విధానాలే ప్రధానంగా ఎన్నికల పోరాటం

తీవ్ర స్థాయిలో జరిగిన ఎన్నికల పోరాటం ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఆదివారం లోగానే ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేస్తాయి. స్థూలంగా రాజకీయ చిత్రం గోచరమవుతుంది. ఎందుకంటే 2024 ఎన్నికల పోరాటం వివిధ పక్షాలకు పెద్ద సవాల్‌గానే మారింది. లౌకికతత్వం, కేంద్ర పెత్తనం, మోడీ నిరంకుశ పోకడలు పెద్ద చర్చకే దారితీశాయి. తెలుగు రాష్ట్రాలలో ఎ.పి ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌ మలి విజయమా లేక చంద్రబాబు నాయుడు ఎన్‌డిఎ పునరాగమనమా అన్నది దేశవ్యాపిత ఆసక్తి నెలకొంది. తెలంగాణలోనూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని తొలి కాంగ్రెస్‌ ప్రభుత్వం లోక్‌సభ స్థానాలలో ఆధిక్యత సాధించి స్థిరపడుతుందా, బిఆర్‌ఎస్‌ భవిష్యత్‌ ఎలా వుంటుంది, బిజెపి పెరుగుతుందా అన్న అంశం కూడా ఉత్కంఠ కలిగించింది. జాతీయ స్థాయిలో బిజెపి ఎన్‌డిఎ కూటమి, కాంగ్రెస్‌ ‘ఇండియా’ వేదిక, ప్రాంతీయ పార్టీలూ వామపక్షాలూ హోరాహోరీగా తలపడిన ఈ పోరాటంలో ప్రజల తీర్పు ఎలా వుంటుందనేది జూన్‌ నాలుగున తేలిపోతుంది. దీనిపై పలురకాల విశ్లేషణలు, సర్వేలు, అంచనాలు, వాదోపవాదాలు, తిట్లూ శాపనార్థాలూ సాగిపోతున్నాయి. బహుశా ఫలితాల తర్వాతా ఈ వాతావరణం కొద్ది రోజులపాటు కొనసాగుతుంటుంది. ఈ నేపథ్యంలో మౌలికంగా మీడియా సంస్థల, సంఘాల, నేతల పాత్ర ఏంటి అన్నది ఇప్పుడు మనం తేరిపార చూసే అవకాశమేర్పడింది. ఫలితాలతో నిమిత్తం లేకుండా ఈ ఎన్నికల పోరాటం నేర్పిన పాఠమేంటి అన్నది చెప్పుకునే సందర్భం ఇది.

వ్యవస్థలు, విధానాల చర్చ
ఈ ఎన్నికల పోరాటం వివాదాల నుంచి విధానాల వైపు, వ్యక్తుల నుంచి వ్యవస్థల వైపు మరలించడం సైద్ధాంతిక శక్తుల తొలి విజయం. ఓసారి వెనక్కు తిరిగి చూస్తే విశ్వగురు మోడీ విజయ యాత్రలా మార్చి ‘అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌’ (ఈ సారి నాలుగు వందల సీట్లు) అంటూ హంగామాగా మొదలైంది. ఇప్పుడెవరూ ఆ మాట అనడం లేదు. అసలు ఆ మాటే మాది కాదు, ప్రజల నుంచి తీసుకున్నామని మోడీనే చెప్పుకోవలసిన స్థితి. బిజెపికి బాగా అనుకూలంగా మాట్లాడే సంస్థలూ వ్యక్తులూ కూడా ఏదో విధంగా మెజార్టీ వస్తుందని సరిపెడుతున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌, సి ఓటర్‌ యోగేంద్ర దేశ్‌ముఖ్‌, యోగీంద్ర యాదవ్‌ ఇలా రకరకాల వ్యక్తులను తీసుకుంటే 300కు దగ్గరగా సరిపెడుతున్నారు. తాజాగా అంచనాలు విడుదల చేసిన యోగేంద్ర యాదవ్‌ కూడా బిజెపికి మెజార్టీ రాదంటూనే మిత్రపక్షాలతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నారు. అమెరికా