‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ నియంతృత్వం కోసమే

Mar 23,2024 04:45 #edite page

గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజలలో మతపరమైన విభజన తెచ్చే విధంగా, బిజెపి ఆధిపత్యాన్ని పెంచే విధంగా కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌370వ ఆర్టికల్‌ రద్దు చేయటం, పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయటానికి నోటిఫికేషన్‌ జారీ చేయటం, మైనారిటీలపై దాడులు, రామాలయ నిర్మాణం…మొదలైనవన్నీ ప్రజల మధ్య మతపరమైన విభజన తెచ్చి బిజెపి రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకొనేందుకు చేసిన ప్రయత్నాలే.జమిలి ఎన్నికల ద్వారా తమ ఆధిపత్యాన్ని పెంచుకోవటానికి రాజకీయంగా కేంద్రంలోనుఅన్ని రాష్ట్రాలలోను తమ ప్రాబల్యం కొనసాగాలని భావిస్తున్నది.

నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి వచ్చాక భారత ప్రజల భిన్నత్వ, బహుళత్వ సంస్కృతిపై దాడి ప్రారంభమైంది. రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలకు విఘాతం కలిగే విధంగా మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఒకే రకమైన పన్ను, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, ఒకే రకమైన తిండి మొదలైనవి ఉండాలని మోడీ ప్రభుత్వం అభిలషిస్తున్నది. వీటితో పాటు ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ పేరుతో లోక్‌సభకు, శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆతృత వ్యక్తం చేస్తున్నది. గతంలోనే ఆ నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేసిన ప్రసంగంలో జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని పిలుపు ఇచ్చారు. ఆ నాటి న్యాయశాఖామంత్రి రవిశంకర ప్రసాద్‌ న్యాయ వ్యవస్థ కూడా జమిలి ఎన్నికలకు అనుకూలంగా స్పందించాలని కోరారు. లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఖర్చు తగ్గిపోతుందని, అభివృద్ధిపై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందని, శాంతిభద్రతల సమస్యలు తగ్గిపోతాయని నరేంద్ర మోడీ అంటున్నారు.

రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సులు
కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కొంతమంది సభ్యులతో జమిలి ఎన్నికలపై కమిటీని నియమించినది. ఈ కమిటీ జమిలీ ఎన్నికలను బలంగా సమర్థిస్తూ కొద్దిరోజుల క్రితం 18,000 పేజీల నివేదికను సమర్పించింది. నరేంద్ర మోడీ కలలు కంటున్న ఒకే దేశం -ఒకే ఎన్నికను ఆచరణ సాధ్యం చేయటానికి వీలుగా నివేదికను రూపొందించింది. రాజ్యాంగంలో ఐదు ఆర్టికల్స్‌ను సవరణ చేయడం ద్వారా జమిలి ఎన్నికలను 2029 నాటికి ఆచరణలోకి తేవచ్చని కమిటీ ప్రతిపాదించింది. లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం, ఆ తరువాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయటం, ఒకే ఓటర్ల జాబితా, ఒకే ఐడెంటిటీ కార్డు మొదలైన ప్రతిపాదనలను ఈ కమిటీ సిఫార్సు చేసింది. 47 రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలను తెలిపాయని, వీటిలో 32 పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలంగా వున్నాయని ఈ కమిటీ పేర్కొన్నది. మొత్తంమీద ఈ కమిటీ నరేంద్ర మోడీ, అమిత్‌ షా అభిప్రాయాలకు అనుగుణంగా ఈ నివేదికను రూపొందించింది.

