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత బోనస్‌గా ప్రకటించి రైతులకు ఇస్తున్నాయి.

మన దేశంలో సబ్సిడీలు చాలా తక్కువ

                 స్పెయిన్‌ దేశంలో కనీస మద్దతు ధరల చట్టం ఉంది. అక్కడ అన్ని పంటలు కనీస మద్దతు ధరకంటే తక్కువగా కొనకుండా చట్టం ఉంది. మరికొన్ని దేశాలు రైతుల కోసం ఇతోధికంగా సబ్సిడీలు ఇస్తున్నాయి. అమెరికాలో ఏడాదికి రైతుకు రూ.79 లక్షలు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు. యూరోప్‌లో 100 బిలియన్‌ డాలర్లు సబ్సిడీగా ఇస్తున్నారు. మన దేశంలో కొద్దిమంది రైతులకు మాత్రమే రూ.6 వేలు నగదు సబ్సిడీగా ఇస్తున్నారు. అదీ రకరకాల ఆంక్షలు పెట్టి. లబ్ధిదారుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తున్నారు. స్వామినాథన్‌ చెప్పినట్లు… మద్దతు ధరలు ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం అదనంగా ఇవ్వాల్సిందేనా అనే ప్రశ్న వస్తోంది. ఐదు లేదా పది శాతానికి తగ్గించుకోవచ్చు కదా అనే వాదనలూ ఉన్నాయి. జాతీయ వ్యవసాయ విధానాల విశ్లేషకులు దేవేంద్ర శర్మ చెబుతున్నది ఏమంటే.. మందుల కంపెనీలు 500 శాతం లాభాలు పోగేసుకుంటుంటే అభ్యంతరం చెప్పడంలేదు. ఇతర పరిశ్రమలూ వంద నుంచి 500 శాతం వరకు లాభాలు ఆర్జిస్తున్నాయి. అలాంటప్పుడు రైతుల ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం అదనంగా ఇవ్వడంలో తప్పేముంది?

రైతు సగటు కుటుంబ ఆదాయం హీనం

                 భారతీయ రైతు సగటు కుటుంబ ఆదాయం నెలకు రూ.10,218. దీనిలోనే తన కుటుంబంలోని ఇతర సభ్యులు చేసే ఇతర వృత్తుల ఆదాయమూ కలిపి ఉంది. ఒక జాతీయ సర్వే రిపోర్టు ప్రకారం…17 రాష్ట్రాలలో సర్వే చేస్తే కేవలం వ్యవసాయం ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి నెలకు వస్తున్న ఆదాయం రూ.1700. ఈ సర్వే ప్రకారం దేశంలో సగానికి పైగా రైతులు నెలకు రూ.1700 మాత్రమే పొందుతున్నారు. అంటే రోజుకు సుమారుగా రూ.27 ఆదాయంతో భారతీయ రైతు కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇది ఎంత చిన్న మొత్తం? రైతు కుటుంబాలు ఎలా బతుకుతాయి? పరిశీలించాల్సిన అవసరం సమాజం మీద ఉంది. ప్రభుత్వాలు ‘హరిత విప్లవం’, ‘నీలి విప్లవం’ అంటూ ఉత్పత్తినీ ఉత్పాదకతనూ పెంచటానికి ప్రణాళికలు వేశాయిగాని, రైతుల సంక్షేమం కోసం, వారి మెరుగైన జీవితం కోసం ఏ ప్రణాళికలూ వేయలేకపోయాయి.

కార్పోరేట్లకు రుణమాఫీ చేసినప్పుడు గుర్తురాదా

             మద్దతు ధరలు అమలు చేస్తే దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలు ప్రభుత్వానికి భారమవుతాయి కదా అంటున్నారు కొందరు. వారందరికీ పంటలు పండించేది రైతులే. నిజానికి దేశ జనాభాలో రైతులూ అంతర్భాగంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలి. నగదు బదిలీ లేదా కనీస ధర ఏదో ఒకటి అమలు చేస్తే చాలు కదా అంటే రెండూ కావాలంటున్నారు దేవేంద్ర శర్మ. ఇలా చేస్తే విద్యా, వైద్యం, అభివృద్ధికి ఆటంకం అవుతుందనే వారు, పురాతన భావాలతో బతికేవారు ఈ కాలానికి అనుగుణంగా మారాలంటారాయన. పరిశ్రమలు తమ వ్యక్తిగత లాభాల కోసం నడుపుతున్నారు. రైతులు దేశ ప్రజలకు అన్నం పెట్టడానికి వ్యవసాయం చేస్తున్నారు. దేశంలో బడా కార్పొరేట్‌ కంపెనీలకు రూ.14 లక్షల కోట్లు మాఫీ చేసినప్పుడు ఈ మేధావులకు విద్యా, వైద్యం, అభివృద్ధి గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం.గ్రామీణ ఉపాధి హామీ పథకం కొత్తగా వచ్చినపుడు కూడా వీరంతా గగ్గోలు పెట్టారు. ఉపాధి హామీ పథకం వల్ల కూలి పెరిగి, వలసలు తగ్గి కొంతమందైనా గౌరవప్రదంగా బతుకుతున్నారన్నది వాస్తవం. అయితే ఇదే బాపతుకు చెందిన కొందరు…రైతు ఉద్యమాలపై విడ్డూరమైన వాదనలు చేస్తున్నారు. రైతుల ముసుగులో భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరినట్లు, ఆందోళన జరిగిన ప్రాంతాల్లో ట్రాక్టర్ల కంటే ఖరీదైన వాహనాల్లో వచ్చినట్లు, చట్టాన్ని వీరు చేతుల్లోకి ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే హర్యానా పోలీసులు తమ సరిహద్దు దాటి (పోలీసు మాన్యువల్‌ను అతిక్రమించి) పంజాబ్‌ సరిహద్దులకు వెళ్లి జరిపిన తుపాకీ కాల్పుల్లో యువ రైతు శుభ కరణ్‌సింగ్‌ చనిపోయినది మాత్రం వారికి కనిపించలేదు. సోషల్‌ మీడియా అకౌంట్లు రద్దు చేయడం వారికి తప్పనిపించలేదు. వాస్తవానికి రైతులు ఎక్కడా చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు. ప్రభుత్వమే జల ఫిరంగులను, బాష్పవాయు గోళాలను, రబ్బర్‌ తూటాలుతోపాటు, ఒక కొత్త రకం రసాయనాన్ని గాలిలోకి వదిలి రైతుల కళ్లూ చెవులూ దెబ్బతినేలా చేసింది. ఇది భారత ప్రజల మీద, ప్రజలందరికీ ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే వారి పైన చేయాల్సిన పనేనా అని సభ్య సమాజం ఆలోచించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సమస్యలను పరిష్కరించి, కనీస మద్దతు ధర చట్టం చేస్తేనే డా||ఎంఎస్‌ స్వామినాథన్‌కు ఇచ్చిన భారతరత్నకు సార్థకత.

( వ్యాసకర్త ఎ.పి కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి )ఎం. హరిబాబు
( వ్యాసకర్త ఎ.పి కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి )ఎం. హరిబాబు
➡️