నుంచి కూడా కొందరు మేధావులు తరలి వచ్చి మోడీ విజయం అంటూ అంచనాలు ప్రకటించి వెళ్లారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో బంధమే దెబ్బ తీస్తుందన్న భయంతో బిజెపితో దానిపై ఆధారపడి లేదని నడ్డాతో అనిపించి మరో నాటకం నడిపించారు. మరో వంక బిజెపి యేతర ప్రభుత్వమే వస్తుందని ‘ఇండియా’ వేదిక నాయకులంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌, చిదంబరం వంటి వారు ఆ మేరకు వివరంగా ప్రకటనలు చేశారు. బిజెపికి పోటీ కాంగ్రెస్‌ మాత్రమేనన్న వాదనలూ తగ్గి 100-125 దాటవని చెబుతున్నారు. మరో వంక మమతా బెనర్జీ వంటి అవకాశవాదులు తాము ‘ఇండియా’ను బయటి నుంచే బలపరుస్తామంటూ తదుపరి ఎత్తులకు అవకాశం అట్టి పెట్టుకుంటున్నారు. చంద్రబాబు నేరుగా పొత్తు పెట్టుకోగా జగన్‌ వంటి వారు తమపై ఆధారపడి మోడీ రావాలని కలలు కంటున్నారు. ఏతావాతా వీరంతా కూడా బిజెపి ప్రత్యక్ష, పరోక్ష దోస్తులే గనక ఎలాగో సర్కారులోకి వస్తామని మోడీ, అమిత్‌ షా వంటి వారు ఆశలు పెట్టుకున్నారు. యు.పి లో సమాజ్‌వాదీ పార్టీ బాగా పుంజుకోవడం, బీహార్‌లో తేజస్వి యాదవ్‌ నాయకత్వంలో ‘ఇండియా’కు మెరుగైన అవకాశాలు, కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో వుండటం సానుకూల అంశాలుగా భావిస్తున్నా రెండు ప్రధాన పార్టీలూ పోటీ పడే హిందీ రాష్ట్రాలలో ఏం జరుగుతుందనేది తేలని అంశమే. మహారాష్ట్రలో వివిధ ప్రాంతీయ పార్టీలలో చీలిక వర్గాలు సృష్టించి బిజెపి కొంచెం అనుకూలత తెచ్చుకున్నట్టు కనిపిస్తుంది. తమిళనాడు, కేరళ కూడా స్పష్టంగా ఎన్‌డిఎకు అవకాశమే లేని రాష్ట్రాలుగా వున్నాయి. ఈ విధంగా చూస్తే మోడీ మోతకు చిల్లు పడిందనేది స్పష్టమే. అంతేగాక ఆయన విశ్వగురు ముసుగు తీసేసి నేరుగా విద్వేష వాక్కులలోకి దిగవలసి వచ్చింది. ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై చివరకు ఎంతో కొంత ఎన్నికల సంఘమే స్పందించవలసి వచ్చింది. అయితే ఎన్నికల సంఘం పాత్రపై ఇప్పటికీ నీలినీడలు అలుముకునే వున్నాయి. 17సి ఫారం ప్రకారం పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్లు వేసిన వారి సంఖ్యను బహిర్గతం చేయడానికి ఎన్నికల సంఘం నిరాకరిస్తున్నది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల మతతత్వ ప్రచారాన్ని, ఇతర పార్టీల నేతల ప్రతి విమర్శనూ ఒకే గాట కడుతున్నది. ఎ.పి లో మాచర్ల ఘటనలతో సహా అనేక సందర్భాల్లో ఎన్నికల సంఘ వ్యవహార శైలి విమర్శల పాలైంది. తెలంగాణ క్యాబినెట్‌ సమావేశానికి కూడా అనుమతించకుండా వివక్షకు పాల్పడింది. రేపటి ఫలితాల తర్వాత ఈ అంశాలన్నీ కూడా ముందుకు రానున్నాయి.