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
జమిలి ఎన్నికలు భారత రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. భారత రాజ్యాంగంలో ఒకటవ నిబంధన భారతదేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్‌’గా పేర్కొన్నది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు బలంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. రాజ్యాంగం ఏడవ షెడ్యూలులో అధికారాలు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించారు. ఈ అధికారాలు అమలు చేయటానికి కేంద్రం, రాష్ట్రాలలో ఒకే పార్టీ వుండాలనే సూత్రం లేదు. అమెరికాలో అధ్యక్షుడు ఒక పార్టీకి చెందితే, రాష్ట్రాలలో గవర్నర్‌లు ఇంకొక పార్టీకి చెందినవారు ఎన్నిక కావటం సాధారణమైన విషయం. మన దేశంలో 1952, 1957, 1962 సాధారణ ఎన్నికలలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలలో (1957లో కేరళ మినహాయిస్తే) గెలుపొందింది. 1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ లోక్‌సభలో స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చి, 8 రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఓటమి చెంది ఇతర పార్టీల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో వుంటే, రాష్ట్రాలలో భిన్నమైన పార్టీలు అధికారంలో వుంటున్నాయి. ఉదాహరణకు 1980 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇందిరా గాంధీ నాయకత్వాన కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలో వుంటే రాష్ట్రాలలో జ్యోతిబసు, యన్‌.టి.రామారావు, రామకృష్ణ హెగ్డే, ఫరూక్‌ అబ్దుల్లా, ఇ.కె.నయనార్‌ మొదలైనవారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో మార్పు రావాలని, రాష్ట్రాలకు ఇంకా ఎక్కువ అధికారాలు ఉండాలని, ఆర్థిక వనరుల పంపిణీలో రాష్ట్రాలకు ప్రాధాన్యత పెరగాలని ఆ నాడు వారు డిమాండ్‌ చేశారు. అందువలనే 1983లో ఇందిరా గాంధీ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సర్కారియా కమిషన్‌ను నియమించారు. అందువల్ల జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని వ్యతిరేకించవలసిన అవసరమున్నది.

బహు పార్టీ విధానం – సంకీర్ణ రాజకీయాలు
భారతదేశంలో చారిత్రక పరిస్థితులు, భిన్నత్వం దృష్ట్యా బహు పార్టీ విధానం ఏర్పడింది. జాతీయ ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీలను జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలుగా గుర్తిస్తున్నది. భారతదేశంలో గత 4 దశాబ్దాలుగా మారిన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. జాతీయ స్థాయిలో 1989లో ప్రారంభమైన సంకీర్ణ రాజకీయాలు 2009 వరకు కొనసాగాయి. 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009 లలో జరిగిన లోక్‌సభల ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకీ మెజార్టీ రాలేదు. 1989, 1996, 1998లలో ఏర్పడిన లోక్‌సభలు ముందే రద్దయ్యాయి. జమిలి ఎన్నికలు జరిగినప్పటికి లోక్‌సభ, శాసనసభలు ముందే రద్దుకావనే గ్యారంటీ ఏమున్నది? భారత రాజ్యాంగంలో 83వ నిబంధన లోక్‌సభ, 172వ నిబంధన శాసనసభ ముందే రద్దు కావడానికి అవకాశం కల్పించాయి. అందువలనే రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ రాజ్యాంగంలో ఐదు ఆర్టికల్స్‌ను సవరణ చేయాలని ప్రతిపాదించింది. ఆ విధమైన సవరణలు చేస్తే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నియంతృత్వాన్ని సమర్థించడమే అవుతుంది.

ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు
ప్రస్తుతం భారతదేశంలో సామాజిక ఆకాంక్షలు, ప్రాంతీయ ఆకాంక్షలు పెరిగాయి. దీనివలన ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరిగింది. లోక్‌సభ ఎన్నికలలో ప్రజల మనోభావాలు ఒకరకంగా ఉంటే, శాసనసభల ఎన్నికలలో మరో విధంగా ఉండవచ్చు. లోక్‌సభ ఎన్నికలను సాధారణంగా జాతీయ ప్రాధాన్యత గల అంశాలు, శాసనసభల ఎన్నికలను రాష్ట్ర స్థాయిలో ఉండే అంశాలు ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు 2014 లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీలో ఏడు స్థానాలు బిజెపి గెలుపొందగా, కొద్ది నెలల తర్వాత జరిగిన శాసనసభల ఎన్నికలలో ఢిల్లీలోగల 70 శాసనసభ స్థానాలలో 67 స్థానాలను ఆప్‌ పార్టీ గెలుపొందింది. కర్ణాటకలో 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుపొందగా, కొద్దినెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలలో రామకృష్ణ హెగ్దే నాయకత్వాన గల జనతాపార్టీ గెలుపొందింది. అందువలన జమిలి ఎన్నికలు ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉండవని రాజకీయ నిపుణులు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

