బాధితులకు భరోసా

Jan 9,2024 07:20 #Editorial
Bilkis Bano case Review Petition by Gujarat Government in Supreme Court

             గుజరాత్‌లో 2002 నాటి అల్లర్లలో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఏడుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన దోషులకు జైలు శిక్ష తగ్గించి క్షమాభిక్ష పెట్టి ముందస్తుగా విడుదల చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు పరుస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం వెలువరించిన తీర్పు స్వాగతించదగినది. రెండు వారాల్లోగా దోషులందరూ జైలుకు వెళ్లాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేంద్ర బిజెపి ప్రభుత్వ అండతో ‘పరివార్‌’ శక్తులు మత ప్రాతిపదికన సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న తరుణంలో సుప్రీం ఇచ్చిన తీర్పు లౌకిక, ప్రజాస్వామిక వాదులకు ఆశాకిరణం. నాటి గుజరాత్‌, నేటి మణిపూర్‌ సహా దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, దాడులకు గురవుతున్న అబలలకు సుప్రీం తీర్పు కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది. బిల్కిస్‌ కేసులో సుప్రీం లేవనెత్తిన అంశాలు రాజ్యాంగం, చట్టాలు, ప్రజాస్వామ్యం ఉనికిని ప్రశ్నార్ధకం చేశాయి. రేప్‌ కేసుల్లో శిక్ష పడ్డ దోషులకు క్షమాభిక్ష కూడదన్న కనీస విచక్షణను గుజరాత్‌ ప్రభుత్వం పాటించలేదు సరికదా తన నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు కోర్టును మోసం చేసింది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున ముద్దాయిల క్షమాభిక్షకు మహారాష్ట్ర ప్రభుత్వానికే అధికారం ఉంది. మహారాష్ట్ర సర్కారు, కింది కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా గుజరాత్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. గుజరాత్‌ ప్రభుత్వ ఉద్దేశపూర్వక తప్పిదాలను, చట్ట, నిబంధనల ఉల్లంఘనలను సుప్రీం ఎత్తిచూపింది. దీన్నిబట్టి గుజరాత్‌ ప్రభుత్వం దోషులను ఎంతగా వెనకేసుకొచ్చిందో అర్థమవుతుంది.

దేశంలో బిల్కిస్‌ బానో ఉదంతం తెలియని వారు లేరు. గుజరాత్‌లో నరేంద్ర మోడీ సర్కారు అధికారంలో ఉండగా 2002లో పెచ్చరిల్లిన ‘గోధ్రా’ మత మారణహోమాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆ సమయంలో దహోద్‌ జిల్లాలో 21 ఏళ్ల బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌నకు గురైంది. అప్పుడు ఆమె ఐదు నెలల గర్భవతి. మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె ఏడుగురు కుటుంబ సభ్యులూ క్రూరంగా హత్యకు గురయ్యారు. సిబిఐ విచారణ అనంతరం 2008లో 11 మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టులు యావజ్జీవ కారాగార శిక్ష విధించాయి. పధ్నాలుగేళ్ల జైలు అనంతరం గుజరాత్‌ ప్రభుత్వం దోషులకు క్షమాభిక్ష అమలు చేసి 2022 ఆగస్టు 15న విడుదల చేసింది. దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న తరుణాన, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట మోడీ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళలోనే, గ్యాంగ్‌ రేప్‌, ఊచకోత దోషులకు గుజరాత్‌ బిజెపి సర్కారు స్వేచ్ఛ ప్రసాదించింది! ఇదీ మోడీ వల్లిస్తున్న ‘బేటీ బచావో’.

బిల్కిస్‌ బానో కేసు దోషుల విడుదలలో తప్పు కేవలం గుజరాత్‌ ప్రభుత్వానిదే కాదు. కేంద్రం అనుమతితోనే దోషులను విడుదల చేశామని గుజరాత్‌ ప్రభుత్వం వెల్లడించడాన్ని మర్చిపోకూడదు. కనుక దోషుల విడుదలలో కేంద్రం పాత్ర పుష్కలంగా ఉందని స్పష్టమవుతోంది. గోధ్రా జైలు నుంచి విడుదలైన దోషులను ఏదో సాధించిన పోరాట యోధులకు మల్లే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, విహెచ్‌పి కార్యకర్తలు స్వాగతాలతో భారీ ఊరేగింపులు నిర్వహించడం గమనార్హం. భీమాకొరేగావ్‌ కేసులో పలువురిపై రాజద్రోహం కేసు బనాయించి ఏళ్లతరబడి జైలులో నిర్బంధించింది బిజెపి సర్కారు. నిందితుడైన 80 ఏళ్ల వృద్ధుడు ఫాదర్‌ స్టాన్‌ స్వామి కనీసం తాగడానికి మంచినీళ్లు ఇవ్వని కారణంగా జైలులోనే తనువు చాలించాడు. రేప్‌, మర్డర్‌ కేసులో దోషులకు మాత్రం క్షమాభిక్షలు, లెక్కలేనన్ని తడవలు పెరోల్స్‌ బిజెపి నీతి. ప్రజలు, ముఖ్యంగా మహిళలు బిజెపి నైజాన్ని అర్థం చేసుకొని తగిన గుణపాఠం చెప్పాలి. బెదిరింపులను తట్టుకొని రాజ్యాన్ని ఎదిరించి న్యాయం కోసం దశాబ్దాలపాటు పోరాడిన బిల్కిస్‌ బానో మహిళలకు పోరాట దివిటీ. బాధితులకు స్ఫూర్తి.

➡️