దెబ్బకు దెబ్బ అంటున్న పుతిన్‌ !

తమ భూభాగాలపై దాడులు చేసేందుకు పశ్చిమ దేశాలు ఆయుధాలను ఇస్తే వాటిపై దాడులకు తాము కూడా ఇతరులకు అస్త్రాలను అందిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించాడు. తామిచ్చిన ఆయుధాలను ఆత్మరక్షణతో పాటు రష్యా మీద ఎదురుదాడులు చేసేందుకు సైతం వినియోగించుకోవచ్చని అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు పవర్‌ పట్టా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ సంక్షోభంలో పశ్చిమ దేశాల కారణంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కరీబియన్‌ ప్రాంతంలో మిలిటరీ విన్యాసాలు జరిపేందుకు రష్యా వైమానిక, నౌకా దళం వెళుతున్నట్లు అమెరికా అధికారులు చెప్పారు. పశ్చిమ దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిన ఉక్రెయిన్‌ నేత జెలెన్‌స్కీ తమ పౌరులను అష్టకష్టాలకు గురిచేస్తున్నాడు. పశ్చిమ దేశాల కుట్రను తమ భూభాగం మీద సాగనివ్వను అనే ఒక్క హామీని ఇచ్చి ఉంటే రష్యా మిలిటరీ చర్య అసలు జరిగి ఉండేదే కాదు. శాంతి సభ పేరుతో ఉక్రెయిన్‌కు మద్దతుగా పశ్చిమ దేశాలు తలపెట్టిన సమావేశాన్ని దెబ్బ తీసేందుకు రష్యాకు సాయం చేస్తున్నట్లు జెలెన్‌స్కీ చైనా మీద ఆరోపణలకు దిగటం అర్ధరహితం. తమ సార్వభౌమత్వానికే ముప్పు తలెత్తితే అణ్వాయుధాలను ఉపయోగించేందుకు కూడా వెనుకాడబోమని, నాటో కూటమి దేశాలపై దాడులకు వీలుగా తమ దగ్గర ఉన్న దీర్ఘ శ్రేణి ఆయుధాలను ఇతర దేశాలకు అందచేస్తామని సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ అంతర్జాతీయ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల సందర్భంగా ప్రతినిధులతో పుతిన్‌ చెప్పాడు. పశ్చిమ దేశాల ఇటీవలి చర్యలు ఉక్రెయిన్‌ పోరులో ప్రత్యక్షంగా పాల్గొనటమేనని, అదే పద్ధతిలో వ్యహరించే హక్కును తాము అట్టిపెట్టుకుంటామని అన్నాడు. అమెరికా జనాలు ఎవరిని ఎన్నుకున్నా వారితో కలసి పని చేస్తామని, ఎన్నికల తరువాత ఏదో మార్పు వస్తుందని తాము అనుకోవటం లేదన్నాడు. ఉక్రెయిన్‌ దగ్గర 1,300 మంది తమ సైనికులు బందీలుగా ఉంటే తమ దగ్గర 6,400 వారి మిలిటరీ సిబ్బంది ఉన్నట్లు పుతిన్‌ చెప్పాడు.
కరీబియన్‌ ప్రాంతానికి వెళుతున్న రష్యా నౌకాదళం క్యూబా, వెనిజులా రేవుల్లో లంగరు వేయవచ్చని భావిస్తున్నట్లు అమెరికా అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో విన్యాసాలు జరపటం రష్యాకు కొత్త కాదని అయితే, ఉక్రెయిన్‌కు అమెరికా ఇస్తున్న మద్దతుకు ప్రతిగా, తమ నౌకాదళం సత్తా ఏ మాత్రం తగ్గలేదని లోకానికి వెల్లడించేందుకు విన్యాసాలను తలపెట్టినట్లు అమెరికా భావిస్తున్నది. మూడో వంతు నల్లసముద్ర రష్యా నౌకలను నాశనం చేసినట్లు గతంలో ఉక్రెయిన్‌ చెప్పుకున్నది. అంతర్జాతీయ దళాల్లో అనేక దేశాలు మిలిటరీ విన్యాసాలు జరుపుతున్నాయి. వాటికి ఆ ప్రాంత దేశాల అనుమతులు లేదా భాగస్వామ్యంతో నిమిత్తం లేదు. బాల్‌టాప్స్‌ పేరుతో రష్యా ముంగిట బాల్టిక్‌ సముద్రంలో 1971 నుంచి అమెరికాతో సహా నాటో దేశాలు ప్రతి ఏటా తమ బలాన్ని వెల్లడించేందుకు విన్యాసాలు జరుపుతున్నాయి. ఈ నెల 7 నుంచి 20 వరకు అమెరికా సప్తమ నౌకా దళంతో అనేక దేశాలు భాగస్వాములు కానున్నాయి.
పశ్చిమ దేశాలు పంపే ఆయుధాలతో పాటు వాటి వినియోగంపై శిక్షణకు ఎవరినైనా పంపితే ఎవరికీ మినహాయింపు వుండదని, వారు ఫ్రెంచి వారు, మరొకరు ఎవరైనా కావచ్చు. వారి మీద దాడులు జరుపుతామని రష్యా హెచ్చరించింది. త్వరలో ఫ్రాన్సు నుంచి శిక్షకులు తమ దేశానికి రానున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించిన పూర్వ రంగం, బ్రిటన్‌ వెయ్యి డ్రోన్లను పంపుతున్న సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. బహిరంగంగా వెల్లడించనప్పటికీ ఇప్పటికే కొన్ని దేశాల నుంచి వచ్చిన వారు రహస్యంగా శిక్షణ ఇస్తున్నట్లు గతంలోనే వార్తలు వెలువడ్డాయి. అవసరమైతే తమ మిలిటరీని పంపుతామని ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌ గతంలో ప్రకటించాడు. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన ఆయుధాలను తమ సరిహద్దుకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా నగరం బెల్‌గో రోడ్‌ మీద ఉక్రెయిన్‌ ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్‌ ఏ రోజు ఏ లక్ష్యాల మీద దాడులు చేసేదీ ప్రతిరోజూ తమకెలా తెలుస్తుందని అసలు తామిచ్చిన వాటిని ఉపయోగించిందీ లేనిదీ కూడా తమకు తెలియదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ అమాయకత్వం నటించాడు. పాలస్తీనా ప్రాంతమైన గాజాలో సాధారణ పౌరులపై మారణకాండ జరుపుతున్న దుష్ట ఇజ్రాయిల్‌ను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్న అమెరికా ఇంతకంటే వేరే విధంగా ప్రవర్తిస్తుందని ఎలా అనుకోగలం?

– ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

➡️