ఓటు మన అస్తిత్వం

Jan 21,2024 07:10 #Editorial, #Special Days, #voter
national voters day editorial

ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఓటు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ఆ దేశ స్థితిగతులను ప్రభావితంచేసే శక్తి ఓటుకుంది. ‘ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే ప్రతి పౌరుడు తన అంతరంగంలో ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవరుచుకోవాలి. ప్రజాస్వామ్య సంస్కారం బయట ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మనలో నుంచే వచ్చింది’ అంటాడు గాంధీజీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే..ఆ ప్రజాస్వామ్యాన్ని సరైన దిశలో నడిపించగల ప్రజాప్రతినిధులను ఎన్నుకునే బాధ్యత, హక్కు తమదేనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మనోభావాలను ప్రకటించే ఆయుధం ఓటు. ఇది భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ‘ఓటు అనే ఆయుధంతో/ పోరాడుతావో/ నోటు అనే వ్యసనంతో/ మరణిస్తావో’నని ఓ కవి అన్నట్టు-ఆ ఓటు.. నోటుకు లొంగిపోతే ప్రజలు ప్రశ్నించేతత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. భారత రాజ్యాంగంలోని 324 అధికరణం ద్వారా కల్పించిన ఈ సార్వత్రిక ఓటు హక్కు 1950 నుంచి అమల్లోకి వచ్చింది. ఓటుకున్న ప్రాధాన్యతను, విలువను దేశ ప్రజలందరికీ తెలియజెప్పేందుకు, అర్హులైన యువతీయువకులను ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది జనవరి 25న ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నిర్వహిస్తారు.

ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గతేడాది నుంచీ ఓటర్ల జాబితా సవరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బోగస్‌ ఓట్లు చర్చనీయాంశంగా మారింది. మృతులు, వలస వెళ్ళిన వారి ఓట్లు తొలగించకపోవడం, ఇతర ప్రాంతాల వారి పేర్లు జాబితాలో నమోదు చేయడం, ఒకే ఇంటి నెంబరులో పది-ఇరవై మంది కంటే మించి ఓటర్లు వుండడం వంటి అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. తిరుపతి ఉపఎన్నికలో 30 వేలకు పైగా ఓటర్‌ గుర్తింపు కార్డులు ఆనాడు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఐడీ నుంచే డౌన్‌లోడ్‌ అయినట్టు నిర్ధారణ అవడంతో ఎన్నికల సంఘం సదరు అధికారిని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఓట్ల తొలగింపునకు భారీ ఎత్తున దరఖాస్తులు రావడమే దీనికి కారణం. సాధారణంగా ఎవరైనా వ్యక్తి మరణిస్తేనో, ఇతర ప్రాంతాలకు వెళితేనో ఓటు హక్కును తొలగించాలని ఫారం-7 దరఖాస్తులు సమర్పిస్తారు. అయితే, ఇటీవల ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి ఓట్లను తొలగించేందుకు భారీగా ఫారం-7 దరఖాస్తు చేసినట్లు తీవ్ర ఆరోపణలొచ్చాయి. అన్నిరకాల ఎన్నికల్లోనూ ఈ బోగస్‌ ఓట్లు నమోదవుతున్నాయి. దీనిపై అధికార, ప్రధాన ప్రతిపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమూ పరిపాటిగా మారింది. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే విధంగా బోగస్‌ ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఏదిఏమైనా ఎన్నికలకు ప్రాథమిక ఆధారం ఓటర్‌ జాబితా. అది తప్పుల తడికగా వుంటే జరిగే ఎన్నిక కూడా అలాగే వుంటుంది. అయోగ్యులు అందలం ఎక్కడానికి అది తొలి మెట్టు అవుతుంది. కాబట్టి ఓటరు జాబితా ప్రక్షాళన జరిగితీరాలి. అర్హులందరూ జాబితాలో వుండేట్లు, అనర్హులు ఒక్కరు కూడా లేకుండా ఓటరు జాబితాలను పకడ్బందీగా రూపొందించడం ఎన్నికల కమిషన్‌ బాధ్యత. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి.

‘కూటికి గుడ్డకున్‌ ప్రజలు, కొంగరవోవుచుండ నీటుగా/ మోటారూబండ్లపై నగదు మూటలతో కలవారి వోటు భి/ క్షాటన సాగుచున్నయది జాగ్రత! దేశ నివాసులారా! మీ/ యోటులు స్వీయభారత సముజ్వల గాత్రికి సూత్ర బంధముల్‌’ అంటాడు జాషువా. అయోగ్యులకు ఓటు వేస్తే దేశాన్ని సమస్త కష్టాలకు గురిచేస్తారని 60వ దశకంలోనే ఆయన హెచ్చరించాడు. క్రియాశీలకంగా పాల్గొనాల్సిన యువత.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సాధారణ ఎన్నికల్లో యువత ఓటింగ్‌ శాతం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఉంటోంది. చదువుకున్న వారు ఓటింగ్‌పై ఆసక్తి చూపడం లేదు. ‘మీకు ఓటు హక్కు ఇచ్చింది రాజులా బతకమని, బానిసలా బతకమని కాదు’ అంటారు అంబేద్కర్‌. ‘ప్రతి ఓటును లెక్కించడం, ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకూడదు’ అన్న థీమ్‌తో ఈ ఏడాది నిర్వహించే ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. పాత, కొత్త ఓటర్లు ముసాయిదాలో తమ ఓటును సరిచూసుకోవాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ‘జాగ్రత్త/ ప్రతీ ఓటూ/ ఒక పచ్చి నెత్తురు మాంసం/ చూస్తూ చూస్తూ వేయకు ఎదో గద్దకు/ అది కేవలం కాగితం మీద గుర్తు కాదు/ జీవితం కింద ఎర్తు’ అంటాడు అలిశెట్టి ప్రభాకర్‌. విచక్షణతో ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది.

➡️