ఎ.పి, తెలంగాణల దృశ్యం
ఆంధ్రప్రదేశ్‌ లోనైతే కేవలం టిడిపి, వైసిపి మధ్య యుద్ధంగా ఇంకా చెప్పాలంటే జగన్‌, చంద్రబాబు పోరాటంగా మొదలైంది. చంద్రబాబు అరెస్టు, కేసుల తర్వాత ఇది పరాకాష్టకు చేరింది. ఈ మధ్యలో బిజెపి, ఎన్‌డిఎలో భాగమైన జనసేన పవన్‌ కళ్యాణ్‌ అసలు కేంద్రం ఊసే లేకుండా కేవలం వైసిపి వ్యతిరేక ఓట్లు చీలనివ్వకపోవడం అంటూ కొత్త పాట తెచ్చారు. బిజెపితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నా విడిగా లౌకిక పార్టీలూ ఆయనతో కలవ వచ్చనే పల్లవీ కొన్ని వైపుల నుంచి వినిపించింది. జగన్‌తో ఆస్తి వివాదాల కారణంగా దూరమైన షర్మిల తెలంగాణ నుంచి ఎ.పి కాంగ్రెస్‌లో ప్రవేశించారు. ఈ పరిస్థితుల్లోనే సిపిఎం ఇతర లౌకిక ప్రజాస్వామికవాద శక్తులతో కలసి బిజెపితో జట్టు కట్టిన టిడిపి కూటమి, నిరంతరం బలపర్చే వైసిపి రెంటినీ ఓడించాలనే విధానంతో ‘ఇండియా’ ఆవిర్భావానికి కృషి చేసింది. ఈ క్రమంలోనే వామపక్షాలూ కాంగ్రెస్‌ కలసి పోరాడాయి. రాజధానికి సహాయం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం, విభజన హామీలు, లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలు తెర మీదకు వచ్చాయి. ఆఖరుకు షర్మిల కూడా చంద్రబాబు, జగన్‌ బిజెపికి లోబడిపోయారనే అంశం నొక్కి చెప్పారు. పోలింగ్‌ చివరి దశలో మల్లికార్జున ఖర్గే, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా వంటి వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో ఎన్నికల పోరాట స్వరూపం మారింది. ముస్లిం రిజర్వేషన్లపై మోడీ బిజెపి వైఖరిని చంద్రబాబు, జగన్‌ ఉభయులూ తోసిపుచ్చవలసి వచ్చింది. విశాఖ ఉక్కుపై ఎన్నికల ఫోకస్‌ మారిందని ‘హిందూ’ వంటి పత్రిక రాసింది. ఇదంతా మొదట బయలుదేరిన నాటి తీరుకు భిన్నమైన సన్నివేశమే. తెలంగాణలోనూ బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకే పరిమితమైన రాజకీయ రణం కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం (భువనగిరి మినహా) కలసికట్టుగా కదలడంతో కొత్త రూపు తీసుకున్నది. ‘ఇండియా’ వేదిక, బిజెపి, బిఆర్‌ఎస్‌ త్రిముఖ సమరంగా మారింది. ఇదే ఇప్పుడు శాసనమండలి ఉప ఎన్నికలలోనూ కొనసాగుతున్నది. గతంలో ఎవరు ఏం మాట్లాడారనే మీమాంస కన్నా లౌకిక శక్తులు దేశవ్యాపితంగా చేస్తున్న పోరాటంలో తెలంగాణ భాగం కావడం, బిజెపిని ఓడించడం కీలకమనే వాస్తవికత సిపిఎం ప్రదర్శించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ది బిజెపి పట్ల మెతక వైఖరి అంటూ వచ్చిన అభిప్రాయాలను స్వయంగా తోసిపుచ్చవలసి వచ్చింది. విచిత్రమేమంటే లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ పునస్సమీకరణ జరుగుతుందని, రేవంత్‌ బిజెపిలోకి వెళతారనీ బిఆర్‌ఎస్‌ ఇప్పటికీ ప్రచారం చేస్తున్నది. మరో వైపున బిఆర్‌ఎస్‌ లోంచి 25 మంది ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌ లోకి వెళతారని కిషన్‌రెడ్డి అంటున్నారు. రాజకీయ దుమారం ఏ స్థాయిలో వుందో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణలు చాలు. ఎ.పి లో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపైనా తెలంగాణలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయనే దానిపైనా ఇప్పటికీ రెండు రకాల అంచనాలు హోరాహోరీగా సాగుతూనే వున్నాయి. ఆ జోస్యాలతో నిమిత్తం లేకుండా ఒక రాజకీయ వాతావరణం తేవడమే వామపక్షాలు సాధించిన సత్ఫలితం. ఇందుకు ఇతర లౌకిక ప్రజానుకూల శక్తుల సహకారం లభించింది.