నరేంద్ర మోడీ ఆలోచనలు-రాజకీయ నియంతృత్వం
నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 మే లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చి, తిరిగి 2019లో గెలుపొందింది. గత పదేళ్లుగా నరేంద్ర మోడీ, అమిత్‌షా ద్వయం అనుసరిస్తున్న రాజకీయ విధానాలు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల కనుగుణంగా కొనసాగుతున్నాయి. కేంద్రస్థాయిలోను అన్ని రాష్ట్రాలలోను బిజెపి కానీ లేదా బిజెపికి అనుకూలమైన పార్టీలు ఉండాలనే ధోరణి బలంగా కనిపిస్తున్నది. అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకోవటం, చీల్చివేయటం జరుగుతున్నది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌ మొదలైన రాష్ట్రాలలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు దీనిని తెలుపుతున్నాయి.
గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజలలో మతపరమైన విభజన తెచ్చే విధంగా, బిజెపి ఆధిపత్యాన్ని పెంచే విధంగా కొనసాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌ 370వ ఆర్టికల్‌ రద్దు చేయటం, పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయటానికి నోటిఫికేషన్‌ జారీ చేయటం, మైనారిటీలపై దాడులు, రామాలయ నిర్మాణం…మొదలైనవన్నీ ప్రజల మధ్య మతపరమైన విభజన తెచ్చి బిజెపి రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకొనేందుకు చేసిన ప్రయత్నాలే. జమిలి ఎన్నికల ద్వారా తమ ఆధిపత్యాన్ని పెంచుకోవటానికి రాజకీయంగా కేంద్రంలోను అన్ని రాష్ట్రాలలోను తమ ప్రాబల్యం కొనసాగాలని భావిస్తున్నది.

జమిలి ఎన్నికలు – భావోద్వేగాలు
జమిలి ఎన్నికలు జరిపితే, ఎన్నికలు జరిగే సమయంలో ప్రజల భావోద్వేగాలను విదేశీ దాడుల పేరుతోనో, రామాలయం నిర్మాణం పేరుతోనో మతపరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టో కేంద్రంలో అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావచ్చని నరేంద్ర మోడీ, అమిత్‌ షా ద్వయం భావిస్తున్నది. మన దేశంలో అనేక సందర్భాలలో ప్రజలు భావోద్వేగాలకు గురికావటం గతంలో జరిగింది. ఉదాహరణకు గత ఎన్నికలకు ముందు పుల్వామా సంఘటన ద్వారా ప్రభుత్వం లాభపడింది. ప్రస్తుత ఎన్నికలలో నరేంద్ర మోడీ పర్యటనకు వెళ్లిన అనేకచోట్ల అభివృద్ధి గురించి కాకుండా రామాలయ నిర్మాణం గురించే ప్రస్తావన చేస్తున్నారు. భావోద్వేగాలను రెచ్చగొడితే ధరలు, నిరుద్యోగం, అవినీతి మొదలైన అంశాల చర్చ లేకుండా చేయవచ్చు. జమిలి ఎన్నికలు ప్రవేశపెట్టి భావోద్వేగాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని వీరు భావిస్తున్నారు.
రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకుని, రాజ్యాంగ సవరణలు చేసి 2029 నాటికి ఆచరణలోకి తేవాలని నరేంద్ర మోడీ, అమిత్‌ షా ద్వయం పట్టుదలగా ఉన్నట్లు కనపడుతుంది. వీరి రాజకీయ, సామాజిక నియంతృత్వ విధానాలను అడ్డుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్య, లౌకిక శక్తులపై ఉన్నది. జమిలి ఎన్నికలలో జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా నష్టపోతాయి. లోక్‌సభ ఎన్నికలలో, శాసనసభల ఎన్నికలలో ప్రజలు వేరు వేరు అంశాలు ఆధారంగా ఓటు చేస్తారు. మందబలంతో రాజ్యాంగ సవరణలు చేసి బిజెపి ఈ విధానాన్ని దేశంపై రుద్దే అవకాశమున్నది. రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి భిన్నమైన జమిలి ఎన్నికలను ప్రజాస్వామ్య వాదులందరూ వ్యతిరేకించాలి.

/ వ్యాసకర్త శాసనమండలి సభ్యులు, సెల్‌ : 8309965083 / కె.యస్‌. లక్ష్మణరావు

➡️