మీడియా ద్వంద్వత్వం
తెలుగు మీడియాలో మొదటి నుంచి పాలక వర్గాల ప్రాబల్యం ఏదో ఒక వర్గాన్ని భుజాన మోయడం పరిపాటి. వర్తమాన ఘట్టంలో మరీ బాహాటంగా రెండుగా చీలిన మీడియా వైసిపి, టిడిపి, బిజెపి మధ్య మొగ్గును చూపించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీడియాపై ఆగ్రహానుగ్రహాలు బాహాటంగానే ప్రదర్శించాయి. ప్రాంతీయ అధికారం తప్ప జాతీయ రాజకీయాల స్పృహ కూడా వదలిపెట్టి వారినో వీరినో గెలిపించడమే లక్ష్యంగా పాక్షిక చిత్రం ఇచ్చింది. తమకు నచ్చిన, చూపిన అంశాల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది. రాజ్యాంగ అంశాలను కూడా స్థానిక రాజకీయ కోణంతోనే చిత్రిస్తూ ప్రజల దృష్టిని దారి మళ్లించింది. ఉద్యమాలనూ, బహిరంగ విషయాలను కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఇటో అటో ఇస్తూ వచ్చింది. కుల మత ధోరణులు, అసభ్య దూషణలు, అమానుష దాడులూ నిత్యకృత్యంగా మారాయి. అక్రమ ధనం వికటాట్టహాసం చేసింది. సైద్ధాంతిక నిబద్దత లేకుండా బిజెపిని మోసిన జనసేన అధినేత సినిమా అభిమానాల నేపథ్యం కూడా చర్చను పక్కదోవ పట్టించడానికి కారణమైంది. విస్తారంగా పెరిగిన సోషల్‌ మీడియా సోపానంగా అప్రధాన వివాదాలే సమయాన్ని బుర్రలనూ ఆక్రమించి వాతావరణాన్ని కలుషితం చేశాయి. ఇంతటి పరిస్థితిలోనూ ఎంతో కొంత చర్చ పట్టాలపై వుందంటే దానికి కారణం ‘ప్రజాశక్తి’ వంటి నిబద్ద పత్రికలు, ప్రజాపక్ష ఉద్యమాలు, శక్తులూ నిర్వహించిన విస్పష్టమైన పాత్ర మాత్రమే. ఎన్నికల పోరాటంలోనూ పోలింగ్‌ అనంతరం కూడా ఉద్రిక్తతలు పెంచడానికి రకరకాల పాచికలు వేసినా ప్రజలు ప్రశాంతత కాపాడుకున్నారు. రేపు తుది తీర్పు వెలువడే వరకూ ఇదే చైతన్యంతో, అప్రమత్తతతో వుండాలని కోరుకుందాం. పాలక వర్గాలు రాజకీయ ప్రయోజనాల కోసం, పదవుల కోసం రగిలించిన వివాదాలు, సృష్టించిన వైరాలూ, వివాద విద్వేషాలు పక్కకు నెట్టి ప్రజల ఐక్యత కాపాడుకోవాలి. పదేళ్లు పూర్తి చేసుకుంటున్న విభజిత రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుంటూ మత రాజకీయాలను ఆమడ దూరం కొట్టడానికి మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముంది. అందుకు విరుద్ధమైన సంకుచిత పోకడలూ అల్పిష్టి తగాదాలను దూరం కొడదాం. ప్రగతిశీల శక్తుల ఐక్యతే ప్రజాస్వామ్యానికి నిజమైన రక్షణ.

తెలకపల్లి రవి

➡️